Previous Page Next Page 
కాంతి రేఖలు  పేజి 48

   
     ఇతను మెంటల్ అయ్యాడా అని ఒక్కక్షణం సందేహించినా మళ్ళీ ఏదో జరిగిందని గ్రహించి అతని చేయి పట్టుకుంది.

     " ఏం జరిగింది సిద్ధార్థా!"

    "జరుగ రాని అనర్థం జరిగిపోయింది. శ్రీనివాస్ ను చంపేసారు."

    "అది మనం అనుకున్నదేగా!"

    "దారుణంగా చంపేసారు."అన్నాడు బాధగా.
       
    " నువ్వింత భీరువు అయితే యెలా! ఈ మధు మూర్తి ని వదలవద్దు." అన్నది.   

     " కసిదీరా తిట్టి వచ్చాను"అన్నాడు.
   
     " యెవర్ని?"

    " మధుమూర్తి ని."

    "మైగాడ్!  ఎంత పని చేసావ్!అతను  మనకు దొరుకుతాడా! అతనికి పారిపోవటానికి అవకాశం ఇచ్చి వచ్చావు... "అన్నది.

    "ఓ.... నేను అసలు విషయాలు ఆలోచించలేదు. ఇప్పుడెలా!" కంగారుగా అతను వెనుతిరిగాడు.

     అతను బంగళా చేరే సరికే పోలీసులు జీపు అక్కడ వుంది. అమ్మయ్య అనుకుని లోపలికి వెళ్ళాడు.

     "ఆయన ఎక్కడికి  వెళ్తారో ,ఏం చేస్తారో నాకు చెప్పరు." అన్నది సులక్షణం.

    " ఎప్పుడొస్తారో చెప్పగలరా!"

    "నాకు తెలియదు ఒక్కొక్కసారి రెండురోజులు పడుతుంది. వ్యాపార నిమిత్తం వెళ్తే వారం రోజులకు గాని రారు."

    " అంతా అబద్ధం.... అబద్ధం....." అరిచాడు సిద్దార్థ.

    అందరూ ఇటు తిరిగారు.

    "ఇరవై నిమిషాల క్రితం ఇంట్లో చూచాను అతడిని."

     పోలీసు అధికారి కనుసైగ గమనించి,ఇల్లంతా వెతికారు. అతని జాడ ఎక్కడా కనిపించలేదు.

     "అతని జీపు నంబరిచ్చి పట్టణం శివార్లు దాటిపోకుండా కట్టుదిట్టం చేయించండి" అన్నాడు.
   
     "వెంటనే వెళ్ళి, పురుషోత్తమరావు విషయం చూడండి" అన్నాడు.

    పోలీసులు చల్లా చెదరు అయ్యారు.

    సిద్దార్థ రాయిల్లా నిలబడి పోయాడు.

    చెల్లెలి ఉత్తరం చూచేవరకు తండ్రిని సార్థక నామధేయుడు అనుకున్నాడు.

    ఊరికి ఉపకారం చేసే ఉదాత్త చరితుడా ఇతను!

     అతను చాలాసేపు అక్కడే నిలబడి పోయాడు.

    "రండి వెళ్దాం...." అన్నది శ్వేత.

    "వీళ్ళంతా ఎరి"

    "అప్పుడే వెళ్ళిపోయారు."

    "పార్వతమ్మ కెలా ముఖం చూపను.!"

    "మరీ అంత సున్నితంగా ఆలోచించకు" అన్నది ఆర్తిగా

    అప్పటికే విషయం ఊరంతా గుప్పుమంది.

    "కలికాలం కాకపోతే ఏమిటీ విపరీతం!ఆ పిల్లేమిటి? పార్వతమ్మ కొడుకును  ప్రేమించటం ఏమిటి?"

    "ఏం ప్రేమలో సినిమాలు చూచి బొత్తిగా చెడిపోతున్నారమ్మా"

    " ఈ నవలలు అట్లాగే ఏడ్చాయి ఏ నవల తీసినా ప్రేమ కధే కదా!

    "అయినా వద్దు అని తన కూతురికి వేరే సంబంధం చూచుకుంటారుగాని, చంపిస్తారా! ఈ విచిత్రం నేనెక్కడే చూడలేదు"

    "ఏ మాట కామాట చెప్పుకోవాలమ్మ, ఆపార్వతమ్మ కొడుకు బంగారం లాంటి కుర్రాడు , మాపాప రైలు ప్రయాణం అంటే భయపడితే ఆరునెలలు తీసుకెళ్ళాడమ్మా."

    " పిచ్చి పిల్లడికి వీళ్ళ మోసం తెలియదేమో."

    రక రకాలుగా మాట్లాడుకుంటున్నారు అమ్మలక్కలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS