భళ్ళున తెల్లారింది. నా జీవితంలో నూతన అధ్యాయానికి అదే తోలి రోజు. ఇక హైదరాబాద్ వదలి ఏ వూరు వెళ్ళాలి?
వెళ్లి ఏం చెయ్యాలి?
అన్నీ ప్రశ్నలే గాని దేనికీ సమాధానం లేదు.
ఎడుడ్డామంటే ఏడుపు రాలేదు.
కన్నీరు కరువయ్యింది.
-ఆ పైన గతాన్ని గురించి ఆలోచించడానికి మనస్సు వప్పలేదు. మడత కుర్చీ లోంచి లేచాను. రమ ఎలా ఉండి ఉంటుందో గుర్తు తెచ్చుకోవాలను కున్నాను. రమ రూపం నా కళ్ళ ఎదుట నిలిచింది. కానీఆది ఆనాటి రూపమే, ఆ రూపానికి ముసలితనం అంటగట్టి వూహించబోయాను.
మనస్సు ఎదురు తిరిగింది.
అందుకే ఒక పసిపిల్ల వాడు చనిపోతే ఆ ఇంట్లో ఎప్పుడూ చంటి పిల్లాడు లేని కొరతే ఉండదు అన్నాడో కవి. ఎప్పుడూ ఆ పసి పాపని గుర్తుకు తెచ్చుకున్నా ఆ వయస్సు లోనే కనబడతాడట. అతని ఊహాశక్తి ఎంత గొప్పదో!!
అవును, ఆ కవి ఎంత తెలివైన వాడో!!
తలుపు వేసుకుని పెరట్లో కి వెళ్లి మంచం వాల్చుకుని మేను వాల్చాను.
తగజల సేతు బంధవం వల్ల ప్రయోజనం ఉండదంటారు. కానీ ఎవరూ మానరు. వాళ్ళు మానుడామనుకున్న వాళ్ళ మనస్సు వప్పుకొదు.
అలోచించి వదిలిన దగ్గర్నుంచీ నా మనస్సు మళ్ళీ గుర్తుకు తేవడం ప్రారంభించింది.
........హైదరాబాదు నుంచి తిన్నగా వైజాగ్ వెళ్లాను. జరిగినదంతా -----హైదరాబాదు లో జరిగినది తప్ప -- అవధాన్లు గారితో చెప్పాను. తనకు ఉత్తరం వచ్చినట్టు అయన చెప్పారు. జరిగిన దానికి చాలా విచారించారు.
"అయితే ఏం చేద్దామనుకుంటున్నావు." అన్నారు.
"ఉద్యోగం" అన్నాను. అంతకు మించి ఆయనతో ఏ విషయాలు మాట్లాడాలో తెలియలేదు. నా ప్రవర్తన ఆయనకు కూడా నచ్చనట్టు గ్రహించాను. పెద్ద అయనతో సంబంధం పెట్టుకోకూడదను కున్నాను.
విశాఖపట్టణం లో ఒక కంపెనీ తో ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగం లో జేరిన నాడు అమ్మ పేర ఒక ఉత్తరం రాశాను. జరిగిన దానికి చాలా విచారిస్తున్నానని కూడా రాశాను. రమ విషయం లో నేను పొందిన అపజయం మాత్రం రాయలేక పోయాను.
వారం రోజులకు ఒక కవరు వచ్చింది. అది నాన్నగారి వద్ద నుంచి వచ్చింది. వణికే చేతులతో విప్పి చదివాను. నాలుగే నలుగు పంక్తులున్నాయి.
"----ఏ క్షణం మా గడప లోంచి అడుగు బయట పెట్టావో, ఆ క్షణం నుంచే నీకూ, మాకూ సంబంధం తీరిపోయింది. అంత ధైర్య సాహాలతో రంగంలోకి దూకిన వాడివి అప్పుడే రాజీకి రావడం బాగులేదు. అసలు రాజీ కి రావదాన్నే నేనోప్పను. "ఆరంభించరు నీచ మానవులు" అన్న పద్యం నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకో. ఆస్థి లో నీకు రావలసిన వాటా యీ నెలాఖరు కు అవధాన్లు గారి ద్వారా ముట్టుతుంది." అని ఉంది.
నా మనస్సు కు కలిగిన గాయానికి కారం పూసినట్టు అయ్యింది. తెలియని ఆగ్రహం ఆవేశించింది. కన్న కొడుకుతో ఏవిటీ పంతం---వెళ్లి కనిపిస్తెనొ----- పొమ్మంటారా.
నా ఉడుకు రక్తం విచక్షణా జ్ఞానాన్ని కలుగనివ్వ లేదు.
వారం తిరిగేసరికి నా వాటా కి వచ్చినట్టు అవధాన్లు గారు చెప్పారు.
ఏం లాభం !!
విశాల ప్రపంచం లో అంత చిన్న వయస్సు లోనే నేను ఏకాకిని. ఇంత నికృష్ట బ్రతుకు ఎందుకు? దేముడు నన్నెందుకు పుట్టించాడో బోధపడలేదు.
చేస్తున్న ఉద్యోగం మానేశాను. విశాఖపట్టణం వదిలేసి బొంబాయి వెళ్లాను. రమ, జాఫర్ కనిపిస్తారేమోనని నెలరోజులు గాలించాను. నా పిచ్చి కాకపొతే వాళ్ళు కనుపిస్తే మాత్రం నాకు ప్రయోజనం ఏమిటి?
అటునుంచి హైదరాబాదు చేరాను. తిన్నగా మామయ్య ఇంటికి వెళ్లాను. కసితీరా వాళ్ళని పరిహసిద్డామనిపించింది. మా మామయ్య మానసికంగా చాలా దెబ్బ తిన్నాడు. నన్ను చూసి కంట తడి పెట్టుకున్నాడు.
"రాజూ! ఒక్కగా నొక్క కూతురు. ఎన్ని కష్టాలు పడి దాన్ని పెంచామో! ఎలా చేసిందో చూడు" అన్నాడు.
అత్తయ్య వెక్కి వెక్కి ఏడ్చింది.
వాళ్ళను ఓదార్చే స్థితిలో నేను.
మా అమ్మ నాన్నలకు నేనూ ఒక్కడ్నే! కానీ, నన్ను పోగొట్టు కున్నందుకు వాళ్ళు విచారిస్తూ ఉంటారా అన్నది అనుమానం. నాన్నగారికి విచారం ఉండదు కానీ, అమ్మ మాత్రం విచారిస్తూ ఉంటుందను కున్నాను. ఆ పూట భోజనం చేయమని మామయ్య బలవంతం చేశారు. నాకు చేయబుద్ది కాలేదు. అత్తయ్య, మామయ్య బ్రతిమాలినా ఉండకుండా రూముకు వచ్చేశాను.
ఇక నేను ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న మిగిలి పోయింది. ఉద్యోగం చేయాలన్న సమాధానం వచ్చినా అంత డబ్బుండగా ఉద్యోగం ఎందుకు అని వూర్కున్నాను.
తినడం మొదలెడితే గాదులు, తవ్వడం మొదలెడితే కొండలు తరిగిపోతా యన్నారు పెద్దవాళ్ళు. బ్యాంకులో ఎకౌంటు చిక్కి, సన్నగిల్లి బక్క చిక్కి పీనుగై పోయింది.
నాలో వేడి పుట్టింది.
అప్పటికే వో సంవత్సరం వెనక్కు పోయింది. హైదరాబాదు కు, అక్కడి వాతావరణానికి స్వస్తి చెప్పి మద్రాసు చేరాను. ఉద్యోగం కోసం ప్రయత్నమూ చేసి, ఒక నేలయ్యే సరికి ఒక కంపెనీ లో ఉద్యోగం సంపాదించాను.
మళ్లీ బండి పట్టాలు ఎక్కింది.
నడక ప్రారంభించింది.
---ఆలోచనలతో పరాకు లో ఉండడం వల్ల సుశీల పిలుపుకు ఉలిక్కిపడ్డాను.
"బాబయ్య గారూ! మా క్లాసు పిల్లలు మహా బలి పురం వెళ్తున్నారు రేపు. నేనూ వేళ్ళవద్దా" అంది సుశీల పుస్తకాలు టేబిలు మీద పెడుతూ.
'అలాగే వెళ్ళమ్మా" అన్నాను.
సుశీల తువ్వాలు తీసుకుని స్నానానికి బయలుదేరేసరికి నేను స్నానం చేయలేదనే విషయం గుర్తుకు వచ్చింది. కుర్చీలోంచి లేచి, టేబులు దగ్గరకు వెళ్లాను. టేబులు మీదున్న పుస్తకాలూ చూశాను. కాళిదాసు అభిజ్ఞానశాకుంతలం ఉంది. చేత్తో పట్టుకుని, పేజీలు తిరగేశాను.
"కావ్వేషు నాటకం రమ్యం
నాటకేషు శకుంతలా
అతత్రాసి....."
నా మనస్సు నా చిన్ననాటి కాలేజీ జీవితాన్ని గుర్తు తెచ్చింది. నాలుగో అంకం తీసి, అత్తవారి యింటికి వెళ్ళే పడుచులు నడుచుకోవలసిన తీరు --కణ్వుడు శకుంతల కు చెప్పిన పద్యం చదివాను.
ఏవిటో!
సుశీల కూడా అత్తవారింటికి వెళ్ళవలసినదే!!
అందుకనే ఆడపిల్ల అన్నారు.
పరాయివాళ్ళ పిల్ల కానీ, మనింటి పిల్ల కాదని అర్ధంట ఆడపిల్లంటే!!
పేజీలు తిరగేశాను.
ఏదో కాగితం మడిచి ఉంది.
తీశాను. విప్పదీశాను.
ఉలిక్కిపడ్డాను.
ప్రేమ లేఖ!! నా కళ్ళు యాంత్రికంగా చదినాయి.
--నిన్ను చూడందే ఉండలేను. నాలుగు రోజుల నుంచీ కనబడడం లేదు. జీవితం మీద విరక్తి పుట్టింది. పక్క మీద నుంచి లేవ బుద్ది కూడా కాలేదు. ఏవిట్రా అని స్నేహితులంతా అడిగారు. దేవదాసు వయ్యావా అన్నారు. మీ కాలేజీ మ్యాగజిన్ లో పడిన నీ ఫోటో ని చూస్తూ కూర్చున్నాను--------

నా శరీరం వణికింది. వణికే చేతులతో ఉత్తరం మడిచి అందులో పెట్టేశాను. ఏం చెయ్యాలో తోచలేదు. కుర్చీలో కూర్చుని , ముఖానికి పట్టిన చమట తుడుచుకున్నాను. ఇంతలో ఆఫీసు ఫ్యూను వచ్చి, "అయ్యగారు , అమ్మగారు వస్తున్నారు" అన్నాడు. గమ్మున లేచాను. కంపెనీ యజమాని భార్యతో ఎందుకు వస్తున్నాడు? ఆయన అసలు ఎన్నడూ మాయింటికి రాలేదు. అసలు మద్రాసు లోనే ఉండడు. నెలకి నాలుగు రోజులుంటాడు. అలాంటిది........
"రండి, రండి " అన్నాను. అయన నవ్వుతూ లోపలకు వచ్చాడు. వాళ్ళావిడకు నన్ను పరిచయం చేశాడు. ఆవిడ నమస్కారం చేసింది. ఇంతలో సుశీల వచ్చింది.
"మా అమ్మాయి సుశీల" అన్నాను నేను.
సుశీల నమస్కారం చేసింది.
"ఏం చదువుతున్నావమ్మా" అందావిడ.
"బియ్యే అండీ" అంది సుశీల. విషయ పరిగ్రహణ జ్ఞానం ఉన్న ఫ్యూను పరుగున వెళ్లి కాఫీ ఫలహారాలు పట్టుకు వచ్చాడు. ఆ తతంగం అయ్యాక, "రేపు మా పాప పుట్టినరోజు . పార్టీకి ,భోజనానికి మీరు యిద్దరూ తప్పక రావాలి." అందావిడ.
"అవును." అన్నాడాయన.
"అంతకన్నానా!" అన్నాను. నేను. వాళ్ళిద్దరూ లేచారు. "మేమిక వెళ్తాము. రేపు మర్చిపోకండి" అనేసి, వెళ్ళిపోయారు.
"బాబయ్య గారూ, ఆవిడ ఏం చదువు కుంది?" అంది సుశీల. ఆ ప్రశ్న ఎందుకు వెయ్యాల్సి వచ్చిందో నాకు అర్ధం గాక "ఏం" అన్నాను. "అబ్బే, ఏం లేదు బాగా చదువుకున్నావిడ లా ఉంటేను." అంది.
"యమ్ . ఏ. సంసృతం లో బెనారస్ యూనివర్శీటి;లో ఫస్టు వచ్చిందమ్మా ఆవిడ రిసర్చ్ చేసింది కూడాను" అన్నాను.
"సుశీల కళ్ళు ఆనందంతో మెరిశాయి. "నేను ఎం.ఏ. చెదవద్డా" అంది. "వో యస్ నువ్వు చదవకపోతే ఎవరు చదువుతారు" అన్నాను.
* * * *
