రాముడు తీసుకున్నాడు. మీద నలవేసుకున్నాడు. చేత బాణాలు పట్టుకున్నాడు.బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళాక అలసట అనిపించింది. కూర్చున్నాడు. అంతదూరంలో కొంగలను చూసాడు. పొలాలపై యెగిరెగిరి వాలుతున్నాయ్. మళ్ళీ ఒక్క గుంపుగా యెగురుతున్నాయ్. లేచాడు. ఒక పొలంలో వలపన్నాడు. ఆ వలకింద బురద నీటిలో చేపలు కదులుతున్నాయ్. అనుకున్నట్టే కొంగలు యీ పొలంపై వ్రాలాయి. ఐదు కొంగలు వలలో చిక్కుకున్నాయ్. ఆ సమయంలోనే ఒక వయసులో వున్నవాడేగాని. పీలవంగా వున్న రైతు అలా వెళ్ళిపోతూ "కొంగల నేం సేస్తావురా" అన్నాడు. జవాబు చెప్పే ముందొకసారి అతని వేపు చూసాడు. పెళ్ళం మాటలు జ్ఞప్తికి వచ్చి నాయ్.
"అయ్యబాబో! కొంగలో వున్న ధాడుపుష్టి యింకే పిట్టలో లేదు. దీని విలవ మందలోడ్ని మందులిచ్చినోడ్ని, నాకు తెలుసు."
"నీకు వైద్యం తెలుసురా..."
"బాబో నదువునేదు. యివ్వనేదు. ఎర్రోడునాగ తిరిగి నోడికి. బద్రాచలం తట్టు అడివిలో ఒక ఋషి కిటుకు సెప్పినాడు."
"నా జబ్బుకు మందుందిరా?"
"మందు నేకపోతే జబ్బు రాదు బాబో! వనమూలికల్లో యెంత సేపుందో యెందరికి తెలుసును?"
"నా జబ్బేంటో పోల్చరా?"
రాముడు చేతినాడెం చూసాడు. కంటిరెప్పలు పరీక్షించాడు. "బాబూ..... కోపంరాదు కదా..."
"సెప్పరా?"
"దాతుపుష్టినేడు. ఉత్తి సెడురక్తం. నానా అలజాటన పడాల".
"మందిస్తావా?"
"రాగి లేనిది రోగం కుదరదు. బస్మాలు పడాల. ఆ బస్మాల్లో యెండి, బంగారం యెంతో వుంటాది."
"నా కెందరో వైదుగులయ్యారు. డబ్బిస్తాను. బాగుచేస్తావా?"
"బాగైతే బవుమానం యిత్తావా?"
"ఓ...."
"ఇప్పుడు మీకు తోసినంతయివ్వండి. ఇవిగోండి రెండు కొంగలు. కోసి నెయ్యిలో వుడకెయ్యండి. నాల్గుపూటలు తినండి. ఇదిగో యీబస్మం. తేనెతో...ఇది యిరవై పూట్లకొస్తాది. ఈ వనమూలిక మొలకి కట్టండి. మా గురువుని తల్చుకుని యిస్తన్నాను-" వాడు సగం నమ్మకంతో రెండు రూపాయలిచ్చాడు.
"పిట్టల కరీదు లేదు దొరా" అన్నాడు రాముడు.
బేరంలోనికి దిగింది. ఇంకో రూపాయి యిచ్చాడు. ఆ వెళ్ళిన రైతు వీడిపేరు. వునికీ అంతా తెలుసుకున్నాడు. రాముడు యింట్లో వచ్చి పడ్డాడు. ఇప్పుడు గుండె, పిరికితో గడగడలాడుతోంది. వాడికి బాగుకాకపోతే తన యింటిమీద పడ్తాడు. ఏం చెయ్యటం? కోటమ్మరాగానే జరిగిందంతా చెప్పిస్తాడు. 'అదే బాగౌతాదిలే' అంటే గాని వాడికి ధైర్యం రాలేదు. ఇప్పుడు కోటమ్మతనకు కోటలానే అనిపిస్తోంది. ఆమె దగ్గర వుంటే యెంతో ధైర్యం గా వుంది. గంజి తాగినా, ఆమెలో వయ్యారపు పంపులను పెంచుతోందిగానీ తగ్గలేదు. తన ఒంట్లో స్థిరమైతే యీ పెళ్ళాన్ని విస్తరిలో వడ్డనను ఆరగించినట్లు అనుభవిస్తానను కుంటున్నాడు. గాలిగండం తప్పించుకున్న గూడిలో దీపం వెలిగినట్లు. రానురాను తనలో ఒకవిధమైన వుత్సాహం వెలగజొచ్చింది. దీపం ప్రమిదలో నూనెవేడి. యెవరో వత్తె యెత్తినట్లు తన ఒంట్లో వుంది. పెళ్ళయ్యాక యిన్నాళ్ళకు పెళ్ళాం తీపిధానం చవి చూసాడు. పెళ్ళాం నిండు ప్రవాహంలా వుంది. శీతాకాలంలో వెచ్చని ఎండలా పెట్టెలో సొమ్ములా, పెదవిపై నవ్వులా వుంది. కొప్పులో పువ్వులు పెట్టుకొని కొంటి చూపులుచూసే కోటమ్మ. వాడి కళ్ళల్లో యిల్లుకట్టుకుంది. ఇన్నాళ్ళూ నోరు తెరుచుకుని వున్న వాడిలో, యీనాటికి పంపు తేనె ధారగా పడ్తోంది. తెరమరుగు దినాలు తెగిపోయాయనుకున్నాడు. ఆమెకున్న బంగారం లాంటి ఒళ్ళు, వయసూ, తనకు అబ్బినట్లు సంబరపడ్డాడు.
అలాంటి రోజుల్లో మళ్ళీ పేచీవచ్చింది. ఒంటిగా వూరినుంచి వస్తున్న కోటమ్మకు త్రోవలో ఒంటిగా తుప్పలచాటునించి సైగ చేసాడు చిట్టిరాజు. ఆమె ఆగి-
"ఏం అన్నా?" అన్నది.
"ఛీ-అలా పిలవకు. ఆ జబ్బులోడి దగ్గర యేం సుఖపడ్తావు? ఇడాకులు తెంపేసుకో. నిన్ను నేను కట్టుకుంటాను."
"ఇక్కడన్నావు. అన్నవని కనికరించాను. ఇంకెక్కడా అలా అనమోక. ఆడు నా కంటికి రాజకుమారుడు. నివ్వు రాకాసివి" అంటూ గబగబ వచ్చే స్తుంటే వెంటబడి నానా ప్రగల్భాలు పలికాడు. ఆమె పట్టించుకోకుండా యింటికి వచ్చేసింది. మొగుడుతో చెప్పుకోలేదు. మళ్ళీ పంచాయితీ కీడిస్తే పరువు తక్కువ అని ఊరకుంది.
ఆ మరుసటిరోజు మళ్ళీ గాడిద తగువొచ్చింది. పోట్టయ్య "అప్పు తీరుస్తావాలేదా?" అని కూర్చున్నాడు. కొంతలో కొంత యిస్తానంటే ఒప్పుకోవటం లేదు. "గాడిద ధరకట్టు" అన్నాడు.
"కట్టను..."
"నీలాగే వుందది - నవ్వగలను. ఇచ్చే."
"నీకిస్తే నీవు కోతకు ఆఘుతావు. ఆపి నా నివ్వను. సస్తే దాన్ని గౌరంచేసి పాతిపెట్తాను. దాన్నివ్వను."
"ఏంటిరా కొట్లాట?" అంటూ చిట్టిరాజు మధ్యకొచ్చాడు. మంచి సమయంలో వీరన్న లేనందుకు రాముడు నొచ్చుకున్నాడు. వీరన్న యింకో గుంపులో తగువొస్తే వెళ్ళాడు. రేపటికిగానీ రాడు.
"నా అప్పకి పెళ్ళి..."
"ఐదోపెళ్ళా-ఎవరు దొరికాడు?" అన్నాడు రాముడు.
"నాకు అందుకే డబ్బవసరం... యిస్తాడో నేదో తేల్చేసుకుందాను."
"నాకు రాసీమన్నానుకదా....ఇద డబ్బు" అని తీసి డబ్బయి రూపాయలు యిచ్చేసాడు చిట్టిరాజు.
"వడ్డీయో?"
"ఎంత?"
"పది..."
"ఇద..."
చిట్టిరాజు కాగితంమీద యేదో రాసి "యిదిగో దీని విలువ యెనిమిది పదులు. ఈ వేళ ఆదివారం. మళ్ళీ ఆదివారం సాయంత్రానికల్లా నా డబ్బు యివ్వకపోయావో-యిందులో ఒప్పందం ప్రకారం నీ పెళ్ళం కోటమ్మ, నా కోటలోరాణీ ఔతాది. ఇది యెవరు కాదంటారో నేను సూస్తాను" మీసాలు త్రిప్పి మరీ వెళ్ళాడు.
రాముడు మంచంమీద కూలబడి పోయాడు. అనుకున్నపని చిట్టిరాజు చేస్తాడని తెలుసు. గాడిద అమ్మినా అంతధర రాదు. దాన్ని అమ్మడం అంటే ఒకకాలు. చేతితో నరుకున్నట్లే అనిపిస్తోంది. పెళ్ళం ధైర్యం చెప్పింది." ఆడు తన శవాన్నే ఆడి కోటలోకి తీసుకెళ్తాడులే..."
"అమ్మో - సావే -- వద్దు వద్దు కోటమ్మా.. ఎక్కడో పేణంతో వుంటే కంటికి యేనాడో ఓ నాడు అవుపిస్తావు."
"అంత పిరికిపడక. ఆడికి మీసంవుంటే నాకు పౌరుషంవుంది. ఆ శవానికి యెనిమిది పదుల రూపాయలతో పువ్వులదండ యేద్దాం. రేపుటినించి నీ ఆర్జన ఒకపుంజీ - నాదొక పుంజీ.. మళ్ళా ఆదోరం నాటికి యెనిమిది పదులు కావా.." అంటూ విరబోసివున్న జుత్తు, ముడి వేసింది.
ఇద్దరూ ఉదయమే వెళ్ళిపోయేవారు. తిరిగి యింటికి వచ్చేసరికి చీకటి పడేది. శ్రమతోపాటు విచారంతో మళ్ళీ రాముడు రోగిష్టిలా కనిపిస్తున్నాడు. ఎంత కొట్టుకున్నా శనివారం సరికి అనుకున్న డబ్బుకు యింకా రెండు వదులు తక్కువ. గాడిద యెవరిదగ్గరో తాకట్టుపెట్తే తీసుకుంటారుగానీ తన దగ్గర వుంచరు. పెళ్ళం దగ్గర అమ్మడానికి యేమీలేదు. గుడిసె కొనే వాళ్ళెవరు? ఎక్కడికైనా ఆ రాత్రి దొంగ తనానికి వెళ్తానన్నాడు. పెళ్ళం వద్దంది. అదే వస్తాది అంది.
* * *
