Previous Page Next Page 
స్రీ పేజి 4

                                

    "చాల్లెద్దురు! పసిదాని మాటలుపట్టుకుని...."
    "ఇక అలా అంటే కుదరదు. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే!"
    "అయ్యో! అయ్యో! ఇదేం అఘాయిత్యమండీ? ఇదేం పొయ్యే కాలమండీ?" అంటూ నెత్తీ నోరూ బాదుకుంటూ కూలబడిపోయింది కామేశ్వరమ్మా.
    
                               *    *    *    *
    పార్వతికి తెలియని పద్మజ చిన్ననాటి విశేషాలు చాలా అరుదేమో? తాను చూసి గానీ, విని గానీ స్నేహితురాలి సంగతులన్నీ పార్వతి ఆకళింపు చేసుకో గలిగింది.
    పద్మజ గురించి ఎంత తెలిసినా -- అనుకోకుండా పద్మజ చేసిన సాహసాన్ని మాత్రం సరిపెట్టుకోలేక పోయింది పార్వతి. కూతురు చేసిన ఘోరాన్ని సనాతనులైన ఆ తలి దండ్రుల లెంత తల్లడిల్లిపోతున్నారో! నిత్య పూజా పునస్కారాలతో, నియమ నిష్టలతో కలకలలాడే ఇల్లు ఎంత కళా విహీనమై పోయిందో! పద్మజ ఎంత కర్కశంగా ప్రవర్తించింది! తన సుఖం మాత్రమే తనకు చాలనుకుందా?
    ఆఫీసులో ఆ పూట చాలా ముభావంగా కూర్చుంది పార్వతి. ఇంటికి వచ్చి కుంపటి అంటించి కాఫీ నీళ్ళు పెడుతుంటే -- సంధించి విడిచిన బాణం లా రివ్వున దూసుకు వచ్చిన సూర్యం పార్వతి ని గాలి దుమారంలా చుట్టేశాడు.
    "అక్కయ్యా! అక్కయ్యా! రిజల్ట్స్ వచ్చేశాయి. వచ్చేశాయి ఇప్పుడే ఇప్పుడే."
    తుళ్ళి పడిన పార్వతి తమ్ముడి చేతిని గట్టిగా అడుముతూ , "రిజల్ట్స్ తెలిశాయా? నువ్వు.... నువ్వు....' అంటూ ఆగిపోయింది. కంపిస్తున్న చేతులతో తమ్ముడి భుజాలు పట్టి వూపుతూ ముఖంలోకి చూడబోయింది.
    మరింతగా పార్వతి హృదయానికి హత్తుకు పోతూ అన్నాడు సూర్యం : "పాసయ్యానక్కయ్యా! నేను పాసైపోయాను."    
    'సూరీ!" చటుక్కున ముద్దు పెట్టుకుంది పార్వతి పసిబిడ్డలా కనిపిస్తున్న తమ్ముడి నుదుటి మీద. "నిజంగా? నిజంగా పాసయ్యావు కదూ? అబ్బ! ఎంత చల్లటి కబురు చెప్పావురా! ఏదీ, ఇంకోక్కసారి! ఒక్కసారి చెప్పవూ?"
    సిగ్గుపడి పోయిన సూర్యం పార్వతి చీర చాటున మొహం దించుకు నిలబడ్డాడు. పార్వతి ఆప్యాయంగా తమ్ముడి శిరస్సు మీద చేయి వేస్తూ అంది: 'సూరీ! నువ్వు తప్పకుండా పాసు కాగలవనే నేననుకున్నాను. అయినా ఆ శుభవార్త కాస్తా నీ నోటి తోనే చెప్పావు. ఎన్నేళ్ళు గా ఎదురుచూశాను, సూర్యం, ఆ క్షణం కోసం! ఇక నా బాధ్యత తీరిపోయింది, తమ్ముడూ! తీరిపోయింది. నువ్వు ఒక డిగ్రీ సంపాదించి ప్రయోజకుడివయ్యావు. నీ రెక్కలు నీకు వచ్చాయి. నా శ్రమ ఫలించింది. ఎంత సంతోషంగా ఉందిరా, సూర్యం! ఏదీ, ఇటు చూడు. నీకూ సంతోషంగా ఉంది కదూ? అవునా? ఉంది కదూ?" పార్వతి కళ్ళలో నీళ్ళు నిలిచాయి. తమ్ముడి చెంపలకు చెంపలు రాస్తూ గద్గదికంగా అంది. "నా కిప్పుడెంత గర్వంగా ఉందనీ! తమ్ముడూ! నాన్న ఉంటె ఎంతో సంతోషించే వాడు! నూరేళ్ళూ నిండినట్టే మనల్ని అనాదులుగా చేసిపోయాడు. నాకు తెలుసు. అంతా నా కళ్ళకు కట్టినట్టే ఉంది. నాన్న చచ్చిపోయే ముందు నాతొ ఎంత తెలివిగా మాట్లాడాడనుకున్నావూ? నీ చేతిని, చెల్లాయి చేతిని నా చేతిలో పెడుతుంటే నాన్న చేతులు గజగజా వణికాయి. నువ్వూ, రుక్కూ బిక్కమొహాలు వేసుకు నించుంటేనేను బావురుమని ఏడ్చాను. 'పారూ! అమ్మా! ఇక నువ్వే ఈ పసివాళ్ళకి తల్లీ, తండ్రీ జాగ్రత్త! జాగ్రత్త!' అంటూనే కళ్ళు మూశాడు."
    "అక్కా!"
    "ఏం, సూరీ! ఏమైంది? ఏమిటి? భయం వేసిందా?" తమ్ముడి వీపు రాస్తూ అడిగింది పార్వతి లాలనగా.
    సూర్యం ఆవేశంగా అన్నాడు: 'అంతా నీ చలవే, అక్కా! నీ చలవే! నువ్వు....నువ్వు...."
    "ఛ! తప్పురా, సూరీ! అంతా నాన్న దీవేనే! అయన అంతరాత్మ చల్లగా కనిపెట్టి ఉంటె మనకే లోటూ రాదు."
    "కాదక్కా! నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. నీ కష్టార్జితం తోనే చదివి డిగ్రీ సంపాదించాను నేను. ఇదంతా నీ భిక్ష! ఊహూ! కాదంటే నేను ఒప్పుకోను."
    కన్నీళ్ళతో నవ్వింది పార్వతి. "మరీ పిచ్చివాడిలా మాట్లాడకు. నేనేం పరాయిదాన్నటరా, నీకు భిక్ష పెట్టటానికి? నా తోడబుట్టినవాళ్ళని నేను పెంచుకోక వదిలేసుకుంటానా? అమ్మా, నాన్నా చచ్చిపోతే మాత్రం -- అక్కయ్య ని-- నేనూ ఊరుకుంటానా? చెప్పు, సూర్యం! చెప్పవేం?"
    "కాదక్కా! అలా కాదు. నువ్వు చెప్పిందెం బాగాలేదు. నీకసలు స్వార్ధం లేదు."
    విస్మయంగా చూసింది పార్వతి. రెట్టించాడు సూర్యం. "అవును. నీకు స్వార్ధమే లేదక్కా!"
    చిత్రంగా నవ్వింది పార్వతి. "ఊ! నాకు స్వార్హమే లేదూ? ఈ ఉన్నదంతా స్వార్ధం కాదూ? తన బాధ్యత తను గొప్పగా నిర్వర్తించాలని తాపత్రయపడటం స్వార్ధం కాదూ? మనస్సంతృప్తి కోసం తలపెట్టిన కార్యాన్ని సాధించి జయించటం స్వార్ధం కాదూ? నాకు స్వార్ధమేలేదని ఎవరైనా పొగిడినప్పుడంతా నాలో నేను పొంగి పోవటం స్వార్ధం కాదూ? స్వార్ధం మరెలా ఉంటుంది, సూర్యం?"
    "అదేమో! నాకు తెలియదు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. నీకు స్వార్ధం ఉంటె ఇలా చేసేదానిని కావు."
    "మరెలా చేసేదాన్ని? నాకే స్వార్ధం ఉంటె ఏమయ్యేది?' కుతూహలంగా చూసింది పార్వతి.
    ఓ క్షణం సూటిగా చూశాడు సూర్యం. "ఊహూ! నువ్వు ఎప్పుడు అలాంటి దానివి కాదు. నిజంగా నీ మీద లేని బాధ్యత నీకై నువ్వు మీద వేసుకున్నావు. అది సాధిస్తే తప్ప మనస్సుకి సంతృప్తి లేదను కున్నావు. కన్న వాళ్ళే విడిచిపెట్టి పోయినా నువ్వే మమ్మల్ని కంటికి రెప్పలా కాచి పెంచావు. ఇక నువ్వు ఎన్నటికీ స్వార్ధ పరురాలివి కాలేవు, అక్కయ్యా! నువ్వు దేవతవి! దేవతవి!"
    సూర్యం కళ్ళు చేమ్మగిల్లుతుంటే చిరునవ్వు నవ్వుతూ అంది పార్వతి: "ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు , సూరీ! నువ్వు చెప్పిందంతా అబద్దం. ఏం చేసినా నా సంతోషం కోసమే చేశాను. నా సంతృప్తి కోసం చేశాను. నా గర్వం కోసం చేశాను. కాదంటావా?"
    "అదంతా నాకనవసరం. నీ మేలు మాత్రం మరిచి పోలేను." తల్లి కొంగు పట్టుకు తిరిగే పసి పాపడి లా నిలబడ్డాడు సూర్యం.
    పార్వతి కళ్ళు గర్వంతో మెరిశాయి. సరిగ్గా రుక్కు కూడా అలాగే వ్రాసింది ఉత్తరం -- 'ఈ సంగతి నీకు వ్రాయటానికి సిగ్గుగా ఉన్నా ఒకందుకు సంతోషంగా ఉంది, అక్కయ్యా! నాకు ఆడపిల్లే పుట్టాలని, దానికి నీ పేరు పెట్టుకోవాలని , ఇలాగైనా నీ ఋణం తీర్చుకోటానికి దేవుడు సాయపడాలని కోరుకుంటున్నాను. ఈ స్థితిలో నిన్ను చూడాలని ఉంది. ఒక్కసారి వచ్చి వెళ్ళవూ? బావ చేసే హాస్యాలు భరించలేకా అత్తయ్య వండే పిండి వంటలు ఇముడ్చు కోలేకా, డాక్టరమ్మ ఇచ్చే మందు బిళ్ళలు మింగలేకా చెడ్డ చికాకుగా ఉంది. నువ్వు వచ్చి వీళ్ళందరికీ చెబితే నా ప్రాణం కాస్త కుదుటపడుతుంది."
    చిరునవ్వు చిందింది పార్వతి పెదవుల మీద.
    "ఎమిటక్కయ్యా ఆలోచిస్తున్నావు?"
    "రుక్కు రాసిన ఉత్తరం గుర్తు వస్తోందిరా. ఈ ఆదివారం తప్పకుండా వెళ్ళి చూసి రావాలి. చిన్నతనం లోనే- వేవిళ్ళతో ఎలా ఉందో ఏమిటో? అయితే-- సూరీ! రుక్కుకి కూతురే పుడితే నా పేరు పెడుతుందట. చూశావా దాని కబుర్లు? ఆ పుట్టే పసిడానికి పార్వతి పేరు నచ్చకపోతే ఏంచేస్తుంది? దానికి నచ్చుతుందో లేదో అన్న సంగతైనా ఆలోచించిందీ?"
    "నచ్చదూ? ఎందుకు నచ్చదూ? నచ్చినా, మానినా దానికా పేరే ఖాయం."
    పార్వతి నవ్వుతూ అంది; "నా పేరు కోసం కాదు గానీ- రుక్కుకి ఆడపిల్లే పుట్టాలి. మేనమామ ఉండగా వేరే సంబంధాలు వెదుక్కోనక్కర్లేదు."
    "ఛీ! పో, అక్కయ్యా!"
    "ఛీ, పో అంటే వీల్లేదు. ఓ ఆరునెలల్లో అది పుట్టనే పుడుతోంది. మేనమామని కాదని ఇక దాన్నేవరికిస్తాము? ఇద్దరికీ మంచి ఈడూ జూడునూ. మహా అయితే ఓ ఇరవై ఏళ్ళ వ్యత్యాసం! ఆ -- ఏమంత లెక్కలోది కాదు. ఆడపిల్ల ఎంతలో ఎదిగి వస్తుందీ!" ఫక్కుమని నవ్వేసింది పార్వతి. సూర్యం మరి నిలబడకుండా వీధిలోకి మాయమయ్యాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS