Previous Page Next Page 
ఒప్పందం పేజి 56

 

    "ఇంకా నయం ....నెలకి పదిహేను వేలు వచ్చే ఉద్యోగం మానేస్తావా ? ఏం తిందామని...."
    "నువ్వు సంపాదిస్తున్నావుగా...." క్రీగంట చూశాను.
    "అయితే నా సంపాదన నా ఖర్చులకి, సేవింగ్స్ కే... మిగతాది నీ జీతంతోటే గడవాలి...." ఖచ్చితంగా చెప్ప్తోన్న అతడిని విస్మయంగా చూస్తూ ఉండగానే గేటు చప్పుడైంది. నవ్య లోపలికి వచ్చింది "సారీ టు డిస్టర్బ్" అంటూ.
    "సారీ ఏంటే....లేట్ గా వచ్చి' చిరుకోపంగా అన్నాను.
    తను తెచ్చిన యాపిల్స్, స్వీట్స్ నాకందిస్తూ అంది... "నేను లేట్ గా రాలేదు.... నువ్వు త్వరగా వంట చేసేశావు. టైం చూడు ఇంకా 'పదే' అంది.
    "కరెక్ట్ నవ్య ఈజ్ కరెక్ట్' అన్నాడు విశాల్ నవ్య వైపు చూస్తూ. ఆ చూపులో లోతుగా , నవ్య అనాటమీని కొలుస్తున్నట్టుగా అనిపించింది నాకు. ఏంటి ఇవాళ విశాల్ కొత్తగా కనిపిస్తున్నాడు నాకు. నాకేదో అయింది. విశాల్ మాటల్లో ప్రవర్తన లో ఏదో వెతుక్కుంటూన్నానా? లేక విశాల్ లోనే మర్పెమన్నా వస్తోందా?
    నన్ను నేను సర్దుకుంటూ "సర్లే లోపలికి పద కాఫీ ఇస్తాను" అంటూ తనని తీసుకుని కిచెన్ వైపు నడిచాను.
    నవ్య కొత్త చీరలో ఇవాళ మరీ అందంగా ఉంది. లేత నారింజరంగు శిఫాన్ చీర, మాచింగ్ పూసలదండ, మాచింగ్ చెవుల జూకాలు , మాచింగ్ గాజులు.... జడలో కనకంబరాల మాల... చాలా అందంగా ఉంది.
    దసరా సరదాగా గడిపేశాం. కానీ విశాల్ నవ్యతో ఎక్కువగా మాట్లాడడం, తన ఎదురుగా నాతొ ఓవర్ గా సరసాలాడడం , అర్ధం లేని జోకులేసి తనే గట్టిగా నవ్వడం, నవ్య అందాన్ని మాటల మధ్యలో వర్ణించడం నేను డైజెస్ట్ చేసుకోలేక పోయాను.
    నవ్య వెళ్తోంటే 'ఉండండి నేను డ్రాప్ చేస్తాను' అంటూ బండి తీసుకుని హుషారుగా బయలుదేరుతోంటే తెల్లబోయి చూస్తూ ఉండిపోయాను. చిన్నముక్క నన్ను అడగచ్చు కదా.... నవ్య ని డ్రాప్ చేసి రానా అని అనిపించింది.
    ఆ తరువాత కూడా రోజులో రెండు సార్లన్నా నవ్య గురించిన టాపిక్ లేకుండా విశాల్ మాట్లాడడం లేదు.
    విశాల్ లో ఈమధ్య నాకో కొత్త మనిషి కనిపిస్తున్నాడు. ఆ మనిషి నేను ప్రేమించిన విశాల్ కాదు. అతను చాలా హుందాగా, అందంగా విశాలమైన భావాలతో ఉన్నవాడు. ఇతడు చాలా మీన్ మెంటాలిటీ గా అనిపిస్తున్నాడు. నిజంగా ఇతను నేను భావించినంత హృదయ సంస్కారం కలవాడు కాదా? ఏమో... నిట్టుర్చాను.
    రోజులు గడుస్తున్న కొద్దీ విశాల్ కొత్తగా, వింతగా అనిపిస్తున్నాడు. సాధారణంగా బైటకి వెళ్ళడానికి అంతగా ఆసక్తి చూపించడు. ఎక్కడి కేడతాం? ఇంట్లో కూర్చుని టీవి చూసుకోవచ్చు కదా.... ఊరికే ఆ ట్రాఫిక్ లో పడి ఎందుకు? అంటాడు. పొరపాటున ఎప్పుడన్నా వెళ్ళినా, కొంపలంటుకు పోతున్నట్టు ఇంక ఇంటి కెళ్దాం అని నస పెడతాడు.... ఏదన్నా హోటల్ కెళితే మెనూ తీసుకుని రెట్లు చెసీ అన్నింటి కన్నా తక్కువ రెట్లు ఉన్న డిష్ ఆర్డర్ చేస్తాడు. ఒన్ బై టూ టిఫినూ, ఒన్ బై టూ కాఫీ చూసి, చూసి చిరాకు పడ్డానో రోజు, "ఏంటిది? ప్రతిదీ ఒన్ బై టూ ఎందుకు? నాకు పూర్తిగా కావాలి' అన్నాను.
    ఇంటి కెళ్ళి భోజనం చేస్తాం కదా.... ఎందుకిప్పుడు డబ్బులు తగలేయడం అంటూ అంతమందిలో వాదనేసుకోడంతో నేనే నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఒక వస్తువు కొనాలంటే పది షాపులు తిప్పుతాడు. ఒకటికి పది సార్లు బేరం.... అటు తిప్పి, ఇటు తిప్పి , ఇది కాదు వేరేదివ్వు.... అంటూ లోపల ఉన్న బాక్సులు తీసి చూపించమంటాడు. దాన్ని జాగ్రత్త అనాలో పిసినారి తనం అనాలో నాకు అర్ధం కాలేదు. అంతేకాక రోజూ తప్పనిసరిగా డ్రింక్ చేయడం, సిగరెట్ తరచూ కాల్చడం.... ఇద్దరం ఉద్యోగస్తులం అయినా మంచినీళ్ళ దగ్గర్నించి నన్ను అందించమనడం, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపి ఇంటికి రావడం, అసలు సిసలైన భర్తలా రాగానే "ధన్యా వాటర్, ధన్యా వంట అయిందా? ధన్యా ఆ పని పొద్దున్న చేసుకోవచ్చు కదా పడుకుందాం రా...." అంటూ తొందర పెట్టడం. పడుకున్న వెంటనే తన కోరిక తీర్చుకుని గుర్రు పెడుతూ నిద్రపోవడం.... మధ్య మధ్య వాళ్ళ ఆఫీసులో ఆడవాళ్ళ గురించి వర్ణిస్తూ , ఎగతాళి గా మాట్లాడడం వంటివి కొత్తగా గమనించడం ప్రారంభించాక ఇలాంటి వాడిని నేనెలా ప్రేమించాను అనిపించింది. ఏమోలే ఒక్కోరిలో ఒక్కో బలహీనత ....అలా పట్టుక్కూర్చుంటే ఎవరూ నచ్చరు అనుకుని నాకు నేనే సమాధానం చెప్పుకుంటూ మరో ఎనిమిది నెలలు గడిపాము.
    నాకు ప్రెగ్నెన్సీ రాలేదెందుకో అనే అనుమానం వచ్చిందో రోజు. ఆ రాత్రి అదే అన్నాను. "విశాల్ తో నాకు పాపాయి కావాలి... బాగా లేట్ అయింది... రేపోసారి డాక్టర్ దగ్గరకు వెళదామా?"
    "పాపాలేదు... బాబు లేదు... వాళ్ళొచ్చిన దగ్గర్నించి ఇల్లంతా గోల, ఉచ్చలు, వాళ్ళ పనులు... నా గతేం కాను.... ఇది లేకపోతె నేను ఒక్కరోజు కూడా ఉండలేను." అంటూ గట్టిగా అదుముకుని పెదాలు కొరికాడు.
