Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 53

    "అవును యెవరి ప్రాణాలు వారికి తీపి"

    " పోలీసులు తీస్తే ఏమయిందట." అన్నారెవరో.

    వాళ్ళు ముఖా, ముఖాలు చూచుకున్నారు.

    "నేను త్రవ్వుతానండీ..." సిద్దార్థ ముందుకు వచ్చాడు.

    "బావుంది-" అర్జున్ నవ్వాడు.

     "ఎందుకా నవ్వు?"కోపంగా చూచాడు. అంతకు ముందే ఇద్దరూ ఘర్షణ పడ్డారు. శ్వేతను దారుణంగా తిడుతుంటే, సిద్ధార్ధ అడ్డుపడి సంస్కారం లేదని నిందించాడు.

     " అన్న హత్య చేసి పాతిపెడితే తమ్ముడు  తీయటం చిత్రంగా లేదూ! మీ అన్నను పట్టించే ఆయుధాలు, సాక్ష్యాలు దొరికితే మాయం చేయాలని కదా!"

    "ఏడ్చావు-"అతను స్నేహితుడి మాటలు లెక్క చెయ్యలేదు.

     పోలీసులు సిద్దార్థ కలసి గోతిలోని మట్టి తీసారు. వారి పనికి  ఆటంకం కల్గిస్తూ జనం ఒకరిని ,ఒకరు త్రోసుకుని వస్తున్నారు. వారిని ఆదుపులో పెట్టటం పెద్దపని అయింది.
   
     సాయంత్రం నాల్గు గంటలవుతుండగా విరుచుకు పడిపోయింది. చెప్పులు బయటికి తీయగానే మరింత గొడవ చేసింది.

     "నా సీను బాబూ...... తెగిన చెప్పుతో వెళ్తుంటే ....ఊర్లోకి వెళ్ళి గంగాబాయి దగ్గర కొన్నాను. ఇంకా అయిదు రూపాయలు బాకీ పెట్టాను. నాకొడుకో...." ఆమెను పట్టటం తరం కావటంలేదు.

    సిద్దార్థ హృదయం కదిలిపోయింది.

    మనిషి జీవితం ఎంత బుద్భుద ప్రాయం అయినది! దాని కోపమేనా? అబద్దాలు, అక్రమాలు, అన్యాయాలు చేస్తుంటాడు. షోకేసులో బొమ్మలా కాపాడినంత వరకే ,అందం, చందం.

     శ్రీనివాస్ పోటో చూచాడు.చ యెంత అందంగా హుందాగా ఉండే వాడు!  ఏముంది! వికృతంగా మారిన ఎముకలు గూడు మిగిలింది!

    ఇంత ఆశాశ్వతమైన శరీరాన్ని పెంచుకోవాలని ప్రక్కవాడినిపాడు చేస్తారు జనం!

    "మిస్టర్ సిద్దార్థా.....సిద్ధార్థా!"ఎస్సై గట్టిగా పిలిచి భుజం పట్టి ఊపాడు.
   
     " ఓ.... అయామ్ సారీ-" అన్నాడు.

     " ఆ అస్థిపంజరం చేతియెముకల్లో ఏమో ఇరుక్కున్నది చూడండి."

    సిద్దార్థ మరో కానిస్టేబుల్ కలిసి విడిపించారు. రెండు ఉంగరాలు బయట పడ్డాయి. ఒకదానిపా  "మధుమూర్తి" పేరున్నది. అది బంగారుది. రెడంవది వెండి ఉంగరం.   

    దానిపై సన్నగా అందంగా  "రాధిక" అన్న అక్షరాలు చెక్కి ఉన్నాయి.
   
     అది  చూడగానే అకస్మాత్తుగా రాధిక పడుకున్నప్పుడు ఆమె చేతికి ఉన్న వెండి ఉంగరం గుర్తుకు వచ్చింది.

     తను శ్రద్ధగా చూడలేదు, చూస్తే దానిపై శ్రీనివాస్ పేరుచెక్కి ఉంటుంది.
   
    "హాయిగా డైమాండ్ వుంగరం పెట్టుకోక ఈ వైట్ మెటల్ తగిలించుకున్నావేం?" అన్నాడు ఓ రోజు.
   
     "నాకు వస్తువు ఖరీదు కన్నా, అనుభూతి ఖరీదు ముఖ్యం అన్నయ్యా."
       
    "ఏమిటి తల్లీ! ఆ అనుభూతి !"

    " ఓ ఫ్రేండ్ ప్రేమతో ఇచ్చింది. అది...." అన్నదామె.

    జనం గోలగా అరుస్తున్నారు.అక్కడేదో విచిత్రంగా వున్నట్టుచూడాలని ముందుకు చూస్తున్నారు.
   
     పోలీసు వాళ్ళను కంట్రోల్ చేయలేకపోతున్నారు.

     సిద్దార్థ వంగి ఒక అందమయిన  పింగాణి కప్పు తీసాడు.

     "ఇందులో పాయసం ఇచ్చి ఉంటారు" అన్నాడు ఎస్సై.

    ఆ దృశ్యం చూస్తే అందరి గుండెలు జలదరించాయి.

    పార్వతమ్మ ఏడ్పు రావచ్చు మీరు దూరంగా వుండండి."

    పోలీసు గొంతు చించుకుని అరిచాడు.   

 అప్పుడు కాస్త వెనక్కు తగ్గినా చొచ్చుకు రావటం మానలేదు. జనం దయ్యం పేరు చెబితే జడుస్తారు కాని, శాస్త్రం పేరు చెబితే ప్రచారం  చెయ్యలేరు.

      లోషన్లు,డెటాల్స్ తెప్పించి ,డాక్టర్ జోస్ సమక్షంలో ఒక పొడవాటి ట్రేలో అస్తి పంజరాన్ని భద్రపరిచారు.

    చెప్పులు జాగ్రత్త గా దాచారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS