Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 45


    " కాదు. ఇన్ని రోజులకు నా అందం గమనించినందుకు!"

    "మొదటి రోజే గమనించాను. ఆరోజే ఆ మాట అంటె చెంపలు పగిలేయి." అన్నాడు.

     "అందమైన మీ బుగ్గలు ఇన్సూర్ చెయ్యి."

    " ఇన్సూర్ నీదగ్గరే చేస్తాను."

    "నేను నాల్గు కాలాలుపాటు క్షేమంగా బ్రతకాలని లేదా!"

    "శ్వేతా!"

    "అయామ్ సారీ సిద్దార్థ!అనాస్ జోకింగ్-"అప్యాయంగా అతని భుజం తట్టింది.

    "శ్వేతా!నువ్వెవరు?"ఆచేతిని గుప్పిట్లో బంధించి అడిగాడు.

    "నేను --నేనే-- ఇదేం ప్రశ్న."

    "నీ ఊరు, పేరు--"

    "నా పరిచయం పూర్తిగా తెలిస్తే గాని ప్రేమించలేరా!"

     "లేదు శ్వేతా! ప్రేమకోసం కాదు. ఈ పరిస్థితులు ఇప్పటికే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నువ్వు ఒక మామూలు టీచరువంటే నమ్మకం కలుగటం లేదు."

    " మరి గృహిణిలా కనిపిస్తున్నానా!"

    "నువ్వలా మాట్లాడితే నేనేం చెప్పలేను."

    ఆమె ఆప్యాయంగా అతని చేయి తీసి పెదవులకి తాకించుకున్నది.

    " సిద్దార్థా! అయిలవ్ యూ--అయి లైక్ యు.అవసరం అయి నప్పుడు అన్ని విషయాలు చెబుతాను కదా." అన్నది.

     అతను అప్రయత్నంగా ఆమె భుజాలు పట్టి!ఆమెను దగ్గరగా తీసుకున్నాడు.ఆవేశంగా ఆమె బుగ్గలు, నుదురు తడిపేసాడు.

     "భేటీ--"

    ఇద్దరూ దూరం జరిగారు.కరీమ్ చాచా వచ్చాడు.అతని ముఖం ఎందుకో గంభీరంగా ఉంది.

     అతను ఆ చుట్టు ప్రక్కల ఉంటాడని తెలిసి తొందర పడిందేమో.

    వచ్చి వారి ప్రక్కన కూర్చున్నాడు.   

     "మొదటి నుండి నాకు అందరూ కలిసిపోయి పని చేసుకోవాలని పిస్తుందయ్యా!ఏది- అమీర్ గనే వుంటనంటడు."అన్నాడు.

    అతని మాటల్లో ఓ హెచ్చరిక కనిపించింది.

     "నువ్వు బీద దానివి"అని శ్వేతకు సందేశం ఉన్నది.

    ఇద్దరు బుద్దిమంతుల్లా దూరం జరిగారు.

    "యువత...అదే మీ అసుంటి పోరలు హిమ్మత్ చేసినా పెద్దోల్లు సాగనియ్యరు."అన్నాడు.

    "నాకు తెలుసు చాచా! నేను వారి ఆటలు సాగనియ్యను."హామీ ఇచ్చాడు కరీమ్ చాచాకు.

    "బేటీ! మీ చాచీ ఏదో మీఠా దాచి పెట్టింది...." అన్నాడు.

    శ్వేత వెళ్ళి ఇద్దరికి స్వీట్స్ తెచ్చి పెట్టింది.

     "మీరు తీసుకొండి చాచా."

    "నేను ఇన్నెళ్ళు జాంకాయ యాపారం చేస్తున్న బేటా. నాకు జాంకాయ రుచి తెల్వదు. కొన్ని కొందరే తింటారు."అన్నాడు.

    ఇద్దరూ నవ్వారు ఇద్దరూ బయటికి వచ్చారు.

     "శ్వేతా! వీలుంటే రేపుదయం చెరువు ఒడ్డుకురా. నీకొక అద్బుతమైన ప్రేమ ప్రపంచం చూపుతాను."అన్నాడు మెల్లగా.

    "అలాగే. హద్దు మీరకూడదు."

    " అయామ్ సారీ! తప్పు నీది. అంత అందమైన కళ్ళతో కవ్విస్తే నేనేం చేయను. ఒక పని చెయ్యి గాగుల్స్ పెట్టుకో," అన్నాడు.

    "అలా అయితే మనం ఏకాంతంగా కలుసుకోవద్దు."

    " నువ్వేదో బుద్దిమంతుడవనుకున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS