Previous Page
మౌనవిపంచి పేజి 46


    
    ఆఖరికి వెర్రి సోదరుడినీ కదిలించింది.
    
    "వెళదామా!" ఆశగా అడిగాడు.
    
    ఆశ్చర్యపోయింది నంద.
    
    ఈ రోజు రెండు మూడు మాటలు మాటాడేడు!
    
    క్రమంగా మనుషుల్లో పడుతున్నాడేమో!
    
    చికిత్స ఆపినా ప్రకృతే చికిత్స చేస్తూందో ఏమో!
    
    సినిమాకి నలుగురూ వెళ్ళాలంటే పది రూపాయలు కావాలి!
    
    ఎక్కడి నుంచి వస్తాయి?
    
    తనలాటి వాళ్ళకి సినిమాలు ఉచితంగా చూపకూడదా? ధనవంతులైనా లక్షాధికార్లకి, వేలు సంపాదించే ఆఫీసర్లకి పాసులిస్తారు వాళ్ళు! చిత్రం కదూ!
    
    "వెళదామా!" మళ్ళీ అడిగేడు.
    
    "అప్రయత్నంగా తలూపింది నంద.
    
    అది గమనించి విమల, శశి కూడా అడిగేరు. "అక్కా! ఆ సినిమా చాలా బావుందని అంతా అంటున్నారు. మా క్లాసులో అంతా చూశారు!"
    
    "ఆదివారం వెళదాంలే!"
    
    తనకీ అదే సమాధానం అన్నట్లుగా వెళ్ళి పడుకున్నాడు రవి.
    
    ఆదివారం!
    
    ఎన్ని అబద్దాలయినా ఆడెయ్యొచ్చు. ఆ రోజు చెప్పి!
    
    ఆఫీసుకి డబ్బు కోసం వచ్చేసరికి, పని త్వరగా కావాలన్నా ఆఫీసరుకి ఇంట్లో సినిమా అడిగిన వాళ్ళకి అందరికీ సమాధానం.
    
    ఆదివారం!
    
    నిజంగా ఆదివారం ఆదివారం కాదు అది! అది! వరం! అది వరం!
    
    ఆ రోజు తప్పించుకుంటే-
    
    మళ్ళీ ఆదివారం దాకా ప్రామిస్సులతో బ్రతకొచ్చు.
    
    గుండె జబ్బు మనిషికి ఇంజక్షన్ యిచ్చి గంట గంట ఆయుర్దాయం పెంచినట్లుగా వారం రోజులు పొడిగించవచ్చు- మళ్ళీ మళ్ళీ వాగ్దానాలు!
    
    మనుషులు చాలా శాంత స్వభావులు.
    
    వాగ్దానాలని నమ్ముతారు సులభంగా!
    
    ఆశాజీవులు కాబట్టే అయిదేళ్ళకొకసారి నమ్మివోట్లేస్తున్నారు.    

 

    "ఇంకా పడుకోలేదమ్మా!"    

 

    వీరయ్యగారి పిలుపుకి ఆలోచనల నుంచి బయటపడింది.
    
    "కూర్చో బాబోయ్!" అంది బెరుకుగా బెరుగ్గా.
    
    "లేదు లేమ్మా! సినిమాకి వెడుతూన్న తొమ్మిది న్నరయింది కదా! వెళితేకానీ టికెట్లు దొరకవు."
    
    నంద ఏమీ అనలేదు.
    
    "బియ్యానికి రాలేదమ్మా?"
    
    "ఇంకో నాలుగురోజులు గడుస్తాయి బాబాయ్!"
    
    "వచ్చి తీసుకోమ్మా! పాత బాకీ ఇవ్వలేదని ఆగిపోతే పూట గడిచేదెల్లాగా? ఒక్క మనిషి రెక్కలమీద బ్రతికే సంసారాలన్నీ అంతే! చేతి కందిన రోజున ఇద్దువుగానీ రేపు తీసుకెళ్ళండి! లేదా నేనే వో బస్తా పంపెయ్యనా?"
    
    నందకి నోరు పెగల్లేదు.
    
    ధరలు పెరుగుతున్నాయి. మళ్ళీ కొత్త ధాన్యం వచ్చే దాకా ఎంత పెరుగుతాయో చెప్పలేం! ఈ మూడు నాలుగు నెలలకీ సరిపడ్డ బియ్యం తీసుకోమ్మా! ధరలు పెరిగాయని జీతాలు పెంచరు! మేమయితే జీతాలు పెరిగాయని వార్త వినగానే ధర పెంచేస్తామనుకో!"    

 

    నవ్వింది నంద.
    
    "నెల నెలా వీలయినంత ఇవ్వమ్మా! ఎరియర్స్ వస్తేనో మరేదయినా వస్తేనో అప్పుడు ఏకంగా మొత్తంగా తీర్చేయ్యొచ్చు!"  

 

    తలూపింది నంద.    

 

    ఆయన వెళ్ళిపోయాడు శశిని పలకరింపుగా చూసి.
    
    నిట్టూర్చింది నంద.
    
    ఎంత దౌర్భాగ్యపు బ్రతుకులోనయినా కొంత అదృష్టం వుంటుందట!
    
    తన జీవితంలో అనిల్ ఒక అదృష్టపు తెర అయితే వీరయ్యగారు ఒక సౌభ్రాతృత్వపు వీచిక!
    
    రేపు వేకువనే లేవగానే నన్నూ లేవగొట్టు!" అంది విమల.
    
    "ఎందుకు?"
    
    "రేపు ఉదయం ప్రాక్టికల్ క్లాసుంది!"
    
    "అలాగే!"    
    
    ప్రాక్టికల్స్ కోసం నిద్ర పోగొట్టుకుని త్వరగా లేచి తయారయి వెళతారు స్టూడెంట్స్! నిద్ర ఒక వరం! మనిషికి అన్నీ మరిపించేది నిద్ర! కన్నతల్లి లాగా మరిపించేది నిద్ర!
    
    ఆ నిద్రని త్యాగం చేసి చదువుతున్నారు! ఫలితం ఏమవుతోంది.
    
    తనెంత నిస్ఫూచీగా, హాయిగా వుండేది. అప్పుడంత సుఖంగా వున్నందుకేనా ఇప్పుడన్ని ఆలోచనలు, బాధలు, కష్టాలు?    

 

    ఉలికిపడింది నంద!
    
    నిజంగా రమ శాపం ఫలించింది!
    
    ఆ రోజు తను రమని హేళన చేయలేదు. నిర్లక్ష్యం చేయలేదు.
    
    కానీ తనూ శారద ఒక జంట!
    
    చదువుల్లో ఆటల్లో, షికార్లలో ఇద్దరూ వారం, వారం పార్కుకో! తోటలకో పిక్నిక్ వెళ్ళేవాళ్ళు.
    
    తోడు వస్తానంటే వద్దనే వారు కాదు.
    
    అయితే రమ ఒక్కసారి కూడా రాలేదు.
    
    "ఎందుకే నువ్వెప్పుడూ మీ అక్కలాగా వుంటావు?"
    
    రమ కళ్ళు చిట్లించింది నంద ప్రశ్నకి.
    
    "నీ పేరుకి లక్ష్మి అని అర్ధం కదా! లక్ష్మి అక్క ఎవరు?" కొంటెగా అంది నంద.
    
    ఆ మాటలతో రమ ముఖం చిన్న బుచ్చుకుంది.
    
    "నందా! అలా ఎగతాళి చేయకే!"
    
    "ఎగతాళి కాదే!"
    
    "ఇంకేమిటి? మీరంతా ధనవంతులు! బాగా వున్న వాళ్ళు! మానాన్న ఎలిమెంటరీ స్కూలు టీచరు! మా ఇల్లు ఒక క్లాస్ రూంలాగా వుంటుంది. ఆ కొద్దిపాటి జీతంతో మేం ఎలా బ్రతకాలి?"
    
    నంద గంభీరంగా వుండిపోయింది.    

 

    నందా! చెబుతున్నా విను! బ్యాంక్ బాలెన్స్ ని రోజూ వాడేస్తే అది తరిగిపోతుంది. ఆఖరికి ఒకపైసా అయినా మిగలదు! జీవితంలో సుఖ సంతోషాలూ అంతే! మీరంతా ఇప్పుడు ఖర్చు చేసుకుంటున్నారు! ముందు బ్రతుకులో అవి మీకు దక్కక పోవచ్చు!"
    
    "శపిస్తున్నావా?" అడిగింది శారద.
    
    "ఒసేయ్ రమా! ఎందుకే ఈ కుళ్ళుబోతు తనం! మేం ఖర్చు చేసుకున్నా మావి తరిగిపోవు. పైగా ఎప్పటి కప్పుడు బ్యాంక్ లో డబ్బువేసి బాలన్స్ పెంచినట్లు ఇంకా సుఖ సంతోషాలనీ పెంచుకుంటూ! అంది నంద.
    
    నవ్వేసింది రమ ఆ మాటలకి.
    
    "అలా అయితే ఫర్వాలేదే! నాకేం కుళ్ళుబోతు తనం లేదు! నేనేం ఏడ్చి పోవటమూ లేదు. కానీ ఇప్పుడు సుఖపడి పోయి తరువాత ఈ రోజుల్ని తలుచుకుని విచారపడకూడదనే నేను అనటం!"
    
    ఆ మాటలకి ఎవరూ ఏమీ అనలేదు.
    
     మరి ఇప్పుడు ఆలోచిస్తే రమ పెళ్ళి చేసుకుని ఇద్దరు బిడ్డల తల్లి అయిపోయింది. భర్త హైస్కూలు టీచరు అదీ సెకండరీ గ్రేడు టీచరు. ప్లాన్డ్ ఫామిలీ!
    
                                         30
    
    పదయి పోయిందక్కా!
    
    పడుకోండి!
    
    అప్రయత్నంగా సమాధానం చెప్పింది.
    
    శశి పరుపులు పరిచాడు.
    
    రవి వచ్చి అతడి ప్రక్కనే పడుకున్నాడు.
    
    విమల తమకి పక్కలు పరిచింది.
    
    లైట్లు ఆర్పెయ్యనా?
    
    "నే తీసేస్తాలే!" అంటూ లేచింది నంద.
    
    వెళ్ళి అలారం సెట్ చేసింది. మళ్ళీ నాలుగు గంటలకి మ్రోగాలి అలారం!
    
    తిరిగి రేపు అంతకే తెల్లవారుతుంది.

 

    ఇంకో రోజు మొదలవుతుంది!
    
    రేపటి మీద ఆశ!
    
    భవిష్యత్తుపై నమ్మకం!
    
    ఇవన్ని రేపు చుట్టూ తిరుగుతూ వుంటాయి. రేపు చుట్టూ తిరిగే పడవల్లాగా!
    
    రేపటి పైన్నే విశ్వాసం లేకపోతే ఈ నిద్ర దీర్ఘ నిద్ర అయిపోతుంది.
    
    రేపు ఈనాటి కంటే హీనంగా జరగనీ- మళ్ళీ రేపు రేపటిపై ఆశ మిగులుతుంది.
    
    ఆశ ఎంత గొప్పది.
    
    అనిల్ తో రేపు వెళ్ళి రిజిష్ట్రారు ఆఫీసులో పెళ్ళికి దాఖలు చేయాలి!
    
    అప్లికేషన్ పెట్టిస్తే సగం భారం వదులుతుంది!
    
    తనని భరిస్తాడు అనిల్!
    
    తన బరువూ బాధ్యతలనీ భరిస్తాడు. భర్త కదా మరి!
    
    జీతం అంతా ఇంటికి ఇవ్వటానికి ఒప్పేసుకున్నాడు. శశికి ఉద్యోగం వచ్చేదాకానే ఈ బాధ్యత, తరువాత తనకి విశ్రాంతే!
    
    రవి ఒక రకంగా మనుషుల్లో పడుతున్నాడు.
    
    తల్లిని, తండ్రిని, వాడిని చూసుకోవటానికి మేనత్త వుంటుంది.    

 

    ఆమె చేతనవని రోజుకి రవి భార్య వస్తుంది. ఆ బాధ్యత స్వీకరిస్తుంది.        
    
    అవును!
    
    బాధ్యతలు ఎక్కడికి వెళతాయి.
    
    అవి పెండింగ్ లో వుంటాయి.
    
    లేదా!
    
    ఒకరి భుజస్కందాలనుంచి మరొకరి భుజస్కందాలకి వెళతాయి.

    

    అంతే తప్ప మాయమయిపోవు.
    
    తన బరువూ బాధ్యతలు అనిల్ పై పడతాయి-కుటుంబం బరువు అతనిపై పడుతుంది. భారం రవిపై పడుతుంది.
    
    తండ్రినుంచి ఏకంగా స్వీకరించిన వాటిని ముగ్గురూ పంచేసుకుంటారు. 

   

    పని సులువవుతుంది.    

 

    అలా అనుకోగానే ఆమె మనస్సు తేలికపడింది.
    
    లైటు తీసివేసి వెళ్ళి పడుకుంది నంద.
    
    రేపటిపై ఆశతో ఉదయంనుంచి పడిన శ్రమ, వ్యగ్రత అన్నీ మరచిపోయి క్షణంలో నిదురపోయింది.
    
    ప్రశాంతంగా నిదురపోతుంది.
    
    తీయటి కలలు కంటుంది నంద!
    
    మధ్యతరగతి సంసారాల్లోని పెళ్లికాని వెయ్యినొక్క ఆడబడుచుల ప్రతీక! ఆనందలక్ష్మి!!
    
    
    
                                          ...సమాప్తం...


 Previous Page

WRITERS
PUBLICATIONS