"ఏలుకునే మగాడికి ఏడ్గురు భార్యలే"అన్నాడు చిదంబరంగా.
ఆనాడే తనకు, భర్తకు మధ్య ఏదో అగాధం ఏర్పిండిందని భావించింది. ఆ విషయం చెప్పుకుంటే తనకే సిగ్గుచేటు.
అభిమానం ఉన్నావారు తమను చూచి అందరూ ఈర్ష్యపడాలని కోరుకుంటారు కాని, జాలిపడాలని కాదు.
గళరంలా ఈ విషయం మ్రింగింది.ఆమె ఏదో ఒక పండుగకు ఇంటికి వస్తుంది అప్పుడు యశోదమ్మ అనుభవించే నరకయాతన యెవరూ ఊహించలేనిది, చిల్లర , మల్లర స్త్ర్రీ ల సంగతి చెప్పనవసరమేలేదు.
సంక్రాంతి రోజు అందరికి వెంకటగిరి చీరలు తెచ్చారు. సులక్షణ, పిల్లలు లేరని మధుమూర్తి కూడా వచ్చాడు.
జమునాబాయి నువ్వుల ఉండలు, విమల్ వాళ్ళ చీర రాధికకు కొని తెచ్చింది. రాధిక తండ్రి ఏమంటాడోనని తీసుకుంది.
"ఎందుకా ముఖం మాడ్పు?"అరిచాడు పురుషోత్తమరావు.
" నా ముఖం అలాగే ఉంది" అన్నది యశోద.
అతను చురచుర చూచాడు.అనుకోకుండా ఆ రాత్రి సిద్దార్థ వచ్చాడు. యశోదమ్మ తెల్లబోయింది.
"ఇప్పుడెలా వచ్చావ్ సిద్ధూ!"
"ఎన్నో టాక్సీలు ,ఆటోలు నడుస్తున్నాయి. రెండు రోజుల కోసం ఇంత ఖర్చు ఎందుకు అనుకున్నానుగాని, మీరంతా గుర్తుకువచ్చారు....."అన్నాడు"స్నానం చెయ్యి. అన్నం పెడతాను."
"నాన్నను పలుకరించి వస్తాను." పైకి పోబోయాడు.
కొత్తగా కట్టిన బంగళా మధుమూర్తికి ఇచ్చాక, పాత డాబాపై రెండు గదులు వేయించాడు పురుషోత్తమరావు.
"మీ నాన్న ఎక్కడికి వెళ్తారు. ముందు అన్నం తిందువుగాని రా."
" అన్నమే కాళ్ళు వచ్చి నడిచిపోతుందా అమ్మా! భలేదానివి" అన్నాడు నవ్వుతూ ,అప్పటికే అతను ఆఖరుమెట్టుపై ఉన్నాడు.
ఎంత ప్రసన్నంగా వెళ్ళిందో,ఎంత ఉత్సాహంగా వెళ్ళాడో ,అంత నీరసంగా తిరిగివచ్చాడు.
అందమైన సిద్దార్థ ముఖం మాడిపోయి ఉంది.
"అమ్మా!"
"ఊ...." అన్నది. ఆమెకు తనంత ఎదిగిన కొడుక్కు ఏం జవాబు చెప్పాలో తెలియనట్టు తల వంచుకుంది.
"ఆమె యెవరు?"
"జమునాబాయి...."అన్నది అస్పష్టంగా.
"నువ్వీ ఇంట్లో ఉండగా , పైన మీబెడ్ రూమ్ లో అది ఉండటం..... ఓ గాడ్! నువ్వెలా సహిస్తున్నావోగాని నేను నాకు ఘాట్ చేయాలని ఉంది" అన్నాడు అశాంతిగా తిరిగుతూ.
"నాకూ ఉంది చెయ్యలేక పోయాను. నీ ముఖం చూచి, చెల్లాయి భవిష్యత్తు ఆలోచించి...."
"అమ్మా!నీకు చీము నెత్తురు లేదా!"
" ఉన్నా, ఈ దేశలో స్త్ర్రీ అంతకంటే ఏం చేయలేదు సిద్దూ! విడాకులిస్తాను. నన్ను హర్షించి , ఆదుకునేది యెవరు? "మగమారాజు ఏదో సరదాపడితే దీనికేం పోయెకాలం! అంటారు'!అన్నది.
"నువ్వు అలాగే యెవడినో తెచ్చి పెట్టుకుంటే...."
"సిద్ధూ!"కోపంగా అరిచింది.
"చూడు ఆ ఊహే భరించలేకపోతున్నావు" అన్నాడు. అతను మాట్లాడుతుండగానే లయబద్దంగా మెట్లమీద శబ్దం అయింది.
అది పురుషోత్తమరావు. నడక. అతను మెట్లు దిగుతున్నాడని అర్ధం అయింది. సిద్దార్థ గదిలో దూరాడు.
" అమ్మా !నేను ..... నిదురపోయానని చెప్పు"అన్నాడు.
"మంచిది...." అన్నదామె.
పురుషోత్తమరావు భార్యను కొర కొర చూస్తూ, మెట్లదగ్గరకు రమ్మని సైగచేసాడు.
ఆమె వెళ్ళింది.
