Previous Page Next Page 
ఒప్పందం పేజి 47

 

                                    రెడ్ హాండెడ్

    అనురాధ తలుపు గడియ తీసి బైటకోచ్చింది.
    దడాలున ఎదురింటి తలుపులు మూసుకున్నాయి.
    పక్క ఇంటి కిటికీ రెక్క టపీమని చప్పుడైంది.
    రోజూ ఎదురొచ్చి టాటా చెప్పే మూడేళ్ళ శ్వేత కనిపించలేదు.
    పబ్లిక్ నల్లా దగ్గర నీళ్ళు పట్టుకునే ఆడవాళ్ళంతా విచిత్రంగా, అసహ్యంగా, అంటరానిదాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు.
    వీధి చివర పాన్ షాప్ వాడు పాన్ తినీ తినీ గారపట్టిన పళ్ళు కనిపించేలా రోతగా నవ్వుతూ కళ్ళేగరేసాడు.
    అనురాధకి గుండెను పదునైన కత్తితో సన్నగా చీల్చి ఉప్పూ, కారం పెట్టినట్టు భరించరాని ఆ వాతావరణం లో కాళ్ళు చచ్చు పడినట్లయింది. చటుక్కున అటుగా పోతున్న అటో పిలిచి అందులో కూర్చుని "గన్ ఫౌండ్రీ" అన్నది నీరసంగా.
    అటో కదిలింది.
    కరెంట్ స్తంభం దగ్గర అసహ్యంగా నవ్వుతూ కాలరెత్తుకుని తను చేసిన ఆటవిక చర్యకు నిదర్శనంగా నిలబడి ఉన్నాడు.
    పొట్టిగా, లావుగా, గడ్డం పెంచి బట్టతలతో సంధి యుగానికి ప్రతీకలా ..వికృతంగా...
    ఆ భంగిమ చూసిన అనురాధకి కడుపులో తిప్పింది.
    సిగ్గు, అభిమానం, పౌరుషం.... పశ్చాత్తాపం ఏమీ లేని ఓ లోఫర్"
    ఆ లోఫర్ చేసిన ఓ అనాగరికమైన పాశవికమైన చర్యని ఆ వీధిలో వాళ్ళంతా భావిస్తున్న తీరు ఎంత వండ్రఫుల్ ! అందంగా , సంస్కారమే ఆభరణంగా బ్రతికే అనూరాధ ఆ వీధిలో అందరికీ ఓ ఫజిల్. ఈమె వంటరిగా ఎందుకుంటుంది? తరచూ ఆమెను స్కూటర్ మీద తిప్పుతూ , అప్పుడప్పుడూ ఆమె ఇంట్లో రెండేసి రోజులు మకాం ఉండే ఆ యువకుడు ఎవరు? భర్తే అయితే మెళ్ళో మంగళసూత్రాలేవి? ప్రియుడైతే.... అలా తిరగడం ఏవిటి బరితెగించి.... అతనే కాక అప్పుడప్పుడు చాలామంది మగవాళ్ళు ఆమె ఇల్లు విజిట్ చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళంతా ఎవరు? ఎందుకొస్తారు? (ఆడవాళ్ళు కూడా వస్తుంటారు. కానీ మగవాళ్ళ రాకాలని మాత్రం అబ్జర్వ్ చేసే జనాలకి ఆడవాళ్ళు కన్పించరు) ఒంటరిగా ఉండే అడదానింటికి మగవాళ్ళు రావడం ఏమిటి? ఈమె ప్రతి రోజూ లేట్ గా వస్తుంటుంది ఎందుకు? ఈ రకమైన ఎన్నో మిస్టరీ లు చేదించి , అవసరం అయితే ఈమెని ఈ కాలనీ నుంచి తరిమి కొట్టాలి. అందుకు నాగరికత ముసుగు కప్పుకొన్న కొందరికి సాధ్యం కాదు కాబట్టి, ఆ భారం చూపులకీ, స్వభావానికి కూడా అనాగరికూడైన "వాడికి" అప్పగించారు.
    స్వతహాగా శాడిస్ట్ లైన అలాంటి వాళ్ళకి అనూరాధ లాంటి అమ్మాయిల కన్నీళ్లు మాత్రమే దాహాన్ని తీర్చగలవు.
    ఎదుటి మనిషి సమస్యలని- కష్టాలని పట్టించుకోని జనాలు ఆ మనిషి సంతోషానికి కారణం తెలుసుకోవటానికి ఉత్సాహపడతారు.
    రానురానూ , దేశం ప్రగతి కి అభిముఖంగా పయనిస్తోన్నా వ్యక్తులు మాత్రం స్వభావరీత్యా పశు ప్రవృత్తికి దూరం కాలేకపోతున్నారు.
    ఈ జనారణ్యం లో ఒంటరి ఆడదాని జీవితం కత్తి మీద సాము , అసలామె వంటరిగా బ్రతకాల్సిన అవసరం కలిగిన పరిస్థితులేలంటివో ఎవరికీ అవసరం లేదు. ఆమె సమస్యలతో ఎవరికీ పని లేదు.
    కానీ వంటరిగా ఉంటోన్న ఈమె ఇంత సంతోషంగా ఎందుకుంది? ఎలా ఉంది- తెలుసుకుని, అభిమాన ధనురాలైన గౌరవనీయురాలైన ఆస్త్రీని బజారు పాలు చేయడానికి మాత్రం అందరూ పాత్ర వహించగలరు.
    వీళ్ళంతా పాపం తను వంటరిగా వాళ్ళ కాలనీలో ఉండటానికి పర్మిషన్ ఇచ్చారుట. కానీ తనింటికి ఎవరూ రాకూదదట. నెలనెలా అద్దె కడుతూ, కష్టపడి తన బ్రతుకు తను బ్రతుకుతూ ఎలా బ్రతకాలి? అన్న విషయంలో వీళ్ళందరి అనుమతి కావాలిట.
    అందరు వయసొచ్చిన ఆడపిల్లలున్న కాలనీ లో తను వంటరిగా ఉండటమే కాక తనింటికి మగవాళ్ళు రావడం మర్యాద కాదట. మిగతా అడ పిల్లలు చెడి పోతారుట.
    ఒంటరిగా ఉన్న ఆడది కేవలం వ్యభిచారాణి క్రింద లెక్క.... పదిమంది బ్రహ్మచారులు కలిసి ఉండచ్చు. పదిమంది కన్నెపిల్లలు కలిసి ఉంటె మాత్రం అదొక బ్రోతల్ హౌస్.
    తన ఇంటి కొచ్చే ప్రతివారి పేర్లూ, అడ్రస్ లూ ఫోన్ నెంబర్లూ ఎంక్వైరీ....
    ఇలా మాట్లాడిన ఇక్కడున్న ప్రతి మగవాడూ అనూరాధ అవకాశం ఇస్తే వాడుకోటానికి ఏమాత్రం వెనుకాడడు. వాళ్ళంతా నీతివాక్యాలు చెబుతున్నారు అహా! ఎంత హాస్యాస్పదం.
    ప్రేమలేఖలు రాసి పెళ్ళాం చూడకుండా పార్శిల్ చేసిన ఓ పెద్ద మనిషి- నాగరికత ముసుగులో నిలబడి తనకు లొంగని - తన వలలో పడని అనురాధని ఓ వేశ్యగా చిత్రించి "వాడికి" నూరి పోస్తాడా? ధైర్యంగా ఎదుర్కోలేని "కొజ్జా" తన హిపోక్రసీ కి ఈ లోఫర్ ని వాడుకుంటాడా?
    కండలు, గడ్డాలు, పెంచేసిన ప్రతి మొగాడూ మొనగాడ్ననుకుని మురిసి పోతుంటే ఆ గూండాలని పోషిస్తూ ఆ గూండాల కి సలాం లు కొడుతూ బానిస బ్రతుకులు బ్రతికే ఈ జనాలు వాడికి సపోర్టా?
    ఏ సిటిజన్ ఇంటికి ప్రత్యేక కారణం లేకుండా పోకూడదన్న కనీస జ్ఞానం లేని కానిస్టేబుల్ ఈ "గూండా" వెళ్ళి పిలవగానే వావి వరసలు తెలుసుకోకుండా, తన ఇంట్లో కూర్చుని మాట్లాడుతోన్న తమ్ముడు లాంటి సుదీర్ ని స్టేషన్ కి తీసుకెళ్తాడా? అది చూసి వీళ్ళంతా 'అబ్బా మొనగాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడని " భజన చేస్తారా?
    అంటే ఈకాలనీ లో ఉన్నది ఒకే ఒక మగాడు... "వాడే", మిగతా వాళ్ళంతా కోజ్జాలే.
    తెల్లవారి లేచిందగ్గర్నుంచీ మొగుడి కళ్ళతో ప్రపంచాన్ని చూస్తూ మొగుడి బ్రెయిన్ తో ఆలోచిస్తూ ఆ మొగుడు నానా గడ్డీ కరిచి సంపాదించి తెస్తోంటే విలాసాలు చేస్తూ విచిత్రంగా బ్రతికే ఇల్లాళ్ళు.... సాటి స్త్రీకి జరిగిన అవమానానికి సిగ్గు పడాల్సింది పోయి, ఆమెని అంటరానిదానిగా చూస్తారా? వీళ్ళంతా చాలా పవిత్రులు.... పాపం అరుంధతులూ.... సతీ సావిత్రులు.
    వీళ్ళందరికీ తనకీ, ఆనంద్ కీ మధ్య ఉన్న బంధుత్వం అర్జంటుగా తెలియలిట. తెలియకపోతే!
    ఆనంద్ అదృష్టమో! దురదృష్టమో ఈ సంఘటన జరిగే టప్పటికీ లేడు. కాంప్ కెళ్ళాడు. ఈరోజు రావాలి. స్త్రీ పట్ల కామద్రుష్టీ గల ఈ మూర్ఖులకి తెల్లారి లేచిం దగ్గర్నించీ అవినీతి బురదలో దొర్లుతూ , శవాల మీద చల్లిన చిల్లర  ఎరుకు బ్రతికే ఈనీచులకి ....తనకీ ఆనంద్ కీ మధ్య నున్న మమతానురాగాల సున్నితమైన అనుబంధం ఎలా చెబితే అర్ధం కాగలదు? స్త్రీ పురుషుల మధ్య "సంబంధాలె కాక "అనుబంధాలు " కూడా ఉంటాయని . అ అనుబంధం విలువ ఏ కొలమానానికి అందనిదని చెబితే మాత్రం ఎలా తెలుస్తుంది?
    నిత్యం కాట్ల కుక్కల్లా కొట్టుకుంటూ రాత్రి అవగానే పశువుల్లా దొర్లే ఈ జనాలకి ఈ అనూరాధ గుండెలో ప్రేమ జల్లుల మధ్య చివురించి వలపుల జడివాన లో విరిసి గుభాళించే గులాబీల పరిమళం.... విలువ ఎలా తెలుస్తుంది?
    అనూరాధ ఆఫీసులో అడుగు బెట్టింది.
    రోజూ "గుడ్ మార్నింగ్ " చెప్పే ప్యూను హాయిగా సిగరెట్ కాల్చుకుంటూ నిర్లక్ష్యంగా చూశాడు.
    అంతవరకూ అదృష్టమే.... కన్ను కొట్టలేదు.
    కొలీగ్స్ చాల బిజీగా ఉన్నట్టు ఫైల్స్ లోకి తలలు దించేసుకున్నారు.
    రోజూ ఆశగా చూసే పరాంకుశం చూపుల్లో ఆకలి -- వసంత, కుమారి రాణి, కమల వారపత్రికలలో అర్జంట్ గా మునిగిపోయారు.
    ఆఫీసు కి ఎందుకోస్తున్నారు? అన్న కర్తవ్యాన్ని విస్మరించి తీరుబడిగా పదకొండు గంటలకి వచ్చి, వచ్చిందగ్గర్నుంచీ మూడెప్పుడవుతుందా? అని గడియారం కేసి చూస్తూ "సింప్లీ సిటింగ్...మంత్లీ టేకింగ్" అన్నట్టు నెలనెలా జీతాలు కరెక్టు గా లెక్క చూసుకుని మాట్నీలకు, షికార్ల కు తిరిగేవాళ్ళు కూడా తనని అసహ్యించుకునే స్టాండర్డ్ కి ఎదిగారా? హౌ వండర్?
    ఒక్క రాత్రిలో కేవలం పన్నెండు గంటల్లో.... నో! నో! (కేవలం పన్నెండు గంట లేమిటి? పిచ్చి - అరగంట చాలు చెడు వ్యాప్తి చెందడానికి) ఇక్కడి దాకా వ్యాపించింది. ఓ నాగరిక యువతికి ఆటవికులు చేసిన అవమానం. ఆ అవమానాన్ని అనాగరిక చర్యని ఎంత ఆర్భాటంగా రిసీవ్ చేసుకున్నారు? ఎంత ఘనంగా ఆహ్వానం పలికారు? వీళ్ళంతా సంస్కారులు... సభ్య ప్రపంచంలో మెలిగేవారు కదా!
    రెడ్ హండెడ్ గా పట్టుపడిందట.
    "ఛీ...సిగ్గులేకుండా ఆఫీసు కొచ్చింది."
    "ఇంకెవరన్నా అయితే నుయ్యో, గొయ్యో చూసుకునేవారు. తెగించినవారికీ తెడ్డె దిక్కట...."
    అనూరాధ కళ్ళల్లో నిప్పులు రాలాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS