"చూడు, రామూ! నే నివాళ బడికి వెళ్ళను" అంది రాము చేయి పట్టుకొని జయ.
రాము ఆలోచనలో పడ్డాడు. ఏది చేసినా ఊరుకొంటారు గానీ బడి మానితే మాత్రం.....ఏమో? ఇంత వరకూ అలా జరగలేదు. ఒకవేళ బడి ఎగ్గొట్టినా తమ్ముడు తన వెంటే ఉంటాడు. ఎలా? జయతో ఆడుతూ ఉంటే రాముకు ఎంతో ఏమిటి? చాలా బాగుంటుంది.
జయ పరిగెత్తి ముందు పోతూంటే తను వెనక పరిగెత్తుతూ జామి చెట్టెక్కి, జయ "ఓడిపోయాను" అనేవరకూ ఆ పిందెలతో కొట్టడం భలే సరదా.
జయ ఏడుస్తూ, "రామూ, నేను ఓడిపోయాను. దిగి రా" అనేవరకూ తను ముప్పుతిప్పలూ పెట్టి మూడు చెరువుల నీళ్ళూ తాగిస్తాడు. ఎలా? ఈవేళ రాము చిన్న మెదడుకు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. పోనీ, తనతో చెప్పకుండా మానేయక పోయిందా? అంతా అయోమయంగా ఉంది. బుర్ర గోక్కుంటూ జయ కళ్ళలోకి చూస్తూండిపోయాడు.
"ఏమిటి ఆలోచిస్తున్నావు? అమ్మకి ఇవాళ ఒంట్లో బాగాలేదు. నేను బడికి పోను అన్నాను. మానేయమంది. మరి నువ్వు మానేస్తావా?" కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ఇలా అడుగుతూంటే రాముకు చిరాకనిపించింది.
"ఫో, మానెయ్! నువ్వే పంపుతావు. నేను మాత్రం వెళ్ళాలి" అన్నాడు ఉక్రోషంగా.
అప్పటికే భుజాన పంచి వేళ్ళాడేసుకొని మంచి ఇస్త్రీ బట్టలతో రవి అన్నను పిలవడానికి వచ్చాడు.
రాము మాట మార్చుకొని ఇంట్లో ఉండిపోవడానికి కూడా అవకాశం లేదు. జయను అక్కడే అలా వదిలివేయడం కష్టం అనిపించినా రవి నిలవనీయడం లేదు.
"నే పోవాలన్నయ్యా! దీనికేం? ఎప్పుడూ ఇంట్లోనే అంట్లు తోముతుంది. మనం పోదాం రా." చెయ్యి పట్టుకొని లాగుతున్న తమ్ముడిని 'వదులు' అనడానికి ధైర్యం చాలలేదు. మౌనంగా వెనుతిరిగి చూసుకుంటూ ముందు వెళ్ళిపోయాడు.
జయకు దూరం అవుతున్న కొద్దీ తన మనస్సు మీద ఎవరో లాగి బాణం వదిలినట్లనిపించింది.
రోషంతో ఏదో అన్నాడే కానీ నిజానికి జయమీద తన కెంత ప్రేమ! కళ్ళలో గిర్రున తిరిగే నీళ్ళను తమ్ముడు చూస్తే నవ్వుతాడనే భయంతో అటు తిరిగి తుడుచుకొన్నాడు.
* * *
నాలు గెప్పుడు అవుతుందా అని కలవరించి పోతున్న రామును లెమ్మంటూ బడిగంటలు గణగణా మోగాయి. సంచి భుజాన తగిలించుకొని రవి చేయి పట్టుకొని పరుగు తీశాడు.
తల్లి ఏదో చెబుతూంది. కానీ, రాము మనస్సు తోటలో సపోటా చెట్టుకింద మోకాళ్ళ మీద తల వంచి కూర్చున్న జయమీదే ఉంది. టిఫిన్ తిన్నాననిపించుకొని బయటపడ్డాడు.
జయ అప్పటికే వచ్చి ఎంతో సేపైనట్లుంది. అటు తిరిగి కూర్చొని అలక వహించింది.
పక్కింటి జగన్నాథం, రవి, మరో నలుగురు పిల్లలు దూరంగా ఆడుకొంటున్నారు. రాము చప్పుడు చేయకుండా వెళ్ళి జయ కళ్ళు మూశాడు. "వదులు ఛీ! పిరికిపందవి. నువ్వంటే నా కసహ్యం!" జయ అంటూనే ఉంది.
బలంగా తోసేయడంతో రాము ముళ్ళమీద పడ్డాడు. ఎప్పుడు వచ్చారో కానీ దూరంగా ఆడుకొంటున్న పిల్లలు నవ్వుతున్నారు దగ్గరకు వచ్చి. "నేను చెప్పలేదన్నయా? ఆ మొండి మొహం జోలికి పోవద్దని!" రవి అన్నాడు.
బాధ పడుతున్న జయ మనస్సు చితగ్గొట్టాలను కొన్న రవి మాటల కేమీ లెక్కచేయలేదు జయ. రామును లేవదీసి మోకాలు పైకెత్తి కూర్చొని అరికలిని ఆ మోకాలిమీదే ఆన్చి పిన్నుతో మెల్లగా ముల్లును తీసేసింది.
నిలబడి చూస్తున్న రవి మనస్సు చివుక్కుమంది. తల దించుకొని మెల్లగా అన్నాడు: "పోనీలే, జయా! ఏమీ అనుకోకు. అనాలని అనలేదు."
"ఫరవాలేదులే మనకు అలవాటేగా!" రమును లేవదీసింది. రవి స్నేహితులతో దూరంగా వెళ్ళిపోయాడు.
కొంతసేపటికి తిరిగి వచ్చాడు స్నేహితులను సాగనంపి. హఠాత్తుగా అడిగాడు రాము: "నీ కేం చదవాల నుంది. జయా?" రవి ముందుకు వంగి, "వంట" అన్నాడు.
రవి నెత్తిన ఠంగుమంది మొట్టికాయ. ఉన్నట్టుండి దూరాన లైట్లు వెలిగాయి. రాముకు జవాబు రాకుండానే వీపుమీద సవారీ కోసం నిలుచున్నాడు నౌకరు గోవిందు.
రవీ, రామూ గోవిందు వెనక పరిగెత్తారు. చీలి పోతూ చేయి ఊపింది జయ.
* * *
"అమ్మా!" ఖంగారుగా ఇల్లంతా దద్దరిల్లేట్లు కేకపెట్టాడు రాము.
పెరట్లో ఆరిన బట్టలు మడత పెడుతూంది భారతి. కొడుకు కేక విని, రమ్మని తిరిగి కేక పెట్టి పనిలో మునిగిపోయింది.
పరుగున వచ్చిన రాము తల్లి మొహం చూసి ఆగిపోయి బొటన వేలితో నేలమీద గీతలు గీస్తున్నాడు. తలఎత్తి కొడుకును పరిశీలనగా చూడసాగింది భారతి. రాము మొహంలో మచ్చుకైనా ఉత్సాహం కనపడటం లేదు. హృదయంలో చెలరేగే భావలకు ప్రతిబింబంలా తయారైంది మొహం. చెప్పదలుచుకొన్నావో, అడగదలుచుకొన్నావో అడుగునే ఉండిపోయి నట్లు స్పష్టంగా కనిపిస్తూంది.
"ఏమిటి, బాబూ?" భారతి అనునయంగా అడిగింది.
"అమ్మా!" మెల్లని స్వరంతో పిలిచి తలఎత్తి ఆగిపోయాడు.
భారతి అప్పటికే దగ్గరగా వచ్చేసింది. తన బిడ్ద ఎందుకిలా ఉన్నాడో?' అనే ఆలోచన రాగానే కలవర పడిపోయింది. తలమీద చేయి వేసి, "ఏమిటి, రామూ?" అంటూ కొడుకు మొహంలోకి చూసింది.
"మరేం లేదమ్మా. జయ ఇంటికి వెడితే?"
అప్పటికే భారతికి సర్వం అర్ధం అయిపోయింది. రాము దిగులుకు ఉన్న కారణం తేలికగా తీసేయగలిగినంత చిన్నది కాదు.
"అత్త లేదమ్మా? జయ ఇవాళ్టినుంచి మీతో ఆటకు రాదు అన్నది!" రాము కళ్ళలో రెండు బొట్లు నిలిచి క్రమంగా చెంపల మీద పడిపోయాయి.
కొడుకును హృదయానికి గాఢంగా హత్తుకొంది.
"రామూ అంటూ ప్రేమగా పిలిచి జయని ఆటకు మనిపించేసిందమ్మా అత్త" రాము మనస్సు రమాదేవి మీద విరుచుకుపడుతూంది.
"తమ్ము డేడీ?" భారతి మాట మార్చాలని ప్రయత్నించింది.
"వాడి కేమమ్మా! జగన్నాథంలాంటి స్నేహితులు కోటిమంది."
"మరి నీకే లేరన్నమాట?"
"జయలా మంచివాళ్ళు కారమ్మా వాళ్ళంతా."
"రవికి మంచి వాళ్ళైతే మరి నీకెందుకు కాక పోతార్రా వాళ్ళంతా?"
"అసలు జయకీ, రవికీ క్షణం పడదు కదమ్మా." ఆ సంగతి భారతికి ఎప్పుడో తెలుసు. రవి కోసం పంపాలనే ఆలోచన మొదట్లోనే తెగిపోయింది.
"ఇంతకీ ఎందుకు రాదమ్మా?"
భారతి ఎటో చూస్తూ అంది: "జయ పెద్దదై పోయింది, బాబూ నీతో ఇక ఆడకూడదు."
నిర్ఘాంతపోయాడు రాము. క్షణం నోట మాట రాలేదు. మెల్లగా ఏదో అర్ధం అయినవాడిలా తల ఊపుతూ, "అదన్న మాట. అసలు అత్తే చెప్పింది నీకు ఇలా అనమని. నిన్నటివరకూ ఆడిన జయ ఇవాళెందుకు ఆడదు? ఛీ! ఏం మనుషులు!" అని చేతులు జేబులోకి పోనిచ్చి మెట్లమీదుగా పరిగెత్తాడు.

* * *
కిటికీలోంచి దూరంగా చూస్తూంటే ఆకాశం తెలుపూ, నలుపూ మేఘాలు నింపుకొని వర్షం వచ్చే సూచన తెలుపుతూంది. ఇక అరగంటలో వచ్చేస్తుంది వర్షం. తను బట్టలు మార్చి టిఫిన్ చేసేలోగా వచ్చేస్తుంది. గోవిందును అడిగినా అలాగే అన్నాడు. తను పెరటి ద్వారం గుండా లోపలికి వెళ్ళి జయను బలవంతంగా లాక్కువచ్చినా వర్షం తడిపేస్తుంది. రమ అత్త ఊరుకోదు. గదిలో పచార్లు చేస్తున్నవాడల్లా ఠక్కున ఆగిపోయాడు. రవి ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు.
"జయ రాకపోతే ఆటలే అయిపోతాయా అన్నయ్యా?"
"నే నందుకేం మానేయలేదు."
"మరి దేనికి మానేశా వేమిటి?"
"అసలు నిన్నెవరడిగారోయ్?"
రవి ఇంకా ఇంకా నవ్వుతూ, "నేను చూశాలే మ్మ దగ్గరికీ, రమ అత్త దగ్గరికీ వెళ్ళి నువ్వేం అడిగావో? జయ ఇంక మనతో ఆడదులే" అని చేతులు తిప్పుతూ కుర్చీలో కూర్చొని కాళ్ళు పైకెత్తి గుండ్రంగా తిరిగాడు.
రాము మొహం విసుగుతో ముడుచుకుపోయింది.
"పోనీలే. నువ్వు చెప్పు, తమ్ముడూ, జయ ఎందుకు రాదూ?" రవి భుజాలు పట్టుకొని ఆపుచేశాడు.
రాము చెవికి దగ్గర్లో నోటిని ఆన్చి రవి గుసగుస లాడాడు. రాము మోహంలో విసుగు విడిపోయి నవ్వు ఆక్రమించుకొంది. "అదా!" అన్నాడు ఆశ్చర్యంగా.
