"ఆఫ్ కోర్స్ ...." అని మాత్రం అనగలిగేడు.
కొంచేమాగి అతనేమనుకుంటుంది విపులంగా చెప్పేడు.
"నిజమే అనుకోండి. కాని చూసేరూ , దుఖాల్ని, బాధల్ని , కష్టాల్ని, కన్నీటినీ - కవిత్వం చెబుతున్నాని కాదు గానీండి - కొందరు మాత్రమే అనుభవించే దౌర్భాగ్యానికి గురై వుంటారని నా అభిప్రాయం. ఆ కొందర్లో మీరుండరని , వుండకూడదని నా ఉద్దేశ్యం."
"ఇంకా నయం. అలా అని ప్రచారం చేసేరు కాదు. నవ్వి పోయేవారు జనం."
శ్రీనివాసరావు శాంతాదేవితో యిక ఈ విషయం మీద మాట్లడ రాదనుకున్నాడు. ప్లాస్కు మీద మూత పెట్టి,నోట్లో యింత వక్కపొడి వేసుకొని ఆఫీసు వరండాలోకి వచ్చి సిగరెట్టు ముట్టించెడు.
శాంతాదేవికి యిరవై రెండు సంవత్సరాల వయస్సుని మునుపెప్పుడో చెప్పిందామె. ఆమె మూర్తిభావించిన శాంతం! చాలా అందంగా ఉండే మనిషి. మల్లెపూవులాటి ఆ మనిషికి మనసు బాగులేదని విన్న శ్రీనివాసరావు కేమిటో తిక్కగా వుంది.
అతనికి తెలిసినంతవరకూ కష్టాలు అందరికీ లేవు. అతనికి తెలిసినంత వరకూ అందరూ శాంతాదేవిలా కమ్మగా నిశ్చింతగా హాయిగా నవ్వలేరు. అతనికి తెలిసినంతవరకూ అంత నిబ్బరంగా బతికే మనిషికి 'కష్ట జ్వరం' తగల కూడదు.
అతని మాటల్ని ఎందుకో శాంతాదేవి ఖాతరు చేయలేదు.
(నాన్ సెన్స్! శాంతాదేవితో నేను చాలా అనవసరమైన మాటలు మాటాడుతున్నానేమో! నా పరిధిని అతిక్రమించి నోరు జారానా? శాంత ఎవరు - నేనెవర్ని? ఒకే ఆఫీసులో బ్రతుకు తెరువు కోసం చాకిరీ చేస్తున్న మనుషులం. మా మధ్య బంధుత్వం యింతకంటే పెరుగేందుకు వీల్లెదంతే!)
"సార్!' అన్నాడు కొండలు వినయంగా.
శ్రీనివాసరావు ఆలోచనల నుంచి తేరుకున్నట్టు గమనించిన కొండలు మరింత వినయంగా అన్నాడు.
"అయ్యగారు తమర్ని పిలుస్తున్నారు."
ఆ కబురు చెప్పి ఏడుకొండలు జారుకున్నాడు.
వాచీ చూచుకుంటే టైం మూడున్నరయింది. పిలుపులూ, పలకరింపులూ , చీవాట్లు మందలింపులూ అన్నింటికీ ప్రతిరోజూ సాధారణంగా రెండున్నరతో 'జనగణమన - .....పాడేస్తాయి. ఇవాళే దో ప్రత్యేకమైన కార్యక్రమం వుండి ఉంటుంది. ఇల్లు చేరుకునే ముందు మనసు మీద గట్టి దెబ్బ తీసేందుకే యీ మానవుడు పిలిచి ఉంటాడని శ్రీనివాసరావు వూహించి , కసి కొద్ది సిగరెట్టు పీకని కాలి కింద వేసి నలిపి కదిలేడు.
అఫీసరేందువల్లనో ప్రశాంతంగా ఉన్నట్లు గమనించి శ్రీనివాసరావు నిబ్బరంగా ఆ గదిలో నిలబడగలిగేడు. అయన సిగరెట్ నుసిని యష్ ట్రేలో విదిలించి కుర్చీలో సర్దుకొని కుర్చుని అన్నారు.
"మిమ్మల్ని ఎప్పటికప్పుడు అడుగుదామనుకుంటూనే మరిచిపోతున్నాను. మీరుండేది రామారావు పేటలోనే గదూ?"
"అవునండి"
"మా యిల్లు తెలుసనుకుంటాను."
"రెండు తడవలు వచ్చేనండి."
"అలాగా.....అవును మిస్టర్ రావ్, సాయంత్రం అఫీసైం తరవాత మీకేదైనా ప్రోగ్రాముంటుందా రోజు?"
ఆ పలకరింపుతో శ్రీనివాసరావు పరవశించిపోయేడు. ఒకానొక ఘనమైన వ్యక్తీ ఎంతో ఆసక్తితో 'రావని పిలిచి , అతని సాయం కార్యకలాపాలడిగేడన్న విశేషం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ పెద్దమనిషి తాలూకు ఆసక్తిని పాడు చేయడం యిష్టం లేదతనికి. జవాబుగా అందంగా చెప్పాలి.
(ఐ లైక్ టెన్నిస్. కాస్మాపాలిటన్ లో టేన్నిసాడి , టీ పుచ్చు కుంటాను . అక్కడికి ముఖర్జీ వస్తాడు. ముఖర్జీని ఎరుగుదురా మీరు? అతను తెలీదు? పిటీ! ముఖర్జీ .....వెయ్యి దూపయాల జీతగాడు . కెందరీస్ అండ్ మెర్లిన్ కంపెనీకి జనరల్ మానేజరతను. ముఖర్జీ పేకాట పిచ్చి! అతను నన్ను బలవంతం చేస్తాడు. సో ఐ మస్ట్ ప్లే! రొండే బోట్ - ఎయిట్ ఆర్ సో ఐ విల్ బి యిన్ మె కార్!)
"తిన్నగా యింటికే వెళ్ళిపోతారేమిటి?: మళ్ళా ఆ పెద్దమనిషే అడిగాడు.
శ్రీనివాసరావు చేదు నిజం గుర్తు వచ్చింది. చెప్పక తప్పదు.
"అవునండి" అన్నాడెంతో బెంగగా.
"బజారు గట్రా....."
"అవన్నీ ఉదయమేనండి."
అతని కప్పుడు వంకాయల బేరం అసహ్యంగా గుర్తు వచ్చింది. చెవిటి కోమటి గాడు జలగలా మనసులో తిరిగేడు. రద్దీగా ఉండే పెద్ద మార్కెట్ యావత్తు అతన్ని నమిలి మింగే రాక్షసిలా అతని కళ్ళ ముందు తిరిగింది.
"సే.....సో.....అవుతే సాయంత్రాలు ఫ్రీగానే ఉంటావన్నమాటేగా "
"అవునండి"
"అడుగుతున్నానని కాదుగానీండి , మీరు నాకో చిన్న సాయం చేయాలి రావ్!"
(మళ్ళా రావనే పిలుస్తున్నారు సార్! అలా పిలిచి నన్ను గెలుస్తున్నారు. నన్నెవరైనా గొప్పవాడు రావని పిలుస్తే నేను సర్వం మరచిపోతాను. నా కొంప మునిగినా పర్వాలేదు మీ కొంప నిలబెడతాను. ఐ లైక్ దట్ నేమ్. ఐ లైకిట్ ఎండ్ ఐ లైకిట్ ఎండ్ ఐ.....)
"మా అమ్మాయి పి.యు.సి ఫెయిలైంది. మళ్ళా పరీక్షలకి పంపుదామనుకుంటున్నాను. మీరు శ్రద్ధ తీసుకుని ట్యూషను....."
"ష్యూర్ సార్ ! తప్పకుండా ....." అన్నాడతను వెంటనే.
"ట్యూషనేగా! బోడి ట్యూషన్ చెప్పి అవతల పారేస్తాను. ఐయాం బ్రిలియంటివ్ యింగ్లీష్, మేథ్స్ , ఎకానమిక్స్ అండ్ వాట్ నాట్ నా పేపరు కాపీ కొట్టి ముగ్గురు డిగ్రీలు పుచ్చుకున్నారు. నా నోట్సులు చదివి వెధవ లనేకమంది అఫీసర్లైపోయేరు. మన బతుకు మనకి అంధకారమే గాని సార్, మనం చాలా మందికి పెట్రోమాక్స్ లైటు! బాబ్బాబని నా కాళ్ళట్టుకున్న మనుషులనేకమంది వున్నారు. నా ఆఫీసరు మీరు. ఈ కెరీర్ మీద పూర్తీ అధికారులున్న మనిషి మీరు పైపెచ్చు నన్నెంతో శ్రద్ధగా రావని పిలిచే రాయెను.!)
"థేంక్స్ అండి. రేపు దశమీ శుక్రవారం. రోజు కూడా దివ్యంగా ఉంది. రేపట్నించే ప్రారంభించండి." అన్నారాయన.
శ్రీనివాసరావు ఆగది నుంచి ఉత్సాహంగా , గొప్పగా బయటికి వచ్చేడు. అతను కుర్చీలో కూర్చుంటే , అది కేవలం చెక్కతో తయారు కాబడినదని తెలుసుకుని సిగ్గుపడిపోయేడు.
"ఏమిటండి విశేషం?" అన్నది శాంత.
"వాళ్ళామ్మాయి పి.యు.సి ఫెయిలైందిట . ట్యూషను చెప్పగలరా అన్నారు. యస్సన్నాను."
"మంచి విశేషమే"
అయిదున్నరకే తను ఆఫీసు వదిలి బయట పడ్డాడు. సైకిలు తీసుకున్నప్పుడు తెలిసింది -- ముందు చక్రంలో గాలి బొత్తిగా లేదని, అతనెంతో దిగులుగా ఆ సైకిల్ని నడిపించుకు వస్తూ అనుకున్నాడు.
"రేపు జీతాల్లో ఈ సైకిల్ బతుక్కి గట్టి రిపేర్ జరిగి తీరాలి. కొత్త ట్యూబ్ , కొత్త టైరు కొనేస్తే? బడ్జెట్ లోనించి పదిహేను రూపాయలు కేటాయించాలి. తప్పదు. లేకపోతే దీంతో సంసారం చేయడం బహు కష్టం. ట్యూబ్ అరడజను పంక్చర్లు టైర్ కేమో అడుగు స్టిచింగూను. ఛీ, నాన్ సెన్స్, బావులేదు సైకిలు!"
