Previous Page Next Page 
రాక్షసీ...! నీ పేరు రాజకీయమా? పేజి 4


    "నిజానికి శ్రీ స్వామివారు ఇవాళ యిక్కడ వుండేవారుకాదు. నా ప్రార్ధనని మన్నించి యివాళ కూడా ఆగి పోయేరు. మనందరం ధన్యులం. నా గురించి ఇప్పుడు నేను చెప్పుకోడం మంచిదికాదు. అనారోగ్యంవల్ల నేను నా విధుల్ని చక్కగా నిర్వహించలేక పోతున్నానేమోనని బెంగకలుగుతోంది నాకు. నానెత్తిమీదనున్న ఈ గురుతర బాధ్యతలను ఒదిలించేసుకోవాలని నేనెంతకాలంనుంచో ఎదురుచూస్తున్నాను. కానీ నా యందు నా ప్రజలకుకున్న అభిమానం నా నిర్ణయాన్ని సాగనివ్వడంలేదు."
    "ఇవాళ మధ్యాహ్నం శ్రీస్వామివారుగూడా నా నిర్ణయాన్ని కాదంటున్నారు. నా విధి నిర్వహణలో వారి ఆశీస్సు లుంటాయని సెలవిచ్చేరు. అందుకే, అన్నాను ఈరోజు సుదినమని. కాగా..... ...ఇప్పుడిక్కడ శ్రీ స్వామివారి మౌనా నిక్కారణం నేను చెప్పగలను. మనిషి ఆలోచనలు పెడదోవన పోతున్నవని శ్రీ స్వామివారు గమనించేరు. ఇక్కడ శ్రీస్వామివారి దర్శన నిమిత్తమై చేరిన ప్రజా వాహినిలో స్వామి మనస్సుని శంకించే ద్రోహి ఎవరో చేరాడు. అందుచేతనే స్వామి మనకి చప్పున ఉపదేశం చేయడాని కిష్టపడటంలేదు. దయచేసి ఆ ద్రోహి సభా మర్యాదని పాటించడం మంచిది. ఆ ద్రోహికీ ఈ సభ యిష్టం లేకపోతే నిరభ్యంతరంగా ఈ చోటొదిలి వెళ్ళి పోవచ్చు. లేదూ, మనసు మార్చుకుని స్వామిని అనుగ్రహించవలసిందిగా కోరుకోవాలి. ఈ రెంటిలో ఏదో ఒక్కటి యిప్పుడీ క్షణంలోనే జరగడం మంచిది."
    రామదాసుగారు హెచ్చరికను పూర్తిచేసి వేయికళ్ళతో సభని కలయ జూసేరు.
    ఎంత చిన్న విషయాన్నైనా పెద్ద పరీక్షలోకి యిరికించడం వారికి అలవాటు. కీలెగిరి వాత పెట్టడం వారికి బాగా చాతవును. ఈ హెచ్చరికవల్ల మున్ముందు ఎంత ఉపయోగమో వారు గ్రహించేరు గనుకనే- ఫలితంకొరకు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
    అయిదు నిమిషాలైనా ఒక్క ద్రోహీ బయటకు నడవ లేదు సరిగదా, సభలో ఎవరికీ వాళ్ళు భయంతో నోరు నొక్కుకుని కూచోడం రామదాసు గమనించేరు.
    రామదాసు గట్టిగా శ్వాస పీల్చేరు. ఇంత ఆనందాన్ని గుండెలో నింపుకుని మళ్ళీ సుఖాసీనులయ్యేరు.
    ఒకపక్క స్వామివారి మహత్తుని ప్రశంసిస్తూ మరోపక్క తన చతురతని ప్రదర్శిస్తే ఇటు స్వామివారుగానీ, అటు ప్రజావాహిని గానీ నోరెత్తడానికి వీల్లేని ఇబ్బందిపట్ల రామదాసుగారికి మోజెక్కువ,
    తెగించి ఎవడైనా పక్షి ఎదురాడితే తగ్గ మందు రెడీచేసుకునే వుంచాడాయన.
    రామదాసుగారేధైనా సభలో ప్రసంగించడమంటూ జరుగుతే అది రాజకీయ సభ కావచ్చు; సాహిత్య సభ కావచ్చు; గాన సభ కావచ్చు; నాటక ప్రదర్శన కావచ్చు. కుస్తీలు కావచ్చు ఏదైనా ఫర్లేదు. ఆ సభకి మున్ముందు పెద్ద పరీక్ష పెట్టి అక్కడ తన బరువెంతో తెలుసుకొనిగానీ సభని సాగనివ్వరు.
    ఆ మాటకొస్తే వారికి తెలీని "విషయం" లేదు. కోళ్ళ పెంపకం మొదలు, అమెరికా ప్రెసిడెంటు వరకూ ఆయన ఏ విషయమైనా మాట్లాడగలడు. ఆయన దగ్గిర కొన్ని రికార్డు లుంటాయి. ఏ సభకి ఏ రికార్డు ఏ శ్రుతిలో వినిపించాలో ఆకళింపు చేసుకున్న ప్రజ్ఞాశాలివారు.
    స్వామివారు కళ్ళు తెరిచి రామదాసు వేపు చూసేరు. రామదాసు సవినయంగా చేతులు జోడించేరు. స్వామివారు ఏమిచేయాలో చాతగాక చిద్విలాసంగా నవ్వేరు. నవ్వి ఉపదేశం ప్రారంభించేరు.
    "హనుమంతుడు శ్రీరామ భక్తుడు అంటే, రామదాసు. హనుమంతుడు వానర జాతివాడు. పరమభక్తుడు. సాక్షాత్తు శ్రీరామ చంద్రులను గుండెల్లో దాచుకొన్న మహాభక్తుడాయన. తిమ్మాపురంలో ఆ భక్తుడున్నాడు. గనుక, తిమ్మాపుర వాసుల కొచ్చిన భయం లేదు."
    "మానవ సేవయే మాధవసేవ అన్నారు. సేవ అనే దాన్లో తృప్తికి హద్దు కూడదు. మన ప్రక్కనున్న మనిషికేం కావాలో మనం తెలుసుకోడం ప్రథమ కర్తవ్యం. తెలిసిన తర్వాత చాతనయ్యింది చెయ్యడం ముఖ్య కర్తవ్యం.
    "కర్తవ్యం-ఎవడికి వాడు బతకడం ముఖ్యం కాదు. తనతో పాటు యింకా ఎంతమంది ఎలా బతుకుతున్నారో వెనక్కి తిరిగి చూడటం ముఖ్యం....."
    శ్రీ స్వామివారు ఒక్కో ముక్కని అయిదూ పది నిమిషాలు ఆగి, మరీ చెప్పడం వల్లనేమో......పై వరుసలో అరగంటసేపు సాగింది ఉపదేశం. అదింకా ఎంతసేపు సాగేదోగాని వాన దేవుడికి వొళ్ళు మండిపోయి దబదబా వాయించి పారేయడం మూలంగా సభ అక్కడితో ఆగిపోయింది.
    వర్షంలో పరుగెత్తుతూన్న ఒక మూర్ఖుడు మరో అజ్ఞానితో అన్నాడు.
    "స్వామిగారంటే ఏంటో అనుకున్నా.....ఆకాడికి మా చిట్టిగాడి బడిపంతులు దేవసాయంగారే బెటరు. మా చిట్టిగాడి పుస్తకం నిండానీతులేగా. చదువుకోడానికి టైముండాలేగాని గురో....దేవసాయం గారి పాఠాలు.....ఏవంటావ్?"
    అజ్ఞాని భయపడుతూ, పరుగెత్తుతూనే అన్నాడు.
    "చెడు మాటాడకు. కళ్ళుపోతాయ్. వర్షం ఎక్కువవుతుంది. తొందరగా పరుగెట్టు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS