27
అప్పు చేయటం గొప్ప కాదు.
తీర్చగలిగే శక్తి వున్నప్పుడే చేయాలి. అది లేనినాడు అప్పు అప్పు కాదు. దయాభిక్ష! దానం.
శక్తికి మించిన దానం అడగటం కూడా తప్పే.
అలా దానం చేయటమూ తప్పే!
నేను మొదట చెప్పాను! మా షాపులో ఖాతాలు లేవని! అయినా మీ ఉద్యోగం చూసి, ఆఫీసులో మీ హోదా చూసి అన్నిటికి మించి మీ అమ్మకి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ లో మందుల పేర్లు మీ ఇంట్లో మందుల అవసరాన్ని చూసి ఇచ్చాను.
కొన్ని సుముహూర్తాలుంటాయి. అప్పు ఇస్తే వెంటనే తీరిపోతాయట. దానికి క్వయిట్ కాంట్రవర్సరీ కూడా వుంటుందని నా కిప్పుడే అనుభవం వల్ల తెలుస్తూంది. చేతులు కాలక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే!
ప్రిస్కిప్షన్ చూపించి మందులు పార్సిల్ చేయించి పట్టుకెళ్ళటం ఒక్కటే మీకు తెలిసినట్లుంది. మళ్ళీ డాక్టరు చీటీ రాస్తే తప్ప మా షాపు ముఖం చూసే అవసరం, అవకాశం వుండవు మీకు. అది మా దురదృష్టం. ఈ రోజుల్లో అప్పు చేసిన గొప్పవాళ్ళు. ఇచ్చినవాడే మూర్ఖుడు. మూర్ఖత్వానికి శిక్ష అనుభవించక తప్పదు కదా!
ఇవన్నీ జనరల్ పాయింట్స్! నా వీక్ నెస్ కి సంబంధించినవి. కానీ మీ వైపు పాయింట్స్ కొన్ని వున్నాయి.
దానికి తోడు మీ బాధ్యతలూ కొన్ని వున్నాయని చెప్పటం అప్పిచ్చిన వాడిగా నా ధర్మం.
అందుకే ఈ చీటీ రాస్తున్నాను.
నేనూ కాలేజీ మెట్లెక్కి చదివాను. చదువు వంట బట్టకపోయినా సంస్కారం కొంత అలవడింది.
వ్యాపారంలో తిరగటంవల్ల కొంత అనుభవం వచ్చింది.
నవలలు చదివీ, సినిమాలు చూడటం వల్లా కొంత జాలిగుండె కూడా ఏర్పడింది.
దానివల్లే ఈ జాబు రాయటం ఏర్పడింది. లేకపోతే అందరి షాపుల్లో అందరి గుమాస్తాల్లాగే పేరు రాసి మొత్తం రాసి పంపిస్తే డబ్బిస్తావా చస్తావా అనే పద్దతిలో వసూలు అయ్యేది. కానీ సంస్కారం సభ్యత అడ్డొచ్చింది.
ఈ ఉత్తరం చదువుకోండి!
ఆపై మీ ఇష్టం!
మళ్ళీ మా షాపు వైపు రావాలంటే ఓ వారంలోగా ఖాతాకి జమ వేయండి, మొత్తం తీర్చమని అడిగే కర్కశత్వం లేదు నాలో అలా జమవేయలేని పక్షంలో ఈసారి ప్రిస్కిప్షన్ని ఇంకో షాపులో ఇవ్వండి. అంతే!
సంబోధన లేదు! సంతకమూ లేదు!
అయితేనేం విషతిక్తబాణం సూటిగా గుండెల్లో దిగనే దిగింది.
"వీరప్పా! నేవచ్చి మాటాడతానని చెప్పు! అంది నీరసంగా. వాడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
రభస పెట్టలేదు. అందుకు సంతోషించింది ఆమె!
"డబ్బు! డబ్బు! ఎక్కడ చూసినా డబ్బే డాన్స్ చేస్తూంది!!"
28
డాన్స్ అనుకోగానే ఆమెకి తన నృత్యాభ్యాసం గుర్తుకి వచ్చింది. ఎస్సెస్సీ పాసయ్యేదాకా తను నృత్యం నేర్చుకుంది.
తన గురువు ఆండాళమ్మగారు ప్రత్యేకంగా నేర్పారు తనకి.
తన అరంగేట్రం రోజున డిస్ట్రిక్టు జడ్జ్ ఆకాశానికెత్తేశారు!
పద్మిని, వైజయంతిమాల, హేమమాలిని, విజయలక్ష్మి మంజుభార్గవి ఆ వరసలో తన పేరూ చేర్చారు ఆయన.
తనకెంతో గర్వం కలిగింది.
ఏమయింది ఇప్పుడా గర్వమంతా?
ఆ పొగరూ, ఆ ఆవేశం ఎక్కడికి పోయింది?
ఓసారి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఇంటర్వ్యూలో ఏయే ప్రశ్నలు అడుగుతారో అనుకుని కాంపిటేటివ్రివ్యూ, కెరీర్ప్ డైజెస్టు, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇంటర్వ్యూ అన్నీ చదివేసింది.
తొలిసారిగా ఇంటర్వ్యూకి వెడుతున్న గాబరాతో, తొట్రుబాటు అన్నీ తన ముఖంలో తన మాటల్లో తన అదురుతున్న గుండెల్లో ప్రతిధ్వనించాయి. తొలిసారి ఆఫీసరు గదిలో అడుగుపెడుతుండగా.
"కమాన్ బేబీ కమాన్!" నవ్వుతో పలకరించాడు.
ఆఫీసరు గదిలో అతనొక్కడే వున్నాడు.
గది బయట ఓ టేబిల్ వేసుకుని దాని ముందున్న కుర్చీలో కూర్చున్న ఓ యువకుడు అంతకు పూర్వమే సర్టిఫికెట్సు, టెస్టిమోనియల్స్ అన్నీ పరిశీలించి పంపేడు.
నమస్తే అంది నంద భయం భయంగా.
"సిడవున్!" బట్టతల ఆఫీసరు కళ్ళు చికిలిస్తూ అన్నాడు.
కుర్చీలో కూర్చుంది నంద.
"నువ్వేం చదివావు?"
"బి.ఏ. లిటరేచర్. సెకండ్ క్లాస్"
"వెరిగుడ్! ఆ మీ ఇంట్లో ఇంకెవరయినా జాబ్ చేస్తున్నారా?"
"నో సర్! మా ఫాదర్ చేసేవారు! సస్పెండయ్యారు!"
"పిటీ! మీ ఫామిలీ ప్లాన్డ్ ఫామిలీయా?"
"నో సర్! మేం సిస్టర్స్, బ్రదర్స్ కలసి నలుగురం అమ్మా, నాన్న..."
"పిటీ! టోటల్ సిక్స్ నీ జీతంలో బ్రతకాలి."
ఆ మాట అనగానే ఆశ చిగుర్చింది. ఉత్సాహంగా "యస్ సర్" అంది.
"ఊ! జాగ్రత్తగా చేస్తావా ఉద్యోగం?"
"టు యువర్ పర్ ఫెక్ట్ శాటిస్ ఫాక్షన్! సర్!"
"అయితే రాత్రి ఎనిమిది తరువాత ఇదే ఆఫీసుకిరా! నౌ యు కెన్ గో!"
"ఎందుకు సర్?"
"పిటీ! పిటీ! సిల్లీ గాల్! ఆ మాత్రం తెలియనిదే డిగ్రీ వచ్చిందా! నీకు ఉద్యోగం రావాలంటే ఆవేళకి రావాలి! దట్సాల్!"
నంద ముఖం ఎర్రనైంది. "యూ ఫూల్!" అంటూ తిట్టేసింది. చడామడా అతడి మనసులోని దురుద్దేశ్యాన్ని గ్రహించి సహించలేకపోయింది. వెంటనే డయల్ చేసి డి.ఎస్.పి.కి రింగ్ చేసింది.
ఎదురు తిరిగిన ఈ తుఫాను గాలికి నిశ్చేష్టితుడై వుండిపోయాడు ఆ ఆఫీసరు!
ఆఖరికి ఆమె చేతిలోని ఫోన్ లాక్కోవాలని కూడా అనిపించలేదు అతనికి.
"హలో డియస్పిగారూ! నమస్తే! నేనిక్కడ...ఆఫీసునుంచి మాట్లాడుతున్నాను. ఈ ఆఫీసరు ఇంటర్వ్యూలో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. మీరు వెంటనే రండి. తగిన చర్య తీసుకోండి!" అంది గబగబా.
