Previous Page Next Page 
ఆచరణ లో అభ్యుదయం పేజి 50


    బెజవాడ లో చిన్నదే అయినా వో ఇల్లు వుంది వాళ్ళకి-- సుధాకరం వాళ్ళ నాన్నగారు ఉద్యోగ రీత్యా ఆ వూరు ఈ వూరు తిరుగుతుండటం అద్దెకున్న వాళ్ళు స్వంత ఇల్లు కట్టుకుని 'వెళ్ళిపోతున్నారుట , ఇల్లు ఖాళీ చేస్తున్నాం అంటూ వుత్తరం వ్రాశారు-- ఆ వుత్తరం చూడగానే ,
    'సరే-- ఈ వూళ్ళో ఈ అద్దె ఇంట్లో ఇక్కడ మనకేం పని వుంది. బెజవాడ వెళ్ళిపోదాం -- తల దాచుకోటానికి ఆ ఆధారం అయినా వుంది కదా. అక్కడే వుండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.' అనిపించిందా ముగ్గురికీ.
    అలాగే వో రోజున బయలుదేరి వచ్చేశారు ఇల్లు చిన్నదే అయినా డబ్బు అవసరం వుంది కనక దాంట్లో నే వో చిన్న భాగం లో వాళ్ళు వుంటూ మరో భాగం అద్దె కిచ్చి కాలక్షేపం చేస్తూ సుధాకరం ఉద్యోగ ప్రయత్నాలలో పడ్డాడు. ఉద్యోగం దొరకటం అంటే మాటలా -- ఎన్ని చోట్ల కి అప్లికేషన్లూ పెట్టినా ఎంతమందిని ప్రాధేయపడినా ఒక సంవత్సరం తిరిగేదాకా అతనికే వుద్యోగమూ దొరకలేదు. ఈలోగా డబ్బుకి చాలా ఇబ్బంది పడటమూ, అక్కడా అక్కడ అప్పులు చెయ్యడమూ కూడా తప్పలేదు. ఆ తరువాతయినా సుధాకరా నికి వచ్చే జీతం అంతంత మాత్రం. దాంతో ఇల్లు గడవాలి, క్రమంగా పాత అప్పులు తీర్చాలి -- ఇంకా చెల్లెలి పెళ్లి చెయ్యాలి -- ఈ చికాకులు చాలవన్నట్లు అద్దె కున్న వాళ్ళు మరో కొత్త సమస్య తెచ్చి పెట్టారు. ఇంటికి చాలా కాలమయి బాగులు చేయించలేదు. గోడలు పెళ్లలు రేగి పోతున్నాయి-- నేలగచ్చు ఊడి వచ్చేస్తోంది-- ఆ బాగులు చేయించి యింటికి సున్నం వేయిస్తే నే యిందులో వుంటాం లేకపోతె ఖాళీ చేసేస్తాం' అన్నారు.
    'మరి కొద్ది రోజులు వోపిక పట్టండి-- కాస్త డబ్బు సర్దుబాటు చేసుకుని ఆ పనులన్నీ చేయిస్తాం.' అని వాళ్ళని బతిమాలుకుని ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చినంత పనయింది.
    ఆ రోజుల్లోనే వసంత చెవిని వో వార్త వేసింది వాళ్ళ స్నేహితురాలు-- 'వో అఫీసులో గుమస్తా ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి-- మనకున్న క్వాలిఫికేషన్ చాలు. అప్లై చేద్దాం' అంటూ వసంత ని ఉసి కోల్పింది.
    మరోకప్పుడైతే ఆడపిల్ల ఉద్యోగం చెయ్యాటానికి కామాక్షమ్మ గారు అంగీకరించేది కాదు. కాని ఆ సమయంలో అన్ని వేపుల నుంచీ మీద పడబోతున్నట్లున్న ఇబ్బందులూ, ఈ స్థితిలో అప్పు చేసి అమ్మాయి పెళ్లి చెయ్యాలని వాడిని బలవంతం పెట్టటం న్యాయం కాదు, అమ్మాయి వుద్యోగం లో చేరితే దాని జీతం వెనకేసి ఆ డబ్బుతోనే అమ్మాయి పెళ్లి చేసెయ్యవచ్చు అన్న ఆలోచనా అనక 'ఊ' అనేలా చేశాయి.
    మరో ఏడాది గడిచింది. కామాక్షమ్మ గారు అనుకున్నట్లు వసంత జీతం అంతా బ్యాంకి లో దాచటానికి వీలు కాలేదు. కాని నాలుగైదు వందలు మాత్రం మిగిలాయి -- ఇలా ఎన్నాళ్ళు ఉద్యోగం చేయించి దీని పెళ్లి చేస్తాం, ఈ ఆలోచన అక్కరకు వచ్చేది కాదు. మనమే ఏ అప్పో చేసి ఆ మూడు ముళ్ళూ వేయించి అమ్మాయిని పంపించేయాలి, అని కామాక్షమ్మ గారు మధ్య మధ్య కొడుకుతో చెప్తూనే వుండేది.
    వాళ్ళు అట్టే ప్రయత్నం చేయ్యఖర్లె కుండానే వో సంబంధం వచ్చింది.
    పెళ్లి కొడుకు మూర్తి కి ఆ వూళ్ళో నే వుద్యోగం. నెలకి నూట యాభై తెచ్చు కుంటున్నాడు -- తండ్రి లేడు -- తల్లీ, ఇద్దరు చెల్లెళ్లు వున్నారు-- వెనక ఆస్టి ఏమీ లేదు. అందరికీ అతని జీతమే ఆధారం. అలాంటి స్థితిలో ఆ యింటికి రాబోయే కోడలు కూడ కాస్త సంపాదించ గలిగేదయితే చన్నీళ్ళ కి వేన్నీళ్ళు తోడుగా గడిచి పోతుంది అన్న అభిప్రాయం ఒకరిద్దరి దగ్గర వ్యక్తం చేశాడుట మూర్తి.
    'మనమ్మాయి ఎలాగూ వుద్యోగం చేస్తూనే వుంది -- పెద్దగా కట్నం ఆశ లేదు వాళ్ళకి-- అమ్మాయికీ, అబ్బాయికీ ఈడూ జోడూ బాగా కుదిరింది ' అని కామాక్షమ్మ గారూ సుధాకరం అలోచించి వసంత అంగీకారం కూడా తీసుకుని పెళ్లి చేశారు.
    కట్నం అంటూ ఏమీ లేకపోయినా చిన్న చిన్న బహుమతుల కీ పెళ్లి ఖర్చుకీ యింట్లో వున్న డబ్బు కాక మరో వెయ్యి రూపాయలు అప్పు అయింది.
    పెళ్లి కాగానే వసంత అత్తవారింటికి వెళ్ళిపోయింది --
    ఇంట్లో వంటా వార్పూ అంతా చూసుకుని, వేల్టికి కొడుక్కీ కోడలికి కంచం అన్నం వడ్డించి ఆఫీసులకి పంపించే అత్తగారిని చూస్తుంటే వసంత కి మొదట్లో చాలా అభిమానంగానే వుండేది. అయితే తను నెలంతా కష్టపడి సంపాదించి ఒకటో తారీకున జీతం అందుకుని సాయంకాలం ఇంటికి రాగానే భర్త అణా పైసలతో సహా లెక్క అడిగి జీతం-- అంతా తీసుకోటం ఏ రోజు కారోజు బస్సు ఖర్చులకి లెక్క పెట్టి చిల్లర డబ్బులు ఇవ్వటం వసంత కి ఎలాగో వుండేది.
    'ఈ డబ్బు నా కష్టార్జితం -- నా ఇష్టం వచ్చినట్లు వాడుకునే హక్కు లేదా -- నేనయినా ఇంటి ఖర్చుకి ఏమీ ఇవ్వనన లేదే-- నా డబ్బులో ఒక అయిదు రూపాయలు పెట్టి నాకు నచ్చిన జాకెట్టు కొనుక్కునే స్వతంత్రం లేదా -- ప్రోద్దున్ననగా టిఫిన్ డబ్బాలో పెట్టి తీసుకు వెళ్ళిన మజ్జిగ అన్నం మధ్యాహ్నం ఆఫీసులో తినాలనిపించక పొతే, హోటలు నించి ఒక్క అర కప్పు కాఫీ తెప్పించుకుని తాగగలిగే తాహతు లేదా ....సాయంకాలం ఇంటి,కి వెళ్తుంటే రోడ్డు మీద పూల దుకాణాల లో గుట్టలుగా పోసిన గువ్వల్లాంటి మల్లె మొగ్గ లని చూసి మనస్సు ముచ్చట పడితే కొనుక్కోటానికి చేతిలో పది పైసలు కూడా వుండవే -- ఏమిటీ బ్రతుకు ?' అనిపించేది ఎన్నోసార్లు.
    అయినా ఎప్పటికప్పుడు 'ఫరవాలేదు, కొన్నాళ్ళు మేమిద్దరం యిలా కష్టపడి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేసేసి పంపించేస్తే ఇంక వారూ నేనూ అత్తయ్యా మిగులుతాం ఇంట్లో-- మా యిద్దరి సంపాదనతో మేం ఇంతకన్నా హాయిగా వుండొచ్చు.' అని మనసుకి నచ్చ చెప్పుకునేది.
    వసంత పెద్దాడబిడ్డకి ఇరవై ఏళ్ళు దాటాయి. మెట్రిక్ ప్యాసయింది. దొరికితే ఉద్యోగం చెయ్యాలని వుబలాట పడింది కాని ఏదీ దొరకలేదు. ఉత్తినే గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చునే కూతుర్ని చూస్తె వసంత అత్తగారికి గుండెల మీద కుంపటి రగులు తున్నట్లే వుండేది. అమ్మాయికి ఏళ్ళు మీరి పోతున్నాయి. పెళ్లి చెయ్యాలి అని తొందర పెట్టింది కొడుకుని. మూర్తి చెల్లెలికి ఎలాగో   వో సంబంధం తెచ్చాడు. తను ఆఫీసులో అప్పు తీసుకొచ్చాడు. వసంత చేత కూడా ఆఫీసులో లోన్ కి అప్లయి చేయించాడు. ఆ ఫారాలా మీద సంతకం పెడుతుంటే వసంత చేతులు వణికాయి, మనస్సు ఎలాగో అనిపించింది. అయినా పైకి ఏమీ అనలేదు.
    ఇద్దరి ఆఫీసుల నుండి తెచ్చిన డబ్బుతో పెద్ద చెల్లెలి పెళ్లి చేశాడు మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS