'అదేమిటన్నయ్యా అంత తేలికగా తీసేస్తున్నావు. నిన్ను ఆ యింటి అల్లుడిని చేసుకోవాలని వాళ్ళంతా ముచ్చట పడుతుంటేను......' అంది అప్పుడే లోపలికి వచ్చిన వసంత విరగబడి నవ్వుతూ.
'ఊ చాల్లెండి పిచ్చి వాగుడు. ఎవరయినా వింటే నవ్వి పోతారు.' అంటూ కసురుకున్నాడు.
'ఛ-- ఇలాంటి విషయాల్లో హాస్యం చేస్తామా -- నిజంగానే -- అవిడోకసారి పని కట్టుకుని మన ఇంటికి వచ్చింది. నువ్వు లేవు. ఈ పరీక్ష లయి పోగానే మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలను కొంటున్నాం -- అంటూ మొదలు పెట్టి చివరికి స్పష్టంగా చెప్పిన తరువాత ఇంక వూరుకుంటే బాగుండదని మా అబ్బాయి కింకా బోలెడు చదువుంది అని చెప్పింది అమ్మ. అయినా వాళ్ళు ఆశ వదులు కోలేదు. ఆయనోసారి నాన్నగారిని కూడా అడిగితె ఇప్పుడప్పుడే చెయ్యాలనుకోవటం లేదు అన్నారుట. అయ్యాక మాత్రం చదువుకో కూడదా అన్నారుట , అయన వోసారి వసంతా వాళ్ళ నాన్నగారితో -- బోలెడు కట్నం ఇస్తాం ఒప్పుకోక ఏం చేస్తారు అని వాళ్ళ ధీమా -- నువ్వెప్పుడయినా కంట బడితే ఆ అమ్మాయి నిజంగా పెళ్లి కూతురు లాగే సిగ్గుపడి పోతుంది.' అని వైదేహి అంటుంటే --
'చంపేశావు. ఆ అమ్మాయి అలా మెలికలు తిరిగి పోవటానికి కారణం ఇదా.' అనుకుని అప్పటి నుంచి ఆ అమ్మాయికి అలాంటి అవస్థ మరి పట్టకుండా జాగ్రత్త పదాలను కున్నాడు.
ఆ తరువాత కొద్ది రోజులకే జగన్మోహిని వాళ్ళ నాన్నగారికి అక్కడ్నించి ట్రాన్స్ ఫరయి పోయింది.
'ఊళ్ళో లేకపోతె మాత్రమేం వుత్తరం వ్రాస్తారేమో.' అని ఎప్పుడైనా వైదేహి అంటే,
'ఇదుగో అన్నయ్యా, నువ్వా జగన్మోహిని చేసుకున్నా మరో విశ్వ మోహినిని చేసుకున్నా నాకే అభ్యంతరం లేదు. కాని నువ్వు మాత్రం ఆ రాబోయే వదిన మోజులో పడి మమ్మల్ని మరిచి పోకూడదు. వైదేహి వాళ్ళ ల్లాగే నేనూ వో అడబడుచునే.' అనేది వసంత.
'తప్పకుండాను. మరి నీ పెళ్ళికి నా కేమిస్తావు?' అనేవాడు మురళీ.
'ఏం కావాలి?'
'పెళ్ళిలో స్నాతకం వేళ బావగారిని కాశీకి వెళ్ళ వద్దని సుధాకరం తో పాటు నేనూ బ్రతిమాలు కుంటాను లే-- నాక్కూడా వో పంచల చాపు ఇప్పించు.' అనేవాడు.
'కాశీకి వెళ్ళవద్దు బావగారూ అని నేనేం బ్రతిమాలుకోను-- వెడితే వెళ్ళండి అంటాను -- ఇంత దూరం వచ్చి పెళ్లి చేసుకోకుండా మా చెల్లాయిని వదిలి ఎలా వెళ్తాడో నేనూ చూస్తాను.' కళ్ళేగుర వేస్తూ చెల్లెల్ని వుడికించేవాడు సుధాకరం.
'పోనీలెండి కాశీకి ఎందుకు మేమిచ్చే కట్నంతో మా చెల్లాయిని కూడా తీసుకుని కాశ్మీరు కి వెళ్ళండి అని చెప్పరాదూ.' అన్నాడు మురళీ వోసారి.
'ఆ ఆ -- కట్నం ఇస్తాననుకుంటున్నావా , ఆ పప్పులెం నా దగ్గర ఉడకవు ....నాన్నగారు ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వను.' అన్నాడు సుధాకరం.
ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే మురళీ కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.
'అన్నయ్యా, నీ పెళ్ళికి వైదేహి వాళ్లతో పాటు నాక్కూడా ఆడబడుచు లాంచనాలు ఇవ్వాలి' అనేది వసంత-- ప్చ్, వైదేహి వాళ్ళ ముద్దు ముచ్చట్లు ఏం చూడ గలిగాను. అందరి అభిమానాన్ని దూరం చేసుకుని చివరికి ఈ అనుభవం రుచి చూశాను---
ఈపాటికి వసంత కి పెళ్లి అయిపోయి వుంటుంది. సుధాకరం కట్నం ఇవ్వకుండానే సంపాదించేడెమో బావగారిని-- అతను ఏం వుద్యోగం చేస్తున్నాడో, ఏ ఊరిలో వున్నారో-- వసంత కి పిల్ల లెంత మందో-- ఆమె వయస్సు ది వైదేహి ఇద్దరు బిడ్డల తల్లి అయింది. వసంత కి ఒకరో ఇద్దరో వుండే వుంటారు -- సుధాకరం కూడా పెళ్లి చేసుకుని బిడ్డా పాపతో సుఖంగా సంసారం చేసుకుంటూండవచ్చు'
'బాబూ, ఈ వీధిలో ఏ ఇల్లు....' తను చెప్పిన వీధిలోకి తీసుకొచ్చి యిల్లు గుర్తు చెప్పమని అడుగుతున్నా రిక్షా అబ్బి మాటలతో మురళి ఆలోచనలు చెదిరి పోయాయి.
అక్కడ వున్న ఒకరిద్దరిని అడిగి చివరికి ఇల్లు తెలుసుకుని రిక్షా దిగి సూట్ కేసు చేత్తో పట్టుకుని గేటు దాటి లోపలికి వెళ్లి తలుపు తట్టాడు.
కొద్ది క్షణాల తరువాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా నిలబడి వున్న వ్యక్తిని చూసి తెల్లబోయాడు మురళీ -- పోలికలు గుర్తు తెలుస్తున్నా అసలు ఆ వ్యక్తీ అవునా, కాదా, పలకరించటమా మానటమా అని తేల్చుకోలేని సందిగ్ధతతో పడిపోయినట్లు అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడి పోయాడు.
అవతల వ్యక్తీ కూడా ఇలా హటాత్తుగా అనుకోకుండా మురళీ ని చూడగలిగి నందుకు ఒక్క క్షణం సంభ్రమంగా చూసి --
'వో-- అన్నయ్యా-- ఏమిటలా చూస్తున్నావు నన్ను గుర్తు పట్టలేదా ఏమిటి?' అంది.
'పోలికలయితే వున్నాయి కాని ఆ వసంత వి అవునా కాదా అని అనుమానం వచ్చింది -- ఏమిటలా తయారయావు .' అతని మాటలలో ఆత్మీయత వుట్టి పడుతోంది. మాట్లాడుతూనే వసంత వెంట లోపలికి నడిచాడు.
'బలేవాడివే -- ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రిందట చూశావు -- ఇంకా అలాగే వుంటా ననుకున్నావా? పెద్దదాన్నయి పోలేదు.' వసంత నవ్వుతూ మాట్లాడుతూన్న ఆ మాటలలో ఆ గొంతు లో ఏదో వెలితి వుందని పించింది మురళీకి.
'ఎవరే వచ్చింది?' పెరట్లోంచి కామాక్షమ్మ గారి గొంతు వినిపించింది.
'మురళీ అన్నయ్య' అని పెరట్లోకి వినిపించేలా గట్టిగా చెప్పి, బూట్లు విడుచుకుని పెరట్లోకి రా కాళ్ళు కడుక్కుండువు గాని' అని మురళీ కి చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వసంత --
వెళ్ళిపోతున్న వసంత నొ సారి పరీక్షగా చూశాక మళ్లీ అదేమాట మరోసారి అనుకున్నాడు.
'వసంత ఇలా అయోపోయిందేమిటి ?' అని.
'బొద్దుగా మిసమిస లాడుతుండే వసంత చిక్కి శల్యమై పోయింది-- ఆ పచ్చటి పసిమి చాయ ఏమయి పోయిందో బాగా నల్లబడి పోయింది. చిలిపిగా, ఆనందంగా ఇటూ అటూ కడులుతుండే చూపులలో అంతులేని ఆవేదన గూడు కట్టుకున్నట్లుంది-- మాటలలో ఏదో గంభేర్యం తెచ్చి పెట్టుకున్న సంతోషం తప్పితే అదివరకులా చురుకుదనం లేదు. ఎందుకిలా వుంది వసంత -- ఈ మధ్యే ఏదైనా సుస్తీ పడి లేచిందా -- అసలు వసంత కి పెళ్లయిందా -- కట్నం ఇవ్వరూ అని సుధాకరం నిజంగానే భీష్మించు కుని కూర్చుంటే ఏ సంబంధమూ కుదరలేదేమో-- తండ్రి లేనే లేడు వున్న అన్నగారు ......'
'ఏం రా, ఇన్నాళ్ళ కి జ్ఞాపకం వచ్చామా?' నిద్ర మత్తు పూర్తిగా వదల కుండానే లేచి వచ్చిన సుధాకరం ఆప్యాయంగా మురళీ భుజం తట్టి ప్రక్కన కూర్చున్నాడు.
'ఏం బాబూ , ఎక్కడ్నించి రావటం ? అమ్మా వాళ్ళూ అంతా కులాసాగా వున్నారా ' అని పలకరించింది కామాక్షమ్మ గారు వచ్చి.
అందరికీ తోచిన సమాధానాలు చెప్తూ ఘూ విప్పి బల్ల క్రిందికి తోశాడు మురళీ .
'లోపలోకి పద -- మొహం కడుక్కుందాం' అంటూ మురళీ సూట్ కేసు తీసుకెళ్ళి గదిలో పెట్టి వచ్చాడు సుధాకరం.
ఆ తరువాత కాఫీలు అందిస్తున్న సుగుణ ని పరిచయం చేసింది కామాక్షమ్మ గారు, 'మా కోడలు -- నువ్వు సుధా పెళ్ళికి వస్తావని ఎంతో అనుకున్నాం. రానేలేదు-- అన్నట్లు, ఇంకా నీ పెళ్లి శుభలేఖ అండనే లేదు, మాకెవరికీ చెప్పకుండా చేసుకున్నావా లేకపోతె ఇంకా పెళ్లి కానేలేదా --....."
'ఏదో హడావిడిగా అయిపొయింది. ఎవ్వరికీ ఉత్తరాలూ, శుభలేఖ లు పంపే వ్యవధి లేక పోయింది.' తను చెప్తున్నది నిజమవునో కాదో తనకే నమ్మకం లేనట్లు ఏదో గొణిగేశాడు మురళీ.
అయితే అక్కడ వున్న మనుష్యులు అతని ధోరణి ని అర్ధం చేసుకునే స్థితిలో లేరు-- ఆ యింటి నంతటి ని ఏదో ఆస్థిమితం , దిగులు అవరించినట్లుగా వుంది. మురళీ ఏదో అడగబోతుంటే కామాక్షమ్మ గారే అంది.
'మా కోడలు పేరుకే కాదు నిజంగా సుగుణాల ప్రోవు....ఇంటి బాధ్యత అంతా తనే చూసు కుంటోంది...నేను.....'
'అదే, మీరు బొత్తిగా యిలా వున్నారేమిటి? ఈ మధ్యే ఏదైనా జబ్బుపడి లేచారా -- వసంత కూడా అసలు గుర్తు పట్టలేనంత గా చిక్కిపోయింది...'
'ఏం చెప్పమంటావు నాయనా ....ఆ వసంతమ్మ ని గురించే నా దిగులంతా-- నా ఆరోగ్యాని కేమిటి ఎలాగా పెద్ద దాన్నయి పోయాను. ఇవాళో రేపో రాలిపోవలసిన దాన్నే....దాని నుదుట దేముడు ఏం రాసి పెట్టాడో తెలియటం లేదు.' అంటూ కళ్ళు ఒత్తుకుంది కామాక్షమ్మ గారు.
'ఏమయింది?' మురళీ భయంగా, కుతూహలంగా అడిగాడు.
ఏదో చెప్పబోయిన సుధాకరం వసంత అక్కడికి వస్తున్నా అలికిడి కావటంతో 'అదంతా వో పెద్ద గాధ -- తరువాత చెప్తాలే -- పద స్నానం చేసి కూర్చుందాం -- నీతో చాలా చెప్పాలి .' అని లేచాడు సుధాకరం-- మురళీ అతనితో పాటే లేచాడు.
'నన్ను ఏవో పెద్ద చదువులు చదివించాలనీ, చెల్లాయి కి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న సమయంలో హటాత్తుగా నాన్నగారు కన్ను మూయటం నీకు జ్ఞాపకం ఉందను కుంటాను' కాస్సేపటి తరువాత సంభాషణ కి వుపక్రమిస్తూ అన్నాడు సుధాకరం -- అతని గదిలో వాళ్ళిద్దరూ కూర్చుని వున్నారు -- 'ఆ -- గుర్తు లేకేం?' అన్నాడు మురళీ.
అప్పటికి నేను బియ్యే పరీక్షలు-- చెల్లాయి ఎస్.ఎస్. ఎల్. సి పరీక్షలు వ్రాశాము......
తండ్రి పోయిన కొద్ది రోజులకే వాళ్ళ రిజల్స్ తెలిశాయి. ఇద్దరూ పరీక్ష ప్యాసయ్యారు. తరువాత ఏం చెయ్యాలి. అసలు ఎక్కడ వుండాలి అన్న సమస్య ఆ యింట్లో వున్న ముగ్గురికీ ఎదురయింది.
