చివ్వున వెనక్కి తిరిగింది.
"రెడ్ హండెడ్ గా పట్టుబడిందిట.... మనముందు పతివ్రతలా నటన" రోజూ తనకి చిరునవ్వుతో విష్ చేసే రామేశం అంటున్నాడు.
"మిస్టర్ రామేశం!' అనూరాధ కంఠం లో డైనమెట్ పేలిన ధ్వని.
"దేర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ యాస్ అండ్ హార్స్ యు జస్ట్ డిసైడ్ వెదర్ యూ ఆర్ ఏస్ యాస్ ఆర్ హార్స్"
అతను తేరుకునేలోగా అనూరాధ ఆటోలో ఉంది.
తట్టుకోలేని వాతావరణం.
కళాకారిణి భావుకురాలు... స్నేహమయి...ప్రేమమయి.... అనూరాధ భరించలేని వాతావరణం.... ఆ విష వాయువుల ప్రభంజనం లో చిగురుటాకులా అనూరాధ.
అనూరాధలాంటి స్త్రీ వంటరిగా బ్రతక్కూడదు. అందంగా అలంకరించుకోకూడదు. ఎవరితో నవ్వుతూ మాట్లాడకూడదు. మగవాళ్ళతో అన్నగానీ, తమ్ముడు గానీ, స్నేహితుడు గానీ, పరిచయస్తుడు గానీ, ప్రియుడు గానీ , బావ గానీ , మరిది గానీ, ఆఖరికి గడ్డాలు, మీసాలూ వచ్చిన కొడుకైనా సరే.... వాళ్ళతో వంటరిగా స్కూటర్ ల మీద ఎక్కడికీ వెళ్ళకూడదు. ఎంత గొప్ప సమాజం ఇది? ఎంత సంస్కారం ఈ మనుషుల్లో?
ఆడదాని కన్నీటికి కారణం అడగని ఈ జనాలు చిరునవ్వుకి సవాలక్ష ప్రశ్న లేస్తారు.
ఓ ఆడది భర్త పెట్టె చిత్ర హింసలు భరిస్తూ కాపురం చేస్తేనో, ఆత్మహత్య చేసుకుంటేనో సానుభూతి చూపుతారు. ఆమె అతణ్ణి వదిలేస్తే చెడి పొయిందంటారు.
ఎంత చిత్రమైన స్వభావాలివి?
మెళ్ళో సూత్రాలు... కాళ్ళకు మట్టెలు ధరించి వ్యభిచారం చేస్తే కూడా పతివ్రతంటారు.
అవేమీ లేకుండా ఒఅ మగవాడ్ని ప్రేమించి, అతనికే కట్టుబడి ఉండి... అతనే లోకంగా అతనే దైవంగా భావించి బ్రతికితే అ ఆడది పతిత.... ఉంపుడుగత్తె.
ఆడది తనకోసం తను బ్రతకకూడదు. ఈ సమాజం కోసం సమాజం నిర్డేశించిన విధంగా బ్రతికితేనే మంచిది.
నో! తను అలా బ్రతకదు. పెళ్ళి అనే అర్ధం లేని తతంగం తో ఓ మగవాడికి బానిసై బ్రతికే కన్నా నచ్చిన వ్యక్తికీ స్నేహితురాలిగా , ప్రేయసిగా బ్రతకడమే తన కిష్టం. అవును- ఈ జీవితం తనది. తనకిష్టం వచ్చినట్టు బ్రతికే అధికారం తనకుంది. వీళ్ళంతా ఎవరు తనని శాసించడానికి- ప్రశ్నించటానికి - కట్టడి చేయటానికి.
ఆనంద్ తో తను కలిసి తిరిగిందని -- కలిసి బ్రతుకుతోందని వావీ వరసలు లేకుండా ఇంటి కొచ్చిన ప్రతి మొగాడి తోసంబంధం అంటగడతారా?
రెడ్ హాండెడ్ గా పట్టుకున్నాట్ట అ మొనగాడు.
ఈ కోజ్జలు మురిసిపోతున్నారు.
రెడ్ హాండెడ్ అంటే? తను ఎవరివరితోనో పడుకుని ఉండగా పట్టి కెళ్ళారా? అణాకానీ వెధవలు, విష యావగాహన లేకుండా అనేయడమే.
అసలు స్టేషన్ లో ఏం జరిగిందో ! ఇన్ స్పెక్టర్ 'వాడిని' ఎలా బూతులు తిట్టాడో వీళ్ళకి తెలీదు. తను స్టేషన్ కి వెళ్ళిందనే తెలుసు. సంస్కారం ఉంది కాబట్టి ఆ ఇన్ స్పెక్టర్ "వాడ్నే' తిట్టి మళ్ళీసారి వస్తే కాళ్ళు విరగ్గోడతానని పంపించాడు.
దానిని కధలు కధలుగా అల్లుతున్నారు ఈ గ్రంధ కర్తలంతా. తనని అప్ట్రాల్ వీళ్ళంతా వెలేస్తారా? గొప్ప నీతిమంతులు . వీళ్ళెవరు తనని వెలేయడానికి . తనే అందర్నీ వెలేస్తోంది. "లేట్ దెమ్ గో టు హెల్" తన ఆనంద్ ఒక్కడు తనని అర్ధం చేసుకుంటే అంతె చాలు. ఆనంద్ లేనప్పుడు ఈ సంఘటన జరగటం తన దురదృష్టం. ఆనంద్ కి తన మీద సంపూర్ణ విశ్వాసం ఉంది.కానీ ఒక్కోసారి పరిస్థితులు మనిషిలోని వివేకాన్ని చంపేస్తాయి. తన ఆనంద్ అలా వివేకరహితుడు కాకుండా ఉంటె చాలు అంతా నమ్మారు.... అసలు విషయం తెలుసుకోవాలన్న ఇంగితం లేకుండా నమ్మారు.
ఆనంద్ కూడా ఈ సమాజంలో మనిషి గా కాక తన మనిషిగా ఆలోచిస్తే అంతే చాలు.
చదువు సంస్కారాలు ఉన్న ఈ గూండా మీద జనానికి ఎంత కన్పిడేన్స్! నిజమే! ఇది గూండాల చేత గూండాల వలన గూండాల కోసం నిర్మించబడ్డ సమాజం. ఈ సమాజంలో చదువు, హోదా, సంస్కారం - పరపతి - అంతస్తు ఉన్నవాళ్ళు కాదు, వి.ఐ.పీ లంటే, గడ్డాలూ, మీసాలు భయంకరంగా పెరిగి కండలు తిరిగిన వస్తాదులు, వీలైనంత కిరాతకంగా ప్రవర్తించేవాళ్ళు వి.ఐ.పీ లు.
ఇంట్లో అడుగుపెట్టి రేడియో అన్ చేసింది. విలవిల్లాడే మనసుకి ఊరట కావాలి. ఎలా? ఆనంద్ రాలేదు , వస్తాడా? ఈ సంఘటన ఊళ్ళోకి రాగానే తెలిసిందా? తనూ అసహ్యించుకుంటున్నాడా?
"పులిని చూస్తె పులి ఎప్పుడు జడవదు. మేకవస్తే మేక ఎన్నడూ అదరదు. మాయరోగ మదేమో కానీ మనిషి , మనిషికీ కుదరదూ!"
రేడియోలో పాట.... అనూరాధ పెదాల పై జీవంలేని నవ్వు....
'అనూ!" కాలుతోన్న గుండె మీద నవనీతం రాసినట్టు పిలుపు.
"ఆనంద్!" శ్రావణ మేఘంలా చలించింది.
"ఊరుకో ప్లీజ్.....నీకేమీ అవమానం జరగలేడుగా! వాడికే కదా అవమానం జరిగింది. నాకంతా తెలిసింది. ఇన్ స్పెక్టర్ గార్ని కలిశాను..."
"కానీ...కానీ.... ఆ విషయం ఎవరికీ తెలీదు. వాడు ఆ గాడిద హాయిగా తిరుగుతున్నాడు.
"పిచ్చిదానా! ఈ సమాజానికి గుర్రాలే కాదు, గాడిదలు కూడా అవసరమే. గాడిద పాలు శ్రేష్ఠమైనవని మహానుభావులే తాగారు. బరువు మోయడానికి గాడిదలు కావాలి. వాటిని బ్రతకోద్దంటే ఎలా?"
"కానీ....కానీ.... నేనిక్కడ ఉండలేను ఆనంద్! నన్నిక్కడి నుంచి తీసుకెళ్ళి పో! ప్లీజ్."
"ఎక్కడి కెళ్ళినా ఇవే మనస్తత్వాలు. ఎంత దూరం వెళ్ళగలం చెప్పు? నువ్వు నీ జీవితాన్ని ఓ చిత్రమైన రీతిలో , తరతరాల ఆచారాలకు, సంప్రదాయాలకు విరుద్దంగా మార్చుకోటానికి ప్రయత్నిస్తున్నావు. వివాహం అనే సంప్రదాయానికి భార్యాభర్తల అనుబంధానికి సరికొత్త నిర్వచనం కల్పిస్తూ యాంత్రికమైన సంసారాల్లో ఓ కొత్త వరవడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నావు. నీ భావాలను అర్ధం చేసుకుని నీ జీవన రీతిని ఆకళింపు చేసుకుని అంగీకరించే సంస్కారం వీళ్ళలో అంత త్వరగా ఎలా కలగగలదని ఆశిస్తున్నావు? ఈ సమాజంలో ఉన్న ఎన్నో దురాచారాలు, మూడ నమ్మకాలు, ఇంతవరకూ తొలగిపోలేదు. మహానుభావులు చేసిన సంస్కరణలనే జీర్ణం చేసుకోలేని ఈ ప్రజలు.... నిన్ను అర్ధం చేసుకోటానికి ఎన్ని శతాబ్దాలు గడిచినా నువ్వు ఆశ్చర్యపోకూడదు.
ఈ సమాజం నిన్ను అర్ధం చేసుకుందా? లేదా? అన్నదికాడు సమస్య. ఈ సమాజాన్ని నువ్వెంత వరకు అర్ధం చేసుకున్నావు అన్నది ప్రధానం. వీళ్ళందరికీ అర్ధమయ్యే లా నువ్వూ ప్రవర్తిస్తున్నావా? లేదా అన్నది కూడా ముఖ్యమే. ఈ సమాజాన్ని చూసి మనం భయపడి పారిపోకూడదు. వీలైనంత మటుకు అందరినీ కన్విన్స్ చేయటానికి ప్రయత్నించాలి. నీలో ఆత్మవిశ్వాసం, మనస్సాక్షి ఉన్నంత వరకు ఒడిదుడుకులను స్వీకరిస్తూ త్రోసిపుచ్చుతూ నీవెంచుకున్న గమ్యం చేరడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి."
అతని మృదుమధుర స్వరం , అతనిస్పర్శ ఉపశమనం కలిగిస్తోంటే వివశురాలై వింటూ అతని గాడ పరిష్వంగంలో కళ్ళు మూసుకుంది అనూరాధ.
***
