ఆమె కళ్ళు లోతుకుపోయి, నల్లని వలయాలు కళ్ళ చుట్టూ ఏర్పడ్డాయి. ముఖం పీక్కుపోయింది. బట్టలు నలిగిపోయి, వాడిన మల్లెలా ఉంది.ఆమెను చూస్తే శత్రువులకు కూడా కడుపులో దేవినట్టు అవుతుంది.
" రాధికా!"
"రాధికనే అన్నయ్యా..... నా శ్రీనుని చంపారు కదూ... ఆరోజే విన్నాను. పెద్దన్నయ్య చంపాడు.దయా దాక్షిణ్యాలు లేక చంపించాడు...."
"లేదమ్మా! అంతా అబద్దం...." ఏదో చెప్పపోయాడు పురుషోత్తమరావు.
"వద్దు.... వద్దు.... నాన్నా . నేను అబద్దాలు వినలేను...." అన్నది వణికిపోతూ.
"అబద్ధం కాదమ్మా...."
"వద్దూ....వద్దు"ఆమె గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
"మీ ఘాతుకానికి ప్రత్యక్ష సాక్షి అది. దాన్ని చూచి అయినా మీ హృదయం ద్రవించటం లేదా!"
"నా కూతుర్ని దారిలో పెట్టే అధికారం నాకుంది."
"చంపి దారిలో పెడతావా!"
"అదీ చచ్చిపోవాలని ఉందా!"
"అది బ్రతికి ఉందనుకుంటున్నారా! మానసికంగా దాన్ని చంపేసారు." అన్నాడు లేచి బయటకు నడుస్తూ.
"ఎక్కడికిరా!" యశోదమ్మ అడిగింది.
" ఇంట్లోనుండి పొమ్మంటే ఇక్కడే పడి ఉంటానా...." అన్నాడు. విసురుగా.
"వెళ్ళనియ్యవే... వెళ్ళనీ. ఒక్కరోజు తిండికి సంపాదించుకుంటే రోగం కుదురుతుంది."అన్నాడు.
" అమ్మా!మళ్ళీ వచ్చి ఈ నరకంలోనుండి, నిన్ను చెల్లెని తీసుకువెళ్తాను."
"వెళ్ళరా ..... వెళ్ళు!ఇక్కడ స్వర్గసుఖాలు అనుభవిస్తుంటే ఈ ఇల్లు నరకంలాగే కనిపిస్తుంది.బయట స్వర్గంచూచి, దేహి అంటూ వస్తావు."
"ఏం మాటలండీ అవి!"
"పచ్చి నిజాలే."
"నాన్న గారూ!నిజాలో అబద్దాలో కాలమే నిర్ణయిస్తుంది వస్తాను."బయటికి వెళ్ళినవాడు మళ్ళీ వచ్చాడు. సరాసరి గది ముందుకు వెళ్ళాడు తలుపు తట్టాడు.
"సరే నేను ఇంట్లోనుండి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికి వస్తానో తెలియదు."అన్నాడు గట్టిగా.
రాధిక అప్పడు తలుపు తీసింది. ఆమె కళ్ళు ఎఱ్ఱగా, ఉబ్బిఉన్నాయి.
"రాధీ!శ్రీనివాస్ తెచ్చి ఇవ్వటం తప్ప, ఏం కావాలన్నా ఇస్తానమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి."
రాధిక కళ్ళనుండి రెండు అశ్రువులు రాలిపడ్డాయి.
"మనం దురదుష్టవంతులం రాధీ...."అన్నాడు.ఆమె నోట్లో పమిట కుక్కుకుంది.
" వస్తాను." అతను చర, చర బయటికి నడిచాడు.
"బాబూ...."యశోదమ్మ ఆర్తిగా పిలిచింది.
"వెళ్ళవే.... వెళ్ళిపో వాడితో...."
"వస్తే సంతోషంగా తీసుకు వెళ్తాను. నీ నియంతృత్వం నీడలో ఆమెకు ఎదిగే అవకాశం లేదు."
"అభ్యంతరం ఎవరికట."
"ఆమెకే ఉంది. ఆమె భారత స్త్ర్రీ భర్తను వదిలి రావాలంటే అంత తేలికగా అంగీకరిస్తుందా!"
"సినిమా డ్తెలాగులు వల్లించుకు."
"వస్తాను." సిద్దార్థ వెళ్ళిపోయాడు.
రేడియాలో టుంగుటూరి సుర్యకుమారి గొంతు మృధుమధురంగా, స్పష్టంగా ఆ ర్తిగా వినిపిస్తోంది.
"లేపనయినా లేపలేదే... మోము చూపనయినా చూపలేదే"
యశోదమ్మ కన్నీరు ఒత్తుకుంటూ భర్తచేతులు పట్టుకుంది.
" వాడితో మీకు పంతం ఏమిటండీ!"
" నోరుముయ్యి!ఏనాడయినా ఒక్క మాట అన్నావా! ఒక్క తిట్టు తిట్టానా!అది అలుసుగా తీసుకుని యెంత మాట పడితే అంతమాట అంటాడా! అయినా ఆ అలంగా జనంతో వీడికి ఏమిటట"అన్నాడు, ఆమె చేతులు ఎదిలించి.
