"మొన్న ఆదివారం, ఇంటికి వస్తావను కున్నాను.' అంది శారద.....
మూడేళ్ళ క్రిందట, అంటే మురళీ వుద్యోగంలో చేరిన కొత్తలో వో రోజున బస్సు స్టాపు లోనే మురళీ వాసు కలుసుకున్నారు. తరువాత తరచూ అక్కడ కలుసుకోటంతో పేర్లూ వూర్లూ చెప్పుకుని పరిచయం చేసుకున్నారు-- తరువాత అ పరిచయం స్నేహంగా మారింది. ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించుకోటం దాకా వచ్చింది --శారదని మురళీ చనువుగా అక్కయ్యా అని పిలుస్తాడు -- అతని గదికి వాళ్ళు రావటం అరుదే అయినా మురళీ తరచు వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఆదివారం సాయంకాలం అక్కడికి వెళ్లి శారద పెటిన టిఫిన్ తిని కాఫీ తాగి, వాళ్ళకి వేరే మరే పోగ్రామూ లేకపోతె కాస్సేపు అక్కడ బాతాఖానీ వెయ్యటం పరిపాటి అయిపొయింది -- మధ్యలో ఎప్పుడైనా ఒకటి రెండు వారాలు అతను వెళ్ళకపొతే వాళ్ళు గుర్తు వుంచుకుని మరీ అడుగుతారు. అలా అడిగిన ప్రతిసారీ, మరో ఫ్రెండు వచ్చాడనో, అనుకోకుండా సినిమా ప్రోగ్రాం పడింద నొ టకీమనీ సమాధానం చెప్పగలిగే మురళీ ఇవాళ శారద అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తోచక ఒక్క క్షణం తబ్బిబ్బు పడిపోయాడు. ఆవాళ అనుకోకుండా పార్కు కి వెళ్ళాననీ, అక్కడ అదృష్టవ శాత్తూ కళ్యాణి కనిపించింద నీ ఆమెతో కబుర్లు చెప్తూ కూర్చుంటే మరెవ్వరూ కూడా గుర్తు లేకుండా పోయారనీ చెప్పటానికి మొహమాట పడిపోయాడు. ఇంతలోనే అపంద్భందవుడి లాగ బస్సు వచ్చి ఆగింది. వో నలుగురు పాసెంజర్స్ ని దింపి, క్యూలో ముందుగా వున్న నలుగుర్ని ఎక్కించుకుని వెళ్ళిపోయింది ఆ బస్సు-- ఆ హడావిడిలో అతను సమాధానం చెప్పలేదన్న సంగతి వాళ్ళు మరిచిపోయారు.
'మరో బస్సు వచ్చేసరికి ఎంతసేపవుతుందో -- మేం రిక్షాలో వెళ్ళిపోతాం .' అంది శారద.
ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న వాడిలా 'సరే వెళ్ళండి' అనేసి బ్రతుకు జీవుడా అనుకున్నాడు. మురళీ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ...లేకపోతె ఇంకా మాట్లాడుతూ అలాగే నిలబడి వుంటే తనూ కళ్యాణి కలిసి షాపింగు కి వచ్చిన సంగతి ఎక్కడ బయటపడి పోతుందో, దానికి వాళ్ళే మనుకుంటారో అన్నట్లు మొహమ్మాట పడిపోయాడు.
కాస్సేపటి తరవాత కళ్యాణి వెళ్ళాల్సిన బస్సు వచ్చింది. ఆమెకి మరోసారి థాంక్స్ చెప్పి బస్సు ఎక్కించి తను రిక్షాలో ఇంటికి వెళ్ళిపోయాడు.
* * * *
గేటు తెరుచుకుని ఇద్దరూ పార్కులో అడుగు పెట్టారు.

ఇంక తరువాత జరగబోయే సంభాషణ ని తలుచుకుంటుంటేనే మురళి మనస్సు పట్టలేని వుత్సాహంతో ఎగిరెగిరి పడుతోంది -- ఆ వుత్సాహం అంతా వచ్చి మొహం మీద ముద్ర వేసుకు కూర్చున్నట్లు, అతని కళ్ళూ, మొహం అదో వింత కాంతితో మెరిసి పోతున్నాయి....అతని కళ్ళకి చుట్టూ పరిసరాలూ, ప్రకృతీ అంతా మరీ మనోహరంగా అనిపించింది. అదివరకు ఎన్నిసార్లో వచ్చి కూర్చుని గంటలు గంటలు గడిపే పార్కులో అది వరకు ఎన్నడూ కనిపించని ఎన్నో కొత్త అందాలు ఇవాళ అనుభవంలోకి వస్తున్నట్లుంది. అక్కడి ప్రతి మొక్కా ప్రతి పువ్వూ కొత్తగా మెరిసి పోతున్నట్లున్నాయి. మనస్సుని గిలిగింతలు పెట్టె ఊహలు, ఇంతటి ఆహ్లాదంతో పరవశించి పోయేలా చేసే పరిసరాలు ఒక్కక్షణం తన నిగ్రహాన్ని చెదరగొట్టేసినట్లయి, అలా తనకి దూరదూరంగా నడుస్తున్న కళ్యాణి ని గబుక్కున దగ్గరికి లాక్కుని ఒక్కసారి తనివి తీరా గుండెలకి హత్తుకోవాలనే కాంక్ష కలిగింది -- మళ్లీ అంతలోనే తెలివి తెచ్చుకున్నట్లు తన వూహలకి తనే సిగ్గుపడి పోయాడు.....ఇన్నాళ్ళ స్నేహం లోనూ తను అతి చనువు తీసుకున్న సందర్భాలు కాని మాటలలోనయినా హద్దులు మీరిన సన్నివేశాలు కాని ఏనాడూ జరగలేదు. అందుకు తన సభ్యత సంస్కారం ఒక్కటే కారణం అనేకంటే కళ్యాణి ప్రవర్తన కూడా తమ ఇద్దరి మధ్యా వో ఇనప గోడలా నిలిచేది అని చెప్పవచ్చు-- పెదవులు చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నట్లే వున్నా ఆమె మొహంలో ఏదో గాంబీర్యం తనని శాసించి అడుగు ముందుకు వెయ్యకుండా చేసేది -- మనస్సు విప్పి మాట్లాడుతున్నట్లే వున్నా అమెచూపులు మాత్రం తనని చొరవగా దగ్గర జేరనీయకుండా అంత దూరంలోనే నిలబెట్టేస్తాయి-- ఇంక ఎన్నాళ్ళు ఈ బింకం సాగించుకుంటుంది? తను చెప్పేది వినగానే కళ్యాణి మొహంలో రంగులు ఎలా తిరిగిపోతాయో ఆమె చెక్కిళ్ళ లో గులాబీలు ఎలా విచ్చుకుంటాయో తాను వూహించుకో గలడు ....అసలు -- సిగ్గుతో మొగ్గలా ముడుచుకు పోతూ కళ్ళు ఎత్తి తన వంక చూడగలదా? పెదవి విప్పి మాట్లాడ గలదా? పెళ్లి కూతురులా తలవంచుకుని మౌనంగానే తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తుందేమో? లేకపోతె , ' నాకెప్పుడో తెలుసు మీ సంగతి' అంటూ చిలిపిగా తన వంక చూస్తుందా?
ఊహలలో తెలిపోతూనే కళ్యాణి తో పాటు నడిచి పౌంటెన్ దగ్గరికి వచ్చి పచ్చిక మీద కూర్చున్నాడు మురళీ. అతనికి కాస్త దూరంలో కూర్చున్న కళ్యాణి తల ఎత్తి అటు వేపు నీటి తుంపరల కేసి చూస్తోంది.
'అక్కడేమిటి చూస్తున్నావు ? ఇటు తిరుగు.....నీకో మంచి మాట చెప్తాను. వింటున్నావా?....వో నాలుగు రోజులయినా శలవు పెట్టి వో సారి వచ్చి వెళ్ళమని నాన్నగారి దగ్గర నుంచి వుత్తరం వచ్చింది. -- వాళ్ళెందుకు రమ్మన్నారో కారణం కూడా వ్రాశారులే -- నేను అక్కడ పెళ్లి కూతుర్ని చూడాలిట -- అలాంటి వుత్తరం రావటం మంచిదే అయిందిలే . లేకపోతె నేనిలాగే ఇంకా కొన్నాళ్ళు తాత్సారం చేసేవాడిని...ఇంక, ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? ఏం వింటున్నావా? నేను అంతదూరం రానక్కరలేదు. నా నిర్ణయం ఏదో ఇక్కడే జరిగి పోయింది అని వ్రాసేస్తాను-- ఏం వ్రాసేయ మంటావా మరి?....మురళీ గొంతు ఉల్లాసంగా, ఆ ఎదుటి మనిషి మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసేటం త మధురంగా మృదువుగా పలుకుతోంది........అయితే కళ్యాణి మీద వాటి ప్రభావం ఏమీ లేనట్లు కదలిక మెదలిక మేకుండా అలాగే కూర్చుంది......
'కళ్యాణి!'
'..........'
'వో, కళ్యాణి దేవి, ఏమిటా పరధ్యానం.'
కళ్యాణి తల తిప్పకుండానే , ఊ.......ఏమిటి?' అంది, అప్పుడే నిద్రలోంచి మెళుకువ వచ్చినట్లు అంత క్రితం అతను చెప్పిందంతా అసలు విననే లేదన్నట్లు.
'ఏమిటీ అంటూ ఇప్పుడడుగు తున్నావా? నేనింత హుషారుగా చెప్పుకు పోతుంటే నువ్వు వినకుండా చేస్తున్న ఘనకార్యం ఏమిటి.' చిరుకోపం నటిస్తూ చేతి కందిన గడ్డి పరకలు తుంపి కళ్యాణి మీదికి విసిరాడు.
మెల్లిగా తలతిప్పి మురళీ కళ్ళల్లో కి చూసింది కళ్యాణి -- అతను అనుకున్నట్లు ఆశించినట్లు కళ్యాణి చూపులల్లో చిరునవ్వు చిలిపితనం చిందు లాడటం లేదు-- ఆ కళ్ళు సిగ్గు బరువు తో వాలిపోవడం లేదు-- ఆ క్షణం లో అతను చేస్తున్న కళ్యాణి కి ఇన్నాళ్ళూ తనకి పరిచయమైన కళ్యాణి కి అసలు పోలికే లేదేమో ననిపించింది -- సాయంకాలపు పల్చటి నీరెండ లో పసిమి చాయలో మరీ అందంగా మెరిసి పోతూ వుండే కళ్యాణి మొహం ఇవాళ దైన్యానికి, ప్రతిరూపుగా వుంది-- తనని కవ్వించి రెచ్చగోట్టక పోయినా ఆదరంగా అభిమానంగా పలకరించే ఆ కళ్ళల్లో అసలు జీవకళ అన్నదే లేనట్లు గాజు బుడ్ల లా వున్నాయి-- మురళీ ఎలాగో అయిపోయాడు. ఆశా భంగంతో పాటు ఆశ్చర్యంతో అతనికి క్షణం నోటమాట రానట్లే అయింది.
'సారీ కళ్యాణి -- నా ధోరణి లో నేను చెప్పుకుంటూ పోయానే కాని నువ్వు వింటున్నావా లేదా అనయినా ఆలోచించలేదు. వచ్చేటప్పుడు వున్న సరదా క్రమంగా దూరం అయిపోయి నువ్వు ముభావంగా వుండిపోయావు అనే విషయాన్ని కూడా గమనించలేక పోయాను. చెప్పు దేన్నీ గురించి నువ్వు దిగులు పడుతున్నావు ....ఆ ఆలోచన లతో ఇలా నువ్వు ఒక్కదానివే తల బద్దలు కొట్టుకోకపోతే నాతో కొంచెం చెప్పరాదా -----' కళ్యాణి నోటితో చెప్పించాలని అడిగాడే కాని ఆమె దేన్నీ గురించి ఆలోచిస్తుందో అతనికి చూచాయగా అర్ధం అయిపోయినట్లే వుంది.
'ఇన్నాళ్ళూ మా మధ్య కులాల ప్రసక్తి రాలేదు -- ఒకవేళ ఇప్పుడు అదే ఒక అభ్యంతరం గా నిలిచినా నేను దానిని లక్ష్య పెట్ట దలుచు కోలేదు. అని స్పష్టంగా చెప్పేస్తాను -- మనసులు కలిసిన తరువాత కులాలు ఒక ప్రతిబంధకం ఎప్పుడూ కావు అని కళ్యాణి కి నమ్మకం కలిగేలా బుజ్జగించి చెప్తాను .....' అనుకున్నాడు. తన మనస్సు గ్రహించకుండా దోషిలా తల వంచుకుని పచ్చిక మీద చేత్తో నిమురుతూ మౌనంగా కూర్చున్న కళ్యాణి ని చూస్తుంటే జాలి ముంచుకు వచ్చిందతనికి -- 'ఊ-- చెప్పాలి మరి. అన్నాడు చిరునవ్వుతో కవ్విస్తూ.
'మీకు అంతా చెప్పాలనే చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను-- కాని చేత కావటం లేదు.
