Previous Page Next Page 
గూడు చేరిన పక్షులు పేజి 4

 

    అనుకున్న ప్రకారం ఉదయం ఏడు గంటలకు అంతా గండిపేట చేరాం. గందరగోళం...హడావుడి.....విపరీతమైన కోలాహాలం . ముఠా నాయకురాలు వాణి. ఎవరికి తోచిన ఆటలలో వారు.... ఎవరిష్ట మొచ్చిన కబుర్ల లో వారు మునిగి పోయి చిన్న చిన్న ముఠాలుగా చీలిపోయారంతా. నేను మాత్రం వాణి దగ్గరే ఉండి కావలసిన ఏర్పాట్లు చూడసాగాను.    
    'అమ్మాయి లందరూ ఫలహారాలు పూర్తీ చేసి వెళ్ళాలి.'
    బిగ్గరగా -- ఒక చిన్న ప్రకటన చేసింది వాణి --
    ఆ ప్రకటన ప్రకారం అందరూ పది నిమిషాలలో ఒకదగ్గరగా చేరారు------
    వడ్డన చురుకుగా సాగుతోంది. నేను కూడా వడ్డన లో పాల్గోని కొంతమందికి వడ్డించాను.
    'రేఖా నీకీ శ్రమ ఎందుకే...? వెళ్లి మనసామాన్ల దగ్గర స్టూలు వేసుకు కూర్చొని కాపలా కాయి .' హడావుడిగా నా చేతిలోని వడ్డన పాత్రనందుకొని తను వడ్డిస్తూ అంది వాణి.
    వాణి చెప్పినట్లు చేశాను--
    పది నిమిషాలు జాగ్రత్తగానే కూర్చొని కుక్కలు సామాన్లు ముట్టుకోకుండా జాగ్రత్త పడగలిగాను. ఆ తర్వాత యేవో ఆలోచనలు వచ్చి మనసును కలిచి వేశాయి. ఊరికే పనిలేకుండా కూర్చోవడం వల్ల మనసు చీకాకు పడింది. పనిలేని సమయాలలో ప్రసాదు నా హృదయం నిండా నిండుకొని తన స్మృతులతో గిలిగింతలు పెడుతూ ఉంటాడు.
    ఇప్పుడూ అదే జరిగింది. గతం గుర్తుకు వచ్చింది. నేను, వాణి మెడిసిన్ పూర్తీ చేసిన సంవత్సరం అందరికీ పార్టీ యిచ్చాము. అప్పుడు కూడా అందరమూ గండి పేటకే పిక్నిక్ కు వచ్చాం. ఈ రోజులాగానే అందరమూ ఉదయమే ఫలహారాలు పూర్తీ చేసిన తర్వాత జట్లు జట్లుగా విడిపోయాము. వాణి నన్ను పూర్తిగా అర్ధం చేసుకుంది. అందుకు నిదర్శనంగా మా ఒంటరి తనానికి తోడ్పడింది. నేను, ప్రసాద్ మెల్లిగా ఒక చెట్టు క్రిందకు చేరాము--
    'ప్రసాద్! తెలివి గల డాక్టరు వని పేరు తెచ్చు కుంటున్నావు. నాకెంత గర్వంగా ఉందొ తెలుసా? కొండంత -- నీ సాన్నిహిత్యంలో నేననుభవిస్తున్న ఆనంద , హాయి మాటలలో ఎలా చెప్పమంటావ్? నన్నర్ధం చేసుకోవడానికి.......'    
    నా మాట పూర్తీ కాకుండానే అడ్డు తగిలి "అమ్మాయి గారూ! నన్ను అనవసరంగా పోగిడేస్తున్నారు. మీ పొగడ్త లకి అనర్హుణ్ణి . అయినా యిందులో నా గొప్పతన మేముంది? మీ నాన్నగారి ఆదరాభిమానాలు . నాతల్లినే మరిపిస్తున్న ఆ సీతమ్మ చల్లని ఆశీస్సులు....ఆప్యాయత . వీటన్నింటినీ మించి మీరు నా పట్ల కనపరుస్తున్న శ్రద్ధ సక్తులూ, నా బోటి అభాగ్యునకు యింతకు మించిన అదృష్ట మేముంటుంది?'
    ప్రసాద్....! అటువంటి మాటలనవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నిన్ను నీవు అలా ఎందుకు కించ పరుచు కుంటావ్? నీకేం లోటు? నాన్నగారు నిన్ను అన్ని విధాలా ఆదుకున్నారు... అదుకుంటున్నారు... అదుకొంటారు. తోడుగా నేనున్నాను. ఇక చెప్పు.....! నీవు అభాగ్యుడ వెలా అవుతావు?'
    'అమ్మాయిగారూ....'
    నేను మధ్యలోనే అడ్డుపడి 'ప్రసాద్....! నీతో చనువు పెంచుకొని ఎంతో సన్నీహితురాలినయ్యాను. నీవు మాత్రం నన్ను 'గారూ!' గీరూ' అని పిలుస్తూ మన యిద్దరి మధ్యా దూరాన్ని పెంచుతున్నావు. అలా పిలవద్దని చాలాసార్లు చెప్పాను. అయినా నా మాట లెక్కచెయ్యకుండా అలాగే పిలుస్తున్నావు. నేను బాధపడడం నీకు యిష్టమా...?'
    'ఎంతమాట....! ఏదైనా సహించగలను గాని, మీరు బాధపడడం సహించగలనా? అయినా మిమ్మలనలా పిలవడం లోనే తృప్తి ఆనందం. ఈనా ఒక్క కోరిక మాత్రం కాదనకండి. మీకు దూరంగా తప్పుకుంటున్నానని కూడా అనుమానించవద్దు. నా ఈ తనువు...ప్రాణం సర్వస్వం మీవి!' అతని కనుకోలుకులలో నీళ్ళు నిలిచాయి. ముఖం దీనంగా మారింది. కృతజ్ఞత అతని ముఖంలో తాండవమాడింది.

                               


    'ప్రసాద్ ఏమిటిది? ఇంత బేలవయ్యావేం? నీ గాంబీర్యం ....ముభావం....ఏమయ్యాయి/ ఈరోజు నీ మాటలు ప్రవర్తన వింతగా ఉన్నాయే?'
    'ఈరోజు అన్ని విషయాలూ మీకు చెబుతాను...మీ నాన్నగారు నాకు చేసిన మేలు ఎన్ని జన్మల కైనా మరువలేను. ఇక మీరో ....! నా అదృష్ట దేవత . నా జీవితంలో మీరు మీ నాన్నగారు తటస్థ పడి ఉండకపోతే నేనేమైపోయి ఉండేవాడినో...? తల్లికి చిన్ననాడు దూరమయ్యాను. నాకు ప్రపంచ జ్ఞానం తెలుస్తున్న రోజులలో తండ్రి నన్ను దూరం చేసుకున్నాడు. ఆ సత్సమయంలో మీరు నాకు తటస్త పడ్డారు. తల్లి, తండ్రి , మిత్రులు సర్వస్వం మీరు, మీ నాన్నగారూ! జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పారు. నన్నింత వాణ్ణి చేశారు. నా ఈ ఉన్నతికి కారకులైన మీ నాన్నగారిని మనసులో పూజించని క్షణం లేదు నాకు. నన్ను వారి వద్దకు చేర్చిన భగవంతుని ధ్యానిస్తూ ఉంటాను ప్రతి రోజూ! వారి నుండి నన్ను జీవితాంతం వేరు చేయకుండా ఉంచాలని కూడా అధ్యానం లో ప్రార్ధిస్తూ ఉంటాను.
    'అదేమిటి ప్రసాద్! ఇందులో నాన్నగారు ప్రత్యేకంగా నీకు చేస్తున్నదేముంది? వారు మొదటి నుండీ పేద విద్యార్ధులకు సహాయపడడం అందరికీ తెలిసిన విషయమే! అందరి లాగేనే నిన్నూ చదివించారు ఎంతమంది నాన్నగారి సహాయంతో చదవడం లేదు? అందులో నువ్వొక్కడివి. పైగా నీవు ప్రతి సంవత్సరమూ ఫస్టు క్లాసులో పాసవుతూ, ఎవరి పైనా కూడా ఆధారపడి వుండకుండా నీ చదువు పూర్తీ చేసుకున్నావు.'
    'చాలండీ అమ్మాయి గారూ! నన్ను వారు అందరిని చూసినట్లు చూస్తున్నారా? లేదు....! ఇంట్లో ఉంచుకున్నారు. ఈ విషయంలో ఎన్నోసార్లు నాన్నగారితో మాట్లాడాను. ఎక్కడైనా హాస్టలు లోనో....మిత్రులతో వేరే ఉంటాననో....వారు ఏ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కన్నబిడ్డ కన్న మిన్నగా చూస్తున్నారు నన్ను. వారి ఆదరాభిమానాలు చూరగొంటున్న నేను నిస్వార్ధతతో యిక ఆ విషయం పదేపదే వారి వద్ద తీసుకు రావడం లేదు.'
    'అదేమిటి? ఇందులో నిస్వార్ధమేముంది? కనీసం నాన్నగారితో నాతొ కలిసి భోజనం చేయడాని కైనా ఒప్పుకోవు . మా భోజనాలకు ముందుగా ఎన్నడూ భోం చేసి ఎరగవు. మంచి బట్టల నిమిత్తం నాన్నగారు ఎన్నిసార్లో డబ్బులివ్వడానికి ప్రయత్నించారు. నీవు తీసుకున్నావా? హాస్టలు కన్న స్నేహితుల రూము కన్న ఎక్కువగా మా యింట్లో ఏం సుఖ పడుతున్నావ్?'
    'ఒక మనిషికి సుఖాన్నిచ్చేది పై విషయాలు కావు. ఆదరణ...ఆప్యాయత. మీ యింట ఈ రెండు కొల్లలు. మనయింటి పనివారంతా నన్ను మీతో సమంగా ఎందుకు గౌరవిస్తున్నారు? అందుకు కారణం నాపట్ల మీరు చూపుతున్న ప్రత్యెక శ్రద్ధ. నాకు అంతకన్న కావలసిందికేం ముంది?'
    'ఈ మాటలు నీ ఔదార్యానికి నిదర్శనం. ప్రసాద్....! నిన్నొక విషయం అడుగుతాను. నిజం చెప్పాలి. నేను నీకు సన్నిహితురాలనవడానికి ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటె నీవు నాకు దూరం కావాలని అంతగా చూస్తున్నావు. అవునా....? ఈ సంగతి అడగాలని ఎన్నిసార్లో ఊహించాను. అవకాశం లభించలేదు. నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. నేనంటే నీకిష్టం లేదా....నాపై అసహ్య....!"
    మృదువుగా తన వ్రేళ్ళతో నా నోరు మూశాడు ప్రసాదు. ఆవిధంగా అంత కాలం మా యింట గడిపిన అతను ధైర్యంగా నన్ను స్పృశించడం అదే తొలిసారి...ఆ స్పర్శ నన్ను వివశురాలను చేసింది.
    'ఎంత మాటన్నారు? మిమ్ముల నసహ్యించుకోవడమా? మీరు నాకు కనిపించని రోజు పిచ్చి వాడనై పోతాను. కారణం తెలియదు. నేనే పనిచేస్తూ ఉన్నా...ఏ పరిస్థితిలో ఉన్నా మీ రూపం నా మనసులో మెదులుతూ ఉంటుంది...హెచ్చరిస్తూ ....ఉంటుంది.... వెన్ను చరుస్తూ ఉంటుంది.... ధైర్యం చెబుతూ ఉంటుంది. మీ నాన్నగారి అభిప్రాయం నాకు తెలియదు. నేను మాత్రం ఎప్పుడో మీ మనస్సర్ధం చేసుకున్నాను. మీనుండి తప్పించుకు తిరగడానికి నేనంతగా నటించవలసి వస్తున్నదో మీరు గ్రహించడం లేదు. నా ప్రస్తుత పరిస్థితి మీకు తెలుసు. జీవితంలో స్థిరపడని వాడి నింకా! అటువంటి నేను ఆవేశంలో నాపై మీరు చూపుతున్న చనువు నాధారం చేసుకొని తప్పటడుగు వేసినట్లయితే సూటిగా మీ నాన్నగారికి ద్రోహం చేసిన వాడనౌతాను నలుగురూ నన్ను ద్రోహి అనడానికి ఆస్కారం ముంటుంది. దయచేసి మీరు నన్ను అర్ధం చేసుకోండి. ఈ విషయంలో యింతకు మించి నేనేం సమాధాన మివ్వగలను?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS