Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 48


                                  19

    అలా కళ్యాణి తో ఘర్షణ పడి తెగతెంపులు చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన మురళీ ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడిలా కాస్సేపు ఇటూ అటూ తిరిగి చివరికి రిక్షా ఎక్కి వో హోటలు కి వెళ్లాడు.
    ఆ రాత్రి అతనికి నిద్ర పట్టనట్లు 'నాకు ఎదురయిన సమస్యకి ఒక పరిష్కారం అలోచించి దానిని ఆచరణ లో పెట్టాక కూడ అవే ఆలోచనలు నన్నెందు కిలా వెంటాడు తున్నాయి -- ఎందుకని , నా మనస్సుకి శాంతి అనేది లేకుండా చేస్తున్నాయి.' అని పదే పదే తనలో తను ప్రశ్నించు కుంటే చివరికి దొరికిన సమాధానం ఒక్కటే.
    'రెండు సంవత్సరాల పాటు భార్యాభర్తలుగా బ్రతికిన వ్యక్తులు విడిపోవటం అంటే -- దానికి కారణాలు ఏదైనా కాని, గత సాంగత్య ప్రభావం మనిషి మనస్సు మీద కొద్దో గొప్పో వుండక మానదు. అనిపించింది.
    'హు, రెండు సంవత్సరాల పాటు ఒకలాంటి మత్తులో పడిపోయినట్లే బ్రతికాను. ఎప్పటి కప్పుడు ఎన్ని అనుమానాలు వచ్చినా అన్నింటిని సమర్దించుకుని సంసారం సాగిస్తూ వచ్చాను. అలాంటి వ్యక్తీ కోసం, అయిన వాళ్ళందర్నీ వదులు కున్నాను. కన్న తల్లితండ్రులకి దుఃఖం కలిగించాను. చివరికి నాకు మిగిలింది దుఖమే. అశాంతే' అనుకున్నాడు.
    'ఇప్పుడు ఏం చేయ్యాలి -- తెల్లవారి లేచిన తరువాత కార్యక్రమం ఏమిటి.' అనుకుంటూ రాత్రంతా అలోచించి, చివరికి కొన్నాళ్ళ పాటు ఎటైనా తిరిగి రావాలని నిర్ణయించు కున్నాడు.
    తెల్లావారాక ఆఫీసుకి వెళ్లి ఒక నెల రోజులకి శలవు శాంక్షను చేయించుకున్నాడు-- అప్పటికీ తిరిగి రావాలనిపించక పొతే ఎక్కడి నుంచయినా వుత్తరం వ్రాస్తాను శలవు పొడిగిస్తూ అనుకున్నాడు.
    స్టేషను కి వెళ్లి బెంగుళూరు కి టిక్కట్టు కొనుక్కున్నాడు.
    ఆ రాత్రి రైలు ఎక్కుతుంటే కళ్యాణిని వదిలేసి వచ్చి సరిగ్గా ఒక్కరోజు అయింది అనిపించింది --
    బెంగుళూరు లో వారం రోజులున్నాడు-- లాల్ బాగ్ కబ్బన్ పార్కులనీ అయిదారు సార్లు చుట్టి వచ్చాడు. కపాలిదియేటరు లో సినిమా చూశాడు -- అక్కడ నుంచి మైసూరు వెళ్లాడు. చాముండీ దేవాలయం బృందావన్ గార్దేన్సు చూసి ఇంక ఎక్కడికీ వెళ్లాలనిపించక హోటల్ గదిలోనే కాలక్షేపం చేస్తూ వో వారం రోజులు గడిపాడు. ఆ తరువాత ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు-- మీకు వోపిక వుండాలి కాని చూడాల్సిన ప్రదేశానికి లోటు లేదు, అని చుట్టూ ప్రక్కల అన్నారెవరో . ఆయినా ఎక్కడికి వెళ్ళాలనిపించక తిన్నగా మద్రాసు వచ్చాడు-- తనకి చాలా సరదా  అయినది, అనుకున్న దగ్గరల్లా     సముద్రపు ఒడ్డు -- సాయంత్రాల మెరీనా బీచ్ లో గంటల కొద్ది కూర్చుని గడిపాడు -- అయినా అది వరకులా ఏమాత్రం సరదాగా వుత్సాహంగా వుండటం లేదు....ఏ ఊరు , ఏ ప్రదేశమూ అతనికి ఆసక్తి కలిగించలేకపోతున్నాయి.
    'నా జీవితం ఒక మలుపు తిరిగి పోయింది-- ఊహు ఆ మలుపు పూర్తిగా దాటి అవతలకి ఇంకా వెళ్ళలేదు నేను-- సరిగ్గా వో మలుపులో నిలబడి వుండగా కాలం స్తంభించి, జీవితం ఆగిపోయి నట్లు వుంది నా బ్రతుకు ఇప్పుడు....ఈ మలుపు దాటిపోతే అవతల వుండే బాట ఎలాంటిదో కాస్త కూడ కనిపించటం లేదు. ....కనిపించక పోయినా ఫరవాలేదు. అది ఎలాంటిదయినా సరే నేను ఇంతకూ ముందు నడిచి వచ్చిన బాట కంటే అందమయినది సాఫీ అయినది అని మాత్రం నాకు నమ్మకం వుంది...అది చేరుకునే లోపునే ఈ మలుపు దాటటమే కొంచెం కష్టం  అది కాస్త నేర్చుకోవాలి.' అని తనకి తనే ధైర్యం చెప్పుకున్నాడు.

                                                
    ఇంక మద్రాసు లో వుండాలని పించలేదు-- ఎక్కడికి వెళ్ళాలి. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తేనొ అని వోసారి అనుకున్నాడు. ఉహు నాకు మొహం చెల్లదు అని మరోసారి అనుకున్నాడు. ఏదీ తేల్చుకోలేని స్థితి లోనే వో ఫ్రెండు కనిపిస్తే అతని దగ్గర అయిదు వందల రూపాయలు అప్పు తీసుకుని-- తరువాత కలకత్తా కి టిక్కెట్టు కొనుక్కుని మైలు యెక్కి కూర్చున్నాడు-- ఎడతెరిపి లేకుండా ఆలోచనలు వస్తూనే వున్నాయి.
    అలా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో టైము తెలియలేదు కాని, రైలు వచ్చి విజయవాడ ప్లాటుఫారం మీద ఆగటం, కాఫీ సోడా పళ్ళూ ఫలహారాలు అమ్మే వాళ్ళ రణ గణ ధ్వని, ప్రయాణీకుల  కోలాహలం వీటితో ఒక్కసారి ఈ లోకం లోకి వచ్చినట్లయింది.
    క్రిందికి దిగి వెళ్లి పుస్తకాలే మైనా కొనుక్కుని తెచ్చుకుందామని లేవబోయిన అతనికి హటాత్తుగా గుర్తు వచ్చింది. 'ఇది సుధాకరం వాళ్ళ వూరు. అతను ఇక్కడే మునిసిపల్ ఆఫీసులో వుద్యోగం చేస్తున్నాడు.' అని తట్టగానే అక్కడ దిగి వాళ్ళందర్నీ చూడాలని పించింది.
    సుధాకరం వాళ్ళ నాన్నగారు అమలాపురం లో పనిచేసే రోజులలో వాళ్ళు మురళీ వాళ్ళ ఇంటి ప్రక్కనే వుండేవారు. ఇరుగుపొరుగు అన్న పరిచయం ఒక్కటే కాకుండా మురళీ సుధాకరం క్లాసు మేట్సు, ఒక క్లాసు కావటంతో ఆ రెండు కుటుంబాల మధ్య బాగా స్నేహమూ, చనువూ ఏర్పడ్డాయి-- వసంత మురళీ ని అన్నయ్యా అని పిలిచేది. ఇటు వైదేహీ కుసుమా వాళ్ళంతా కూడా సుదాకరాన్ని అన్నయ్యా అని పిలిచేవాళ్ళు-- అలా నాలుగైదు సంవత్సరాలు ఒక్క కుటుంబం లా మెలిగిన ఆ రెండు కుటుంబాలు సుధాకరం వాళ్ళ నాన్నగారు చనిపోవటం తో విదిపోవలసి వచ్చింది-- సుధాకరం వాళ్ళకి విజయవాడ లో వో చిన్న ఇల్లు వుంది--
    స్వంత ఇంట్లో కాలక్షేపం చేస్తూ సుధాకరం నెమ్మదిగా వుద్యోగాని కి ప్రయత్నించుకో వచ్చునని ఆ కుటుంబం అమలాపురం నుండి విజయవాడ వచ్చేసింది -- అప్పటికి సుధాకరం మురళీ కూడ బియ్యే పరీక్షలు వ్రాశారు. ఆ తరువాత సుదాకరానికి అక్కడే వుద్యోగం దొరికిందని తెలిసింది--
    ఇప్పుడు ఒక్కసారి వెళ్లి వాళ్ళని చూడాలని పించింది మురళీ కి-- ఇంకా ఈ వూళ్ళో నే ఆ వుద్యోగం లోనే వున్నాడా అనే సంశయం వోసారి తల ఎత్తినా అంతగా లేకపోతె మరో రైల్లో వెళ్లిపోవచ్చు అనుకుని సూట్ కేసు చేతిలోకి తీసుకుని రైలు దిగి ఇవతలకి వచ్చి, టికెట్ మీద బ్రేక్ జర్నీ కి వ్రాయించుకుని బయటికి వచ్చి రిక్షాలో కూర్చున్నాడు.
    రిక్స్జా కదిలి పోతోంది-- అతని మనస్సులో చిన్ననాటి దృశ్యాలు తిరిగి పోతున్నాయి.....
    వైదేహి స్నేహితురాళ్ళ ఎవరెవరో చాలా మండే వచ్చేవారు వాళ్ళ ఇంటికి. వసంత లా అన్నయ్యా అన్నయ్యా అని పిలుస్తూ చనువుగా వుండక పోయినా ఏదో అవసరం మేరకు మురళీ తో కూడా మాట్లాడేవారు చాలామంది-- అందులో ఒక అమ్మాయి మాత్రం అతన్ని చూడగానే పాము మెలికల లా ఒళ్ళంతా తిప్పేసుకుని అదో లాంటి బిదియంతో ముడుచుకు పోతూనే వోరగా అతని వంక చూడటానికి తాపత్రయ పడేది. అది గ్రహించిన మురళీ కి 'ఏమిటీ ఈ అమ్మాయి వాలకం .' అనిపించి విసుగూ నవ్వూ కూడ వచ్చేవి.....
    వో సాయంకాలం జాజి పువ్వులు మాల కట్టుకుంటూ మధ్య హల్లో చాప మీద కూర్చుంది. వైదేహీ, మురళీ కూడ చెల్లెలి ప్రక్కన కూర్చుని ఖబుర్లు చెప్తున్నాడు. మధ్య మధ్య జాజి మొగ్గలు చేతిలోకి తీసుకుని వాటి పరిమళాన్ని అఘ్రాణి స్తూ -- సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి వైదేహీ స్నేహితురాళ్ళ మీదికి మళ్ళింది.
    'మా జగన్మోహిని నువ్వంటే పడి చస్తుందన్నయ్యా....' అంది వైదేహీ వున్నట్లుండి.
    మురళీ కనుబొమలు ముడుచు కున్నాయి. చేతి వెళ్లు కసిగా బిగుసుకు పోతుంటే అతని గుప్పెట లో వుండిపోయిన జాజులు విలవిల్లాడి పోయాయి. 'ఎవరా జగన్మోహిని?' అన్నాడు రోషంగా చెల్లెలి వంక చూస్తూ.
    వైదేహీ మోకాలి మీద గడ్డం ఆనించి తల వంచుకుని నవ్వుకొంటూ అంది. 'అదే ఆ ఇనస్పెక్టరు గారి అమ్మాయి -- మొన్న వాళ్ళు వూతచుట్టాలు పంపించలేదూ? చాలా బాగున్నాయని మరోటి అడిగి వేయించుకుని తిన్నావు కూడ.'
    అతను ఊత చుట్టలు తిన్న మాట నిజమే కాని ఆ అమ్మాయి యెవరో మాత్రం గుర్తు రావటం లేదు. 'సరిగ్గా చెప్పూ -- ఊరికే తికమక పెట్టి చంపక.' అన్నాడు ఇంకా విసుగ్గా.
    వైదేహీ మరి కొన్ని వివరాలు చెప్పాక ఆ అమ్మాయి యెవరో గుర్తు వచ్చింది. 'నల్లగా పొట్టిగా వుంటుంది....ఎలక తోకల్లా రెండు జడలూ ....చచ్చాం పో....ఆ పిల్ల పేరా జగన్మోహిని...ప్చ్....వాళ్ళ నాన్నగారికి ఆ పిల్లకి ఆ పేరు పెట్టి అంత చక్కటి పేరుని యిలా అవమానం చెయ్యటానికి ఎలా మనసోప్పిందో ...నిజం చెప్తున్నాను...అలనాడు ఆ జగన్మోహిని ఇదే రూపంలో సాక్షాత్కరించి వుంటే నాలాంటి దేవతలంతా అమృతానికి కూడా ఆశ పడకుండా లేచి చక్కా పోయేవాళ్ళు' అని అతను అంటుంటే,


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS