నవ్య గుమ్మంలో నిలబడి బై చెప్పింది.
రిసెప్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. మేము ఆహ్వానించిన స్నేహితులంతా వచ్చారు.
అందులో కామన్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడంతో చాలా సరదాగా ఆహ్లాదంగా గడిచింది. జోకులతో, చిన్నచిన్న సెటైర్ల తో మమ్మల్ని అతపట్టించారు. మా రిసెప్షన్ నవ్య, సరిత కూడా బాగా ఎంజాయ్ చేశారు. నవ్య ఖరీదైన పూల బోకే ఇచ్చింది.
పార్టీ ముగిసింది. ఒక్కొక్కరే డిన్నర్ పూర్తీ చేసి సెలవు తీసుకుని వెళుతూ "స్వీట్ నైట్' అంటూ కొత్త దనంతో అభినందిస్తూ వెళ్ళిపోయారు.
రాత్రి పదకొండు దాటింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు . నేనూ, విశాల్ మిగిలాం. మాముందు టేబిల్ మీద మిత్రులు అందచేసిన బహుమతులు... అవన్నీ బోయ్ తో రూమ్ కి పంపమని మేనేజర్ కి చెప్పి, మేము ఫస్ట్ నైట్ కోసం ఏర్పాటు చేసుకున్న రూమ్ లోకి వెళ్ళిపోయాం.
నేను మంత్రముగ్ధురాలినై ఆ రూమ్ లో మాకోసం చేసిన ఏర్పాట్లు చూస్తూ నిలబడిపోయాను. అందంగా అలంకరించిన మంచం, కళాత్మకంగా పేర్చి ఉన్న పళ్ళు, పాలు, స్వీట్స్ చల్లదనాన్ని పరిమళంతో నింపిన రూమ్ ఫ్రెష్ నర్.... గాజు జగ్గులో మంచినీళ్ళు.
"ఎలా ఉంది?" వెనగ్గా వచ్చిన విశాల్ నా భుజం మీద తన గడ్డం ఆన్చి మృదు గంభీరంగా అడిగాడు. అతనంత దగ్గరగా చేరి అలా అడగడంతో నా అణువణువు జల్లుమంది. సిగ్గుతో కళ్ళు వాల్చాను. విశాల్ నాకు అభిముఖంగా వచ్చి తన కుడి చేయి చూపుడు వేలితో నా గడ్డం ఎత్తి 'సిగ్గా' అన్నాడు. నేను చేతుల్తో మొహం దాచుకున్నాను.
"ఆధునిక యువతులు కూడా సిగ్గు పడతారా?" అన్నాడు చేతుల్లో బంధిస్తూ.
"ఎక్స్ క్యూజ్ మీ సర్" బైట నిలబడిన రూమ్ బోయ్ స్వరం విని నేను దూరం జరిగాను.
చేతినిండా బహుమతులతో గుమ్మం బైట నిలబడి ఉన్నాడు 'కమిన్" అన్నాడు విశాల్.
బోయ్ అవన్నీ తీసుకొచ్చి ఓ మూలగా ఉన్న టేబిల్ మీద సర్దాడు.
"ఏమన్నా కావాలా సార్" వినయంగా అడిగాడు.
విశాల్ ఒక్క క్షణం అలోచించి "యా జానీవాకర్" అన్నాడు.
"యస్ సర్ " బోయ్ వెళ్ళిపోయాడు.
నేను విశాల్ వైపు అయోమయంగా చూశాను. "ఇప్పుడెందుకది?"
"ఇప్పుడే కావాలి... కిక్ కోసం' అంటూ తమాషాగా కళ్ళేగరేసి కోటు తీసి హంగర్ కి తగిలించాడు.
కిక్ కోసం అది కావాలా? అంటే... నాకేం అర్ధం కాలేదు. మొదటిసారి ఏకాంతంలో శరీరాలు, ఆత్మలు ఏకం చేసుకునే శుభ సమయంలో ప్రేమించిన ప్రేయసి ఇవ్వని కిక్కు ఒక మందు బాటిల్ ఇస్తుందా?
"ఏంటి ఆలోచిస్తున్నావు/ కమాన్ డ్రెస్ చేంజ్ చేసుకో.... నో, నో డ్రెస్ తీసెయ్....' అన్నాడు కొంటెగా నవ్వుతూ.
నాకెందుకో ఇప్పుడే శృతి చేసుకుంటూన్న నా జీవనరాగంలో చిన్న అపశ్రుతి వచ్చినట్టుగా అనిపించింది. విశాల్ వైపు చూశాను.
"ఏంటి అలా చూస్తున్నావు?" జానీవాకర్ తెప్పిస్తున్నాననా?"
"అవునన్నట్టుగా తలూపాను. "నాకు ఈ టైం లో నువ్వు డ్రింక్ చేయడం ఇష్టం లేదు విశాల్' అన్నాను.
"ఓ గాడ్ అదా ఆలోచిస్తున్నావు. దాని పవర్ ఏంటో చూపిస్తాగా... అప్పుడు నువ్వే అంటావు ప్రతి రాత్రీ డ్రింక్ చేయి విశాల్ అని" అంటూ చటుక్కున ముందుకు లాక్కుని పెదాలు గట్టిగా కొరికాడు. ఊహించని ఈ చేష్టకి ఒక్కసారిగా నా శరీరం యావత్తూ పులకరించి పోయి, ఏదో మైకం కమ్మినట్టు అయింది.
"అబ్బా" తీయగా మూలిగాను. ఈ మాత్రానికే.... చెవిలో గుసగుసగా అన్నాడు. బోయ్ డోర్ శబ్దం చేయడంతో నేను బాత్ రూమ్ లోకి పరిగెత్తాను.
బాత్ రూమ్ అద్దంలో నాకు నేనే కొత్తగా , అందంగా కనిపించాను. పట్టుచీర, మెడలో హారం, మంగళసూత్రం, చెవులకు జూకాలు... తలనిండా పూలు, రేగిన జుట్టు, పెదాల మీద సన్నటి గాటు. కొద్దిగా మంటగా ఉన్నా ఆ మంటలో తీయటి బాధ. ఆ తీపిదనం కోసం మనసు తహతహలాడుతూన్నట్టు అయింది. ఆ క్షణంలో నాకిష్టం లేని డ్రింక్ విశాల్ ఇష్టంగా తాగుతున్నా నాకేం తెలియలేదు. అతని చేష్టలతో సర్వం మరిచి నా శరీరం అతనికి అప్పగించేశాను. విశాల్ నన్ను పూర్తిగా ఆక్రమించుకుంటుంటే పరవశంతో అరమూసుకు పోతున్న నా కళ్ళకు బెడ్ లైట్ వెలుగులో టేబిల్ మీద అమర్చిన అందమైన పూల బోకే మీద నవ్య చేతి రాతతో అందమైన అక్షరాలు కనిపించాయి.
Fragile handle with care
నా వైవాహిక జీవితంలో మొదటి దశ పూర్తయింది. ఈలోగా నవ్య సరితా రెండు, మూడు సార్లు వచ్చి వెళ్ళారు. ఆరోజు దసరా, మా పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పండగ. అన్నీ సవ్యంగా ఉండి ఉంటె పుట్టింట్లో అమ్మానాన్న చెల్లాయి ప్రేమలతో ఎంతో ఆనందంగా గడిచేది. నేను ఎన్నిసార్లు క్షమార్పణ కోరి వాళ్ళ ఆశీర్వాదాలు కోరినా వాళ్ళు మొండితనం వదల్లేదు. అలాగే విశాల్ పేరెంట్స్ వైపు నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరి తను వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏమన్నా గట్టి ప్రయత్నాలు చేశాడో లేదో నాకు తెలియలేదు. రెండు, మూడు సార్లు అడిగితె 'వదిలేయ్ వాళ్ళకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వస్తార్లె" అన్నాడు తేలిగ్గా.
దసరాకి ఇద్దరమే ఉండడం నాకెందుకో కొంచెం బాధగా అనిపించింది. విశాల్ ని అడిగాను "నవ్యనీ, సరిత నీ పండక్కి పిలవనా" అని. గుడ్ ఐడియా తప్పకుండా పిలువు.... సరిత వస్తుందంటావా? భర్త పిల్లలు ఉన్నారు కదా...."
"అందర్నీ పిలుద్దాం" అన్నాను.
"ఏమో ...అయినా చూడు పిలువు.... నవ్య మాత్రం వస్తుందిలే.... మొగుడూ, గిగుడూ బాదరబందీ లేవు కదా....' అన్నాడు. అలా అనడంలో వెటకారం ధ్వనించింది. మొదటిసారి విశాల్ నోటి నుంచి వినిపించిన ఈ ధ్వని వింతగా చూశాను.
"ఏంటి అలా చూస్తున్నావు... నిజమే కదా.... తనూ ఒక్కతే ఉండి ఏం చేస్తుంది? అందుకే తప్పకుండా వస్తుందంటున్నా..."
నిజమేనా... వేరే ఉద్దేశం లేదు కదా... ఏమిటో ఈమధ్య విశాల్ విషయంలో కొంచెం నెగిటివ్ థింకింగ్ మొదలైంది నా మనసులో. దాన్ని ముందే తరిమేయకపోతే గొడవలకు దారి తీయవచ్చు. ఇంక ఆలోచించకుండా ఇద్దరికీ ఫోన్ చేశాను. విశాల్ అన్నట్టే సరిత రాలేనంది. నవ్య అంగీకరించింది.
మర్నాడు ఐదింటికే లేచి స్నానం చేసి, వంట మొదలు పెట్టాను. సాంబారు, వంకాయ కూర, టమాటా పెరుగు పచ్చడి, బెండకాయ వేపుడు, గారెలు, రవ్వ కేసరి, అంతా అయేటప్పటికి పది దాటింది. మరోసారి స్నానం చేసి, కొత్త చీర కట్టుకుని టీవి చూస్తున్న విశాల్ పక్కన కూర్చున్నాను సోఫాలో.
'అయిందా వంటింట్లో భరతనాట్యం' అడిగాడు దగ్గరగా తీసుకుంటూ.
'ఇలా రాజేంద్రభోగిలా కూర్చోకపోతే నాక్కాస్త సాయం చేయవచ్చుకదా.." చిరుకోపంగా అన్నాను. అలా అన్నాక అనిపించింది అవును విశాల్ నాకెందుకు కిచెన్ లో గానీ, ఇంటి పనిలో గాని సాయం చేయడం లేదు. తెల్లారి లేచి బొంగరం లా తిరుగుతూ మొత్తం పని నేనే చేసుకుంటున్నాను. ఇద్దరం కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాక నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయడం మాత్రం చేస్తున్నాడు. ప్రేమ మైకంలో నేను నా అస్తిత్వాన్ని మర్చిపోతున్నాను. ఎంతగా అలసిపోతున్నా నాలో ఈ ఆలోచనే రాలేదు. అంటే నేను విశాల్ ని గారం చేస్తున్నానన్న మాట. కాలేజీ రోజుల్లో స్నేహితురాళ్ళంతా కలిసి తీసుకున్న తీర్మానాల సంగతే మర్చిపోయినట్టుంది. అందరూ కూడా తమకు వచ్చే భర్తల వంట పనిలో, ఇంటి పనిలో సాయం చేస్తేనే తాము ఉద్యోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా చేయకపోతే ఉద్యోగం చేయకూడదని, కూడా అనుకున్నారు. ఆ ఆలోచనలు, నిర్ణయాలు ఏమయ్యాయో... బొత్తిగా ఇల్లాలిగా మారిపోయాను అనిపించింది.
"రేపట్నించి నువ్వు నాకు ఇంటిపనిలో సాయం చేయాలి" అన్నాను విశాల్ తో.
"ఇంపాజిబుల్... మనకా అలవాటే లేదు. అమ్మ వండిపెడితే తినడం, తిరగడం తప్ప నాకేం రాదు.'
"రాదేంటి నేర్చుకో... ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇద్దరం ఇంటి పని చేసుకోవాలి."
"నో డార్లింగ్.... అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఈ ఫెమినిస్టు టైపు డైలాగ్స్ నాకు చిరాకు."
"అయితే నేను జాబ్ మానేస్తాను."
"వాట్ జాబ్ మానేస్తావా?" కూర్చున్న చోటే నాలుగంగుళాలు ఎగిరి కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా అన్నాడు.
"ఎందుకంత ఆశ్చర్యం... మేమంతా పెళ్ళి కాకముందు ఇలాగే నిర్ణయించు కున్నాం. మాతో పాటు ఇంటిపనిలో , వంటపనిలోసాయం చేస్తూ, చేదోడు, వాదోడు గా ఉండే భర్త వస్తేనే జాబ్ చేయాలి. లేకపోతె ఇంట్లో పని మాది... బైటపని సంపాదన భర్తది అని...'