    నా మనసు చివుక్కుమంది. మా ప్రేమ గుర్తుగా పిల్లలుండాలని నేను కోరుకుంటుంటే తనేంటి ఇలా అంటున్నాడనిపించింది. పిల్లలు లేని ఇల్లు ఇల్లా, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అన్నాను.
    "కానీ, నీకో సంగతి తెలుసా! పొట్ట ఉన్న ఆడది సెక్స్ కి పనికి రాదు. అందుకే నువ్వు గర్భవతి కావడం నాకిష్టం లేదు."
    "నీలో ప్రేమ కన్నా కామం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తోంది" అన్నాను, అతని కళ్ళల్లో కి సూటిగా చూస్తూ.
    "నీమీద ప్రేమ ఉంది కాబట్టే ఎప్పుడూ ఇలా దగ్గరగా ఉండాలని ఉంటుంది. దగ్గరయాక కరెంట్ ప్రవహించదూ బాడీలో. అందుకే ఇది" అంటూ ఆక్రమించుకుంటున్న అతడిని నిరోధించలేక నిస్సహాయంగా శరీరం అప్పగించి పడుకున్నాను.
    అయితే సరిగ్గా నెల తిరిగేసరికి నా కోరిక తీరింది. నేను నెల తప్పాను. ఆ విషయం విశాల్ కి అప్పుడే చెప్పాలని పించలేదు. కానీ, రోజలు గడుస్తున్న కొద్ది నాకు వేవిళ్ళు ప్రారంభమై నీరసం ఎక్కువై ఏమీ తినాలనిపించక సిక్ అయ్యాను. నా నీరసం గమనించి కారణం అడుగుతాడేమో అప్పుడు చెప్పాలని ఎదురు చూశాను. కానీ, అతనికి నన్ను రాత్రిపూట తప్ప ఇంకో సమయంలో గమనించే ఆసక్తి, శ్రద్ధ లేదని తెలిశాక చాలా బాధనిపించింది. ఈ సమయంలో నాకేది కావాలంటే అది తెస్తూ ఏం కావాలి అంటూ పదేపదే నా కోరికల లిస్టు అడుగుతూ ఎంతో మురిపెంగా చూసుకోవాల్సిన  ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త ....ఆదర్శవంతమైన కాపురం కోరుకున్నాను.... కానీ, ఇదేంటి ఇలా వుంది?
    నేను ఊహించిన క్షణం రానే వచ్చింది. నా నీరసం, పెరుగుతున్న నా పొట్ట చూసి, చిరాగ్గా మొహం పెట్టి అడిగాడు.... "ఏంటది? ఈ పోట్టేంటి? నాకు పల్చటి పొట్ట లేకపోతె నీమీద కోరిక చచ్చిపోతుంది. వేరే మార్గం వెతుక్కోవాల్సి వస్తుంది...." అన్నాడు.
    ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు? నిర్ఘాంత పోయాను. నోట మాట రానట్టుగా చూస్తున్న నా భావాలు పట్టించుకోకుండా మళ్ళీ అన్నాడు. "తిండి తగ్గించు.... ఎక్సర్ సైజ్ చేయి.... ఆయామ్ ఫాండ్ ఆఫ్ ఫిగర్ .... నీ ఫ్రెండ్ నవ్య చూడు.... బ్యూటీ ఫుల్ ఫిగర్.... తినేయాలనిపిస్తుంది.... అవునూ కొంపతీసి ఇది అది కాదు కదా..." అన్నాడు. నేను మూగదానిలా ఏమీ మాట్లాడే శక్తి లేనట్టు  ఉండిపోయాను. అలా వాగుతూనే తన కోరిక తీర్చుకుని పక్కకి తిరిగి పడుకున్నాడు. కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుంటున్న కొండ చిలువలా అనిపించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS