8
కాలం జరుగుతున్న కొద్దీముందుగా శారదమ్మ భయపడవలసిన రోజులే వచ్చాయి. మొదట కోడల్నే మెత్త మెత్తగా మందలిద్దామను కుంది. కాని రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది సుమా అని ఎవరో హెచ్చరించి నట్లయింది. శారదమ్మ చటుక్కున భర్త ఫోటో వైపు తిరిగి చేతులు జోడించింది. తన భర్త అజ్ఞాతంగా వుండి ఏదో జ్ఞానోపదేశం చేస్తున్నట్లు తరచుగా అనుభూతి పొందు కుంటుంది ఆమె. "నా కొడుకు కాపరాల్ని బాగుచేసే భారం నీదే నాయనా శ్రీరామ చంద్ర ప్రభూ!" అని సీతారాముల పటానికి మనసారా మొక్కింది. యధావిధి పూజల్లో ప్రత్యెక పూజలు కూడా చేసింది. సత్యన్నారాయణ వ్రతం చేయడమే గాక వేంకటేశ్వరు నికి ముడుపు కట్టింది.
ముడుపుల తోనూ, మొక్కుబళ్ళతోనూ జగడాలు తీరితే బాగానే వుండును.
కొన్నాళ్ళు ప్రశాంతంగా వుంటే, ఆ తరువాత పెనుతుఫానే వచ్చి పోయేది. ప్రేమ దగ్గర చిన్న కారణాలే ప్రేమ లేని చోట పెద్ద కారణా లౌతాయన్నది ముమ్మాటికీ నిజం.
పంకజం పేచీ ఒక రకంగా వుండేది. వరస వారీగా చూడడం అవసరం. వీధి బాగులేదని, ఇల్లు బాగు చేయించలేదని, ఎక్కువమంది పని మనుషులు లేరని, గొప్ప వాళ్ళలా కనిపించడం లేదని. రేడియోలు, బీరువాలు, సోఫాలు , ఫాన్లు, ఐరన్ కాబినేట్లు, స్ప్రింగు కాట్లూ అన్నీ చెత్త కంపెనీ లవని . ఇల్లు ఇరుకు కాబట్టి ఈ అలంకారాలన్నీ కేవలం చెత్త మాత్రమేనని. వంద రూపాయల చీరైనా కొనలేదని , వెయ్యి రూపాయల నగైనా చేయించ లేదని, ముచ్చటగా బొంబాయి కైనా తీసి కెళ్ళలేదని, పుట్టింటి వారు పిలిచినా పేడ మొహం పెట్టారని.
కమలాకరం ధోరణి గమ్మత్తుగా వుండేది. అతను భార్యని ఎలా అజ్నాపించాలో అలా అజ్ఞాపించే వాడని చెప్పవచ్చు. నన్ను పీడించు కు తినే అధికారం నన్ను కన్న తల్లికుంది గాని, నీకు లేదు. నిన్ను నేను ప్రేమించలేదు. ఆ మాట నిజమే అయినా భార్యవు కాబట్టి పడి వుండాలి. నేను ప్రేమించ గలిగే అవకాశాన్ని నాశనం చేసుకుంటానేం? బాగుపడాలంటే ఇకనైనా ఒళ్ళు దగ్గిర పెట్టుకో. మా అమ్మ చేత చాకిరీ చేయిస్తే నేను ఒప్పుకోను. మా అమ్మతో తగువులాట పెట్టుకున్నావంటే మరి నీకు దిక్కు వుండదు గుర్తుంచుకో.
* * * *
"మాటిమాటికీ ప్రేమ అంటారు. అదేదో మీకు బాగా తెలుసన్న మాట?" అంది పంకజం అదోరకమైన విరువుతో.
"అవును. కాదన్నారెవరు. నేను వసంత ని ప్రేమించాను. ఇంకెవర్నీ అంత గాడంగా ప్రేమించలేను. అని కమలాకరం విసురుగా వెళ్ళిపోయాడు.
కమలాకరం లో ఆలోచన అంతా స్తంభించి పోయింది. కొత్తగా ప్రాక్టీసు పెట్టిన అతను అనేక రకాల ఇబ్బందులలో చిక్కుకున్నాడు అందుకే ఆవేశ పడిపోయాడు.
భార్యా భర్తల మధ్య తగువు లాటలను. మనస్పర్ధలను తీవ్రంగా అసహ్యించు కునేవాడు కమలాకరం. తనకే అలాటి స్థితి వచ్చినందుకు ఆశ్చర్య పడి-- తన జీవితం పూర్తిగా అన్యాయమై పోయిందను కున్నాడు అతను. అయినా ఇతరులకు న్యాయం చేయడానికే. నిర్దోషు లకు. శాంతి చేకూర్చడా నికే బ్రతుకును ధారపోయాలని నిశ్చయించు కున్న పాతికేళ్ళ యువకుడు.
కమలాకరం వెళ్ళిన చాలాసేపటి వరకూ అచేతనురాలై నిలబడి పోయింది పంకజం. ఆవిడ వినరాని సత్యం విన్నది. సామాన్య స్త్రీలు ఇలాటి సత్యాలను వజ్రా ఘాతాలుగా , ఆశని పాశాలుగా భావిస్తారు. కాని ఆ సామాన్య స్త్రీలే ఇలాటి అవమాన భారాన్ని, అయిష్ట తాపాన్ని కడుపులో దాచుకుంటారు.
పంకజాన్ని ఎక్కువగా తప్పు పట్ట వీలులేదు. ఆమె అకస్మాత్తుగా అనుకోని విధంగా విన్నది. అదైనా భర్త నోటి వెంటే అహంకార పూరిత మైన ధ్వనిలో విన్నది.
9
సముద్రం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా కనిపించింది.కమలాకరం కి ఈ రాత్రికే తుఫాను వస్తుందా అనుకున్నాడు స్వగతం లా.
విద్యార్ధి గా వున్నప్పుడు తను ఆకాశాన్ని అమితంగా ప్రేమించే వాడు. దాన్ని అందుకోగలడన్న ఆశ ఉండేది అప్పుడు. తన మనసులా పశ్చిమానికి క్రుంగి పోతున్న సూర్యుణ్ణి చూచి వెనుదిరిగాడు.
బజారు దారి వెంట అతడు నడుస్తుంటే వెనక నించి ఎవరో పిలిచి నట్టయింది. వసంత లా అనిపించి ఉలిక్కి పడ్డాడు. తర్వాత తన భ్రమకి తనే నవ్వుకున్నాడు.
మళ్ళీ పిలుపు ! వెనక్కీ, ప్రక్కకూ కలియ జూశాడు. కిలకిల ధ్వనితో నవ్వింది ప్రతిమ. సందేహం లేదు ప్రతిమే.
కాసేపు రెప్ప వేయలేక పోయాడు. ఆమెలో వచ్చిన మార్పు అతను కనురెప్పల్ని నిలబెట్టేసింది. ఆమె ఒక్క ఏడాది లోనూ తగు మాత్రం ఒళ్ళు చేసినందున వింత అందం. అంగ సౌష్టవం . సౌకుమార్యం లోనే హుందాతనం అబ్బాయి. నిజంగానే ఇంద్ర ధనుస్సు లో ఒక రంగులాగ ఎంత చూపు దిద్దు కుందని! కమలాకరం చూపుల్లో పరివర్తన గుర్తించి లే వెన్నెల లాంటి నవ్వు కురిపించింది ప్రతిమ.
తక్షణం తన ఉనికి అర్ధం చేసుకున్నాడు. ఒకప్పుడు తను ఆవిడను మహా ప్రవరాఖ్యుడి లాగ తృణీకరించిన మాట చటుక్కున స్పురించి అతని కళ్ళు దిగి పోయాయి.
గతం జ్ఞాపకం లేనట్టు కమలాకరం పక్కనే నడుస్తూ సంభాషిస్తుంది ప్రతిమ. మునుపటి ముగ్ధత్వం మచ్చుకైనా లేదు ఆవిడలో. మంచి నెరజాణ గా తయారైంది.
"మీ ప్రాక్టీసు ఎలా సాగుతోంది" అనడిగింది.
తడబడుతూ , తమాయించుకుంటూ "ఏదో ఒక లాగ వున్నది" అన్నాడు.
బస్టాండ్ వైపు రెస్టారెంటు వద్ద నిలబడి పోయింది. "మీరు కూడా రండి -- టీ తీసుకుందాం --" అంది.
"అబ్బే నాకెందుకూ?-- ఇంటిదగ్గర రెడి కాఫీ ఉండనే వుంటుంది" అన్నాడు గబగబా.
"చూడండి ! మీరు ఒద్దంటే ఊరుకోడానికి నేను మునుపటి ప్రతిమను కాను." అంది ప్రతిమ గోముగా.
అతనికి చురుక్కున తగిలింది.
కోపంగా చూద్దామను కున్నాడు. సాధ్యం కాలేదు.
"సరే అన్నట్టు అనుసరించిన కమలాకరం తో ఇక్కడికి మీ యిల్లు అరమైలు వుంటుంది. ఇల్లు చేరుకునేసరికి మీకు మళ్ళీ దాహం వేయదు కనుకనా?--" అంది నవ్వుతూ.
కొన్ని నెలలై కొరవడిన ఆనందమేదో గుండెల మీద చిగురులెత్తి నట్టయింది ఒక క్షణం, కంగారు పెట్టింది ఆ భావం.
కాని ఇంటి వూసు రాగానే వివర్ణమైంది ముఖ భంగిమ.
'అక్కడికి చేరేసరికి ఆకలి దప్పులనేవి ఆరిపోతాయి." మనసులోనే జవాబిచ్చాడు. పైకి అంటే "ఓహో ! మీ భార్య భర్తల మధ్య అంత అన్యోన్యానురక్తీ ఉందన్న మాట" ఆనేసినా అనగలదు ప్రతిమ.
వేడి వేడి టీ పట్టిస్తుండగా మనసు లో ఒక మెరుపు మెరిసింది.
ఈ ప్రతిమ ను వసంత గురించి అడగవచ్చు. ఇంతసేపై మాట్లాడు తున్నా వసంత ప్రసక్తే తేలేదు ఎందుకో ప్రతిమ -- తను మాత్రం అడిగాడా?-- సిగ్గుపడ్డాడు. తనకే గుర్తు లేకపోయింది -- ఇంత ప్రేమించినా--
అకస్మాత్తుగా వసంత విషయం ఎత్తడానికి భయపడ్డాడు కమలాకరం. ప్రతిమ ఏమన్నా అనుకోవచ్చు. తాము ప్రేమించు కున్నట్టు తెలిసినా తెలీక పోయినా.
చమత్కారంగా సంభాషణ నడిపించాడు.
"ఇన్నాళ్ళూ మీరు కనిపించలేదు. ఊళ్ళో లేరా?"
అతని ఒరశ్నకు జవాబివ్వకుండా "ఈ కొత్త ప్రయోగం ఏమిటో ఆశ్చర్యంగా వుంది. మీకన్నా పెద్ద దాని నయ్యానా కొంపదీసి ?" అంది.
"లేదులే ప్రతిమా? మనం కలుసుకుని చాలా రోజులైంది మరి?"
"అవును కమలాకరం గారూ! ఉద్యోగం ప్రయత్నం మీద అక్కయ్య వాళ్ళ వూరు వెళ్లాను. అక్కడ ఒక ఎనిమిది నెలలు వ్యర్ధంగా గడిపాను అనక అన్నయ్య -- ఈ ఊళ్ళో వర్కుషాప్ లో పని దొరికేటట్టుంది అని వ్రాయగానే వచ్చేశాను." అంది.
"అయితే నువ్వు వర్క షాపు లోనా పని చేస్తున్నది?--"
"అవును. మిమ్మల్ని చూసే అదృష్టం ఇవాళ కలిగింది."
"దేనిలో అదృష్టానికే ముంది గాని-- మీ వసంత ఈ మధ్య కనిపించడం లేదే?" అన్నాడు.
అతను గతుక్కుమనే లాగ నవ్వి "హాయిగా మద్రాసు లో కాపరం చేసుకుంటూ వుంటే ఇక్కడెందుకు కనిపిస్తుంది ? మీలాంటి మగవాళ్ళని నేనెక్కడా చూడలేదు?" అంది.
"ఏం?' అనాలోచితంగా అనేశాడు.
"ఎంత వెర్రితనం ఎంత మొహమాటం మీదని?"
"అలాగా! -- అది కాదు .....వసంత కేమేనా పిల్లలా?"
"లేదింకా!-- ఈ మధ్య వాళ్ళాయన తో కలిసి ఉత్తరాది అంతా చుట్టి వచ్చిందిట. చూసిన విశేషాలన్నీ , ఓ భారతం వ్రాసిందంటే నమ్మండి." హుషారుగా చెప్పింది.
"అలాగా!--" అన్నాడు కమలాకరం నీరసాన్నీ తెచ్చి కోలు నవ్వుతో కప్పిపెడుతూ.
ప్రతిమ ఇల్లు వచ్చినట్టు ఆమె "చీరియో' చెప్పి వెనుదిరిగే వరకు తెలీలేదు కమలాకరం కు. వాళ్ళ ఇల్లు ఎప్పుడూ చూడలేదు అందుకే విలాసంగా నరికించాడు.
ఒకావిడ లోపలికి తప్పుకుంది అతన్ని చూసి. అప్పటికే ఆవిడ మొహంలో రుసరుస ను చూసేశాడు. అప్పుడెప్పుడో ప్రతిమ పరిచయం చేసిన ఒదినగారు కాబోలు:
ప్రతిమ లోపలికి అదృశ్యం కావడంతో కమలాకరం నడక వేగం పుంజు కుంది.
వారిలో వసంత వాళ్ళ వీధి మలుపు చూస్తుండగానే -- ప్రతిమ చెప్పిన వార్తలు మదిలో మెదిలాయి.
గుండె గుబులుగా బరువెక్కింది. నిట్టూర్చాడు . అతని నిట్టుర్పు అనంత ప్రపంచంలో ఏ మూలనో లీనమైంది.
10
కొన్ని రోజులై కొత్త రకంగా నిర్భయంగా దెబ్బలాట లు తీస్తున్నది పంకజం. ఆమె ఏదో నిశ్చయం చేసుకున్నట్టుంది.
ఒకరోజు "ఆలస్యంగా అర్ధరాత్రి పూట రావడం ఏం లక్షణం" ని అడిగింది.
"ఇంటిపోరు లక్షణం కాబట్టి నోరుమూసుకు పడుండ" మన్నాడు.
"పడుండడానికి నాకు దిక్కు లేదను కున్నారా?" అంది ఇదివరకే పుట్టింటి దిక్కు పదేపదే జ్ఞప్తి తెచ్చుకున్న పంకజం.
* * * *
మళ్ళీ సంక్రాంతి రోజులు వచ్చేసరికి కమలాకారంతో పాటు అందరికీ గుండెలు పిచుపిచు మన్నాయి. గతించిన సంక్రాంతి కంటే, గామించబోయే సంక్రాంతి కంటే, అగమించ బోయే సంక్రాంతి ని తలుచు కుంటేనే భయమని పించింది. ఎంత కఠినతరంగా గడిచాయి. ఈ సంవత్సరం రోజులూ?-- ఇలా ఎన్ని సంవత్సరాలు గడవాలి? అని ఎవరికి వారే ప్రశ్నించుకునీ వుంటారు.
శారదమ్మ మొట్టమొదట మంచి ముహూర్తం చూసుకుని కోడలి పైనే విరుచుకు పడింది. కాని దెబ్బలాట లో కోడలిదే పై చేయి. అయినా పంకజం భర్తతో వాదులాడినంత తీవ్రంగా అత్తగారితో పోరాటం అవసరం లేదనుకుంది.
శారదమ్మ సంగతి సరేసరి. ఆవిడ లౌక్యానికే ప్రసిద్ది కాని దెబ్బలాటలకు కాదు.
కమలాకరం ప్రేమించాడన్న సంగతి తెలిసిన తర్వాత అత్త పైన చులకన భావం ఏర్పడింది పంకజం కి. లేకపోతె మొదట్లోనే మంచి గురి కుదిరిన అత్తగారి మాటలకి నిలువ యిచ్చి అలోచించి వుండేది. ఎవరినో ప్రేమించిన కొడుక్కి తనని ముడిపెట్టి మోసం చేసింది కదా అనే చెడ్డ భావన పాతుకు పోయింది పంకజం లో.
