"ఎవరమ్మాయ్ నువ్వు?"
"నారాయణగారి కుమార్తెను" అంటూ వివరంగా చెప్పింది.
"ఇటు విను! నువ్వు చేసిన కంప్లైంట్ ఈ రోజుల్లో సర్వసామాన్యం. అనవసరంగా రభస చేయక! ఎవరువిన్నా నవ్వేస్తారు సుమా! వీలయితే ఎడ్జస్టయిపో. జాబ్ దక్కించుకో. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం ఎట్ ది కాస్ట్ ఆప్ లైఫ్ ఆ విషయం మరిచిపోకు!"
"యూ రాస్కెల్" తిట్టేసింది నంద.
"ఇదిగో అమ్మాయ్! నువ్వు రాంగ్ నెంబర్ కి రింగ్ చేశావు. నిజంగా డియస్పీగారికే నీ ఫోన్ వెళ్ళివుంటే ఏమయ్యేది?"
"అయితే నువ్వెవరు?"
"నేనా నేనెవరో చెప్పినా నీకు తెలియదులే! ఎమ్మెల్యే కావాలంటే నా హెల్ప్ ఉండాలి. సమితికి ప్రెసిడెంట్ కావాలంటే నా చేయూత కావాలి! ఎం.పి.గా నిలబడ్డ వారెవరయినా సరే నన్ను రిక్వెస్టు చేయంది గెలవలేరు. ఉద్యోగం రావాలన్నా, ఉండాలన్నా, ట్రాన్స్ ఫర్ అవాలన్నా వూస్ట్ చేయాలన్నా నా హస్తం ప్రశస్తం. నన్ను గురించి చెప్పుకోవాలంటే బోలెడంత వుంది. అయినా అడగందే చెప్పడం భావ్యం కాదు. ఈ విషయంలో ఇక యింతకంటే మాటాడను!"
"నీ పేరేమిటి?"
"నాకు పేరు లేదు. నా ఫోన్ నెంబర్ డబల్ నైస్! లక్కీనెంబర్!" అంటూ క్రెడిల్ చేశాడు.
ఆవేశం తగ్గిపోయిన నంద నిరాశగా నిస్పృహలతో చూసింది ఆఫీసరు వైపు.
అతను నిస్సహాయంగా చూస్తున్నాడు.
అతన్నే మీ అనకుండా బయటికి నడిచింది నంద.
మరి అంతటి కోపం ఆవేశం ఇప్పుడే మయిపోయాయి?"
నిట్టూర్చింది నంద.
మనిషి పరిస్థితులకి బానిసా? లేకపోతే పరిస్థితులు మనిషికి బానిసలా? ఎవర్నెవర్ని లొంగదీసుకుంటున్నారు? ఈ రోజు ఈ దేశంలో మనిషి పరిస్థితులకి లొంగిపోయాడు-పోతున్నాడు.
వ్యక్తిత్వం లేదు. స్వాతంత్ర్యం లేదు.
అంతటా డబ్బు- డబ్బు- డబ్బు-
స్వైర విహారం చేస్తూంది. ఈ డబ్బు కోసం మనిషి చేయలేని పనిలేదు. మానవుడు ఆఖరికి తను సృష్టించిన డబ్బుకే బందీ అయిపోయాడు.
"అక్కా!" పిలిచింది విమల.
తల విదుల్చుకుంది నంద!
శశికాంత్, విమల పుస్తకాలు మూసేస్తున్నారు.
అప్పుడే తొమ్మిదైపోయిందా అనుకుంది.
భోజనానికి వంటింటివేపు కదులుతుంటే ఇంటివాళ్ళ రేడియో మోగుతున్న వార్తలు వినిపిస్తున్నాయి.
29
"ది సీజ్ ఆలిండియా రేడియో..."
ఇంగ్లీషులో వార్తలు ప్రారంభమయ్యే వేళకి అందరికీ కంచాలు పెట్టింది విమల.
రోజలాగే నలుగురూ కూర్చున్నారు.
రవికాంత్ అలవాటుగా నంద ప్రక్కనే కూర్చున్నాడు.
అన్నం కలిపి పెడుతున్నది నంద.
పచ్చడి, కూర, చారు, మజ్జిగ భోజనం ముగించారు.
చాలా అలసిపోయినట్లుగా అనిపించింది నందకి.
అందరికి రోజుకి ఇరవైనాలుగు గంటలయితే తనకి నలభై ఎనిమిది గంటలులాగా గడిచిపోయింది కాలం.
ఎంతకాలం ఈ బరువు భరించాలి? తను బాధ్యతలకి కష్టాలకి భయపడటం లేదు. కానీ ఈ బరువుకి భయపడుతూంది! ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఈ రోజు మరీ దౌర్భాగ్యంగా గడిచింది.
పదేళ్ళ క్రితం ఎలా వుండేది తను!
తను మాత్రమేనా? తన కుటుంబం ఎంత హాయిగా వుండేది? అసలు దేశం ఎంత సుభిక్షంగా వుండేది.
ఎవరయినా ముసలమ్మలు ఆ రోజుల్ని తలుచుకుని ఈ రోజుల్ని ఈసడించుకుంటూ వుంటే నవ్వేసేది తను.
మరి ఈ పది సంవత్సరాల అనుభవమే తనని వెనుకటి రోజులతో పోల్చుకుని చింతపడేట్లు చేస్తూంటే మరి వాళ్ళకెలా వుంటుంది.
ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విదేశాల్లో ప్రభుత్వం రాకెట్లని ఆకాశంలోకి పంపుతూంది. పరిశోధనకి కొన్ని కోట్లు ఖర్చవుతున్నాయి. మనవాళ్ళు ఏమీ ఖర్చు చేయకుండానే ధరల్ని ఆకాశానికి సునాయాసంగా పంపేస్తున్నారు.
అటు ఇటు అయిన వారికి ఏ బాధా లేదు. మధ్యనున్న వారికి వ్యవసాయదారుడికి, నెలజీతాల వాళ్ళకి దిన దినానికి జీవితం బరువవుతోంది.
ఒక నెలలో వున్నట్లుగా జీవితం మరో నెలలో వుండటం లేదు. అవసరాలు పెరగవు. ఆశలు పెరగవు.
కానీ ధరలు పెరుగుతున్నాయి...
ఫలితంగా కోరికలని కట్టేసుకుంటున్నారు జనం!
ఇది నిర్భంధ పొదువు, సబ్బులు, కొబ్బరినూనె, కంది పప్పు, శనగపప్పు, నూనె, పంచదార ఇవి కూడా లగ్జరీ వస్తువులై పోయాయి.
మనిషికి ఇంతకంటే బాధ వుందా?
"అక్కా! అమ్మకి మందివ్వలేదా?"
తల విదిలించుకుంది నంద. ఆ రోజంతా ఆలోచనతోనే గడిచిపోయింది.
అమ్మకి మందివ్వటం కూడా మరచి తను.
లేచి వెళ్ళి మందు కలిపి ఇచ్చింది.
పక్కింటి నించి రేడియోలో పాటలు వినిపిస్తున్నాయి.
సుందరమ్మ మందు తాగేసి గ్లాసు అందించింది.
"ఇంకా పడుకోలేదమ్మా?"
నిద్దర్రావటం లేదమ్మా! రేపు డాక్టర్నడిగి రెండు మాత్తర్లు తీసుకునిరా!
"అలాగేనమ్మా!"
పక్క మంచంలో వెల్లకిలా పడుకుని పై కప్పు కేసి చూస్తున్నాడు నారాయణ. ఇంకా నిద్రపోలేదు.
"దుప్పటి కప్పనా నాన్నా!"
తలూపేడు నారాయణ.
దోమలు కుడుతూ వుంటే దుప్పటి కప్పుకోవడంకూడా తెలియటం లేదు ఆయనకి.
పక్కనే తల్లికి దోమ తెరకట్టటంవల్ల ఇక్కడ దోమలు విజ్రుంభిస్తున్నాయి.
అందరికీ దోమ తెరలు కొనటం అంటే యజ్ఞంచేసినంత అవుతుంది!
ఎక్కడనుంచి తేవాలి!
అప్పు! అప్పు! తీర్చే సాధనం?
"నందా?"
రవికాంత్ పిలుపుకి ఉలికిపడింది నంద.
"ఆ పాట బావుంది కదూ!"
రేడియోలో పాట వినిపిస్తూంది శంకరాభరణం లోనిది.
దేశాన్నంతా ఒక వూపు వూపేసిన సినిమా!
