Previous Page Next Page 
ఒప్పందం పేజి 53

 

    ఐదో రోజు  ఉదయం సరిగ్గా పదకొండు గంటలకి కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా రంధీర్.
    ఇవాళ ఫస్టు కాదే.... రంధీర్ ఎందుకోచ్చాడు? 'చెప్పు రంధీర్" అన్నాను.
    "మేమ్ సాబ్ అప్ ఏక్ బార్ నీచే అనా...." అన్నాడు.
    "ఎందుకు?" అడిగాను నొసలు చిట్లించి.
    "అయియే...."అంటూ మరోమాటకి అవకాశం ఇవ్వకుండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు నడిచి జదేసుకుని మొహం తుడుచుకుని పౌడర్ అద్దుకుని, ,ముగ్దని ఎత్తుకుని, డోర్ తాళం వేసి, కిందికి దిగాను. నాలుగో ఇంటి దగ్గర మరో పదిమంది కాలనీ ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఎడంగా రంధీర్.
    నన్ను చూడగానే ముందు కొచ్చి పాప నివ్వమని చేతులు చాచాడు. ముగ్ధ అతనలా చేతులు చాచగానే ఆ చేతుల మీదకి ఎగిరింది. పాపనేత్తుకుని అతను ముందు నడుస్తుంటే  మిగతా ఆడవాళ్ళంతా అతడిని అనుసరించారు. అయోమయంగా ఎక్కడికి? ఏమిటి? అని అడక్కుండా నేనూ వాళ్ళని అనుసరించాను.
    కాలనీ లో ఈమధ్యే కొత్తగా కట్టిన అపార్ట్ మెంట్ లోకి వెళ్ళారంతా. ఏముంది ఇక్కడ? అడిగాను నాతో కొంచెం బాగా మాట్లాడే కవితను... 'పద చెప్తాను'.... అంటూ లిప్ట్ వైపు నడిచింది. లిప్ట్ ఐదో అంతస్తుకి వెళ్ళగానే  రంధీర్ మాకు ఒక ప్లాట్ చూపించి, తను పాపని తీసుకుని కొంచెం దూరంగా నిలబడ్డాడు. ఒకావిడ కాలింగ్ బెల్ కొట్టింది. కొన్ని నిముషాల్లో కొంచెం ముప్పై ఏళ్ళ యువతి వచ్చి తలుపు తీసింది. ఆమె చాలా ఆధునికంగా అలంకరించుకుని ఉంది స్లీవ్ లెస్ జాకెట్టు, పెదాలకు లిప్ స్టిక్, బొడ్డు కిందకి చీర.... ఎందుకో  నాకు ఆమె నచ్చలేదు. నేను లోపలికి వెళ్ళాలా వద్దా అని సంశయిస్తూండగానే అడాళ్ళంతా ఆమెను తోసుకుని లోపలికి వెళ్ళారు. కవిత నావైపు చూసి రా అంటూ పిలిచింది. ఎందుకు? ఆవిడెవరు? మేమంతా ఎందుకు ఆమె మీదకి దాడి చేస్తున్నాం. నాకేం అర్ధం కావడం లేదు. ఆడవాళ్ళంతా ఆమెని తిడుతున్నారు. చాలా అసహ్యంగా, బూతులు తిడుతున్నారు. సిగ్గుందా? దరిద్రపుదానా? మా సంసారాలు నాశనం చేస్తావా? అంటూ ఆపకుండా తిడుతున్నారు. కొంతమంది ఆమె విరబోసుకున్న జుట్టు పట్టుకుని మెడ వెనక్కి వంచి బలంగా మెడ అటూ, ఇటూ తిప్పెస్తున్నారు. హటాత్తుగా జరిగిన దాడికి ఆమె నిశ్చేష్టురాలైంది. ఆమె మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. భయంతో బిక్కచచ్చి పోయింది. ఇంతలో యాభై ఏళ్ళ స్త్రీ, అరవై ఏళ్ళ పెద్దాయన వాళ్ళ వెనకాల ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఏదో టీవి చానెల్ వాళ్ళు కెమెరా పట్టుకుని బిలబిలలాడుతూ వచ్చారు.
    యాభై ఏళ్ళ స్త్రీని చూడగానే ఆ అమ్మాయి ఆడవాళ్ళందర్నీ తోసేసుకుంటూ "అమ్మా' అంటూ వచ్చి ఆవిడ్ని వాటేసుకొబోయింది. ఆవిడ చీత్కారంగా వెనక్కి జరిగి "ఛీ పాపిష్టి దానా? నన్ను ముట్టుకోకు. నువ్వు చచ్చావని మేము నిశ్చింతగా ఉన్నామింత కాలం. నీ బతుకు చెడ. ఎందుకే ఇట్లాంటి బతుకు బతక్కపోతే చావచ్చు గా...ఎందుకీ బతుకు? తోటి ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తూ నువ్వు ఆనందంగా బతుకుతావా? తన్నండమ్మా దీన్ని అడ్డంగా నరకండి" అంటూ ఆవేశ పడుతున్న ఆవిడని పక్కకి జరిపి పెద్దాయన ఆవిడ్ని మందలిస్తున్నారు. "నీ ఆరోగ్యం జాగ్రత్త .... ఆవేశపడకు" అంటూ.
    లేడీ కానిస్టేబుల్స్ ఆ యువతి దగ్గరకు వెళ్ళి భుజ్జం మీద లాఠీతో పొడుస్తూ.... 'నడు....చేసింది చాలు.... మస్తు ఎంజాయ్ చేసినావ్....ఇంక జైల్లో చేద్దువు నడు...." అంటూ లాఠీ తోటే ఆమెని ముందుకు తోశారు.
    కెమెరాలు క్లిక్, క్లిక్ మనిపిస్తూ టివి చానెల్ వాళ్ళు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నిశ్చేష్టురాలై చూస్తున్న నాకు కవిత చెప్తున్న విషయం లీలగా, ఏదో కలలోగా విన్పించసాగింది.
    ఆ యువతి ఆ అపార్ట్ మెంట్ లో చేరి ఏడాది కావస్తోంది. ఆమె చిన్నప్పటి నుంచీ దొంగతనాలు, చేస్తూ, చదువుకోకుండా చిల్లరగా తిరుగుతూ, పాతికేళ్ళ కి పాతికమంది బాయ్ ఫ్రెండ్స్ ని మార్చింది. ఆమె ప్రవర్తనకి విసిగిపోయిన తల్లితండ్రులు ఆమెని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఎక్కడ తిరిగిందో ఏం చేసిందో బాగా డబ్బు సంపాదించింది. ఎక్కడో ఇదివరకు అపార్ట్ మెంట్ లో ఉంటూ వెధవ పనులు చేసి అక్కడ తంతే ఇక్కడొచ్చి పడింది.వచ్చిన దగ్గర్నుంచీ ఆ కాలనీ లో కనిపించిన మగాడిని వల్లో వేసుకుని వాళ్ళ పర్సులు ఖాళీ చేస్తూ వాళ్ళని తాగించి, వాళ్లతో ఎంజాయ్ చేస్తోంది. కాలనీలో చాలామంది మగవాళ్ళు రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం, భార్యలకి తెలిసి గొడవలు పడి, నానాయాగీ అయి మొగుళ్ళ ని అదుపులో పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు. లేనివాళ్ళు  కన్నీళ్ళ తో కాలం గడుపుతున్నారు.
    ఎప్పటి నుంచో ఇదంతా గమనిస్తున్న రంధీర్ "ఆపరేషన్ విత్ ఆడవాళ్ళు' అనే కొత్త ఫార్ములాతో చిక్కు సమస్య విప్పాడు. చాలా పకడ్బందీగా ఆమె తల్లి దండ్రుల అడ్రస్ తెలుసుకుని , ఆమె స్వభావం తెలుసుకుని వజ్రాన్ని వజ్రం తోనే కోయాలన్న సూత్రం తెలుసుకుని, మా ఆడవాళ్ళ నీ, లేడీ కానిస్టేబుల్స్ నీ, సాక్ష్యం కోసం టీవి చానెల్స్ వాళ్ళని పిల్చుకొచ్చి ఆ యువతిని అక్కడి నుంచి వెళ్ళగొట్టే సాహసం చేసిన రంధీర్ మా రక్షకుడు. అతని వైపు చూశాను. ఇక్కడ జరిగే తతంగంతో తనకేం సంబంధం లేనట్టు పాపాయితో కబుర్లు చెప్తున్నాడు.
    ఎవరన్నా నెగెటివ్ గా మాట్లాడినా, తన ట్రాప్ లో చిక్కుకోకపోయినా ఆ మగాడి మీద  రేప్ కేసు పెట్టడం ఆ యువతి  నేర్చుకున్న విద్యల్లో ఒకటి. 'అంతేకాదు' కవిత స్వరం డామినేట్ చేస్తూ, పెద్దాయన స్వరం వినిపించింది. "చూడమ్మా కానిస్టేబులమ్మా... దీనికి ఏ శిక్ష అయినా సరే వేయమను....ఉరిశిక్ష అయినా సరే.... మాకు మాత్రం చెప్పకండి.... పదవే వెడదాం" అంటూ భార్యని తీసుకుని వెళ్ళబోతూ మా అందరి వేపు చూసి రెండు చేతులు జోడించి "క్షమించండమ్మా ఈ దరిద్రపుది చేసిన పనికి నేను క్షమార్పణ అడుగుతున్నాను." అంటూ ఆ వృద్ద దంపతులు తలవంచుకుని వెళ్ళిపోయారు.
    ఆ యువతిని చూస్తుంటే జాలి పడాలో,  అసహ్యిన్చుకోవాలో అర్ధంకాలేదు. టివి కెమెరా కి కనిపించకుండా మొహం మీద చీర చెంగు కప్పుకుని తలవంచుకుని కానిస్టేబుల్స్ వెంట వెడుతోంది. మొత్తం అపార్ట్ మెంట్ లో ఉన్నవాళ్ళంతా గుంపులు, గుంపులుగా చేరుతున్నారు.
    ఇంకా ఏదో చెప్తూనే ఉంది కవిత... "డబ్బు కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతున్న సమాజం ఇది సరితా.... అడ, మగ తేడా లేదు. ఎవరైనా, ఏ పని చేయడాని కైనా సిద్దపడుతున్నారు. ఇంత చండాలంగా సంపాదించి ఈ విలస వంతమైన బతుకు బతక్కపోతేనేం....దీని బతుకు కూడా ఓ బతుకా? మన దౌర్భాగ్యం కాకపోతే దీనింటికి రావడం ఏంటి? పదండి వెడదాం...." అంటూ అందర్నీ హెచ్చరించి తను నా చేయి పట్టుకుని ముందుకు నడుస్తూ అంది... "మనం చాలా అదృష్ట వంతులం. ఎక్కడి నుంచి వచ్చాడో మనందరికీ తోబుట్టువులా దొరికాడు. ఏ అన్న కూడా చేయడింతటి ధైర్యం కదూ...." అంది రంధీర్ వైపు కృతజ్ఞత గా చూస్తూ.
    అదేం పట్టించుకోని రంధీర్ పాపాయి నెత్తుకుని లిప్ట్ దగ్గరకు నడిచి బటన్ నొక్కాడు.

                                                               ***   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS