Previous Page Next Page 
ఒప్పందం పేజి 52


    బహుశా అతని పేరు రణధీర్ అయి ఉండచ్చు. అందరూ రంధీర్ అంటారు. నేనూ అలాగే అంటాను. అతని అసలు పేరేంటో అడగాలన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటె అతడిని ఏ పేరుతొ పిలిచినా పలుకుతాడు. పేరుతొ పిలవకపోయినా పలుకుతాడు. నిత్యం భక్తులను తన చూపులతో కాపాడే సాయిబాబా లానిపిస్తాడు. ఏటి ఒడ్డు నుంచే తన పిల్లల్ని చూపులతో కాపాడే తాబెలులా అనిపిస్తాడు.
    నాకళ్ళు వీధి చివర దాకా వెళ్తూ వస్తూ అనిశ్చితంగా కదుల్తున్నాయి. ఏదో భయం, దుఃఖం, కలుగుతోంది. నితిన్ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? ఎవరా పార్తీలిచ్చే వెధవలు.... ధరలింతగా పెరిగిపోయిన ఈరోజుల్లో రోజూ హోటల్లో తాగుడు కీ, తిండికీ వేలు ఖర్చు పెట్టె వాళ్ళెవరు? మా పెళ్ళయిన ఐదేళ్ళ లో నితిన్ ఎప్పుడూ ఇలా ఆలస్యంగా రావడం, నాతొ ముక్తసరిగా , ముభావంగా ఉండడం నాకు తెలియదు. మాది అనురాగ దాంపత్యం.... మా అనురాగ దీపం మా ముగ్ధ అదంటే నాకన్నా నితిన్ కే ఎక్కువ ప్రాణం. వాళ్ళ బాస్ ఎనిమిదింటి దాకా అపెస్తాడని ఇంటి కొచ్చి దాంతో చెప్పుకుని వాళ్ళ బాస్ ని నానా తిట్లు తిట్టే నితిన్ ఈమధ్య ముగ్ధతో కూడా సరిగా ఉండడం లేదు. ఏదో ఎడంగా, తప్పు చేస్తున్న వాడిలా, ఇబ్బందిగా ఉంటున్నాడు. ఏం జరుగుతోంది? భగవంతుడా.... నా సంసారంలో తుఫాను రేగడం లేదు కదా....నేనెన్నడూ ఇలాంటి సిట్యూఎషన్ ఊహించలేదు.
    హైదరాబాద్ లో కత్రినా లు, సునామీలు వస్తాయా? రావు.... ఎక్కడ ఎలాంటి వరదలోచ్చినా , ఎంత పెద్ద భీభత్సం జరిగినా హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నా జీవితం కూడా అంతే అనుకున్నా.... అలాగే సాగింది కూడా. కానీ...కానీ నితిన్ లో ఏదో మార్పు....భయంకరమైన మార్పు. ఈ పెనుమార్పు నాకు నిద్రని దూరం చేస్తోంది. అప్పటిదాకా పది దాటకుండానే నన్ను కౌగిట్లోకి రప్పించుకోడాని కి నితిన్ చేసే హడావుడి , అల్లరి, అలకలు, చిలిపి చేష్టలు, ముద్దు, ముద్దుగా మండలిస్తూనే మరీ మరీ కావాలని కోరుకుంటూ పది కొట్టగానే లైటార్పేసిన రోజుల నుంచి పన్నెండైనా ఒంటి గంట అయినా , రెండు అయినా నిద్రకి కరువై పోయాయి.
    కలలో కూడా నితిన్ గురించి చెడుగా ఆలోచించని నా మనసుకి హటాత్తుగా తగిలిన ఈ చేదు ప్రతి రక్తకణం నిండా నిండిపోయి నా నాలుక రుచిని కోల్పోయినట్టు తిండికి దూరమైనాను. అయినా ఎందుకో నితిన్ తో గట్టిగా మాట్లాడ లేకపోతున్నాను. ఎందుకిలా ఆలస్యంగా వస్తున్నావు ఇంటికి అని అడగ లేకపోతున్నాను. ఎందుకని?
    చిన్నప్పటి నుంచి సున్నితమైన మనస్తత్వంతో , మొహమాటంతో, సిగ్గు, జంకు లాంటి స్త్రీల కుండే కొన్ని అసహజమైన గుణాలతో పెరిగేనేమో ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళలేను.... పదిమందిలో మాట్లాడలేను. వేదిక లెక్కి కాలేజీ లో కూడా ఏనాడూ ఏ కార్యక్రమం లో కూడా పాల్గొన లేదు. బి.ఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో కాలేజీ ఫస్టు వచ్చిన నేను క్యాంపస్ సెలక్షన్ లో ఫెయిల్ అవడానికి , అందరి కన్నా లాస్ట్ లో బోర్డర్ లో పాసైన హరిణి సెలెక్టు కావడానికి కారణం తనకున్న పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. హరిణి కున్న ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, "నువ్వు నలుగురితో మాట్లాడడం నేర్చుకోకపోతే నీకీ జన్మలో ఉద్యోగం రాదు" అని హరిణి చాలాసార్లు అనేది. "పోదూ వెధవ ఉద్యోగం....నాకా అవసరం రాదులే' అన్నాను చాలా కాన్ఫిడెంట్ గా.
    ఆ వీక్ నెస్ నన్ను ఏదో అగాధం లో తోసేసేలా ఉంది. ఇప్పటికైనా నేను నితిన్ తో ఖచ్చితంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అకస్మాత్తుగా నాతొ, పాపతో ముభావంగా మారడానికి రాత్రిళ్ళు ఇంటికి ఆలస్యంగా రావడానికి ఇంట్లో అసలు సరదాగా గడపక పోవడానికి కారణం ఏమై ఉంటుంది? నానుంచి ఏదన్నా పొరపాటు జరిగిందా? మామూలు ఆడవాళ్ళ లా నేను కూడా మగవాడి లోనే లోపం వేదుకుతున్నానా? నా తరపు నుంచి ఏదన్నా పొరపాటు జరిగిందేమోనన్న ఆలోచన నాకెందుకు రాలేదు. సంసారం పాడు కావడానికి భర్త ప్రవర్తనే కారణం అవుతుందన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది నాకు? నితిన్ మారాడు. కానీ, ఆ మార్పు నేను గ్రహించినట్టు అతనికి తెలిసిందా? ఆ మార్పు నన్ను నా కూతుర్నీ బాధపెడుతుందని అర్ధం అయిందా? ఒకవేళ అర్ధం అయితే అతనెందుకు నాకు వివరణ ఇవ్వలేదు? అడిగితె చెప్పాలను కున్నాడా?
    మరి నేనెందుకు ఈ మార్పుని మౌనంగా భరిస్తున్నాను. నేనెందుకు అతడిని నిలదీయలేదు. నిలదీయడం సంగతి పక్కన పెడితే అసలు నేను ఏమీ అడగలేదు. అతను అలా ఆలస్యంగా రావడం, ముభావంగా ఉండడం చాలా మామూలు విషయంలా భావించానా? నేను నిజంగా ఫూల్ ని... భార్యగా నా విద్యుక్తధర్మాన్ని విస్మరించాను. ఏమైనా సరే అడగాల్సిందే.... అలా నిర్ణయించుకున్నాక కొద్దిగా నా మనసుకి ఊరట లభించింది. ఇంట్లో రోడ్డు మీద స్కూటర్  హెడ్ లైట్ వెలుగు కనిపించింది. చిన్న వణుకు. నిశ్శబ్దంగా లోపలికి నడిచి తలుపు వేసేసి , హాల్లోకి నడిచి మెయిన్ డోర్ గడియ తీసి లోపలికి వచ్చేశాను. మంచం పైన వాలిపోయి, కళ్ళు మూసుకున్నాను. జరగబోయేదేంటో తెలుసుకోవాలన్న ఆరాటంతో...కాస్సేపటి కి ముగ్ధ పక్కకి చేరి ఎడం చేయి దాని మీద వేసి పడుకున్నాడు నితిన్. నేను కళ్ళు తెరవకుండా అలాగే శూన్యం లో ఏదో వెదుక్కుంటూ పడుకున్నాను.
    నేను అడగాలనుకున్నా ప్రశ్న నా నోటి నుంచి రావడం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు? నేనేదన్నా పొరపాటు చేశానా? నువ్వే ఏదన్నా తప్పు చేస్తున్నావా? ఈనాలుగు ప్రశ్నలు అడగడానికి నాలుగు రోజులు రిహార్సల్స్ చేశాను. అయినా నావల్ల కాలేదు. నా చేతకాని తనానికి నామీద నాకే అసహ్యం  వేసింది.
    మరునాడు రోజూలాగే "నాన్నా రాణీ....నాన్న నన్ను ఎత్తుకోలేదు.... నాకు అన్నం వద్దు" అని మారాం చేస్తున్న ముగ్ధ ని బతిమాలి, బుజ్జగించి అన్నం పెట్టి పడుకోబెట్టాను. నాకు ఏం తినాలనిపించలేదు. అన్నీ సర్దేసి పడుకున్నాను. రంధీర్ కర్ర శబ్దం అయిందాకా పడుకోడం, ఆశబ్ధం రాగానే ధైర్యంగా  బాల్కనీ లోకి వెళ్ళి నితిన్ కోసం వీధి పొడుగునా నిరీక్షించడం.... తమాషాగా ఆరోజు నాకు ఎంతసేపటికీ శబ్దం వినిపించలేదు. ఏమై ఉంటుంది రంధీర్ కి... ఆలోచిస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. నితిన్ వచ్చాడు.... ఒక్క ఉదుటున లేచాను. గడియ తీయగానే ముందు నితిన్....వెనకాల రంధీర్ . నితిన్ తల వంచుకుని కొద్దిగా తూలుతూ లోపలికి వచ్చాడు. రంధీర్ నావైపు చూడకుండా సలాం చేసి వెళ్ళిపోయాడు.
    నాకేం అర్ధం కాలేదు. ఏమైంది? రంధీర్ సాయంతో ఎందుకోచ్చాడు నితిన్? ఏదన్నా యాక్సిడెంట్ అయిందా? స్కూటర్ శబ్దం రాలేదే.... ఎలా వచ్చారిద్దరూ? అంటే డ్రైవ్ చేయలేనంతగా తాగాడా.... ఎక్కడన్నా పడిపోతే రంధీర్ తీసుకోచ్చాడా? అతనికేలా తెలుసు? ఈ కాలనీ దాటి వెళ్ళని రంధీర్ కి నితిన్ ఎక్కడ? ఎప్పుడు ఎలా తారసపడ్డాడు? నా మనసులో వంద ప్రశ్నలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కానీ ఒక్క ప్రశ్న కూడా బైటకి రాలేదు. నితిన్ సోఫాలో వాలిపోయి  అడ్డంగా పడుకున్నాడు. కాళ్ళకి బూట్లు లేవు కానీ, సాక్స్ ఉన్నాయి. బూట్లు అస్తవ్యస్తంగా అమూల కొకటి, ఈమూల కొకటి విసిరేసినట్లు పడి వున్నాయి. అతని దగ్గరగా నడిచి మీద చేయి వేయబోయాను. ఛండాలపు వాసన కంపు.... కడుపులో తిప్పేసింది. అక్కడి నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయినా నా చిట్టి తల్లి పక్కన వాలిపోయాను. కన్నీళ్ళు రాకుండా దుఖం ఘనీభవించినట్టు అనిపిస్తోంది.
    తెల్లవారి లేచాక నితిన్ మొహం ఎర్రగా జేవురించి ఉంది. కళ్ళు కూడా నిప్పుల్లా ఉన్నాయి. నాతొ ఏమీ మాట్లాడలేదు. కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎనిమిదింటికి బైటికి వెళ్ళిపోయాడు. కాకపోతే రాత్రి ఎనిమిదింటికే వచ్చాడు. కానీ, నాతొ మాట్లాడలేదు. ముగ్ధతో కాస్సేపు ఆదుకుని అన్నం తిని పడుకున్నాడు. ఇలా నాలుగు రోజులు గడిచాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS