Previous Page Next Page 
ఒప్పందం పేజి 51

   
                                    రక్షకుడు

    టక్ ...టక్ ...టక్ ....టక్.... ఎంతోసేపటి నుంచీ నిశ్శబ్దంగా భరిస్తున్న ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ .... టక్...టక్ ... ఇప్పుడు సమయం పన్నెండు నాకు తెలుసు ఈ శబ్దం.... గూర్కా రంధీర్ కర్ర శబ్దం. అన్ని ఇళ్ళల్లో లైట్లారి పోయాక నెమ్మదిగా లేచి కర్రతీసుకుని తన డ్యూటీ లో జాయిన్ అవుతాడు. ఆకాలనీలో కొందరు పదింటికే పడుకునేవాళ్ళున్నా , పన్నెండింటి దాకా టీవీలు చూస్తూ కూర్చునే చాలామంది ఇళ్ళల్లో లైట్లు అరిపోయిందాకా తన కర్రని బుజ్జగించి శబ్దం చేయకుండా పక్కన పెడతాడు. కర్ర లేకుండానే పది తరవాత ఒక్కసారికాలనీ మొత్తం ఒక చక్కరు కొడతాడు. అందరూ లైట్లార్పే శారని నిర్ధారించుకున్నాక తన విధి నిర్వహణ ప్రారంభిస్తాడు.
    ఇటీవల ప్రతి అర్ధరాత్రి క్రమ తప్పకుండా వింటున్న శబ్దం.... నా మెడ చుట్టూ పెనవేసుకున్న పాపాయి గులాబీ రంగు చేతులు సున్నితంగా పక్కకి తొలగించి, నెమ్మదిగా మంచం దిగాను. నితిన్, ఇవాళ కూడా ఇంకా రాలేదు. ఏమైంది నితిన్ కి హటాత్తుగా ఏదో జరిగింది. వారం నుంచీ ఇదే వరుస పన్నెండు దాటాక కానీ రావడం లేదు. ఇదివరకు వారానికోసారి పార్టీలంటూ కొద్దిగా డ్రింక్ చేసి , పదకొండు, పన్నెండు లోపల వచ్చేవాడు. కానీ వారం నుంచీ ప్రతి రోజూ పార్టీ లేనా అనడిగితే అదోరకంగా నవ్వాడు. పైగా నాపట్ల తన ప్రవర్తనలో కూడా ఏదో మార్పు కనిపిస్తోంది.
    పాపాయితో రోజూ రాత్రిళ్ళు ప్రాబ్లెం అవుతోంది. డిన్నర్ చేయడానికి మారాం చేస్తోంది. నాన్న వచ్చాక తింటాను. నాన్న వచ్చాక బజ్జుంటాను అని.... దాన్ని బుజ్జగించి , బతిమాలి, బామాలి అన్నం పెట్టి పడుకోబెట్టె టప్పటికి తలప్రాణం తోకకి వస్తోంది. ఇలా లాభం లేదు...రేపు నితిన్ ని నిలదీయాలి . ఏదో జరుగుతోంది.
    దిగులుగా అసహనంగా బాల్కానీ లోకి వచ్చాను.
    టక్...టక్.... కింద రోడ్డు మీద నిటారుగా నడిచి వెళ్తోన్న రంధీర్ కనిపించాడు. అతని చేతిలోకర్ర కొన్నిక్షణాలు శబ్దం చేయడం ఆపేసింది. అతను కదలకుండా అలాగే నిలబడి పోయాడు. నాకు తెలుసు అలా ఆగిపోయాడంటే అతను మా బాల్కనీ లో పడిన బెడ్ రూమ్ బెడ్ లైట్ వెలుగు చూశాడు. నేనేదన్నా చెప్తానేమో అని కొన్ని క్షణాలు ఆగాడు. నేనేం చెప్పకపోవడంతో తలవంచుకుని ముందుకు సాగాడు. ఇదీ నేను గమనిస్తున్నాను వారం నుంచీ.,.. పన్నెండు అయిందని అతని కర్ర  శబ్దం వినగానే నాలో ఏదో భయం, దిగులు, అసహనం.... వెంటనే బాల్కనీ లోకి వచ్చి వీధి చివరి దాకా చూడడం.... కాస్సేపు అక్కడే తచ్చాడి నిట్టూర్చి లోపలికి వెళ్ళడం బహుశా అతనూ గమనిస్తున్నాట్టున్నాడు. అందుకే నేను లోపలికి వెళ్ళిందాకా అదే రోడ్డులో నాలుగుసార్లు  తిరుగుతాడు. బెడ్ రూమ్ నుంచి బాల్కనీ లోకి ఉన్న డోర్ వేయగానే తిరిగి కర్ర శబ్దం కొంచెం దూరమవుతుంది.
    రంధీర్ కర్ర కొట్టడంలో యెంత కమ్మటి శబ్దం.... ఎంత రిధమిటిక్ గా ఉంటుందా శబ్దం. ఎవరు నేర్పారితనికి ఇంత అద్భుతమైన విద్య?చక్కని సంగీతానికి అనుగుణంగా కదిలే మృదంగం లా , గాలి సంగీతానికి ఇంత లయబద్దంగా కదుల్తుందా అతని చేతిలో కర్ర. నాకు నిశ్చింతనీ, బోలెడంత సెక్యూరిటీ ని ఇచ్చే శబ్దం. భయంతో నాలోకి నేను కుంచించుకు పోతుంటే నన్ను ఓదారుస్తూ నాకు ధైర్యం చెబుతూ , ఆత్మీయంగా వినిపించే శబ్దం.
    అతనంత క్రమశిక్షణతో , నిజాయితీ తో తన ధర్మాన్ని నిర్వర్తించే సేవకుడు ఎవరూ ఉండరు.... సేవకుడు ప్రజసేవకుడు.... మా కాలనీలో ఉన్న ఐదువందల మంది ప్రజలకు రాత్రి పూట రక్షణ కల్పించే సేవకుడు.... చుట్టూ పక్కల ఉన్న ఎన్నో కాలనీల్లో రాత్రి అవుతుందంటే భయంగా ఉండేది. దొంగతనాలు... నేరాలు.... ఒకసారి ఒక కాలనీలోని పార్కులో అర్ధరాత్రి ఎవరు తెచ్చి పడేశారో ఒక స్త్రీ శవం..... పెద్ద గొడవ పోలీసులు, హదావుడి పంచనామాలు , ఇంటరాగేషన్ లు కాలనీ కాలనీ దెబ్బతో గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుంది. అందుక్కారణం వాళ్ళ కాలనీలో రంధీర్ లాంటి గూర్కా లేకపోడం.... ఉన్న గుర్కా ని అన్యాయంగా దొంగతనం ఆరోపించి తీసేసిన ఆ కాలనీ రాజకీయాల పాపం.... ఆ కాలనీ లోనే అంతులేనన్ని రాజకీయాలు ....ఆ రాజకీయాల్లో బలైపోయిన గూర్కా... అతని పరిస్థితి కళ్ళారా చూసిన మరో గూర్కా ఆ కాలనీలో అడుగు పెట్టక పోవడం.
    కానీ, మా కాలనీలో అలా కాదు.... మా రంధీర్ ఎంతో మంచివాడు. నెమ్మదస్తుడు. ఎంత నెమ్మదస్తుడంటే అతని కష్టానికి ఇచ్చే పది రూపాయలను కూడా ఎంతో నమ్రతగా అడుగుతూ వాళ్ళు ఎన్నిసార్లు రమ్మంటే అన్ని సార్లు ఓపికగా తిరిగి పదో రోజు ఇచ్చినా తీసుకుని సలాం కొట్టి వెళ్ళేంత మంచివాడు. ఆ మంచివాడిని ఎన్ని రాజకీయాలున్నా ఏం చేయగలవు? ఆ మంచితనానికి ఎంత దిర్మార్గం అయినా తలవంచాల్సిందే. నిజానికి అతను తీసుకునేది వేలు కాదు, లక్షలు కాదు.... కేవలం వందల్లో జీతం ... ఉండటానికి ఐదువందల మంది ఉన్నా కుటుంబాలు మాత్రం 50 కుటుంబాలే.... ఒక్కో కుటుంబం నుంచి అంటే ఒక్కో ఇంటి నుంచీ నెల దాటిన పదో రోజుకి అతనికి దక్కేది పది రూపాయలు . 50*10=500 రూపాయలు. నాకు తెలుసు. ఆ పది రూపాయలు ఇవ్వడానికి పది సార్లు తిప్పే అమ్మగార్లు, అయ్యగార్లు ఆ పదిరూపాయల దానం ఇస్తున్నట్టు జాలిపడి ఇస్తున్నట్లో భావిస్తూ , ఇవాళ చేయి ఖాళీ లేదు, రేపు రా అనో, ఇవాళ చిల్లర లేదు రేపుతీసుకో అనో వెధవ శుక్రవారం పూట పొద్దున్నే తగలడతాడు . రేపు రమ్మనండి. అని చీదరించుకునే ఇల్లాళ్ళనూ చూసిచూసి విసిగి విరక్తి చెందిన నేను రంధీర్ ని ప్రేమించడం నేర్చుకున్నా.
    ఒకటో తారీకు పొద్దున్నే అమ్మా అంటూ సలాం కొట్టి రంధీర్ రావడం, ఆలస్యం పది రూపాయలు చేతిలో పట్టుకుని నిలబదేదాన్ని అదే అలవాటు పాపాయికి నేర్పాను. అది కొంచెం పెద్దయ్యాక సరదాగా ఇప్పించడం నేర్పిస్తూ అ ఇవ్వడంలో ఇష్టాన్ని నేర్పాను. దానంలా కాకుండా అతని కష్టానికి ప్రతిఫలం ఇస్తున్న భావన నా చిట్టి తల్లిలో కలిగించాను. పొట్ట కూటి కోసం తరతరాలుగా గుర్కా వృత్తి తో తృప్తి పడుతూ , అదే  వృత్తిలో దైవాన్ని దర్శించుకునే ఆ దార్శనికుడికి పది రూపాయలు ఇవ్వడం ఇష్టంగా, గుళ్ళోని హుండీలో వేసేంత భక్తిగా ఇవ్వడం నేర్పాను. అంతేకాదు, దసరా మాములుకి వచినప్పటి నుంచీ నేనే అతని జీతం ఇంటికి 20 రూపాయలుగా మార్చాను. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, కరెంట్, నీళ్ళు, పెట్రోలు ఆఖరికి అతని చేతిలో కర్ర ధర కూడా పెరిగి పోయిన అతని ఆదాయం సరిపోతుందా? లేదా అనే ఆలోచన ఎవరికుంది? ఎవరికీ ఉండదు. సామాన్యుడి గురించిన ఆలోచన ఉంటె ప్రభుత్వం ధరల నిలా పెంచుతుందా? అంతే....అందుకే ఎవరో ఒకళ్ళు గుర్తించి అతడి ఆదాయం పెంచాలి అనినేనే ఆ పని చేశాను. మాటల్తో వ్యక్తం చేయలేకపోయినా నా ఎదురుగా వచ్చినప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ లో ఎంతో కృతజ్ఞత కనిపిస్తుంది.
    రాత్రి పదిగంటల నుంచి ఉదయం ఐదింటి దాకా కాళ్ళరిగేలా కర్ర కొడుతూ అదీ ఎవరికీ నిద్రాభంగం కలక్కుండా మధురమైన ధ్వని తరంగం లా లయబద్దంగా కొడుతూ కాలని మొత్తం తిరుగుతూ ఒక్క దొంగని కానీ, అసాంఘిక శక్తులను గానీ రానీకుండా మమ్మల్నందర్నీ కంటికి రెప్పలా కాపాడే రంధీర్ కి పది రూపాయలు పెంచడం పెద్ద విశేషం కాకపోవచ్చు.... కానీ ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. రంధీర్ కి ఇచ్చిన డబ్బు నాకు అలాంటి సంతృప్తి నే ఇస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS