Previous Page Next Page 
స్వాతి జల్లు పేజి 4

 

                                        2


    అరుంధతి వ్రాసిన కధ తిరిగోచ్చేసింది. ఆమెకు అన్నం నీళ్ళు కూడా సహించలేదు. ప్రకాశరావు వేళాకోళంగా నవ్వుతూ "బెటర్ లక్ నెక్ట్స్ టైం - మళ్ళీ పంపించు! ఇంక వేరే చేసే పనేముంది?" అనేసి వెళ్ళిపోయాడు.
    అరుంధతికి ఆ వేదన కొత్తగా ఉంది. ఏదీ తోచనీయని ఒకానొక అశాంతి. తన కధ మొట్టమొదటి సారే, తిరిగొచ్చి ఉంటె, ఇంత బాధపడేది కాదేమో? కాని, ఒకటి ప్రచురింపబడి చాలా మంది బాగుందని, తను గూడా వ్రాయగలననుకొన్నాక, తిరిగొస్తే, గుండెల్లో చెయ్యి పెట్టి కలచినంత అశాంతిగా ఉంది.
    స్నానానికి కూడా లేవకుండా, దిగాలుగా మంచం మీద పడుకుంది.
    ఎప్పుడో రెండు గంటలకు రవి వచ్చే వరకూ అలానే ఉంది. రవి ఆమెను చూచి ఆశ్చర్యపోతూ "అలా ఉన్నారేం , అక్కయ్యగారూ? ఒంట్లో బాగుందలేదా?" అన్నాడు. అతని కంఠం లో ఆతృత స్పష్టంగా ధ్వనిస్తోంది. అది గమనించిన అరుంధతి ఆర్ద్ర స్వరంతో "ఒంట్లో కాదు రవీ! మనసు బాగులేదు." అంది.
    "ఓస్ అంతేనా? నాకు చెప్పండి ఎందుకు బాగులేదో? క్షణంలో బాగు చేస్తాను"
    --నవ్వుతూ అన్నాడు రవి.
    అరుంధతి ఆశ్చర్యంగా అతని వంక చూసింది. అతనంత చొరవగా మాట్లాడడం ఆమె ఎన్నడూ వినలేదు. పసిపిల్లాడిలా నవ్వుతున్నాడు రవి.
    "నా కధ తిరిగోచ్చేసింది. నేను గూడా వ్రాయాగలననుకున్నాను. కానీ నాకా శక్తి లేదని తెలిసిపోయింది. ఇది నేను సహించ లేకుండా ఉన్నాను."
    రవి గలగల నవ్వాడు.
    "ఓస్! ఇందుకేనా , ఇంత బాధ పడ్తున్నారు? కధ తిరిగొచ్చి నంత మాత్రాన మీరు వ్రాయలేరని ఎక్కడుంది? అందరూ , ఎప్పుడూ మంచినే వ్రాయగలరా? ఒక్కొక్క సారి , కొన్ని బాగుండవు. కానీ మళ్ళీ ప్రయత్నించి మంచివి వ్రాయగలరు. ఇంత మాత్రానికి కృంగి పోకూడదు. "ఈ ఓదార్పుతో అంత వరకూ అరుంధతి అణచి ఉంచిన కన్నీళ్లు పైకి వచ్చాయి.
    "లాభం లేదు రవీ! నేనింక కాగితం మీద కలం పెట్టను."
    'ఛ! ఛ! అంత మరీ పసి పిల్లలయి పోతున్నారేమిటండీ? అయినా తిరిగొచ్చినంత మాత్రాన, అది మంచి కధ కాదని ఎక్కడుంది? నా స్నేహితుడోకాయనకు ఇలానే తిరిగొచ్చిందట! అతడు దానినే, రేడియో లో చదివాడు. శ్రోతలందరూ ఎంతో బాగుందని మెచ్చుకోవటమే కాక, అది ఇతర భాషలలోకి కూడా అనువదింపబడింది. ఇంకొకరికి కూడా  ఇలానే తిరిగోస్తే, అయన దానిని తన ఫైల్ లో దాచి, కొంత కాలం తరువాత మళ్ళీ అదే పత్రికకు పంపాడట! -- ప్రచురించబడింది!"
    అరుంధతి నవ్వేసింది. ఆ తరువాత అరుంధతీ, రవీ చాలాసేపు తిరిగొచ్చిన కధలు కధలు చెప్పుకొన్నారు. మనసులో వెలితి పూర్తిగా పోకపోయినా అరుంధతి చాలావరకు స్థిమిత పడింది. అరుంధతి పెదవులపై చిరునవ్వును తృప్తిగా చూసిన రవికి, తను వచ్చిన పని గుర్తు వవ్చి కంగారు పడ్డాడు.
    "అక్కయ్యగారూ! బావగారు కాఫీ తీసుకొని రమ్మన్నారు!" అన్నాడు.
    మిగిలిన అన్ని విషయాలలో లాగే, రవి విషయంలోనూ, నిరాసక్తంగా ఉండేది అరుంధతి-- ఈనాడు , మొట్టమొదటిసారిగా అతని హృదయ వైశాల్యం అర్ధమయింది. అరుంధతికి దెబ్బతిన్న వాళ్ళను మరింత బాధించడం , తోటి మానవుల కర్తవ్యం కాదని అందరికీ తెలిసినా, అదేం పాపమో, నూటికీ, తొంబై మంది అలానే ప్రవర్తిస్తారు-- అదొక సరదా! నిందితులను పులుల సమక్షాన విడిచి ఆ పోరాటాన్ని చూసి, ఆనందించే మానవ ప్రకృతిలో ఇది విడ్డూరమేమీ కాదు. కానీ, తోటివారి ఆవేదనకు అవహేళన చేసే బదులు గాయానికి మందుపూసి అనునయించే అమృత హృదయులు కూడా ఉంటారు. రవిలోని యీ భాగాన్ని ఈనాడు చూడగలిగింది. ఇది ప్రయోజనం కోరిన నటన కాదు. నటించడం రవికి చేతకాదు- అరుంధతి ఆలోచనలో ఉండటం గమనించి, రవి మళ్ళీ బెదురుగా "బావగారికి కాఫీ..." అన్నాడు.
    అరుంధతి ఉలికిపడింది.
    "కాఫీ, నే పంపిస్తాలే! ఇంతమంది నౌకర్లున్నారు - ఎవరో ఒకరు తీసి కెళ్త'రు-- నువ్వు తీసి కెళ్లక్కర్లేదు--" రవి తెల్లబోయి చూచాడు.
    అరుంధతి నవ్వుతూ "ఎందుకలా బెంబేలు పడతావ్! మీ బావగారు నిన్నేమీ అనరులే! నేనివ్వలేదని చెప్పు!" అంది.
    రవి ఇంకేమీ మాట్లాడలేక వెళ్ళిపోయాడు. ఏవేవో ఆలోచనలలో పడిపోయిన అరుంధతికి, ప్రకాశరావు కారు హారను విన్నాక కానీ తాను కాఫీ పంపలేదని గుర్తు రాలేదు-- కంగారు పడిపోయింది. కాఫీ ఏ హోటల్ లోనో తాగవచ్చు! కానీ, అలా చేస్తే ఎక్కువ డబ్బు ఖర్చయి పోతుందని ప్రకాశరావలా చేయడు. కాఫీ పంపనందుకు చిరాకుపడ్తాడనుకొన్న ప్రకాశరావు యదా ప్రకారం మాట్లాడటంతో ,అరుంధతి వూరుకోలేక "కాఫీ త్రాగారా?' అంది.
    ఈ ప్రశ్నకూ ఆశ్చర్యపోతూ "ఆ! మల్లమ్మ తెచ్చిందిగా!" అన్నాడు ప్రకాశరావు.
    అరుంధతి లోలోపల ఆశ్చర్యపోయింది. తర్వాత మల్లమ్మ నడగగా వెంకటలక్ష్మీ పంపిందని తెలిసింది. అరుంధతి సంతోషంగా వెంకట లక్ష్మీ దగ్గిర కొచ్చి, "వెంకటలక్ష్మీ! నీ మేలు మరిచిపోలేను. చక్కగా అందరికీ, అన్నీ కనిపెట్టి చూస్తావు" అంది. ఈ పొగడ్తలకు వెంకటలక్ష్మీ మురిసిపోలేదు. ఆమె ముఖంలో సాధారణంగా ఏ భావోద్వేగమూ కనుపించదు. ఒక తపస్వినిలాగ ఉంటుంది. "ఇందులో అంత మెచ్చుకోవలసిందేముందమ్మా! నా పని నేను చేసాను." అంటూనే మరొక పని మీద వెళ్ళిపోయింది. అరుంధతి మనసులో ఆమెను మరొకసారి మెచ్చుకుంది.
    ఆరోజు మనోరంజని వచ్చింది. మనోరంజని తరచు అరుంధతి దగ్గరకు వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు సుందర్రావు కూడా వస్తాడు- తార ఇంచుమించు ప్రతిరోజూ వస్తుంది. మనోరంజనికి సుందర్రావు అరుంధతిని కాదని తనను చేసుకున్నాడని, తెలుసు! అందువల్ల అరుంధతి కంటే తానెంతో అందమైన దానినని అనుకొంటుంది. (కాదని అంతరాంతరాలలో ఆమెకు తెలుసు.) అరుంధతితో ఎప్పుడూ సుందర్రావు గురించే మాట్లాడుతుంది. ముఖ్యంగా తమ ప్రణయ సల్లాపాల గురించి సిగ్గుపడుతూ ,సిగ్గుపడుతూ చెప్తుంది. తార ద్వారా అన్ని విషయాలూ తెలిసిన అరుంధతి పొంగి వచ్చే నవ్వును, అతి ప్రయత్నం మీద అపుకొంటుంది.
    మనోరంజని ఈ విషయాలన్నీ తన దగ్గిర ఎందుకు చెప్తుందో అర్ధం చేసుకోలేనంత మూర్కురాలు కాదు అరుంధతి. ఆమె సుందర్రావును ప్రేమించి ఉంటె, ఆ మాటలకు కటకట పడేదేమో? కాని, ఇప్పుడామె మనోరంజని మాటలను ఆసక్తి తో వింటున్నట్లు నటిస్తూ లోలోపల నవ్వుకొంటుందంతే!
    తార వచ్చినప్పుడు అరుంధతి ప్రాణాని కెంత హాయిగా ఉంటుందో, మనోరంజని వచ్చినప్పుడంత విసుగ్గా ఉంటుంది. లేని స్నేహాన్ని నటించడం , అవసరం లేని, కృత్రిమ మర్యాదలు-- డాబు దర్పాల ప్రదర్శన -- తమకు ఏవిధంగానూ సంబంధం లేని ఎవరి గురించో ఏవో కబుర్లు ఇదంతా, అరుంధతికి చిరాకే! తప్పనిసరిగా భరిస్తుంది.
    ఇంక సుందర్రావు ప్రవర్తన మరొక రీతిగా ఉంటుంది. మనోరంజని ప్రక్క నున్నంత సేపూ , అతడు అరుంధతి తో ఎక్కువ మాట్లాడడు. అరుంధతి వంక సూటిగా చూడడు. కానీ, ఏకారణం వల్ల నైనా , మనోరంజని కాస్త దూరమయితే , (అలా జరగటం చాలా అరుదు) అతని చూపులకు తట్టుకోవటం అరుంధతికి చాలా కష్టమవుతుంది. మనసులో ఎంతో విసుక్కొంటుంది. అంతా అయిపోయిన తరువాత, ఇప్పుడిలా కళ్ళతో కోరికలు క్రక్కటం ఎందుకో? అవును! అంతకంటే ఏం చేయగలడు? తన దగ్గిర ప్రేమ ప్రస్తావన తెస్తాడా? ఏ ముఖం పెట్టుకుని? తానై అతనికి దగ్గిరవుతుందా? అదొక్కటే తక్కువ!
    "ఇవాళ భలే తమాషా జరిగింది." అంది మనోరంజని.
    "ఏమిటీ?" అడగాలి గనుక అడిగింది అరుంధతి.
    మనోరంజని సిగ్గు పడటం మొదలు పెట్టింది. అరుంధతి విసుగ్గా చూసి వూరుకుంది. తన సిగ్గు పోగొట్టేవాళ్ళెవరూ లేకపోవటం తో , తనే పోగొట్టుకొంది మనోరంజని.
    "ఇవాళ మీ యింటికి రావాలని తయారవుతున్నాను. ఇంట్లో ఎవరూ లేరు గదా, అని తలుపులు దగ్గిరగా వేసికొని బట్టలు మార్చుకొంటూన్నాను. ఎలా వచ్చారో తలుపు తోసుకొని, అల్లరిగా వచ్చి ఎదురుగా నిల్చున్నారాయన! సిగ్గుతో ప్రాణం చచ్చి పోయిందనుకో! బయటకు పొమ్మని ఎంత బ్రతిమాలినా విన్నారు కాదు. ఇంత కొంటె వాళ్ళతో ఎలా వేగటం బాబూ'!"
    మనోరంజని ముద్దుగా నవ్వుంది.
    అరుంధతి విధి లేక నవ్వింది.
    ఈ అభాగ్యురాలు , అనుభవంలోకి రాని, తన కోర్కెలకు మాటల నిచ్చి, ముచ్చట తీర్చుకోవాలనుకొంటుందా? తను కొంచెం వోపిక పట్టి, ఆమె ముచ్చట తీరిస్తే. వచ్చే నష్టమేముందీ? కాస్త తలనొప్పి వస్తుంది, నిజమే అయినా ఫరవాలేదు -- తార వచ్చి ఆ తలనొప్పి ఎగరగోట్టేస్తుంది.

 

                                
    ఇంతలో అక్కడకు వెంకటలక్ష్మీ వచ్చి, మనోరంజనికీ, అరుంధతికీ, కాఫీ ఫలహారాలు బల్ల మీద పెట్టింది. తరువాత బీరువా తెరిచి, లెటర్ పాడ్ తీసి డ్రాయింగ్ టేబిల్ మీద పెట్టి ఇస్త్రీ తువ్వాలు వాష్ బేసిన్ పైన కర్ర మీద ఉంచి వెళ్ళిపోయింది.
    వెంకట లక్ష్మీ వెళ్ళిపోయిన తరువాత, మనోరంజని అరుంధతి వంక అదొక రంకంగా చూస్తూ "ఇదంతా , ఏమిటీ?" అంది.
    "ఏముందీ? అయన సాధారణంగా పడుకోబోయే ముందు ఉత్తరాలు వ్రాస్తారు. అందుకని లెటర్ పాడ్ బల్ల మీద పెట్టింది. ముఖం కడుక్కుని బట్టలు మార్చు కొంటారు. అందుకని తువ్వాలూ, అదీ పెట్టింది."
    మనోరంజని చూపులకు ఆశ్చర్యపోతూ అంది అరుంధతి.
    మనోరంజని క్షణ కాల మాగి రహస్యం చెబుతున్నట్లు నెమ్మదిగా "ఈ పనులన్నీ, ఈవిడ నెందుకు చెయ్యనిస్తావ్? నువ్వు చేసుకోరాదా? లేకపోతె, మొగ నౌకర్లను పెట్టు--' అంది.
    అరుంధతి కి చాలా కోప మొచ్చింది. అతి ప్రయత్నం మీద తన కోపాన్నణచుకొంటూ "ఏం ఫరవాలేదు" అంది. మనోరంజని వూరుకోలేదు.
    'అలా తోసి పారేయ్యకు. అంత అందమైన అమ్మాయిని, మీ అయన పనులన్నీ చేయమన్నావ్! ఏ క్షణం లో ఏం జరుగుతుందో ? తరువాత విచారించీ ప్రయోజనం లేదు."
    అరుంధతి ఈసారి తన చికాకును దాచుకోలేక పోయింది.
    "ఆ భయం నాకు లేదు" విసురుగా అంది.
    మనోరంజని దెబ్బతిన్నట్ల యి, ఇంకేం మాట్లాడక "వస్తాన" ని వెళ్ళిపోయింది. ఎంత కాదనుకొన్నా అరుంధతి మనసామె మాటలతో పాడయింది. ఆ ప్రయత్నంగానే , వంటింటి వైపు నడిచింది. వంట పనిలో లీనమై పోయిన వెంకట లక్ష్మీ ని పరీక్షగా చూడకుండా ఉండలేక పోయింది. వెంకటలక్ష్మీ అందమైనది, నిజమే! కానీ, దాన్ని అందం అనటం కంటే తెజస్సంటే బాగుంటుందేమో! మూర్తీభావించిన వైరాగ్యంలాగుండే ఆమె నడవడీ, ప్రశాంతత నిండుకొన్న ఆమె చూపులూ గమనించిన అరుంధతి క్షణ కాలమైనా ఆమెను వేరొక దృష్టితో చూసినందుకు తనను తాను నిందించుకుంది.

                                *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS