Previous Page Next Page 
ఒప్పందం పేజి 45

 

    తీరిగ్గా , పెన్, లెటర్ పాడ్ తీసుకుని వ్రాయసాగింది. ఏమని సంభోధించాలి. శ్రీమతా, కుమారా! కాసేపు అలోచించి చివరకు మాధవి గార్కి అని మొదలు పెట్టింది.
    "మాధవి గార్కి
    నమస్తే,
    మీ సీరియల్ 'వాడిన పూలు' నాకెంతో నచ్చింది. ముందుముందు ఏమవుతుందో అని ఆతృతగా వుంది. నాకు మధు, కల్యాణి పాత్రలు చాలా నచ్చాయి. నాకు ఇలాంటి అద్భుతమైన పాత్రలు సృష్టించాలనే కోరిక ఒకటి గాడంగా ఉంది. మీతో పర్సనల్ గా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మనము ఎక్కడైనా కలుసుకోవటానికి ఏర్పాటు చేయగలరా? ఇలా వ్రాస్తున్నందుకు అన్యధా భావించరని తలుస్తాను. మీతో ఎన్నో మాట్లాడాలి. మిమ్మల్ని చూడాలి అని తహతహగా వుంది. నన్ను మన్నించి జాబు వ్రాస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.
    మీ జాబు కోసం వేయి కళ్ళతో నిరీక్షిస్తూ.
     అనుపమ
    పి.ఎస్. మీ కల్యాణి కి ఈ అనుపమ కి స్వభావంలో చాలా పోలికలున్నాయి.
    మీరే చూస్తారుగా....అను.
    రాజుని పిలిచి కవర్ తెప్పించి వెంటనే పోస్టు చేయించింది. అప్పటి నుంచీ తను మొదలు పెట్టబోయే కధకు బదులు ఈవిడ లెటర్ వ్రాస్తుందా! లేదా! అని ఆలోచించసాగింది. వ్రాస్తే బాగుండు. యేమని రాస్తుంది?ఒకవేళ.... కలుసుకోమని రాస్తే ఎలా? ఎలా కలుసుకోవాలి? ఒకవేళ కలుసుకున్నా ఏం మాట్లాడాలి. ఎందుకు రాశానా అని దిగులుపడింది. పోస్ట్ చేసిన దగ్గర నుంచి మూడు రోజులు వరుసగా పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అతను రాగానే ఒక్క పరుగున బయటికి పోతుంది. తీరా అది పక్క వాళ్ళతో ఎవరికో అయ్యుంటుంది. అతన్ని వెనుక నుంచి కసిగా తిట్టుకుంటూ , నిరాశగా లోపలి కెళ్ళింది. ఆరోజు పోస్ట్ మేన్ ను చూస్తూనే బయటకు పరుగెత్తింది. అతను ప్రక్క వాళ్ళ కీయగానే వళ్ళు మండిపోయింది. వెనక్కి వెళ్ళబోతుంటే "మీకూ కూడా వుందండీ" అన్నాడు. ఆత్రంగా అతని వేపు చూసి చేయి చాచింది. అతను ఎం.ఒ. ఫారం జేబులో పెట్టుకుని తన కవరు ఇచ్చేలోగా ఆలస్యాన్ని భరించలేనిదానిలా "త్వరగా ఇవ్వండి" అంది విసుగ్గా. అతను కవర్ ఇవ్వగానే తడబడే అడుగులతో లోపలి కెళ్ళి త్వరత్వరగా కవర్ చింపి లెటర్ తీసింది. చేతులు వణకసాగాయి. కళ్ళు ఆదుర్దాగా అక్షరాల వేపు పరుగెత్తాయి.
    "అనుపమగార్కి
    మీ నమస్కారాలు స్వీకరిస్తూ తిరిగి నా నమస్కారాలు అందిస్తూ, నా సీరియల్ మీకు నచ్చుతున్నందుకు సంతోషం. కల్యాణి, మధు లాంటి పాత్రలు సృష్టించాలనే మీ అభిలాషకు నేను అభినందిస్తున్నాను. తప్పకుండా సృష్టించండి. ఒక రచయితకి ఇంకో రచయిత తో స్నేహం చేయాలి అనే ఉంటుంది గదా! కాబట్టి మీరు నన్ను కలుసుకోవచ్చు. ఇన్నాళ్ళ నుంచి మనం ఒక ఊళ్ళోనే వుంటూ కలుసుకోలేక పోవడం విచారించదగ్గ విషయం. ఆదివారం మూడు గంటలకు బిర్లా టెంపుల్ కు వస్తారుగా , అక్కడ కలుసుకుందాం. మీరు ఏం చీర కట్టుకునేది వ్రాస్తే, కొంచెం ప్రత్యేకంగా కనిపించేవి కట్టుకుని వస్తే మిమ్మల్ని గుర్తుపట్టే అవకాశం వుంటుంది. కాబట్టి తప్పకుండా రండి. మీ వేయి కళ్ళలో సగం నాకిస్తే వాటితో మీ జాబుకోసం నిరీక్షిస్తూ.
                    మీ మాధవి.
    ఒళ్ళంతా పులకించిపోయింది అనుపమకి. ఎంత చిలిపిగా ఉందీ ఉత్తరం. ఉత్త అల్లరి దట్టుందీవిడ. కుమారే అయ్యుంటుంది. అందుకే ఇలా వ్రాసింది. ఎంత బాగుందీ ఉత్తరం. మనిషి ఇంకెంత బాగుంటుందో! ఆదివారం, ఇంకా అయిదు రోజులు. అబ్బా యుగాల్లాగా అయిదు రోజులు నిరీక్షించాలా ఇంకా! ఛ...ఛ.... త్వరగా ఆదివారం వస్తే బాగుండును. వెంటనే లెటర్ వ్రాసింది అనుపమ.
    "మాధవిగార్కి , మీ లెటర్ నన్ను నిజంగా ఆనంద సాగరంలో ముంచింది. ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఉంది. ఆదివారం నాటి మధుర క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఎర్రటి బోర్డర్ వున్న తెల్లచీర కట్టుకుంటాను. ఎర్రటి జాకెట్ వేసుకుంటాను. తలలో కనకాంబరాలు పెట్టుకుంటాను. చాలా వివరాలు ఇంకా ఏమి వ్రాయాలో మీరు కూడా వీలైతే నాలాగే డ్రెసప్ అయి రండి . ఎదురు చూస్తుంటాను.
                మీ అనుపమ"
    ఆ లెటర్ పోస్టు చేసి ఆదివారం కోసం నిజంగానే క్షణ మొక యుగంలా గడపసాగింది. "అబ్బా ఇంకా నాలుగు రోజులు. ఒకరోజు గడిచింది. మూడే రోజులు....ఇంకా రెండు రోజులు... ఒకే ఒక్క రోజు.... ఓహ్ 24 గంటలు... మైగాడ్ ఇంకా రెండు గంటలు... అలా ఆదివారం మధ్యాహ్నం దాకా క్షణాలు లెక్క పెట్టుకుంటోంది. ఇంకా ఒక గంట.గబగబా తయారైంది . ఎలా? ఎలా మాట్లాడాలి? యేమని మాట్లాడాలి? ప్చ్ ఆవిడ బాగా మాట్లాడుతుందేమో ఎంతైనా రచయిత్రి కదా.... తన అనుమానాలన్నీ ఈరోజు తీర్చేసుకోవాలి. టాయ్ లేట్ అవుతూ కూడా ఆలోచిస్తోంది. ఐదు అవగానే "అమ్మా నేను వనజా వాళ్ళింటికి కేళుతున్నాను. ఒక గంటలో వచ్చేస్తా" అని తల్లితో చెప్పి రోడ్డు మీద కొచ్చింది.

                                    ***

    చల్లగా ఉన్నచోట నుంచుని చుట్టూ చూసింది అనుపమ. జంటలు జంటలుగా అడ, మగా అక్కడక్కడా కూర్చున్నారు. పిల్లలు గోలగోలగా అరుస్తూ ఆడుకుంటున్నారు. అనుపమ లో ఆత్రం హెచ్చింది. చుట్టూ చూసింది. క్రింద ఉన్న ఇళ్ళు, రోడ్డు మీద సాగిపోయే కార్లూ, బస్సులూ ఆటవస్తువుల్లా కనిపిస్తున్నాయి.
    "ఇంకా రాలేదేం ఈవిడ" విసుగ్గా వెనక్కి తిరిగింది. ఆమెకి అతి చేరువలో నుంచున్న యువకుడు చిరునవ్వుతో "హలో" అని విష్ చేశాడు. చిరాగ్గా అతడి వైపు చూసి ముందుకి నడిచింది. 'ఆడపిల్ల వంటరిగా కనిపిస్తే చాలు....' తిట్టుకుంది మనసులో.
    "ఎవరి కోసమో ఎయిట్ చేస్తున్నట్టున్నారు" అతని కంఠం తిరిగి వినిపించింది.
    "ఎవరి కోసమైతే మీకెందుకు?" అనేసి గబగబా వెళ్ళి చెట్టు క్రింద కూర్చుంది.
    "అనుపమా దేవి...." చివ్వున తలత్రిప్పి చూసింది. అతనే....
    "మీరు....మీరు ....నాపేరు మీకెలా తెలుసు?' తడబాటుతో ఆశ్చర్యంగా అడిగింది.
    "మీకు మాధవి తెల్సినట్టే నాకు మీరు తెలుసు" చిలిపిగా నవ్వాడు.
    "అంటే...మీరు....మాధవా?"
    "హమ్మయ్యా....ఇప్పటికి గుర్తుపట్టారన్న మాట ...థాంక్స్...."
    "ఇలా సస్పెన్స్ లో ఎందుకు పెట్టారు?"
    "సస్పెన్సా ...." అమాయకంగా అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS