తన పెళ్ళయి కాపురానికి వచ్చింది ఇక్కడికే అత్తగారు, మావగారు, ఇద్దరు బావగార్లు, పెద్ద బలగం.... అందరి పెళ్ళిళ్ళు , పురుళ్ళు ఇక్కడే అయాయి. తనకి బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. ఇక్కడే పుట్టారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడే అయాయి. అత్తగారు, మావగారు మేసిలిన ఇల్లు... వాళ్ళు లేకపోయినా అడుగడుగునా వాళ్ళ జ్ఞాపకాలు.... వాళ్ళ మంచితనం ఈ ఇంట్లోంచి ఎక్కడికి వెళ్తుంది తను? పిల్లలు మహారాజా భవనం కట్టించినా తను వెళ్ళదు.... ఈ కట్టే ఇక్కడే రాలిపోవాలి. తనక్కావలసింది పిల్లలు, వాళ్ళ సందడి. కొడుకూ, కోడలు, మనవడు, మనవరాలు అత్తగారిలా తను కూడా అందరితో ఆనందంగా బతకాలి. పండగలకి, వచ్చిపోతూ కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలు ....పిల్లల్ని మించిన సంపద ఈ ప్రపంచంలో ఏం ఉంది? ఏ ఆడదాని కైనా నగలు, చీరలు ఎన్ని ఉన్నాయని ఎవరన్నా చూస్తారా? ఎంతమంది పిల్లలున్నారని వాళ్ళెం చేస్తున్నారు? అని చూస్తారు. ఏంటో తన బాధ ఎవరూ అర్ధం చేసుకోరు.
చెప్పుల చప్పుడుకి తల తిప్పి చూసింది. "ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి?" లోపలికి అడుగుపెడుతోన్న పట్టాభిరామయ్య ని అడిగింది.
"నీకోసం ఒక మంచి బహుమతి తెస్తున్నానోయ్.... హుషారుగా చెప్పారు చొక్కా గుండీలు విప్పుతూ.
ఆవిడ ఆసక్తిగా నవ్వింది. "నన్ను సంతోషపెట్టె బహుమతి ఈ ప్రపంచంలో ఏం ఉందండి? నా పిల్లలు తప్ప?"
"అదే.... వాళ్ళనే తెచ్చాను."
గిరుక్కున అయన వైపు తిరిగి, చరచరా నడిచి వెళ్ళి అయన చేయి పట్టుకుని సంభ్రమంగా "పిల్లలోస్తున్నారా?" అడిగింది.
అయన నవ్వుతూ....ఊ ....రేపు మధ్యాహ్నని కల్లా వస్తారు" అన్నారు.
"అలాగా....మీకెలా తెలుసు? ఉత్తరం రాశారా? ఫోన్ చేశారా?: ఉత్సాహం ఉరకలు వేస్తోంటే గబగబా ప్రశ్నల వర్షం కురిపించింది.
"ఎందుకంత ఆరాటం ? రేపటి దాకా అగవచ్చు కదా .." నవ్వుతూ బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు పట్టాభిరామయ్య.
కాత్యాయిని పరవళ్ళు తొక్కుతున్న ఉత్సాహంతో కంచాల్లో అన్నం, పదార్ధాలు వడ్డిస్తూ, అయన బాత్ రూమ్ లో ఉన్నవిషయం మర్చిపోయిన దానిలా ప్రశ్నలు కురిపిస్తూనే ఉంది. కాళ్ళు చేతులు కడుక్కోచ్చిన పట్టాభిరామయ్య భార్య ఆనందం చూస్తూ పిచ్చిది.... పాపం పిల్లల కోసం కలవరిస్తోంది. రెపీ పాటికి వాళ్ళని చూస్తుంది. ఇంతకాలం తన మాట జవదాటకుండా , తనని, తనవాళ్ళని కళ్ళల్లో పెట్టుకు చూసుకున్న ఈ అమాయకురాలికి తనిచ్చే బహుమతి ఎంత ఆనందాన్నిస్తుందో.... ఆలోచిస్తూ భోజనం ముగించాడు.
మర్నాడు ఉదయాన్నే లేచి జంతికలు, రవ్వలడ్లు, చేసింది కాత్యాయిని.పిల్లల కిష్టం అని కందిపచ్చడి రుబ్బింది.
"ఏవండీ.... ఎన్నింటికి వస్తారు? వంట చేసేయనా? వాళ్ళోచ్చేసరికి చల్లారి పోతుందేమో వచ్చేముందు చేయవచ్చు కదా" అంది.
అయన తెల్లబోయాడు. తనెంత తెలివి తక్కువవాడు. పిల్లలోస్తున్నారంటే నిజంగా వాళ్ళే వస్తున్నారను కుంటోంది. తను తెస్తున్నది కంప్యూటర్ అని, దానికి ఇంటర్ నెట్ కనెక్షన్ పెట్టించి, వెబ్ కామ్ కొన్నాడని తెలిస్తే ఏం చేస్తుందో.... ఎంత పని చేశాడు తను... కాత్యాయని హడావుడి పడకు నా మాట విను.... పిల్లలు....
'అబ్బా.... నా టైం వృధా చేయకండి. మీ సోదతో.... నాకు బోలెడు పనుంది" అంటూ హాల్లోకి వెళ్ళిపోయి పనిమనిషి సాయంతో బూజులు దులపసాగింది.
ఆయనకేం చేయాలో కాత్యాయానికి ఎలా చెప్పాలో అర్ధం కాలేదు. అక్కడికీ రెండు, మూడు సార్లు తను చేయబోతున్న పని వివరించబోయాడు కానీ ఆమె వినలేదు. అయన బిక్కుబిక్కుమంటూ అటూ, ఇటూ తిరగసాగాడు.
పదకొండున్నర అవుతుండగా కరణం గారి అబ్బాయి సత్యనారాయణ పిలుపువినిపించి గబుక్కున వీధి వాకిట్లోకి వచ్చాడు. బండి మీద ఇంకో కుర్రాడిని ఎక్కించుకుని, కంప్యూటర్ తో సహా వచ్చాడు సత్యనారాయణ . "రా సత్యం....' అంటూ భయంభయం గానే వాళ్ళని ఆహ్వానించాడు.
"ఎక్కడ పెట్టమంటారు?" అడిగాడు సత్యనారాయణ.
"ఏంటండి అది? సందేహంగా చూసింది కాత్యాయని.
"ఇది మ్యాజిక్ బాక్స్ అంటీ... కొంచెం సేపు మీరు కళ్ళు మూసుకుని కూర్చోండి ....గొప్ప మ్యాజిక్ జరుగుతుంది." అన్నాడు సత్యనారాయణ.
"మ్యాజిక్కా ...." అయోమయంగా చూసింది.
అయన ఆమె వైపుచూదకుండా కంప్యూటర్ ఎక్కడ పెట్టాలో వాళ్ళకి వివరిస్తూ మొహం చాటు చేసుకున్నాడు.
విషయం ఏమిటో అర్ధం కాకుండా అయోమయంగా ఉండిపోయిన కాత్యాయని తిరిగి లోపలికి వెళ్ళింది. గంట తరవాత 'అంటీ.... ' అంటూ కేకేశాడు సత్యనారాయణ.
"ఏవిటయ్యా అంత కేకేస్తున్నావు?" గాభరాగా వచ్చింది.
"ఇప్పుడు చెప్పండి....మీ మనవరాలు ముందు కావాలా? కూతురా, కొడుకా?"
"అదేంటి? ఏరి వాళ్ళు. ఎవరు ముందు కావాలేంటయ్యా నీ ప్రశ్న పాడు గానూ.... నీకు కన్నుకావాలా? కాలు కావాలా? అన్నట్టుంది" అంది వీధి వాకిలి వైపు పరుగు లాంటి నడకతో వెళ్తూ.
సత్యనారాయణ గట్టిగా నవ్వాడు. "ఇలారండి.... ఇరుగో మీ కొడుకు, కోడలు మీకోసం వాళ్ళు నిద్రపోకుండా ఎదురు చూస్తున్నారు.... మాట్లాడండి" అంటూ చెవుల్లో ఫోన్స్ పెట్టాడు.
"అమ్మా....కులాసానా ...."కిరణ్ గొంతు వినిపించి కాత్యాయని అణువణువూ పులకించినట్టు అయింది. "నాన్నా కిరణ్ ఎలా ఉన్నావురా?"
ఆవిడ స్వరం గద్గిదికం అయింది.
హమ్మయ్య గుండెల మీంచి పెద్ద బరువు దించినట్టుగా నిట్టూర్చాడు పట్టాభిరామయ్య.
ఆవిడ మాట్లాడుతూనే ఉంది. వాళ్ళ ఉత్తరాల కోసం తనెలా ఎదురు చూస్తోంది, తను వాళ్ళ కోసం ఎంతలా తపిస్తోంది... అన్నీ చెప్తోంది. ఎంత బిజీగా ఉన్నా ఉత్తరం ముక్క రాయలేరా అని దెబ్బలాడుతోంది. అయన ముగ్ధుడై చూడసాగాడు. 'నాయనా సత్యం ఒక్కసారి నా చిట్టి తల్లి ని చూపించవూ".... కొడుకు 'నిద్రొస్తోంది పడుకుంటాను' అన్నాడు కాబోలు, 'అలాగే నాయనా పడుకోండి' అంటూ ఫోన్ తీసి సత్యనారాయణ ని ప్రాధేయపడింది.
"చూశావా?" పిల్లలోస్తున్నారు అన్నాను వచ్చారు చూశావా? ఇదంతా ఆధునిక విజ్ఞానం మహిమ తెలుసా?" నవ్వుతూ అడిగాడు. ఆవిడ మొహం మ్లానమైంది.
"ఇదిగో అంటీ మాట్లాడండి.... మీ అమ్మాయి మాధవి కనిపిస్తోంది. చూశారా?' అదుగో పాప నిద్రపోతోంది. " అంటూ మళ్ళీ ఫోన్ ఆవిడ చెవుల్లో పెట్టాడు.
"అమ్మా....అమ్మా....' మాధవి గొంతు వినిపిస్తోంది. కానీ, కాత్యాయని స్వరం మాత్రం పైకి రావడం లేదు. దుఃఖం ఉండలా మారి గొంతులో అడ్డుపడింది.
"మట్లాడు కాత్యాయని , పిల్లలు, పిల్లలు అంటూ కలవరించి ఇప్పుడా ఏడుపెందుకు? ఎంతో సంతోషించాల్సిన సమయం ఇది."
"అవునాంటీ హాయిగా మీ పిల్లలతో మీరు యెంత సేపైనా మాట్లాడుకోవచ్చు. పాపాయికి కధలు చెప్పవచ్చు. వాళ్ళని చూడచ్చు. ఉత్సాహంగా చెబుతున్నాడు." సత్యనారాయణ.
"కానీ...కానీ.... వాళ్ళ కోసం పోద్దుట్నీంచి కష్టపడి చేశానే, ఆ వంటలన్నీ ఎవరు తింటారండి? ఈ కంప్యూటర్ , ఈ మైకు , ఈ కెమెరా ఇవన్నీ చాలా గొప్పవే కావచ్చు కాక, కానీ కానీ నా చిట్టి తల్లిని ఒక్కసారి నా గుండెలకి హత్తుకుని ఆ స్పర్శ లోని మాధుర్యం అనుభవించే అవకాశం నాకీ పెరిగిన ఆధునిక విజ్ఞానం ఇవ్వగలదంటారా?"
పట్టాభిరామయ్య సత్యనారాయణ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చిన ఇంజనీరు అందరూ ఆవిడ ప్రశ్నకి సమాధానం చెప్పలేని వాళ్ళలా నిలబడి పోయారు.
***
