జయప్రద సిగ్గుపడి, "నే నేమీ మాట్లాడలేదు, టీచర్! లక్ష్మే ఏమిటో చెప్పుతున్నది" అని క్షమాపణ చెప్పుకొంది.
ఇంటర్వెల్ లో స్టాఫ్ రూమ్ కు పోయిన పారిజాతానికి సత్యవతి కనబడింది. అంటే సెలవివ్వకుండా, సత్యవతిని హెడ్ మిస్ట్రెస్ పిలిపించిన దన్నమాట.
మామూలుగా దగ్గరగా ఉండే బెంచీలన్నీ దూర దూరంగా వేయబడి ఉన్నాయి. ఒక్కొక్క బెంచీలో ఒక్కొక్క టీచర్ మాత్రమే కూర్చుని ఉన్నారు.
ప్రశ్నార్ధకంగా సత్యవతివైపు చూచింది పారిజాతం.
సత్య నవ్వి, "144 వ సెక్షన్ ప్రస్తుతం మన స్కూల్లో అమల్లో ఉంది" అని అంది.
"ఏం? ఎందుకు?" పారిజాతం ప్రశ్న.
"సరేలే! ఒకరితో ఒకరు మాట్లాడినకొద్దీ, స్కూల్ పని తక్కువా, క్రమశిక్షణరాహిత్యం ఎక్కువా అవుతున్నదిగా! అందుకనే! అది సరేకాని, ఏమిటి కథ? మళ్ళీ ప్రహసనమా?" అని సత్య అడిగింది. ప్రహసన మంటే, వాళ్ళిద్దరి భాషలో 'సంజాయిషీ' అన్నమాట.
"నోటితో అంది. కాని, కాగితం ద్వారా ఇంకా రాలేదులే. ఈ మారు కాస్త పెద్ద ఎత్తులోనే ఉన్నట్లుంది!" నవ్వుతూ అంది పారిజాతం.
మిగతా టీచర్లు ఏదో పని చేసుకొంటున్నట్లుగా నటిస్తూ, వీళ్ళ మాటలు వింటున్నారు. సాధారణంగా ఇట్లాంటి విషయాలు స్కూల్లో జరిగితే, మిగతా వారు నాలుగు రోజులపాటు తప్పుకు తిరుగుతారు.
అంతా కంగారుగా లేచి నిలబడేటప్పటికి, ఏమిటో నని పారిజాతం తల తిప్పి చూచింది. హెడ్ మిస్ట్రెస్ హడావిడిగా సత్య పక్కకు వచ్చి, "చూడమ్మా! నీవు ఇంత నీరసంగా ఉన్నావని నాకు చెప్పలేదమ్మా! స్నేహితురాలన్న మాటే కాని, ఒక్కటీ సరిగ్గా చెప్పరు!మధ్యాహ్నానికి కూడా సంతకం చేసి, ఇంటికి పోయి, రెస్ట్ తీసుకోండి" అంటూ పారిజాతం వైపు నిందాగర్భితంగా చూసి, వెళ్ళిపోయింది.
సత్యవతి నవ్వుతూ, "విభజించి పాలించుమురా, తెల్లవాడా?" అని, అక్కడినుంచి కదిలింది.
* * *
రెండు నెలలు జరిగాయి. ఒకనాడు ప్రాణేశ్వరరావు గారు, ఇంట్లో ఈజీ చైర్లో కూర్చుని, 'ఆంద్రప్రభ' చదువుకొంటున్నారు. ఇంతలోకే అనంతలక్ష్మి ఇంట్లో నుంచి, పెద్ద పెట్టున సుబ్బారావు అరుపులూ, అనంత లక్ష్మి ఏడుపూ, స్వరాజ్యలక్ష్మి తిట్లూ, వాళ్ళమ్మ ఏడుపులూ, శాపనార్ధాలూ గగ్గోలుగా వినిపించినాయి. మరుక్షణంలో అనంతలక్ష్మి పరుగెత్తుకొంటూ, ప్రాణేశ్వరరావుదగ్గరకు-"చంపేస్తున్నాడు, మాస్టరుగా రండీ! నే చచ్చిపోతాను, బాబోయ్! మీరు రక్షించండోయ్!" అని పొలికేకలు పెట్టుకొంటూ వచ్చింది.
ప్రాణేశ్వరరావుగారు ఈ రెండు నెలల్లో, అనంత లక్ష్మి కుటుంబాన్ని గురించి కొంత గ్రహించుకో గలిగారు. తండ్రి ఎటువంటి వాడో తెలియదు కాని, తల్లి మాత్రం వట్టి మాటలపుట్ట. సినిమా భాషల్లో మాట్లాడుతుంది. పిల్లల్ని ఆదుపాజ్ఞల్లో ఉంచడం ఆవిడకు చేతకాదు. ఎవరి ఇష్టం వారిదే.
ఒకమారు అనంతలక్ష్మి, తల్లిని- "పంది కన్నట్లు కని వీళ్ళిద్దర్నీ నా మీద పడేశావు. నా దారిని నేను పెండ్లి చేసుకొని పోతే, నీ రోగం చప్పగా కుదురు తుంది" అని అనడం విని, ప్రాణేశ్వరరావుగారు నిర్ఘాంతపోయారు!
దారిని కుర్రాళ్ళు పోతూఉంటే, స్వరాజ్యలక్ష్మి కిటికీ చువ్వలు పట్టుకొని, "కోసి కొనుము ఈ కోమల కుసుమము, కోరి విరిసె నీ కోసమే స్వామీ!" అని భావగీతాలు పాడుతుంటే, చూచి, 'తల్లీ! ఈ తెలివి చదువులో ఉంటే ఎంత బాగుండేది!' అని ఎన్నోసార్లు అనుకొన్నారు.
క్రాపు ఎగదువ్వుకుని, మెడకు రుమాలు రౌడీలాగా చుట్టుకొని, ఆడపిల్లలు బడికిపోతూ ఉంటే, వెనక ఈలపాటలు పాడుతూ, వాళ్ళను అనుసరించిపోయే సుబ్బారావును చూసి ఎన్నోసార్లు అసహ్యించుకొన్నాడు.
ఇంటికి ఒక మారు ప్రాణేశ్వరరావుగారి తమ్ముడి కొడుకు రాజగోపాల్ వచ్చాడు. ఆ అబ్బాయి అనంత పురంలో బి. ఇ. మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అతను వచ్చిన రోజు, అనంతలక్ష్మి, వెయ్యి సార్లు ఏదో పనిపెట్టుకోని, ప్రాణేశ్వరరావుగారి ఇంటికి వచ్చింది. అక్కాచెల్లెళ్ళు గొంతెత్తి గీతాలు పాడారు. ఆ రోజు ఇంట్లో సంభాషణ విధమే మారింది. అనంతలక్ష్మి తల్లి ప్రాణేశ్వరరావుగారి భార్యతో, రాజగోపాల్ వినే టట్లు తన కూతుళ్ళ శ్రావ్యమైన కంఠాన్ని గురించి, అనంతలక్ష్మి త్యాగాన్ని గురించి అరగంట చెప్పింది. ఆవిడ వెళ్ళిపోయిన తరవాత, మాస్టరుగారి భార్య మహాలక్ష్మమ్మగారు తలుపు గడియపెట్టి, "ఈ మాటు వాళ్ళెవరైనా వస్తే, తలుపు తీస్తే, గారంటీగా అబ్బాయితో పాటు అనంతపురం పోతా" నని బెదిరించారు. అప్పటి ఆ కుటుంబ ప్రవర్తనబట్టి, వారి నైతిక విలువలకూడా కొంతమేరకు ప్రాణేశ్వరరావుగారికి అర్ధమయ్యాయి.
కాని, ఆయన లౌక్యుడు. అనంతలక్ష్మి కి పితూరీలు చెప్పే అలవాటు ఉందని ఆయనకు తెలుసు. ఆవిడతో ఏమన్నా బెసికితే, హెడ్ మిస్ట్రెస్ కు వెంటనే పితూరీ మోస్తుంది. ఆమె అది నిజమా, అబద్ధమా అని ఆలోచించదు. అనంతలక్ష్మి మాటలు విని ఏమన్నా వ్రాసిందంటే ఉద్యోగం చెయ్యడం కష్టమౌతుంది. అందుకని, యుక్తిగా, అనంతలక్ష్మి అంటే సానుభూతి ఉన్నట్లు నటిస్తూ, ఆ పిల్ల దగ్గర హెడ్ మిస్ట్రెస్ గురించి, ఆవిడ పరిపాలనా దక్షతను గురించి తెగ పొగుడుతూ ఉంటారు. ఈ పొగడ్తలన్నీ హెడ్ మిస్ట్రెస్ గారికి చేరుతాయని ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. హెడ్ మిస్ట్రెస్ తా నంటే ఎక్కడలేని ఆపేక్ష ఒలక బోయడంకూడా అందుకేనని తెలుసు. వీటన్నిటినీ మించి, కూతురు ఎమిలీకి లెక్కల్లో మార్కులు ఎక్కువ వెయ్యటానికి, మంచి మాటలలో తన చుట్టూ వల పన్నుతూందనికూడా తెలుసు. లోకం పోకడ తెలిసిన ప్రాణేశ్వరరావుగారు, భార్యకు ఈ విషయాన్ని అర్ధమయేటట్లు బోధించి, అనంతలక్ష్మి కుటుంబం గురించి ఎక్కడా నోరు జారవద్దని గట్టిగా హెచ్చరించారు. ఆమె ఇట్లాంటి విషయాల్లో ఆయన కన్న నాలుగాకులు ఎక్కువ చదివింది. వాళ్ళతో చాలా కలుపుగోలుగా ఉంటుంది. అడపా దడపా పులుసు, ఊరగాయవగైరాలు కొద్దిగా సప్లై చేస్తూ ఉంటుంది.
ఈ వేళ ఏడుస్తూ, తన దగ్గరకు వచ్చిన అనంత లక్ష్మిని చూసేటప్పటికి, ఆయనకు చిరాకు వేసింది. అది బయటపడకుండా, హడావిడిగా ఈజీ చైర్లో నుంచి లేచి, "ఏమిటమ్మా! ఏమయిందేమిటి?" అని ఆత్రంగా అడిగారు.
ఏడుస్తూ, అనంతలక్ష్మి చెయ్యి చూపించింది. ముంజేతిమీద ఎర్రగా వాత దేలింది. అది చూసేటప్పటి టికి ఆయనకు నిజంగా కోప మొచ్చింది.
"ఎవడమ్మా? నీ తమ్ముడేనా? అప్రాచ్యుడు! శుంఠ! బేకారు వెధవ! ఆడపిల్ల మీద చేయి చేసుకొంటాడా! ఉండు, వీడి పని చెబుతాను! పోలీసుల కప్పజెపుతా" నని గట్టిగా కేకలేశారు.
వంటింట్లోనుండి బయటికొచ్చిన మహాలక్ష్మమ్మ గారు సానుభూతి ఉట్టిపడే స్వరంతో- "చన్నీళ్ళతో తడిపిన గుడ్డ చుడతాను, రా అమ్మా!" అని ఆవిడను ఇంట్లోకి తీసుకుపోయింది.
ఇంతలోకే, కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో సుబ్బారావు వచ్చి, "నీ వెవడవోయ్, మా వ్యవహారాల్లో తల దూర్చ డానికి! పోలీసులతో చెబుతావా? నీ తాతతో చెప్పుకో! నీకూ, ఆ అనంతముండకూ రంకు సాగుతున్నట్లుంది! లేకపోతే నీ కెందుకు ఈ బాధ!" అని అరిచి, అక్కడ నిలబడకుండా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పోయాడు.
వాడి మాటలు విన్న అనంతలక్ష్మి వలవల ఏడుస్తూ వచ్చి, "నీ నాలుక మండిపోనూ! అక్కమీద అభాండం వేస్తావురా! చూశారా, మాస్టరుగారూ! వీడెప్పుడు చస్తాడో, నా పీడ ఎప్పుడు విరగడవుతుందో!" అని కూలబడింది.
ప్రాణేశ్వరరావుగారికి సిగ్గుతో చచ్చినంత పనయింది! ఇదేదో పీడ పట్టుకొన్నట్లయింది. బాధ్యత గలపనిచేస్తూ, అనంతలక్ష్మి అట్లా వీథిని పడడం ఆయనకు నచ్చలేదు. అయినా, లౌక్యాన్ని మరవకుండా, "వాడి అవాకులూ చెవాకులకేంలే, అమ్మా! భయపడకండి. ఇంటికి పోయి అమ్మగారికి ధైర్యం చెప్పండి" అని ఆమెను నెమ్మదిగా సాగనంపి, ఇల్లు మార్చే ఆలోచనలో పడ్డాడు.
* * *
