Previous Page
కృష్ణవేణి పేజి 47


    
    "ఎన్నడూ కనీవినీ ఎరగని సమావేశం ఇది" అంటూ నవ్వింది రేణు.
    అరుణా మాధవ్ లూ- శాంతా రఘూలూ-కృష్ణవేణి శ్యామసుందర్ లూ - చిరంజీవి సరోజా - రేణూ ఆ సమావేశంలో సభ్యులు. అంతా కృష్ణవేణికి అతిధులు. పైనా హాల్లో టేబుల్ చుట్టూ సోఫాల్లో కూర్చుని కబుర్లలోకి దిగారు సభ్యులంతా.
    అరుణా మాధవ్ లు ఉదయమే కార్ లో వచ్చారు. అరుణని చూస్తూంటే పూర్వ పరిచయమున్న సన్నిహితురాలిగా తోచింది కృష్ణ వేణికి-కృష్ణవేణినీ చూస్తూ చిరునవ్వు నవ్వింది అరుణ, "ఎంత అందమైంది అరుణ!" అనుకోకుండా వుండలేకపోయింది కృష్ణవేణి. అరుణే చనువుగా పలకరించి మాట్లాడింది. "మా ఆహ్వానం మన్నించి మీరిద్దరూ వచ్చినందుకు సంతోషం రావుగారూ!" అంటూ శ్యామసుందర్ మాధవ్ ని మర్యాదగా ఆహ్వానించాడు.
    "మిమ్మల్ని చూడగలిగినందుకు మేముకూడా ఎంతో సంతోషిస్తున్నాం." అన్నాడు నవ్వుతూ మాధవ్.
    అరుణ స్నానం చేసి నిండుగా అలంకరించుకొంది. లేత కనకాంబరం జరీచీరమీద మువ్వల వడ్డాణం మిసమిసలాడుతూంటే పోటీగా తెల్లటి మెడచుట్టూ రాళ్ల నెక్లెస్ ధగధగలాడసాగింది. త్రాచులాంటి వాలుజడలో పడగ విప్పినట్టు పట్టెడుపూలూ! విశాలమైన కళ్ళని చక్రాల్లా తీర్చిదిద్దుతూన్న కాటుక! నున్నని నుదుట నిలిచిన గుండ్రని కుంకుమా! అరుణ అలంకారంలో ప్రత్యేకతలుగా కన్పిస్తున్నాయి.
    "నువ్వు చాలా అందమైనదానివి అరుణా!" అంది చనువుగా కృష్ణవేణి. అరుణ నవ్వింది-"నేను అలా అనుకుంటూనే వచ్చాను. నిజంగా నిన్నుచూసి నా అభిప్రాయంలో కొంత మార్పు తెచ్చుకున్నాను. నిన్ను మించిన అందగత్తెనా కృష్ణవేణీ నేను? కళ్ళారా చూస్తూ అంతమాత్రం తెలుసుకోలేనా?" అంది. "బావుందిలే నువ్వు చెప్పింది. ఎవరికళ్ళు వాళ్ళకుండగా అర్ధంలేని వాదాలెందుకు? సరేగాని నీకిటువంటి ముస్తాబు అయిష్టం కాబోలు."
    "అది ఒకప్పుడు. ఆదశ మారిపోయింది కదా? రావుగారికి ఇటువంటి అలంకరణే ఎంతో ఇష్టం. నాకు కూడా ఈ ముస్తాబులో ఏదో నిండుదనం అనుభవమవుతుంది".
    అరుణ కబుర్లు వింటూ కూర్చుంది కృష్ణ వేణి. "నాపూర్వ ప్రవర్తన తల్చుకొంటూంటే ఎంతో ఆశ్చర్యపోతూంటాను కృష్ణవేణీ! ఆయనతో మరో ఆడది స్నేహంచేసివుంటే నామూర్క త్వానికి నేను బలైపోయేదాన్ని. నా సంసారం నాకిచ్చావు. నీఋణం ఎలా తీర్చుకోగలను కృష్ణవేణీ?" కృతజ్ఞత నిండివున్న మనసుతో అరుణ కృష్ణవేణి చేతులు ఒడిలోకి తీసుకొని కళ్ళలోకి చూస్తూ వుండిపోయింది.
    "నా స్వార్ధం నేను చూసుకున్నాను తప్ప నాలో గొప్పదనమేమీలేదు అరుణా!" అంది కృష్ణవేణి నెమ్మదిగా.
    కొంతసేపయ్యాక అరుణ వున్నట్టుండి-"నువ్విలా సింపుల్ గా వుండటం నాకేమీ బావులేదు కృష్ణవేణీ! లేకపోతే నేనూ ఈ ముస్తాబంతా మార్చేస్తాను." అంటూ పట్టుపట్టింది.
    కృష్ణవేణి నవ్వి "అలాగే" అంటూ లేచి వెళ్ళింది. కృష్ణఎని నగలు పెళ్ళినాడు కాస్సేపే ఒంటిమీద నిలిచాయి. మరెప్పుడూ వాటినుపయోగించలేదు. మళ్ళా ఆనాడు అరుణ ప్రోత్సాహంతో - నిండు మనసుతో అలంకరించుకొంది కృష్ణవేణి. కృష్ణవర్ణపు లేతనీలం జరీ చీరలో ధగధగ లాడే ఒంటెడు నగలలో ఎన్నడూ లేని కళలు నింపుకొంది కృష్ణవేణి. అరుణ కృష్ణవేణిని చూస్తూ చిరునవ్వు నవ్వింది.
    అప్పుడే వచ్చిన రేణు ఇద్దర్నీ చూసి విస్తుబోయింది. "నా స్నేహితురాలు రేణు అరుణా! సాయంత్రానికి శాంతకూడా వస్తుంది." అంటూ పరిచయం చేసింది కృష్ణవేణి.
    "అలాగా? అంతా తెలిసినవాళ్ళే. కానీ ఇదే చూసుకోటం కదూ రేణూ?" చనువుగా పలకరించింది అరుణ.
    "రోజూ చూస్తూన్న స్నేహితురాలు కృష్ణ వేణినే పోలిక కట్టలేకపోయాను. ఏమిటీ చిత్రం? ఇద్దరూ పెళ్ళికూతుళ్ళ మల్లే ముస్తాబయ్యారు.'
    "ఇక పెళ్ళికూతురులా ముస్తాబవ్వాల్సింది నువ్వు. మేం కాదులే." అంది కృష్ణవేణి.
    సాయంత్రం శాంతా రఘూలూ దిగారు. సరూని అందుకొంటూ క్షేమసమాచారాలు పరామర్శించింది. కృష్ణవేణి. శాంతకూడా ఎవ్వరికీ తీసిపోకుండా నిండైన అలంకరణలో వుంది. పచ్చగా బొద్దుగా చూడ ముచ్చటగావున్న సరూముద్దులు మూటకడుతూంది.
    రఘూ రాగానే మాధవ్ శ్యామసుందరుల కబుర్లలో చేరిపోయాడు.
    ఆ సమావేశం అందరికీ ఆనందమయంగా తోచింది. ఇంత చిత్రమైన సమావేశానికి కారణం ఎవరు? అనుకొంటే "దైవం" అనిపిస్తుంది ప్రతీ మనసుకూ.
    అరుణతో కథపుట్టింది. మాధవ్ తో కదిలింది. కృష్ణవేణితో నడిచింది. రేణూ శాంతలతో మలుపు తిరిగింది. శ్యామసుందర్ తో అందమైన మరో బాట చేరింది.

                             *    *    *

    అతిధులందరికీ వదిన వడ్డన ప్రారంభించింది.
    శాంత పాపాయి నెత్తుకొని సమీపంలోనే తిరుగుతూన్న కృష్ణవేణీ వాళ్ళమ్మ రేణు నుద్దేశించి-"అంతా పెళ్ళిళ్ళు చేసుకొని చిలకాగోరిం కల్లా వుంటున్నారు. ఇక నీదే ఆలశ్యం అమ్మాయ్ రేణూ!" అంది.
    "నిజమే పెద్దమ్మా! వీళ్ళందర్నీ చూస్తూంటే నాకూ అలానే అనిపిస్తోంది సుమా" అంటూ నవ్వింది రేణు.
    "మరి ఆలశ్యమేమిటి మరదలుగారూ? వరాన్వేషణ ప్రారంభించకూడదూ?" అంది వదిన నవ్వుతూ.
    "ఆబాధ్యతే నాడో మాబామ్మ బుజాలపైనే వుంచేశాను - వదినా! స్నేహితురాళ్లిద్దరూ శాంతా కృష్ణవేణీ స్వంతపెత్తనాలు చెలాయించి ఎంతలేసి గొడవలు తెచ్చిపెట్టుకున్నారనీ!"    
    "మీబామ్మ బుజాలమీద పడేస్తే ఏతాత య్యనో కట్టబెడతానంటుందేమో!" శ్యామసుందర్ ప్రశ్నించాడు. రేణు అతినిర్లక్ష్యంగా జవాబిచ్చింది-"బుద్ధిగా ఆ తాతయ్యనే కట్టుకుంటాను."
    అంతా ఫక్కుమన్నారు. "అబద్ధంకాదు రేణు చెప్పేది. వాళ్ళ బావపేరు వాళ్ళ తాతయ్య పేరే. బంధువులంతా అతన్ని తాతయ్యే అని పిలుస్తారట కూడాను. ఇప్పుడు ఫారెన్ లో చదువు తున్నాడు. ఆ సంబంధమే వాళ్ళబామ్మ చేస్తానంటుంది."
    శాంత చెప్తూంటే రేణు తలదించుకు అన్నంలోకి చూస్తూ వుండిపోయింది.
    "అదీ సంగతి? మొత్తానికి రేణు అందర్నీ మించిపోయింది. బలే గడుసుది." అన్నాడు మాధవ్.    
    "అయితే మీబావ ఎలా వుంటాడేమిటి రేణుకా?" రఘూ ప్రశ్నతో రేణు తలెత్తి చూసి నవ్వింది చిన్నగా. రేణు బుగ్గల్లో గులాబీల రంగు కూడుకొంది. కళ్ళలో కొంటెదనం బోయి ఏదో కొత్తదనం నిండుకొంది.
    "మీబావ ఎక్కడో దేశంగాని దేశాల్లో వుంటే ఇక్కడ నువ్వింత సిగ్గుపడిపోతావెందుకూ?" అంటూ హాస్యమాడాడు శ్యామసుందర్. అంతా మరొకసారి ఫక్కుమన్నారు.
    "బావుంది. మీబావ ఎలా వుంటాడని అడిగితే ఏం చెప్పను? మీకెవ్వరికీ మాత్రం తీసిపోడు." అంది రేణు.
    "అదే చూస్తాం. పెళ్ళికి పిలవటం మర్చిపోకు". అంది అరుణ. "అది ఎమ్మెస్సీ చదువుతుంది. రెండేళ్ళు మనం ఓపికపట్టి వుండగల గాలి." అంది కృష్ణవేణి.
    అంతా అన్నాల్లోవుండగా అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడు. అతిధులందర్నీ పేరు పేరునా సంతోషంగా పరామర్శించాడు.
    నాలుగురోజుల క్రిందట-"బావగారూ! నాలుగురోజుల్లో నా ఫ్రెండొకడు భార్యతో కలసి ఇక్కడికి వస్తున్నాడు" అని శ్యామసుందర్ అన్నప్పుడు అన్నయ్య నవ్వి అన్నాడు. - "మీకు లేని అభ్యంతరం నాకే ముంటుంది బావగారూ? మీ సహృదయతకి మేమంతా ఋణపడివుంటాం -కానీ ఇకమీదట చెల్లాయిని బెదిరించకండి."
    "ఏం? మీ చెల్లాయికీ తెలుసుగా జడిపించటం." అన్నయ్య కెలా తెలిసిందా? అని విస్తుపోయింది కృష్ణవేణి.
    "అన్నయ్యతో ఎందుకు చెప్పావు వదినా?" అంటే వదిన నవ్వి వూరుకుంది.
    అన్నయ్య పరామర్శలతోపాటు భోజనాలు ముగిశాయి. హాల్లోకూర్చుని తమలపాకులు వేసుకుంటూన్న సమయంలో కృష్ణవేణి సరదాగా రఘూనీ, అరుణనీ వుద్దేశించి హాస్యమాడింది -"ఏం బావగారూ? మీకు శాంతకూ రెండు గదులిమ్మంటారా? ఒకటి చాలంటారా? అరుణా నువ్వుకూడా-రెండుమంచాలు వేయించనా?" అరుణ నవ్వింది-"పొరపాటు చేస్తే దెప్పిపొడుస్తారనుకో. కాని మీ సంగతి మాత్రం నాకు తెలీదనుకొంటున్నావా?"
    "కాదులెండి వదినగారూ! కృష్ణవేణి అలిగి కూర్చోదు. ఎప్పుడూ బోలెడు కబుర్లు చెప్తుంది." శ్యామసుందర్ మాటలకు కృష్ణ వేణి అమితంగా సిగ్గుపడిపోయింది. చిరుకోపంతో కళ్ళతోనే భర్తని మందలించింది.
    "మీ హాస్యాలు నాకేం నచ్చలేదు. నేను వెళ్ళి పడుకుంటాను" అంటూ లేచింది రేణు రుసరుస లాడుతూ.
    "అయ్యయ్యో! నువ్వెళ్ళిపోతే సభకి అందమే పోతుంది. ఎలా వెళ్తావు?" అంటూ మాటలతోనే అడ్డుపడ్డాడు శ్యామసుందర్.
    "ఈ నాలుగురోజులూ ఇలా కబుర్లు చెప్పుకొంటూ కూర్చోటమేనా? కాస్తఎటైనా తిరగటం వుంటుందా?"
    "అంతా సాయంత్రానికే కదా కలిసింది. రేపట్నుంచీ షికార్లూ, సినిమాలూ-ఫోటోలూ-పార్టీలూ అన్నీ" అంది కృష్ణవేణి.
    "నాకు తెలీకడుగుతానూ. పర్స్ ఎవరిదీ?" రేణుకి ధర్మసందేహం.
    "నాకు తెలుసుగాబట్టి చెప్తున్నాను. అరుణ పర్స్ బరువుగా వుంటుంది మరి." అనేసి వూరుకున్నాడు మాధవ్.
    "అవును. పెత్తనం మీరు చెయ్యండి. గొప్పగా వుంటుంది." అంటూ నవ్వింది అరుణ.

                             *    *    *

    తర్వాత మూడురోజులూ మూడు క్షణాల్లా సరదాగా గడిచిపోయాయి. ప్రతీ బిల్లూ కృష్ణ వేణి అందుకొని శ్యామసుందర్ చేతిలోపెట్టేస్తూ వుండేది.
    వీడ్కోలు సమయంలో వదిన శాంతకీ - రేణుకీ - అరుణకీ - కృష్ణవేణికీ కుంకుమతో పాటు చీరలిచ్చింది. చి. సరూకి సిల్కుగౌనూ!
    కృష్ణవేణి ఉత్తరాల కట్ట అరుణకిస్తూ - "రావుగారూ రాసినవి అరుణా! చదువుకో, నీకు చాలా వుపకరిస్తాయి." అంది. అరుణ వాటిని పదిలపరుచుకొంది.
    శాంత పుట్టింటి కెళ్ళిపోయింది.
    చల్లటిరాత్రి కారుప్రయాణం సౌఖ్యంగా వుంటుందని అరుణకిష్టమట. అరుణా మాధవ్ లు సంతోషంగా వీడ్కోలు తీసుకున్నారు. చేరగానే లెటర్ రాస్తామంటూ.
    "నీకు మాధవ్ ని చూస్తే ఎటువంటి ఆలోచనలూ రాలేదా?" అన్నాడు శ్యామసుందర్ కృష్ణవేణితో ఆరాత్రి.
    కృష్ణవేణి చాలాసేపు మవునంగా వుండి పోయింది. - "నాకు ఇప్పుడు మాధవ్ పూర్వం మాధవ్ లా కన్పించలేదు. మా ఇద్దరికీ ఏదో స్నేహం వుందని కూడా అనిపించలేదు. మాధవ్ ని నేను అన్నయ్యగా మాత్రం భావిస్తున్నాను. మీరు అర్ధమైన క్షణమే నాలో అనుకోనిమార్పు వచ్చింది. మీవంటి భర్త అంతభాగ్యం నాకొక్క దానికే. అసలు మిమ్మల్ని నేనెలా పూజించుకోవాలో తెలుసుకోలేకపోతున్నాను. నన్ను నమ్మితే. అదృష్టవంతురాలిని-"చూస్తూండగానే కృష్ణ వేణి కళ్ళవెంట కన్నీళ్లు జలజలారాలిపడ్డాయి.
    "ఇంకా బాధపడతావా? తప్పుకదూ? నిన్ను క్షమించమని అంతరాత్మ ప్రబోధించింది. తిరిగి నీ దగ్గిరకి వచ్చాను. ఇద్దరం బ్రతుకంతా కలిసే ఉంటాము. ఈపైన ఇద్దరం ఒకటి. ఎవ్వరూ బాధపడకూడదు కృష్ణవేణీ!"    
    శ్యామసుందర్ మాటలు వింటూ కాళ్ళదగ్గిరే కూర్చుంది కృష్ణవేణి.
    తప్పు అనేది అందరూ చెయ్యరు. కానీ తప్పుచెయ్యటం క్షమించరాని నేరం మాత్రం  కాదు-అనుకొని క్షమించి ఆదరించగలిగే క్షమాగుణంకూడా అందరికీ వుండదు. ఉన్నవాళ్ళ మహానుభావులే.
    శ్యామసుందర్ పసిపాపలా నిద్రపోతున్నాడు. కృష్ణవేణి అప్రయత్నంగా భర్త పాదాలు తాకికళ్ళు కద్దుకొంది. సమీపంలోనే టేబుల్ మీది రాధా మాధవులను చూస్తూ భర్తని గుండెలకి చేర్చుకొంది.


                       ----:  సంపూర్ణము  :----


 Previous Page

WRITERS
PUBLICATIONS