Previous Page Next Page 
ఒప్పందం పేజి 49

 

                                      స్పర్శ

    మధ్యాహ్నం ఒకటిన్నర కావస్తోంది. వర్షాకాలం.... రెండు రోజులుగా కుంభవృష్టి తో అల్లల్లాడిన జనం ఆవేళ కొంచెం ఎండ రావడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎండ ప్రియురాలి కౌగిలి లా నులివెచ్చగా ఉంది. కాత్యాయిని వీధి గుమ్మం అరుగు మీద అ స్పర్శలో చలి కాచుకుంటూ కూర్చుంది. ఆమె కళ్ళు వీధి  చివరన అతుక్కుని ఉన్నట్టుగా దృష్టి తదేకంగా ఉంది. ఎవరి కోసమో ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా ఆమెని చూస్తేనే తెలిసిపోతోంది. కొద్దిగా ఆ కళ్ళల్లో అసహనం, విసుగు కూడా కనిపిస్తోంది. హటాత్తుగా సైకిల్ బెల్ మోగింది. ఆమె కళ్ళల్లో ఆశ రెపరెప లాడింది. కానీ, మళ్ళీ కొన్ని సెకన్ల లోనే ఆశ అంతరించింది. నిరాశ మబ్బులా కమ్మింది. ఎవరో కుర్రాడు సందు మలుపు తిరిగి వెళ్ళిపోయాడు.
    "వెధవ.... ఎవోచ్చిందో ఇవాళ కూడా రాలేదు....' అనుకుంది విసుగ్గా.
    అయినా ఎదురుచూడడం మానను అన్నట్టుగా అక్కడే అలాగే కూర్చుని ఉండిపోయింది.
    ఇవాళ ఒకటో తారీకు. గతనెల సరిగ్గా ఇదేరోజున పట్టాభీరామయ్య రిటైర్డ్ అయాడు. ఆరోజు కలగని దిగులేదో కలిగినట్టు అయింది ఆవిడకి. ఆరోజు మెడలో వేసిన పూలదండలు చేతుల మీద వేసుకుని, శాలువా భుజాన కప్పుకుని ఇంట్లో వస్తూనే రేపట్నించి నీకు బోలెడు కాలక్షేపం అంటూ నవ్వాడు.
    ఉన్న ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు పేర విదేశాలకు వెళ్లిపోవడంతో కాత్యాయిని దిగులు పెట్టుకుంది. అందులోనూ మనవరాలు నవ్య కూడా తల్లిదండ్రులతో వెళ్ళిపోవడం ఆవిడకి అసలు నచ్చలేదు. ఏడాది పాటు అరచేతుల్లో పెంచుకుని కళ్ళల్లో పెట్టుకుని అపురూపంగా చూసుకుంది. ప్రాణానికి ప్రాణంగా భావించింది. అసలు కూతురు అలా నిర్దయగా తన నుంచి ఆపిల్లను తీసుకుని అన్ని వేల మైళ్ళ దూరం వెళ్తుందని ఆవిడ అసలు ఊహించలేదు. అనుకోకుండా ఓరోజు అటుకొడుకు,కోడలు, ఇటు అల్లుడు, కూతురు వచ్చి మాకు అమెరికా లో ఉద్యోగం దొరికింది వెళ్తున్నాం అనగానే కుప్పకూలి పోయింది. దుఃఖంతో స్వరం మూగబోయింది. ఎందుకు? ఎందుకు మీరంతా అంత దూరం వెళ్ళడం... మన ఊరు గొడ్డు బోయిందా? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలకి వేమైంది? అంటూ ప్రశ్నల వర్ధం కురిపించింది.
    అప్పటికే నలుగురూ హైదరాబాదు లో ఏదో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. దాదాపు ప్రతి పండక్కి కనీసం ఒక్కరోజైనా నలుగురూ వచ్చి వెడుతుంటే ఇల్లంతా కళకళలాడుతూ ఉందని పొంగిపోయింది. కూతురు మాధవి నెల తప్పిందని తెలియగానే పాపాయిని నేనే పెంచుకుంటా అంటూ మురిసిపోతూ చెప్పింది. ఏడాదిపాటు గుండెల్లో పెట్టుకుంది కానీ, వాళ్ళలా హటాత్తుగా తన నెత్తి మీద బండరాయి పడేస్తారని ఆవిడ కలలో కూడా అనుకోలేదు.
    అమ్మా.... ఇప్పుడున్న ఉద్యోగాలు బాగానే ఉన్నాయి కానీ , అక్కడ ఉద్యోగం ఇంకా బాగుంటుంది. ధరలు చూశావా ఎలాపెరిగి పోతున్నాయో ....మనం ఎంతకాలం ఈ పాతకాలం పెంకుటింట్లో ఉంటాం. ఈ పెంకులు తీసి డాబా వేసుకుడాని క్కూడా మన దగ్గర డబ్బులు లేవు. అందుకే, అమెరికా వెడితే బోలేడు డబ్బులు సంపాదించుకుని , మంచి ఇల్లు, కట్టుకోవచ్చు. ఇక్కడ కాదు... హైదరాబాద్ లో కట్టుకుందాం మంచి ఇల్లు... చూశావా... నీ మెడలో నా చిన్నప్పటి నుంచి చూస్తూన్నా ఆ పాత గొలుసు తప్ప ఒక్క నల్లపూసల గొలుసు చేయిన్చుకున్నావా? మమ్మల్ని చిన్నప్పటి నుంచి అష్టకష్టాలు పడి పెంచిన నిన్ను, నాన్నని మేము ఇప్పుడైనా సుఖ పెట్టాలంటే అక్కడికి వెళితేనే సాధ్యం అంటూ మాధవి, కొడుకు కిరణ్ ఒక పక్క అల్లుడు, కోడలు మరోపక్క అమెరికా వెడితే కలిగే లాభాలు ఎంతో ఓపిగ్గా వివరంగా చెప్పి తనని బలవంతంగా ఒప్పించారు.నీకెందుకు వెళ్ళగానే వారానికో ఉత్తరం రాస్తాం. రెండు రోజుల కోసారి ఫోన్ చేస్తాం అంటూ వాగ్దానాలు చేశారు.
    ఏదీ.... వెళ్ళి రెండేళ్ళవుతోంది.... అన్నట్టుగానే వెళ్ళిన కొత్తల్లో వారానికో ఫోన్ మాత్రం చేశారు. ఈ రెండేళ్ళ లో నాలుగుసార్లు ఉత్తరాలు రాశారు. మళ్ళీ ఉత్తరాలేవి? ఆవిడ కళ్ళు మళ్ళీ వీధి చివరకు మళ్ళాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే రోడ్డు వస్తుంది. రోడ్డుకి ఎడం వేపు కొంచెం దూరం వెళ్ళి, మళ్ళీ ఎడం పక్కకి తిరిగితే  బ్యాంకు , రోడ్డు కుడి పక్క నుంచి మరి కొంచెం దూరం వెడితే పోస్టాఫీసు ....ఆ పోస్టాఫీసు నుంచి ఉత్తరాల కట్టలు మోసుకొచ్చే సింహాచలం కోసం ప్రతిరోజూ ఆ సమయానికి అలా వీధి వాకిట్లో ఎదురు చూడడం ఆవిడ దినచర్య లో ఓ భాగమైంది.
    ఏం పిలలో! వెళ్ళేటప్పుడు ఎంతగా నచ్చ చెప్పారు? ఎన్ని కబుర్లు చెప్పారు. వెళ్ళిం దగ్గర్నించి ఆ కబుర్లు ఏమయాయో.... ఏవన్నా అంటే బిజీ అమ్మా... టైం లేదు అనడం.... ఎంత బిజీగా ఉంటె మాత్రం తల్లి తండ్రులకి ఉత్తరాలు, రాసుకోరా, దగ్గరా? దాపా కొన్ని వందల వేల మైళ్ళ దూరంలో ఉన్నారు.... ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో.... పల్చగా కమ్మిన కన్నీటి తెర మధ్య పరిసరాలన్నీ అస్పష్టంగా కనిపించాయి. సైకిల్ బెల్ మోగడంతో ఉలిక్కిపడి మళ్ళీ ఆశగా చూసింది. ఆవిడ కళ్ళల్లో అనందం చిన్న మెరుపులా వచ్చి చేరింది.
    'అమ్మగారూ.... మీకేం లేవండి" బిగ్గరగా అనేసి బెల్ మోగించుకుంటూ ముందుకు సాగిపోయాడు పోస్ట్ మాన్ సింహాచలం.
    "ఒరేయ్ సింహాచలం..." ఆవిడ పాతకాలం గేటు దగ్గరకు వడివడిగా వచ్చింది.
    ఎదురింటి గేటు ముందు సైకిల్ ఆపి, గేటు తోసుకుని లోపలికి వెళ్ళి ఉత్తరాలు ఇచ్చి వస్తోన్న సింహాచలం మళ్ళీ అన్నాడు. "మీకేం ఉత్తరాలు రాలేదండి."
    "నీ మొహం సరిగ్గా చూడు" విసుగ్గా అందావిడ.
    నవ్వాడు సింహాచలం. 'అమ్మగారూ! నమ్మకం లేదేంటండి ...ఇలా చూడండి . అసలు కట్టే పలచబడింది. అందులోనూ అమెరికా నుంచి ఉత్తరాలు ఎవరికీ రావడం లేదు. అయినా చాదస్తం కానీ, కంప్యూటరు పెట్టించుకోండి అంటే వినరేంటండి? కాలం మారిపోయింది. కంప్యూటర్లో గంటలు, గంటలు మాట్లాడుకునే రోజులివి. మీరింకా ఉత్తరం ముక్క కోసం ఎడురుచూత్తారెం టండి?' తనకి తెలిసిన విజ్ఞానం అంతా రెండు ముక్కల్లో గబగబా అనేసి తిరిగి బెల్ మోగించుకుంటూ సైకిల్ ముందుకి పోనిచ్చాడు.
    కాత్యాయానికి ఏమీ అర్ధం కాలేదు. కంప్యూటర్లో మాట్లాడుకోడం ఏంటి? వీడొకడు అడిగిన దానికి సమాచానం చెప్పకుండా ఏవిటో మాట్లాడతాడు. విసుగ్గా అనుకుంటూ తిరిగి సందు చివర వైపు చూపు తిప్పింది. ఈయనగారు ఇంకా రాలేదేంటో.... ఆకలేస్తోంది. మళ్ళీ వర్షం పడితే కష్టం అనుకుంది. అప్పుడే వీధి చివర నుంచి వస్తూ కనిపించాడు పట్టాభిరామయ్య.
    కాత్యాయని అరుగు మీంచి లేచి, లోపలికి నడిచింది. డైనింగ్ టేబిల్ మీద కంచాలు, మంచినీళ్ళు పెట్టింది. ఆవిడకి చాలా దిగులుగా అనిపించింది. ఎంతకాలం అలా లింగు లిటుకుమంటూ ఇద్దరే ఉండడం.... పిల్లలతో కళకళలాడల్సిన ఇల్లు... అప్పుడే రెండేళ్ళు... "ఎంతో కాలం ఉండమమ్మా డబ్బులు సంపాదించుకుని అందరం ఇళ్ళు కొనుక్కుని, కొంత పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుని వచ్చేస్తాం. అప్పుడు అందరం హాయిగా ఉండొచ్చు.... ' కిరణ్ మాటలు గుర్తొచ్చాయి. మీరు ఇక్కడ లేనప్పుడు నాకే ఇల్లు అయితే ఏంరా తల దాచుకోడానికి అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS