'సరే-- నాకు బొత్తిగా మతి పోతోంది -- ఇందాకటి నుండి వీధి దీపాలు కూడా లేవుగా ' అనుకున్నాడు -- మురళీ యిచ్చిన దూపాయి నోటు లో తన కిరాయి పోను మిగిలిన చిల్లర రిక్షా దీపం వెలుగులో జాగ్రత్తగా లెక్క పెట్టి అప్పటికి తెమిలి మురళీ చేతిలో పోశాడు రిక్షా అబ్బి.
చిల్లర డబ్బులు జేబులో వేసుకుంటూ గేటు తెరుచుకుని లోపలికి రాబోయాడు -- హటాత్తుగా అతని కళ్ళ కేదో అప్రియమైనది కనిపించినట్లు కళ్ళు కుంచించుకు పోయాయి. ఒళ్ళంతా జలదరించి నట్లు అయింది -- ఏమిటిది ? నిజమేనా ? నా కళ్ళు నన్ను మోసం చెయ్యటం లేదు కదా -- మా యింటి తలుపులు తెరుచుకుని ఒక మనిషి బయటికి రావటం ఏమిటిది ? అతను అలా సందిగ్ధం లో వుండగానే కరెంటు వచ్చింది ఒక్కసారిగా లైట్లన్నీ వెలిగాయి. ఆ వెలుగులో గబగబా అడుగులు వేసుకుంటూ మేడ మెట్ల వేపు నడిచి ఆ తరువాత మెట్లు మీదుగా పైకి వెళ్ళిన వ్యక్తిని మురళీ గుర్తు పట్టాడు. అతను గోపాలరావు.
'గోపాలరావు,' లోలోపలే అతని పేరు వుచ్చరించు కున్నాడు మురళీ. 'ఈ వేళప్పుడు ఇతను మా యింటికి ఎందుకు వచ్చినట్లు?' మురళీ లో అనుమానం తల ఎత్తింది. అర్ధమయింది అన్నట్లుగా తల పంకించాడు. గబగబా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లి వీధి తలుపు మళ్లీ గడియ పెట్టాడు. --సరిగ్గా అప్పుడే లోపల నుండి వీధి గదిలోకి వచ్చిన కళ్యాణి ఆ సమయంలో అక్కడ భర్తని చూసి తెల్లబోయి 'వచ్చారా?' అంది పలకరింపు గా 'ఏం? ఇప్పుడిప్పుడే రాకూడదనుకున్నావా?'
అతని కంఠస్వరం అతని ఆకారం కళ్యాణి కేమిటో భీతి గొలుపుతున్నాయి. అతని కళ్ళల్లో ఎర్ర జీరలు కరడు కట్టి వున్నాయి-- మొహం జేవురించి వుంది-- పిడికిళ్ళు బిగుసుకుని వున్నాయి. ఆ పాద మస్తకం వో విధమైన ఆవేశంతో ఎలాంటి దారుణ కృత్యం అయినా చెయ్యటానికి వెనుకాడని రాక్షస ప్రవృత్తి లో వూగి పోతోంది.
'ఏం జరిగింది -- సినీమాకి వెళ్లాను అని చెప్పి వెళ్ళిన మనిషి ఇంకా సినిమా విడిచే వేళ కాకుండా ఎందుకు వచ్చేసి నట్లు- అసలు సినీమాకి వెళ్లలేదా -- అయినా ఇలా వున్నారేమిటి ?' అనుకుంటోంది కళ్యాణి గుండెలు దడదడ లాడుతుండగా.
'ఇప్పుడు మన యింట్లోంచి వెళ్ళిన వాడెవడు.' మురళీ కళ్ళు నిప్పులు కురిపిస్తుంటే గొంతు పిడుగులు గర్జిస్తూ న్నాయి.
అసలే భయం భయంగా నిలబడిపోయిన కళ్యాణి, వెంటనే ఆ ప్రశ్న ని అర్ధం చేసుకోలేని దానిలా, ఆ ప్రయత్నంగానే , 'ఇప్పుడా !' అంది.
'ఆ-- ఇప్పుడే -- ఇంతకూ ముందే -- అంటే నేను వచ్చే ముందే.' హటాత్తుగా కళ్యాణి జబ్బ అంది పుచ్చుకుని, 'చెప్పు,' అన్నాడు.
'ఆడా -- అయన-- మన గోపాలరావు గారు.' అంది బెదిరిన లేడిలా చూస్తూ.
'హు -- మన, గోపాలరావు గారు -- ఎందుకొచ్చారు.'
'వాళ్ళ బాబుకి జ్వరంగా వుందిట -- మందు కోసం వచ్చారు.'
'వాడే ఎందుకు రావాలి? పిల్లల నెవరి నైనా పంపించక పోయాడా?'
'వాళ్ళ పిల్లలంతా ఒక్క చంటి వాడు తప్ప మిగిలిన వాళ్ళంతా సినీమాకి వెళ్ళారుట -- సాయంత్రం దాకా ఆడుకున్న బాబుకి అప్పటికప్పుడు జ్వరం వచ్చిందిట, అదీ బాగా ఎక్కువగా వుందిట-- మన పాప కోసం అవి ఎప్పుడూ ఏవో మందులు కొని యింట్లో వుంచుతాం కదా అని ఏమైనా వుంటే ఇమ్మని అడగటానికి వచ్చాడు.....'
కళ్యాణి చెంప చెళ్ళు మంది.
'అలాంటి కట్ట్టు కధలు చెప్పి నమ్మించ లేవు నన్ను. నేను సినీమాకి వెడతానని చెప్పాను-- మీకు అడ్డు లేకుండా వాడూ పెద్ద పిల్లలందర్నీ సినీమాకి పంపించాడు. చంటి వెధవ దేముంది చీకటి పడగానే నాలుగు మెతుకులు తిని నిద్రపోతాడు.....టిక్కెట్టు దొరక్క నేను త్వరగా ఇంటికి రావటం వల్ల నా కంట పడ్డారు.....'
'ఏమిటి మీరంటున్నది.' అప్పటి దాకా భయంతో దుఃఖంతో బిగుసుకుపోయిన కళ్యాణి ఒక్కసారి ఒంట్లో శక్తి నంతటిని కూడ గట్టుకుని కాస్త పెద్ద గొంతుతో అంది నిలదీస్తున్నట్లే.'
'నీ అరుపులకి నేను బేదిరి పోతానను కున్నావా..... ఇంకా ఎన్నాళ్లు కప్పుదామను కున్నావు?' మురళీ గొంతులో కోపంతో పాటు వ్యంగ్యం ధ్వనించింది.
'మీ కళ్ళు కప్పానా? నన్నూ బావగారిని గురించి ఇంత నీచంగా వూహించటానికి మీ మనస్సేలా ఒప్పింది...వాళ్ళ పిల్లలు సినీమాకి వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు-- ఎనిమిది గంటల వేళ అయన వచ్చి చెప్పి పిల్లవాడికి మందేదయినా ఇమ్మన్నాడు. ఆసలు మీరు ఇంట్లో వున్నారనే అనుకున్నారుట-- మీరు లేరనీ, మందు ఇస్తాను కూర్చోమని చెప్పాను. కొవ్వువత్తి వెలుగులో ఈ అలమారు లో మందులు నేను వెతుకుతుంటే గాలిగి అది అరిపోతుందని వీధి తలుపులు కొంచెం ఓరగా వేశారు. మందు కనిపించింది. అది తీసుకుని హడావిడిగా వెళ్లి పోయారు . పైన బాబు ఒక్కడూ వున్నాడని ....పిల్లవాడికి మందు కావాలని వచ్చిన మనిషికి అది ఇవ్వకుండా ఎలా వుండగలను ? ఈ మాత్రం సహాయం ఒకరికొకరు చేసుకో లేకపోతె ఎలా -- అయన మన యింటికి వచ్చినందుకే మమ్మల్ని అనుమానిస్తారా.' కళ్యాణి అడ పులిలా ఆగ్రహంతో వూగి పోతోంది.
'అన్నింటికీ తెగించిన దానివి కనకనే ఎదురు తిరిగి మొగుడ్ని ఇన్ని మాటలు అనగలుగు తున్నావు. నీలో నిజంగా ఏ పాపమూ లేకపోతె ఇలాంటి అపవాదు వచ్చిందేమిటా అని దుఃఖంతో కుమిలి పోయేదానివి-- ఇలాంటి అభాండాలు వెయ్యటం న్యాయం కాదు అంటూ నా కాళ్ళకి చుట్టుకొని గిలగిల్లా డిపోయేదానివి-- అంతే కాని ఇంత ధైర్యంగా ఇన్ని కల్లబొల్లి ఖబుర్లు చెప్పి నన్నే ఎదురు ప్రశ్నిస్తూ కూర్చోవు -- సరే -- ఏదయినా నా మంచికే వచ్చింది-- ఈ రెండేళ్ళు నేను మానసికంగా అనుభవించిన నరకానికి ఈనాడు విముక్తి కలిగింది -- ఇది నీకూ సంతోషంగా వుంటుంది. వస్తా.' అంటూనే గబగబ ;లోపలికి వెళ్లి బీరువా తెరచి నాలుగు జతల బట్టలూ కొంత డబ్బు, బ్యాంకి చెక్కు బుక్కూ అన్నీ చిన్న సూటు కేసులో సర్దుకుని ఇవతలకి వచ్చాడు.
'ఈ రెండేళ్ళూ ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాల నిన్ను అనుమానించటానికి అస్కారం వచ్చినా నేనే భ్రమ పడుతున్నా నెమో నని నన్ను నేనే మండలించుకుని పశ్చాత్తాప పడి నీ ముందు నా బలహీనత వెల్లడించు కుంటుండేవాడిని -- అంతే కాని నువ్వు నటన లో ఆరితేరిన దానవని నేను గ్రహించలేక పోయాను.'
'నటించానా నేను?' నిర్ఘాంత పోయింది కళ్యాణి.
'నువ్వు ఆనాడు చెప్పానే గుండెలలో కోలాహలం మండి పోతున్నా మొహంలో అమృతం లాంటి చిరునవ్వు నింపుకుని మీ వాళ్ళ ముందు నటించానని-- అలాంటి నటనతో నే నా కళ్ళూ కప్పావు ఇన్నాళ్ళూ.'
'నా మాట కొంచెం వినండి.'
'అక్కర్లేదు . ఇంక నీ మాటలతో నూ కల్ల బొల్లి ఏడ్పులతో నూ నన్ను నమ్మించ లేవు.' అంటూ తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయాడు.
కళ్యాణి మ్రాన్పడి పోయింది -- అంతా ఏదో ఇంద్రజాలం జరిగినట్లుగా వుంది తప్ప మురళీ రావటం తనని అనరాని మాటలనడం, తిరిగి వెళ్ళిపోవడం అంతా నిజంగా జరిగింది అని నమ్మ శక్యం కావటం లేదు. అలా ఎంత సేపో ఆలోచిస్తూ చివరికి, ఆ రాత్రి జరిగిందంతా ఒక్కో క్కటే గుర్తు చేసుకుంటుంటే హటాత్తుగా తనలో శక్తి అంతా నీరయి పోయినట్లు అలా నిలబడటానికి కూడా సత్తువ లేనట్లు అక్కడే గోడ వార కూలబడి పోయింది. 'ఇంక నీకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు.' అన్న మురళీ మాటలే చెవుల్లో గింగురు మంటుంటే రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వుండిపోయింది. అలా ఎంతసేపు గడిచిందో గుర్తు లేదు కాని గదిలో పడుకున్న పాప లేచి ఏడుస్తున్న ఏడుపు వినిపించి --
'వస్తున్నా తల్లీ వస్తున్నా. ఏడవకు.' అంటూ ఒక్క వుదుటున లేచింది -- ఎదురుగా బార్లా తెరిచి వున్న తలుపులు చూసి ఒక్కసారి భయపడి పోయి గబుక్కున వాటిని మూసి గడియ పెట్టి పాప దగ్గరికి పరుగెత్తింది.
