Previous Page Next Page 
ఒప్పందం పేజి 44

 

                                    వర్ధమాన రచయిత్రి

    కధ వ్రాయాలి ...ఎలా ?
    ఏమని వ్రాయాలి? ఏమైనా సరే వ్రాసి తీరాని. ఏమని ఏమిటి నా మొహం.... మంచి ఇతివృత్తం తీసుకోవాలి. అద్భుతంగా రాయాలి. ఈసారి తిరిగి రాకూడదు. రానివ్వకూడదు. చదివినవాళ్ళంతా ఆహా అద్భుతంఅనేట్టు వ్రాయాలి.
    ఎలావ్రాయాలి? అసలెలా మొదలుపెట్టాలి? ఎలా ముగించాలి? ఏం ధీమ్ తీసుకోవాలి? దారినపోయే బిచ్చగాడ్ని తీసుకుంటే, ఊహూ లాభం లేదు. అది ట్రెజడీ చేయాలి.... అయినా చాలామంది వ్రాశారు అలాంటివి. ఎవరూ వ్రాయని విధంగా వ్రాయాలి. ఎవరికి రాణి ఐడియాలన్నీ నాకే వస్తే ఎంత బాగుండు. అందరిలాగా వ్రాస్తే గొప్పేముంది? ప్రత్యేకత ఉండాలి. వెధవది అన్నీ చదివిన కధలే....ఎలా?
    బుగ్గన పెన్నా నించుకుని తదేకంగా కిటికిలోంచి ఆకాశంలోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంది. కాబోయే ప్రఖ్యాయ రచయిత్రి కుమారి అనుపమ. ఆకాశం గూర్చి వ్రాస్తే ....! ఉన్నట్టుండి హటాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఊహూ బాగుండదు.ఆకాశం కవితా వస్తువు కాని కధావస్తువుకాదు.
    ఇప్పటి దాకా ఎన్నో విషయాల గూర్చి బోలెడు కధలు వ్రాసింది. అన్నీ కలిపి పాతికకిపైనేఉంటాయి. వాటిలో కనీసం పదిహేను అయినా పత్రికలకు పంపించింది. పాపం అన్నీ యజమానురాల్ని వదిలి వెళ్ళలేక అనుపమ ని వెతుక్కుంటూ ఇంటికి తిరిగి వచ్చాయి. మొట్టమొదటి రచన తిరిగి రాకుండా ఉండాలని, తిరిగి వచ్చేందుకు స్వంత చిరునామా గల కవరు స్టాంప్స్ అవి లేకుండా పంపించింది. కాని ఆ పత్రికల వాళ్ళు ఈ అమ్మాయి ఎంతగా ఎదురు చూస్తుందో జవాబు కోసం అని ముచ్చటగా లెటర్ వ్రాశారు.
    'అమ్మా నీ రచన ప్రచురణకి స్వీకరింపబడలేదు. కావున మా ఫైల్స్ మరీ బరువుతోక్రుంగి పోతున్నాయి. ఆ ఫైల్స్ మీద దయ చూపి వెనక్కి తీసికెళ్ళి వాటి బరువు దించు" అని అర్ధం వచ్చేలాగ....ఆ లెటర్ చూసి నిరుత్సాహపడ్డా పోనీలే మొట్టమొదటి కధ కదా! అని, ఎన్ని రాళ్ళు విసిరితే ఒక్కటి తగులుతుంది అని సరిపెట్టుకుంది.
    ఇది జరిగి రెండు సంవత్సరాలైంది. ఇంతవరకూ రాసి పంపిన పదిహేను కధలు ఒకదాని వెంట ఒకటి వరుసగా పోటీలు పడుతూ తిరిగి వస్తుండేటప్పటికి అనుపమ ఉక్రోషంతో మండిపడేది.దానికి తోడూ ఇంట్లోతమ్ముళ్ళు, చెల్లాయిలు, అన్నయ్యలు ఎగతాళి చేయటం, విరగబడి నవ్వటం... ఆమె కోపాన్ని రెట్టింపు చేస్తుంది. వాళ్ళందరి మీది కోపం ఆ కాయితాల మీద చూపించి, వాటిని పరపరాచించి కిటికీ లోంచి గిరాటేసి లోపలి కెళ్ళి వెక్కివెక్కి ఏడ్చేస్తుంది.
    అసలు అయినా తన ఫ్రెండ్స్ అంతా "నీ కధలు బాగుంటాయే అనూ! చాలా బాగా వ్రాస్తావు. ఇప్పుడు వచ్చే కధలు ఏమంత బాగుంటున్నాయి. వాటి కన్నా నీవివెయ్యి రెట్లు నయం.ఎందుకు తీసుకోవటం లేదో గాని...."
    'అయినా ఈమధ్య రికమెండేషన్ లేనిది కధలు కూడా వేసుకోవటం లేదుట....' అని అంటున్నారు. చదివిన వాళ్ళంతా తన కధలు బాగుంటాయి అనే అన్నారు కాని, ఇంతవరకూ ఒక్కరూ బాగాలేవు అనలేదు.ఈ పత్రిక వాళ్ళకి ఎందుకు నచ్చటం లేదో గాని..."
    తనకి రోజూబోలేడు ఐడియాలు వస్తాయి. అన్నీ వ్రాసేసింది. మరి ఒక్కటీ అచ్చవలేదు. మరి ఎలాంటివి నచ్చుతాయి వీళ్ళకి.
    ఒకరోజు అనుపమ వ్రాసుకుంటుంటే సెవెన్త్ క్లాసు వేలగబెడ్తున్న చెల్లెలు వచ్చి పెద్ద పెట్టున రాగం ప్రారంభించింది. అను ఏమిటే? ఏమైంది? అని చూస్తె తన చేతులోంచి నోట్ బుక్ లాక్కుని కాళ్ళు తపాతపా నేలకేసి కొడుతూ తల్లిదగ్గరికి వెళ్ళి ..."అమ్మా ఇటు చూడు అక్క నా స్కూల్ నోట్సు నిండా పిచ్చిపిచ్చిగా రాస్తుందీ " అని ఫిర్యాదు చేసింది.
    "నీకధలు  తగలెయ్యా! ఒక్కటీ అచ్చయి చావటం లేదు. పుస్తకాలన్నీ తగల బెడుతున్నావుటే...." అని ఆవిడ అనుపమనే తిట్టింది. కోపంతో ఒళ్ళు ,మండింది అనుపమకి. తల్లి చేతుల్లోంచి నోట్ బుక్ తీసుకుని తన పేరు చూపిస్తూ "ఏమే గుడ్డీ ఇది ఎవరి నోట్స్" అంది కళ్ళెర్రజేస్తూ , అది బిక్కమొహం వేసి "నాకేం తెలుసు ఆ బొమ్మా, నా నోట్స్ మీది బొమ్మ లాగే ఉంటె నాదనుకున్నాను" అంది తనని తను సమర్ధించుకుంటూ.
    "ఏడవలేక పోయావ్...రెండు తంతే సరి. ఎలా అనుకుంటావు నీదని...." అని తిట్టి అక్కణ్ణించి వచ్చేసింది.
    'ఛ...ఛ మూడ్ చెదరగొట్టేసింది" అని తిట్టుకుంది . తరువాత ఇంకో రోజు. 'అన్నయ్యా! కాస్త ఇది పోస్ట్ చేయవా?' అని ఒక కధ అన్నయ్య కిస్తే దాన్ని టేబిల్ మీద విసిరేసి "నాకేం పనిలేదా? వెధవ చచ్చు రాతలు రాస్తూ కధలని పేరు పెట్టి పోస్టల్ ఖర్చులన్నీ దండగ చేస్తావు....ఒక్కటీ అచ్చవదు" అన్నాడు.
    ఉక్రోషంతో అనుపమ "నువ్వు చేయనని చెప్తే నేనే చేసుకుంటానుగా! ఇన్ని మాటలెందుకు? నావి చచ్చు కధలని నువ్వొక్కడివే అన్నావు. అయినా నా అదృష్టం బాగాలేక అచ్చవటం లేదు కానీ కధలు బాగుండక ఏం కాదు....' అన్నది.
    "అహహ వచ్చిందమ్మా మహా రచయిత్రి. నీ కధల్లో లోపాల్లేక వెతికి, వెతికి ఇహ విసుగొచ్చి, అమ్మా లోపాల్లేని కధలు మేము వేసుకోవడం లేదు కాబట్టి మరో సహజత్వం లేకుండా కాస్త సినిమాటిక్ గా వ్రాయి -- వేస్కూంటాం అని తిప్పి పంపిస్తున్నారు' వెక్కిరింతగా అని వెళ్ళిపోయాడు.
    'అనుపమా! ఇలారా ఈ వంకాయలు తరిగిచ్చి పో" లోపల్నుంచి శాంత కేక వినిపించడంతో ఉలిక్కిపడి పెన్ కి కేప్ పెట్టి కాగితాల మీద పేపర్ వెయిట్ పెట్టి ఒక్క పరుగులో వంట యింట్లోకి వచ్చింది. "పని వున్నప్పుడు కూడా వెధవ రాతలు వ్రాయకపోతే ఏం? పేపర్లన్నీ పాడు చేస్తావు" అన్నది విసుగ్గా ఆవిడ.
    "ఉండమ్మా! ఈసారి పంపించే కధ తిరిగి రాదు చూసుకో! తప్పకుండా అచ్చయి తీరుతుంది. నవ్వినా నాపచెను పండదా! నలుగురు మెచ్చురోజు ఉండదా!" కూనిరాగం తీస్తూ కత్తిపీట , వంకాయలు ముందరేసుకు కూర్చుంది. పాట ఆపి వంకాయలు తరుగుతూ తిరిగి ఆలోచనల్లో పడింది. ఒక్కసారి నా కధ పడితే మిగతావి అవే అచ్చవుతాయట. అయినా ఎవరూ వేసుకోకపోతే పేరు ఎలా తెలుస్తుంది? ఏవిటో పిచ్చి లోకం నిట్టూర్చింది. "వంకాయ గూర్చి ఒక కధ రాస్తే " హటాత్తుగా వచ్చింది ఆలోచన. "ఛీ ఛీ ....వంకాయ గూర్చేమిటి' అనుకుంది. మళ్ళీ "ఏం ఎవరో ఒకావిడ కత్తీపీట గూర్చి వ్రాసింది. వంకాయ గూర్చి ఏం అసలు కవికీ, రచయితలకు ప్రతిదీ కధావస్తువే , కవితా వస్తువుట-  ఇంకేం వ్రాస్తే సరి. అబ్బే వంకాయ గురించి బాగుండదు. పోనీ ఉల్లిగడ్డ గురించి వ్రాస్తేనో, వెధవది ఉల్లిగడ్డ తరుగుతుంటే చచ్చే ఘాటు. కళ్ళనీళ్ళు వస్తాయి.ఉల్లిగడ్డ కు ఏదో రూపం కూడా ఉందిట. వ్రాస్తే సరి.
    "ఇవ్వాళ అవుతుందిటే ఆ తరగటం" తల్లి మాటతో త్వరగా త్వరగా తరగడం ముగించి వంకాయ ముక్కలు , ఉల్లిగడ్డ ముక్కలు ఆవిడ కిచ్చింది.
    మరోసారి మరోపని అలా పనులతోటే గడిచింది రాత్రి ఎనిమిది దాకా, తరువాత భోజనాలు, మళ్ళీ పని, కానీ ప్రతి పని చేస్తూ దీని గురించి వ్రాస్తే దీని మీద వ్రాస్తే అనుకుంటూనే ఉంది. దేనిమీద వ్రాయాలో తెల్చుకోకుండానే పడుకుంది. పడుకుని ఇంకా ఆలోచిస్తూనే ఉంది. అసలు ఈసారి తిరిగి రాకుండా బ్రహ్మాండమైన కధ వ్రాసేయాలని ఉంది అనుపమకి. కానీ ఒక్క ఐడియా రావడం లేదు. ఏది ఆలోచించినా అన్నీ ఎవరో వ్రాసినవే అవుతున్నాయి. "ఛ అందరికీ నా ఆలోచనల్లాంటి ఆలోచనలే రావాలా పోటీ కాకపొతే" అనుకుంది.
    లాటరీ పిచ్చి ఉన్న నాన్న మీద వ్రాస్తే, రేసేస్ పిచ్చి ఉన్న అన్నయ్య మీద వ్రాస్తే, పోనీ క్రికెట్ చాంపియన్ తమ్ముడి మీద వ్రాస్తే, పోనీ భార్యా విధేయుడైన రాంబాబు మీద వ్రాస్తే , భర్తని చవటని చేసి కీలుభోమ్మలా ఆడించే ఆవిడ మీద వ్రాస్తే.... లాభం లేదు ఇలాంటి వాళ్ళ మీద కూడా బోలెడన్ని రచనలు వచ్చాయి. ఆలోచన పూర్తిగా తెగకుండానే నిద్రలోకి జారింది అనుపమ.
    ఆరోజు, వారం వారం వచ్చే మేగజైన్ వచ్చింది. పేపరబ్బాయి పేపర్ తో బాటు అదికూడ వేసి వెళ్ళాడు. వెంటనే ఆత్రంగా తన అభిమాన రచయిత్రి సీరియల్ ఉన్న పేజీ తిప్పింది. "వాడిన పూలు" అని ఆ సీరియల్ కోసం వారాలు క్షణాల్లా గడిచిపోతే ఎంత బాగుండును అనుకుంటుంది అనుపమ. ఆవిడ రచన లంటే అనుపమ కి ప్రాణం. ఎంతో ఏకాగ్రతతో అక్షరం పొల్లు పోకుండా చదువు తుంది. దీక్షగా చదివేయసాగింది.
    ఏదైనా నవల గాని, ఇలాంటి సీరియల్స్ గాని చదివేటప్పుడు ఆ టైం లో భూమ్యాకాశాలు ఏకమైనా, ప్రపంచం తల్ల క్రిందులైనా అది పూర్తయ్యేదాకా లేవదు. అనుపమ. అప్పుడు ఎంతమంది పిలిచినా పలక్కుండా చదువుతూ కూర్చుంది. సీరియల్ సశేషం అని చూడగానే ఎక్కడ లేని నిరాశ ఆవరించింది.విసుగ్గా పుస్తకం అవతల పడేస్తూ 'మరీ ఇంత కొంచెం వెయ్యకపోతే ఇంకొంచెం వేయకూడదూ"అనుకుంది. "పాపం కల్యాణి చచ్చిపోతుందో ఏమిటో" దిగులుగా అనుకుంది. కల్యాణి ని చంపకూడదు. బాబూ ఆవిడని చంపేస్తే కధేముంటుంది. వీల్లేదు చంపనే కూడదు" ఈ రచయిత్రికి లెటర్ వ్రాస్తే కల్యాణిని చంపకండి అని... ఒకసారి ఆవిడను కలుసుకోవాలని కూడా వుందని వ్రాస్తే సరి. అసలు కధలంటే ఎలా వుండాలి? అని అడిగి తేల్చుకుంటే తన కధల్లో లోపాలు లేకుండా చూసుకోవచ్చు. ఆవిడది ఈ ఊరేట....అడ్రస్ కూడా తెలుసు. వ్రాస్తే సరి. ఎంతో అలోచించి  పాత పత్రికలన్నీ తిరగేసి అడ్రస్ సంపాదించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS