Previous Page Next Page 
మరుపులో మెరుపులు పేజి 4

 

    బయట వాన చప్పుడు తగ్గినట్లనిపించి, కిటికీ దగ్గిరకు వెళ్ళి తలుపు తోసి, బయటకు చూశాడు. అప్పుడే మబ్బులు వీడి వెలుగు సంతరించుకుంటోంది. రోడ్లన్నీ నీటి మయంగా వున్నాయి. మూడో అంతస్తు లో నుంచుని చూస్తూ వుంటే గాలి విసురుకు వాలిపోయిన తీగలు జాలిగా కనుపిస్తున్నాయి. పచ్చటి ఆకుల మీది నిలిచిన నీటి బిందువులు సూర్యరశ్మి లో మిలమిల మెరుస్తున్నాయి. కొద్దిసేపు భీభత్సం చేసి ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని చూస్తూ నిట్టూర్చాడు. వెనక్కి తిరిగి కుసుమ వంక చూచాడు. ముందు బల్ల మీదకు వంగి మోచేతుల మీద తలానించుకుని వున్న కుసుమను చూస్తుంటే, మనసంతా ఏదో తెలియని భావంతో నిండి పోయింది.
    నిద్రపోతోందేమో అనుకుంటూ మెల్లిగా దగ్గరగా వెళ్ళాడు. బూట్ల చప్పుడుకు చటుక్కున తలఎత్తి చూసింది.
    ఆమె వంక చూసి చిరునవ్వుతో "లేవండి వెడదాం" అన్నాడు. అంతలోనే కందినట్లున్న ఆమె ముఖం వంక చూస్తూ , వెళ్ళి ముఖం కడుక్కు రండి. హోటల్ కు వెళ్ళి భోం చేద్దాం" అన్నాడు.
    అతనికే సమాధానం చెప్పకుండా, మొహం కడుక్కొచ్చి అతనితో పాటు కారెక్కింది మౌనంగా.
    మరేమీ మాట్లాడించకుండా ఒక పెద్ద హోటల్ ముందు కారాపాడు. ప్రత్యేకంగా ఫామిలీస్ కోసం వుండే గదిలోకి వెళ్ళాడు. తల వంచుకుని చేతి గోళ్ళ వంక చూచుకుంటున్న కుసుమను పరీక్షగా  చూడటం తప్ప మరేం మాట్లాడించడం మంచిదనిపించలేదు. ఎప్పుడో విచ్చిన పద్మంలా వుండే కుసుమ వడలిన గులాబి లా కనుపించింది. కళ్ళల్లో ఎర్ర జీరలు స్పష్టంగా కనుపిస్తున్నాయి. భయం, సిగ్గు , కోపం రకరకాల భావాలు మిళితమయి మేడులుతున్నట్లు మధ్యకి మధ్య చలిస్తున్నాయి.
    సర్వర్ తెచ్చిన భోజనాన్ని అతి నిశ్శబ్దంగా తినడం ప్రారంభించారు. భోజనం పూర్తవుతుండగా, నిండుగా వడ్డించిన ఇస్తరి లా వున్న ఆమె ప్లేటు వంక ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూచి.
    "ఎందుకంత భయపడ్డారు?" అడిగాడు ఆప్యాయంగా, చనువుగా.
    వాలిపోతున్న కళ్ళను బలవంతాన పైకెత్తి అతని ముఖంలోకి చూచి వెంటనే కళ్ళు దించుకుంది.
    ఏం సమాధానం యివ్వని ఆమె వంక నిశితంగా చూస్తూ "చెప్పడం యిష్టం లేదా?' అడిగాడు.
    "యిష్టం లేక కాదు. చెప్పేందుకు కారణం తెలియదు." ఆశ్చర్యంగా చూశాడు. కారణం తెలియని భయాలతో సతమత మవుతున్న ఆమెను గురించి ఎలా అర్ధం చేసుకోవాలో తెలియలేదు." తెలియక కాదు, చెప్పడానికి యిష్టం లేదు కాబోలు" అనుకున్నాడు అంతలోనే.
    "వెళదామా!"
    తల వూగించి, లేచి అతని వెంటనే బయటకు వచ్చింది.
    "మీ యిల్లెటో చెప్పండి."
    "ఫరవాలేదు ఆ సందు మొదట్లో దింపండి. నే వెళ్ళిపోతాను."
    "యిలా రోడ్డు మధ్యలో వదలడం నా కిష్టం లేదు. మీ యింటి దగ్గర దింపుతాను" అన్నాడు. వెంటనే "మీవాళ్ళేమయినా అంటారని భయమా" అడిగాడు.
    "ఏమయినా అనడానికి నాకెవరూ లేరు." అంది ఎటో చూస్తూ అప్లికేషన్ లో "అర్బన్" అని రాసినట్లు గుర్తుకు వచ్చి బాధనిపించింది ప్రభాకర్ కు. 'అయామ్ సారీ" అన్నాడు. యింటి ముందు కారాపుతూ "వంట్లో బాగుండక పొతే రేపు ఆఫీసుకు రాకండి" అన్నాడు.
    "థాంక్స్. మీరివాళ చాలా పని వుందని రమ్మనమన్నారు. నామూలంగా ఏ పనీ అవలేదు" అంది తల వంచుకుని. "ఏం ఫరవాలేదు. నేను యిప్పుడేళ్ళీ పూర్తీ చేసుకుంటాను. మీరు దాన్ని గురించి ఏమీ ఆలోచించకండి." అని కారు ముందుకు పోనిచ్చాడు.
    సుదీర్ఘంగా నిట్టూర్చి లోపలకు వెళ్ళింది . "నయం ఆఫీసుకు వెళ్ళింది. లేకపోతె ఆ వాన పడుతున్నంత సేపు భయంతో వంటరిగా చచ్చి పోయేది" అనుకుంది.
    ఆ రాత్రి పనంతా పూర్తీ చేసుకుని అలసట గా మంచం మీద వాలిన ప్రభాకర్ కు ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఆ ఉదయం జరిగిన సంఘటన అతని మనసును దాటి పోవడం లేదు. భయంతో దగ్గరగా వచ్చిన ఆమెను శాశ్వతంగా దగ్గిర చేసుకో గలిగితే......
    "ఏమయింది కుసుమకు? నిజంగా కారణం తెలియని భయాలా ఆమెవి? .... లేక బయట పెట్టడం యిష్టం లేదా? ఆమెను అంతగా భయపెట్టె వాటికి కారణం తెలుసుకోవాలి....? అతనికి తెలియకుండానే అతనిలో వున్న జిజ్ఞాస నిర్ణయానికి నాంది పలికింది.

 

   
    మర్నాడు ఆఫీసు లో అతి మాములుగా పని చేస్తున్న కుసుమను చూచి ఆశ్చర్య పోయాడు ప్రభాకర్. ఆరోజు కుసుమ ఆఫీసుకు రాదనీ, మళ్ళీ మామూలు మనిషి కావడానికి కనీసం రెండు మూడు రోజులు పడుతుందని.... ఏదేదో అనుకున్న ప్రభాకర్ , ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. మాములుగా రోజులా చిరునవ్వుతో విష్ చేసిన ఆమె వంక నిశింతగా చూస్తూ ఆలోచించకుండా వుండలేక పోయాడు.

                                                           6
    ప్రభాకర్ అంటే తన మనసులో కలిగిన ప్రత్యేకమయిన భావానికి తనే ఆశ్చర్య పోయింది కుసుమ వూహకందనంతగా. అది గౌరవం తప్ప మరేమీ కాదని తెలిసినా, అసలు తనకొక పురుషుడి మీద అలాటి భావమయినా కలుగుతుందని కల్లో కూడా అనుకోని కుసుమకు అది ఆశ్చర్యాన్నే కలిగించింది. తనకు దగ్గిరగా రావడానికి ప్రయత్నిస్తున్న ప్రభాకర్ ని గురించి ఆలోచిస్తూ భయపడ సాగింది.
    టైప్ చేసిన వుత్తరాలిని తీసుకుని ప్రభాకర్ గదిలోకి వెళ్ళింది. దీర్ఘంగా ఆలోచిస్తున్న ప్రభాకర్ వుత్తరాలందుకుని ముందుంచు కున్నాడు. ఏదో నిర్ణయం తీసుకోవలసిన పెద్ద సమస్యలా వుంది. ఒక చేత్తో ఏదో కాగితాన్ని పట్టుకుని, రెండో చేతి ముని వేళ్ళతో యధాతధంగా ముందున్న టేబుల్ మీద కొట్టసాగాడు. విశాలమైన కళ్ళను విప్పారితం చేసుకుని చూస్తూ నిలుచుండి పోయింది.
    తలఎత్తి కుసుమ వంక చూచిన ప్రభాకర్ చటుక్కున లేచి నిలబడుతూ , "అదేం -- మళ్ళీ అల్లా అయ్యారు' అడిగాడు.
    ఒక్క క్షణం తడబడి "అబ్బే ఏమీ లేదు - మీరు వాటి మీద సంతకం చేసిస్తే -- పోస్టుకు పంపిస్తాను " అంది కళ్ళు క్రిందకు దించుకుంటూ.
    ఒక్క క్షణం ఆమె వంక చూచి వుత్తరాలు ఆమె చేతి కందిస్తూ , రామకృష్ణ ను ఓసారి లోపలకు రమ్మనమని చెప్పండి.

                             *    *    *    *
    "మీరెక్కడ పెరిగారు చిన్నతనమంతా?" అడిగాడు ఓ రాత్రి కుసుమతో భోజనం చేస్తూ.
    "ఓ అనాధాశ్రయములో -- " అంది చాలాసేపటికీ. "చూడండి నాకు చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటే కలిగేది బాధ తప్ప మరేమీ లేదు. దయచేసి నన్నెప్పుడూ అడగకండి..... మీ విషయాలు చెప్పండి. నా ఊహకు కూడా అందని విషయాలు విని ఆనందిస్తాను." అంది అతి మెల్లిగా అయినా చాలా నిశ్చలంగా.
    ఆమె వంక క్షణం సేపు సూటిగా చూసి మౌనంగా వూరుకున్నాడు కొంతసేపు.
    "మీకు ఎర్రటి బొట్టు ఎంతో అందాన్నిస్తుంది. ఎప్పుడూ నల్లటి బొట్టే పెట్టుకుంటారేం?" అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అతని చూపులు తప్పించుకుంటూ చాలాసేపు మౌనంగా వుండి పోయింది. చివరకు "నాకు ఎరుపంటే యిష్టం లేదు." అంది. ఏం మాట్లాడాలో తోచని ప్రభాకర్ కాసేపు వూరుకుని "యివాళ మన సంభాషణ కు మంచి రోజు రాలేదు. ఎక్కడ మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోతోంది. పదండి ఏదయినా సినిమాకు వెడదాం" అన్నాడు చిరునవ్వుతో. "నన్నింటి దగ్గర దింపెయండి." అనడిగింది. అతనితో ఎక్కడికి వెళ్ళడం యిష్టం లేదని చెప్పలేక.
    "ఏం చేస్తారు యింటి కెళ్ళి?" అడిగాడు కారు మెల్లిగా పోనిస్తూ. చల్లని గాలి చక్కలిగింతలు పెడుతోంది. రంగు, రంగుల లైట్ల తో రోడ్లు పెళ్ళి పందిళ్ళ లా వున్నాయి.
    "ఏం లేదు -- ఏ పుస్తకమో చదువుకుంటూ పడుకుంటాను."
    "ఆ పుస్తకం పాటి కంపెనీ నేను యివ్వలేనంటారా?"
    "అది కాదు...."
    "నాతొ పబ్లిక్ గా తిరగటం మీకిష్టం లేదు. అంతేనా' అడిగాడు మధ్యలోనే కుసుమ మాటలను ఆపేస్తూ. అతని చూపులను తప్పించుకుంటూ కళ్ళు దించుకుంది.
    "ఎప్పుడడిగినా మీరెందుకు యింత సందేహిస్తున్నారో నాకర్ధం కాదు- నాకు మాత్రం మీతో పరిచయం చేసుకోవాలని వుందన్న విషయం మీకూ తెలుసు...."
    "......"
    "సరే కానీండి....మీకెప్పుడు నాతొ రావాలనిపిస్తే అప్పుడే వద్దురు గాని" అంటూ కుసుమ యింటి ముందు కారాపాడు.
    "థాంక్స్ ....గుడ్ నైట్" అని గబగబా లోపలకు వెళ్ళిపోయింది. అతని కారు వెళ్ళేంత వరకూ కూడా ఆగకుండా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS