Previous Page Next Page 
మేఘమాల పేజి 4


    కూర ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుంటూ అదే వ్యక్తం చేశాడు గూడా: 'మీకు నామీద కోపం తగ్గినట్లే వున్నది!' అని చిన్నగా నవ్వాడు.
    ఆమె అరక్షణం గూడా ఆలశ్యం చేయకుండానే, 'మీమీద నాకు కోపం దేనికి?' అన్నది-ప్రశ్నార్ధకంగా మొఖంపెట్టి. అంతలోనే, అసలే అందమైన విశాలమైన మొఖాన్ని మరింత పెద్దది చేసుకొని, పెద్దగా నవ్వుతూ, 'అయినా కోపతాపాలతో నాకు పనేమిటి? ఆవిడ గారు వుండమన్నారు, మీరు వున్నారు...మధ్యలో నేనెవర్ని?-నా వ్యక్తిగత అభిప్రాయాలు నావి...' ఒక్క క్షణం ఆగింది. 'అసలు విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.....మీరు మా యింట్లో మమ్మల్నిపోషించేందుకుగాను వుండటం నాకేమాత్రం యిష్టం లేదు .....మమ్మల్ని మేం పోషించుకోలేనంత హీన స్థితిలో మాత్రం మేం లేం.....ప్రతి క్షణం మీరా విషయం గుర్తుంచుకోక తప్పదు!'- ఆమె ఇంకా నవ్వుతూనే వున్నది!
    త్యాగరాజు మొఖం పాలిపోయింది...
    -విభ్రాంతిగా ఆమె మొఖంలోకి చూస్తూ కొయ్యలా బిగుసుకుపోయి కూర్చుండిపోయాడు!
    
                                *    *    *

    మరునాడుదయాన స్నానంచేసి తన గదిలోవున్న వాలుకుర్చీలో కూర్చొని ఆ రోజు డక్కన్ క్రానికల్ 'వాంటెడ్ కాలమ్స్' చూడసాగాడు.
    అతడికి ఇక ఓ ఉద్యోగం అంటూ చూసుకోవాలసిన అవసరం ఏర్పడింది.
    -అందుకనే ఉదయాన లేస్తూనే ఇంటి ఎదురుగ్గావున్న కిళ్ళీ బడ్డీకివెళ్ళి పేపరుకొనుక్కొచ్చుకున్నాడు.
    ఉన్నట్లుండి పేపరు మడిచి మంచం మీద పడేసి లేచి తన పెట్టి మూత తీశాడు. అందులోంచి వో పెద్ద తోలు పర్సును బయటకులాగి - లెక్కపెట్టి యాభై పదిరూపాయలనోట్లను తీసుకొని, మధ్య గదిలో వంటయింటి గది తలుపు ఇవతలగా నిలబడి. 'ఏఁవండీ!' అని పిలిచాడు.
    'ఏం నాయనా?' అన్నది ప్రకాశం తల్లి.
    'ఒకసారి ఇలా వస్తారా?'
    ఆవిడ ఇవతల గదిలోకి వచ్చింది.
    ఆమెవైపు డబ్బున్న చేయి జాపుతూ, 'ఈ అయిదువందలూ మీ దగ్గరవుంచి ఇంటి అవసరాలు గడుపుతూ వుండండి!' అన్నాడు చిన్నగా.
    ఆమె కళ్ళు ఆనందంతోటి, కృతజ్ఞతతోటీ మెరిసినయ్.
    సహజమైన అభిమానంతో, 'నా దగ్గర ఎందుకు నాయనా! నీ దగ్గరే వుండనీయ్...నీవే ఖర్చుపెట్టు!' అన్నది.
    'కాదులేండి .... కుటుంబ విషయాలల్లో .... అంటే యింట్లోకి ఏవేం కావాలో తెలుసుకునేంత జ్ఞానం నాకు లేదు .... అయినా ఎవరిదగ్గరుంటే ఏం బోయింది ... మీ దగ్గరేవుంచి ఖర్చు పెడుతూ వుండండి!' అంటూ మరొక్కడుగు ముందుకు వేశాడు.
    ఆవిడ చేయిజాచి అందుకోబోయింది.
    -కాని, ఇంతలోనే శకుంతల కంఠం ఇద్దరినీ అప్రతిభుల్ని చేసింది!
    'అమ్మా!'
    ఉలిక్కిపడి ఇద్దరూ అటు చూచారు.
    'నీకు సిగ్గు వేయటంలేదూ?...' ఆమె ఆవేశంతో ఊగిపోతున్నది: 'ముక్కూ మొఖం తెలియని ఆయన దగ్గర డబ్బు తీసుకోవటానికి నీకు సిగ్గు వేయటం లేదూ?' ఆమె తల్లిని తీక్షణంగా చూడసాగింది.
    'శకుంతలా!' వేదనతో అన్నాడు త్యాగరాజు. 'నన్ను ఇంకా ముక్కు-మొఖం తెలియని వ్యక్తిలాగానే భావిస్తునానావా శకుంతలా?'
    'కాక....మీరు మాకేఁవైనా బంధువులా, ఆత్మీయులా?.... అయినా నాకు తెలియకడుగుతాను ... ఎన్నాళ్ళ పరిచయ ముందని ఇంత త్యాగం చేస్తున్నారు?....సరిగ్గా మాతో పరిచయమయి పదిరోజులయినా కాలేదే....అందునా అంతకుముందు ఒక్కసారిగూడా చూడని మామీద...ఎందుకంత ప్రేమ ఒలకబోస్తున్నారు?' ఒగరుస్తూ అన్నది.
    త్యాగరాజు నెమ్మదిగా, 'ఆత్మీయత ఏర్పడటానికి...బంధుత్వాలూ, ఏళ్ల తరబడి స్నేహాలూ కావాలనే విష్యం ఈ నాడే నీనుండీ తెలుసుకుంటున్నాను....నిజం శకుంతలా! నా కళ్ళు తెరిపించావ్!' అని విసురుగా వెనక్కు తిరిగాడు.
    ప్రకాశం తల్లి కూతుర్ని కోప్పడుతున్నట్లు, 'శకుంతలా!... అదిగాదే!...' అని అనబోయిందిగాని, ఆమె మాటలు కొనసాగనీయకుండానే శకుంతల, 'నీకు తెలియదులే వుండవే!....మనం ఏఁవీ అడుక్కుతినేవాళ్ళం గాదు....ఉట్టి పుణ్యానికి డబ్బులు తీసుకొని వాళ్ళ కాళ్ళ క్రిందపడి వుండటానికి మనకూ చీమూ, నెత్తురూ వున్నది!' విసురుగా అన్నది.
    మరుక్షణంలోనే గీరగా తల ఎగరవేసి నిరక్ష్యంగా త్యాగరాజును చూస్తూ నిలబడింది.
    త్యాగరాజు శకుంతల వైపు వడివడిగా నడిచాడు: 'క్షమించాలి శకుంతలగారూ! నేనన్నా, నామాటలన్నా, నా చేతులన్నా మీకెందుకింత కోపమో నాకర్ధం కావటం లేదు....నిజం చెబుతున్నాను....నేను ఈ డబ్బు ఇవ్వటం లోనూ-అంతేకాదు ఇక్కడ మీ గృహంలో వుండటంలోనూ - నాకు ఏ దురుద్దేశ్యమూ లేదు.....నా మాటలు నమ్మండి......భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను!' అతడికీ ఆవేశమొచ్చింది.
    బయటకొచ్చేసి తన గదిలో మంచంమీద కళ్ళు మూసుకు పడుకున్నాడు.
    ఏఁవిటీ శకుంతల ఉద్దేశ్యం?
    తనమీద ఎందుకింత కోపాన్నీ, ద్వేషాన్నీ ఏర్పరచుకుంటున్నది?
    అతడికి ఆ క్షణంలో వో భయంకరమైన సమాధానం కళ్ళముందు కదిలింది.
    -ప్రకాశాన్ని తమ చంపానని గానీ ఆమె అపోహ పడటం లేదుగదా?
    ఒళ్ళంతా చమటలు పట్టింది.
    తల దిమ్మెక్కింది.
    -ఒక్క క్షణం కూడా ఆ గదిలో కూర్చోలేకపోయాడు!
    గుడ్డలేసుకొని బయటకు వచ్చేశాడు!
    తనెందుకు చంపుతాడు?.....తనెందుకు చంపుతాడు?...
    
                                *    *    *

    'వడ్డించమంటారా?' నల్లని ముంగురులని ఎర్రటి మొఖంమీద వేలితో తిప్పుకుంటూ అన్నది:
    'అక్కరలేదు.'
    '-నామటుకు నేను భోజనం చేయకుండా ఏ విషయంలోనూ సాధించబోను!' శకుంతల చిన్నగా నవ్వింది: 'దేనికదే!'
    ఆమె ఎలా నవ్వగలుగుతున్నది?
    'ఆకలిని ఎన్నాళ్ళు చంపుకోగలరు?' తిరిగి ప్రశ్నించింది - ఆమె కంఠంలో హేళనగూడా మిళితమై వున్నట్లనిపించింది.
    'ఆకలిని చంపుకోవాల్సిన అవసరం నాకేంవున్నది?' .... ఒక్క క్షణం ఆగాడు. 'అంతేగాదు నాకు ఎవరిమీదా కోపతాపాలు గూడా లేవు.....నాకు అవసరం లేదుగూడా. ఎందుకంటే, నా కెవరున్నారని......నేను అనాధున్ని!' కష్టంగా అన్నాడు.
    'మేం అనాధులమని మీరు డొంకతిరుగుడుగా చెప్పనక్కరలేదు!' ఆమె తీక్షణంగా అన్నది - చురచురా చూస్తూ, బుంగమూతి పెట్టి,
    'శకుంతలా!' అతడు కోపాన్ని ఆపుకోలేక పోయాడు.
    'అనవసరంగా ఉద్రేక పడబోకండి- త్యాగరాజుగారూ! లేవండి.....కాళ్ళు కడుక్కోండి....అమ్మ యింతవరకు భోజనం చేయలేదు......మీరు చేస్తేనే గానీ ఆమె చేయదట.....నాకైతే మాత్రం ఇలాంటి పట్టింపులు లేవు!' ఆమె ఇక సంభాషణను పొడిగించటం యిష్టం లేదన్నట్లుగా వెనుదిరిగింది-నిర్లక్ష్యాన్ని గూడా వ్యక్తీకరిస్తున్నట్లే వున్నది ఆమె సన్నని కంఠం!
    అతడిలో ప్రజ్వరిల్లుతున్న కోపాన్ని ఆహుపులో పెట్టుకుంటూ, 'నేను చెప్పానుగదా! ... నేను ఇప్పుడు భోజనం చేయను.....హోటల్లో భోంచేసి వచ్చాను...నన్ను ఇబ్బంది పెట్టబోకండి .... అంతే గాదు - ఇంకో విషయం గూడా చెబుతున్నాను. మీ కిష్టం లేకుండా ఎన్నాళ్ళు మీ యింట్లో బిచ్చగాడిలా వుండగలను? ... అందుకే వో గంటలో ఇక్కడనుండి వెళ్ళిపోదామనుకుంటున్నాను!' తల వంచుకు అన్నాడు-అయినా కోపంలో రంగరించిన మాటల వేడి సూటిగానే వున్నది!
    లోపలినుండి సన్నని ఏడుపు వినబడసాగింది.
    అది ప్రకాశం తల్లిది!
    ఇంకేంవున్నది?-అది త్యాగరాజు గుండెల్ని మెలితిప్పటం మొదలుపెట్టింది!
    'భగవాన్!'- మంచంమీద కూలబడి పోయాడు.
    'ఆమె అన్నం తినలేదు......ఇక ఈపూట తినదుగూడా....దానివలన కలిగే కష్టనష్టాలను సంపూర్ణంగా బాధ్యులు మీరే.....మీరే బాధ్యులు!' శకుంతల గిరుక్కున తిరిగి లోపలకు వెళ్ళిపోయింది- ఓ మెరుపులా!
    -ఇంకా లోపలనుండి ఏడుపు వినిపిస్తూనే వున్నది!
    త్యాగరాజు పడుకొని కళ్ళకు తువ్వాల చుట్టుకున్నాడు-ఈ వెలుగును భరించలేనట్లుగా!
    తనెందుకు ఇలా అయిపోతున్నాడు?
    అర్ధం కాలేదు.
    
                                  *    *    *

    త్యాగరాజుకు మధ్యాహ్నం మెళుకువ వచ్చేటప్పటికి మూడుగంటల లయింది.
    దూరంగా శకుంతల నిలబడి వున్నది. బంగారు బొమ్మలావున్న ఆమెను చూస్తూ ఒక్కక్షణం కన్నార్పలేక పోయాడు!
    'గంటబట్టి మీరు ఎప్పుడు లేస్తారా అని ఎదురుచూస్తూ నిలబడి వున్నాను!' అన్నది చిన్నగా నవ్వి.
    ఆమె నవ్వినప్పుడు ముత్యాలు రాలుకున్నయ్యేమో ననిపించింది.
    మంచంమీద చేతులమీదగా సగంలేచి, నేను ఇంకా ఎందుకు వెళ్ళిపోలేదూ అని అడగటానికా!' అన్నాడు త్యాగరాజూ నవ్వుతూ-ఆమెనుండి చూపులు మరల్చుకోకుండానే.
    ఆమె మొఖం చిన్నబుచ్చుకున్నది.
    'నేనంత కఠినురాలినేంగాదు.....లేవండి!'
    తెలియని ఆసక్తితో లేచి కూర్చున్నాడు త్యాగరాజు.
    'చెప్పండి!'
    'ఈ రోజు ఉదయాన మా అమ్మ అన్నం తినలేదనే విషయం మీకు తెలుసా?' అన్నది.
    'ఎందుకని తినలేదు?'
    'కారణంగూడా తెలియదా మీకు?' ఆమె చూపుల్లో కొంటెతనం, ఆమె పెదాల చివర విరుపు అతణ్ణి  వివశున్ని చేసింది.
    మనిషి బిగుసుకుపోతూ, 'తెలియదు...' అన్నాడు. ఒక్కక్షణం ఆగి తిరిగి ఆమె ఏదో అనబోయేలోగానే, 'అలా తెలుసుకోవాల్సిన ఆగత్యంగూడా నాకు కనిపించలేదు.....మీరంతా నాకేమౌతారని ఈ తాపత్రయం?' అన్నాడు కవ్వింపుగా.
    'పోనీయ్, వో స్నేహితుడి తల్లిగా బాగోగులు ఆలోచించాల్సిన బాధ్యత మీమీద లేదా?' అందాన్నే దాసోహం చేసుకున్న కళ్ళతో వోరగా చూస్తూ.
    'శకుంతలగారూ! నన్ను ఎందుకు చిత్రాతి చిత్రమైన పశ్నలువేసి హింసిస్తున్నారో అర్ధంకావటంలేదు!' అన్నాడు తల అటూ యిటూ ఊగిస్తూ. 'నేను ఇది సహించల
ేను.....మీ అసలు ఉద్దేశ్యమేఁవిటో నాకు చెప్పండి....' ఒక్క క్షణం తటపటాయించి చటుక్కున అడిగాడు: 'నామీద మీకేఁవీ అనుమానం లేదుగదా...?'
    'ఏ విషయంలో?' ఆమె భ్రుకుటి ముడిచింది.
    'అదే...అతడు తడబడ్డాడు! 'మీ అన్నగారి చావు విషయంలో!'
    'అంటే-?' ఆమెకు అర్ధం కాలేదు.
    'సరే, అయితే అంతటితో ఆవిషయం వదిలివేయండి!' త్యాగరాజు నిట్టూర్పు విడిచాడు.
    -తను లేనిపోని అనుమానాలన్నీ నెత్తిన రుద్దుకుంటున్నాడు!    
    'మీరు పూర్తిగా ఆవిషయం చెప్పందే నేను వదలను!' అన్నది ఒత్తి పలుకుతూ శకుంతల.        '-నన్ను ఇబ్బంది పెట్టబోకండి .... సావకాశంగా మరోసారి చెబుతాను!'
    ఆమె, రెండు క్షణాలు నిశ్శబ్దంగా కూర్చున్న తరువాత చిన్నగా నవ్వి, 'వద్దులేండి.....మిమ్మల్ని ఇబ్బందిపెట్టటం వలన నాకు ఒరిగేదేఁవిటి? అసలు విషయానికి వద్దాం!' అంటూనే లోపలికివెళ్ళి మరుక్షణంలోనే వెనక్కు తిరిగివస్తూ, 'ఇందాక భోజనానికి అభ్యంతరం చెప్పారు.....కాఫీకి అలాంటిదేఁవైనా వున్నదా?' అన్నది నవ్వుతూ చిలిపిగా.
    '-ఒకటి.....మీలో నామీద ఉద్దేశ్యాలు మారనంతవరకూ, నాలోనూ మారవు!...' చాలా గుభనంగా అన్నాడు.
    'అయితే పరిస్థితులు నన్ను కొద్దిగా మార్చినయ్.....బహుశః మిమ్మల్ని మా యింట్లో ఉండమనక తప్పదేఁవో గూడా!....'ఓరగా చూడసాగింది.
    'మీరు ఉండమనటంతో నా ఒళ్ళో లక్షలు వచ్చి పడతయ్యని నేను సంతోషిస్తా ననుకుంటున్నారా?' ఆమె మాటలకు త్యాగరాజు మొఖం కందగడ్డలా అయింది.
    -ఆమె తనని హీనంగా చూస్తోంది!
    'పాపిష్టిదాన్ని! నాకు సరిగ్గా మాట్లాడటం గూడా చేతగాదు..... నా మాటలు మీకేఁవైనా కష్టం కలిగిస్తే నన్ను క్షమించాలి! .... ముందు కాఫీ తెస్తాను, ఆగండి!' అంటూ చరచరా లోపలకు వెళ్ళింది.    
    తిరిగి రెండు నిమిషాల్లోనే ఫ్లాస్కో, గ్లాసు తీసుకువచ్చి త్యాగరాజుకు గజం దూరంలో నేలమీద కూర్చొని, ఫ్లాస్కో మూత తీయసాగింది.
    'దీని కంతటికీ కారణం మా అమ్మ! ఆమె మాటను తీసివేయలేక, ఆమె మనస్సుకు కష్టం కలిగించటం యిష్టం లేక....ఇలా మిమ్మల్ని కోరవల్సి వస్తోంది!
    'చెప్పండి!' అన్నాడు తాపీగా-ఆమె ఇచ్చిన పొగలు గక్కే కాఫీతో నిండిన స్టీలుగ్లాసును అందుకుంటూ.
    'చెప్పేందు కేఁవున్నది .... మీరు మా గృహంలో వుండక తప్పదు-మా అమ్మ దృష్టిలో మాకు ఆసరాగా-కానీ, త్యాగరాజుగారూ! నా మనస్సుమాత్రం దానికి అంగీకరించటం లేదు ... ఇలా అంటున్నానని మీరు కష్టపెట్టుకోవద్దు...నేను మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి అనే మనిషినిగాను .... చెప్పదల్చుకున్నధాన్ని నిర్మొహమాటంగా చెప్పగలను .... అందుకనే నేను నలుగురి దృష్టిలో చెడ్డదాన్నయి పోతున్నాను-'    
    'అసలు సంగతి చెప్పండి!'
    'అదే - మీరు ఇక్కడే వుండాలి... అయితే మా కుటుంబాన్నంతా పోషించవల్సిన బాధ్యతనూ, బాధనూ నేను మీ నెత్తిన రుద్ధదలుచుకోలేదు....పేయింగ్ గెస్ట్ గా వుండండి.....మీరు రూంలోవుండి హోటల్లో తింటే ఎంతవుతుందో సుమారున అంతా లెక్కకట్టి నెలనెలా యిస్తుండండి!' అని గంభీరంగా అన్నది. 'అంతేగాదు.....మేం తిండికి మలమలా మాడుతున్నా ఒక్క పైసాగూడా ఎక్కువ మాకు ఇవ్వవద్దు.....అలాంటి దంటే నాకు పరమ అసహ్యం......నా మటుకు నేను ఎవరి చెప్పు చేతుల్లోనూ వుండటం సహించలేను!' అంటూనే నోరుతెరిచి ఏదో చెప్పబోతున్న త్యాగరాజువైపు కన్నెత్తైనా చూడకుండా చరచరా లోపలికి వెళ్ళిపోయింది.
    త్యాగరాజు అలాగే నోరు తెరచుకొని ఆమె వెళ్ళినవైపే గుడ్లప్పగించి చూస్తూ కూర్చుండి పోయాడు!
    'ఈమె చాలా గర్విష్టిలా వున్నది!'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS