ఓరోజు హటాత్తుగా శేఖర్ అరెస్ట్ అయ్యాడన్న వార్త వింది మాలతి.
అతను చేస్తున్న పైనాన్స్ వ్యాపారం దెబ్బతింది.
మాలతికి ఏంచేయాలో తోచలేదు.
అది చాలా మామూలు విషయం లా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న మావయ్యగార్ని.... బెయిల్ మీద విడిపించమని బ్రతిమాలింది. బెయిల్ కి కోర్టు ఖర్చులకి యాభై వేలు తెమ్మాన్నాడాయన. మాలతి ఏడ్చింది... బ్రతిమాలింది. ఎవరూ కూడా కరగలేదు. పైపెచ్చు ఆమెనే దరిద్ర మొహంగా అభివర్ణించారు.
మాలతి తన దగ్గర మిగిలిన ఉన్న ఒకే ఒక్క నాగ, చంద్రహారం అమ్మి భర్తనివిడిపించింది.
మళ్ళీ శేఖర్ ఖాళీగా తిరగడం ప్రారంభించాడు.
మాలతి కష్టాలు పెరిగాయి.
ఓరోజు భర్తని అడిగింది. తనకి ఉద్యోగం చూడమని. ముందు శేఖర్ మండిపడ్డా తరువాత అలోచించి మాలతి ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాడు.
ఇరవై రోజులు కష్టపడ్డ తరువాత ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా ఉద్యోగం దొరికింది. నెలకి ఐదు వందలు జీతం.
మాలతి మనసు శాంతించింది.
మావగారి సంపాదన మీద తిండికి అధారపడక్కర్లేదు అనుకుంది. ఆమెలో కొద్దిగా ఆత్మవిశ్వాసం పెరిగింది.
అత్తగారి పట్లా.... ,మావగారి పట్లా గౌరవం ప్రదర్శిస్తూనే కొంత తిరుగుబాటు ధోరణి అలవాటు చేసుకుంది.
కోడలి లో వచ్చిన మార్పు సుభద్రమ్మ ను కలవర పెట్టింది. తన చేయి దాటి పోతోందన్న ఆందోళన మొదలైంది ఆవిడలో.
"బోడి ఐదు వందలు కూడా సంపాదననేనా. ఒక్కపూట తిండికి చాలదు. ఈమాత్రానికి ఈవిడ గారు యెగిరి పడుతోంది. ముష్టి ఉద్యోగం మానిపించేయరా" అంది కొడుకుతో.
శేఖర్ ఆ విషయం లో మాత్రం తల్లి మాట వినలేదు. అతని ఆలోచన వేరుగా ఉండడమే అందుకు కారణం.
"ఇంటికి బాగా దగ్గర కదమ్మా స్కూలు. నడిచి వెళ్లి రావచ్చు. రోజుకి మూడు గంటలు. ఇంట్లో పనికి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది లే వెళ్ళనీ" అన్నాడు.
మాలతి రోజూ ఐదింటికే లేచి వంట , వార్పూ, పూర్తీ చేసుకొని స్కూల్ కి వెళుతుంది. తిరిగి వచ్చి మళ్ళా పని....పని ఎక్కువైనా అలసటగా అనిపించలేదు. తను సంపాదన పరురాల్ని అయానన్న ఆనందంతో మిగతా విషయాలు ఆమె నంతగా బాధించలేదు.
మొదటి నెల పూర్తవుతుండగా జీతం అందుకోబోయే క్షణం కోసం ఎంతో ఎదురు చూసింది. ఐదువందలు చేతిలో కనిపించగానే గుండె నిండా సంతోషం.... కళ్ళ నిండా కాంతులు నింపుకొని స్కూల్ ఆవరణ దాటి బైటి కొచ్చిన మాలతి నిశ్చేష్టురాలైంది. ఎదురుగా శేఖర్....."ఇవాళ జీతం వచ్చినట్టుంది" చేయి చాపాడు.
మాలతి చేష్టలుడిగి అతడ్నే చూస్తుండి పోయింది.
"ఇవ్వు" గద్దించాడు.
మౌనంగా తన కష్టార్జితం ఐదు వందలు అతని చేతిలో పెట్టింది.
కన్నీళ్లు నిగ్రహించుకుని ఇంటికి పరిగెత్తింది.
తలగడ లో మొహం దాచుకుని కుళ్ళికుళ్ళి ఏడుస్తున్న మాలతికి మావగారి స్వరం కటువుగా విన్పించింది.
"ఇవాళ నీ కోడలికి జీతం వచ్చింది. డబ్బులడిగి తీసుకో. తనది.... తన మొగుడిదీ తిండికి సరిపడా నెలకి ఎంత అవుతుందో లెక్క వేసి ఇవ్వమను..."
అత్తగారి స్వరంలో హేళన. "ఆ ఇస్తుంది ముష్టి ఐదొందల్లో ఆవిడగారి కాఫీ ఖర్చు రాదు."
మాలతి మనసునిండా తుమ్మముళ్ళు పరచిన బాధ.
రోజులు గడుస్తున్నాయి. యాంత్రికమైన ఆమె జీవితంలో మార్పేమీ లేదు. శేఖర్ తాగుడికీ....పేకాట కీ మాలతి జీతం ఖర్చు పెడుతున్నాడు.
"మీరేదన్నా వ్యాపారం చేయచ్చుగా. సెల్ఫ్ ఎంప్లాయి మెంట్ స్కీం కింద లోన్ తీసుకుని" ఓరోజు అంది మాలతి.
"మీనాన్న సెక్యూరిటీ ఇస్తానంటే అలాగే చేస్తా" అన్నాడు.
మాలతి కడుపు మండిపోయింది. కూతుర్నిచ్చినందుకు జీవితాంతం అల్లుణ్ణి పోషించాలా అయన. ఏం మనిషి? అన్నిటికీ మవగారే లోకువ.
'ఇంకా నాకో చెల్లెలుంది. దాని క్కూడా పెళ్ళి చేయాలి మా నాన్న ' కొంచెం విసురుగా అంది.
"ఏం ఫర్వాలేదు. అంతగా అయితే దాన్ని కూడా నేనే చేసుకుంటా... మీ నాన్నని ఆస్తి రాసిచ్చేయమను."
"షటప్ " మాలతి అప్రయత్నంగా అరిచింది.
"ఏమన్నావే...."చెంప చెళ్ళు మంది.
"నన్ను నోర్మూయ్యమంటావా ....జాగ్రత్త... చీరేస్తాను" విసురుగా వెళ్ళి పోయాడు.
మాలతి వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆ రాత్రి ....అత్తగారి గదిలోంచి విన్పిస్తోన్న మాటలు అనుకోకుండా మాలతి చెవిన పడ్డాయి.
వెటకారానికి అన్నాడనుకున్న శేఖర్ మాటలు నిజం చేయాలన్న ప్రణాళికకి ఆ గదిలో అంకురార్పణ జరుగుతోందని అర్ధమైంది. ఆమె ఆపాదమస్తకం కంపించింది.
"నో...నో... అలా జరక్కూడదు.
నీలిమ జీవితం నాశనం అవకూడదు.
నీలు తెలివైంది.... వీళ్ళ ఆటలు దాని దగ్గర సాగవు. కానీ.... వీళ్ళ భయం కరమైన తెలివితేటలూ ముందు అదేపాటి. బెదిరించో బ్లాక్ మెయిల్ చేసో వీళ్ళు నీలిమ ని ఈ నరకం లోకి లాగుతారా? అమ్మో!
మాలతికి నిద్రపట్టలేదు.
వారం రోజులు ఏకదాటిగా ఆలోచించిన మాలతి ఒక నిర్ణయానికి వచ్చింది.
ఆరోజు.... ఇంటికి బందులోచ్చారు. మాలతి స్కూల్ కి లీవ్ లెటర్ పంపించింది పని తెమలక.
వంట....టిఫిన్లు.... కాఫీలు.... వంటింట్లోంచి బైటికి రావడానికి ఒక్క క్షణం తీరిక దొరకలేదు.
గిలకలా తిరుగుతూ పనిచేస్తున్నా ఆమె మెదడులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి.
అత్తగారు బంధువుల ముందు మాలతిని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నట్టు నటిస్తోంది.
ఆ రాత్రికి అందరూ వెళ్ళిపోయారు.
అలసిపోయిన ఆమె హల్లో కూర్చుని కునికిపాట్లు పడుతోంది. ఇంకా శేఖర్ ఇంటికి రాలేదు.
అత్తగారి గదిలోంచి గుసగుసలు.
మాలతి సభ్యత కాదనుకుంటూనే కిటికీ దగ్గరకి నడిచింది.
"మీరూరుకొండి.... తలుపులు వేసేసి నోట్లో గుడ్డలు కుక్కితే శబ్దం బైటికి రాదు. మన పని మనం చేద్దాం. రెండు లీటర్ల కిరసనాయలు పొతే పోయింది. శ్యామల కూతుర్ని చేసుకుంటే రెండు లక్షలిస్తానంది."
"వద్దే...ఆ తరువాత పోలీస్ కేసు.... అరెస్టులు.... దానికి పిల్లల్లెరని కేసు పెట్టి....విడాకులు ఇమ్మందాం. అయినా మనవాడికి నీలిమ మీద మనసుంది. విడాకులిస్తే దీని బతుకు బజారు పాలవుతుందని భయపడైనా కిక్కురు మనకుండా దీని చెల్లెల్ని ఇస్తారు. మగపిల్లల్లేరు కాబట్టి ఆస్తి మనకే వస్తుంది."
"మీ బుర్ర కూడా ఇంత బాగా ఆలోచిస్తుందా? సరే.... అదేదో రేపే వెళ్ళి లాయర్ని కలవండి. దీని పీడ వదలనైనా వదలాలి. లేదా దీని చెల్లెల్ని అస్తితోసహా ఇక్కడికి తీసుకురావాలి."
మాలతి నిలువెల్లా వణికిపోయింది.
ఆ వెంటనే వెళ్ళి.... వణికే చేతుల్తో నీలిమకి ఉత్తరం రాసింది.
పది రోజులు గడిచాయి.
శేఖర్ కొన్ని కాగితాలు తీసుకొచ్చాడు. అతని వెనుకే అతని తల్లి, తండ్రి చెల్లెలు. మాలతి స్వెట్టర్ అల్లుతోంది. తనముందు పెట్టిన కాగితాల వైపు చూసింది తలెత్తి.
"ఏమిటివి?" అడిగింది.
"విడాకుల కాగితాలు. సంతకం పెట్టు " తీవ్రంగా అన్నాడు.
"విడాకులా ! దేనికి?' అడిగింది.
"పెళ్లై మూడేళ్ళు దాటుతున్నా పిల్లల్లేరు. గొడ్డు బోతుదాన్ని కోడలిగా చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా అందుకు.... నోర్మూసుకొని సంతకం చేయి" మండిపడుతూ అంది సుభద్రమ్మ.
"చేయకపోతే" నింపాదిగా అంది మాలతి.
"గొంతు పిసికి చంపేస్తాను" విసురుగా అన్నాడు శేఖర్.
'అలాగే కానివ్వండి. నేను సంతకం పెట్టను"
"ఎంత పొగరే నీకు" చెంప చెళ్ళుమంది.
మాలతి చేతిలో ఊలు జారిపడింది. నిదానంగా కళ్ళెత్తి చూసింది.
"సంతకం పెడతావా ? పెట్టవా?"
"పెట్టను"
శేఖర్ చేయి ఎత్తాడు. మాలతి అతని చేయి గట్టిగా పట్టుకుంది.
నలుగురూ అదిరిపడి చూశారు. వానపాములా నెమ్మదిగా కదుల్తూ.... అణిగిమణిగి ఉండే మాలతి లో కనిపించిన ప్రతిఘటన వాళ్ళని ఓ క్షణం వణికించింది.
"అరేయ్....దీనికి పొగరెక్కువైంది. నువ్వు అణుస్తావా? నేను అణచనా? సుధా.... వెళ్ళి కిరసనాయలు డబ్బా పట్రా...." అరిచింది సుభద్రమ్మ.
మాలతి ఓ క్షణం ఆవిడ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. తరవాత మంచం కింద దాచిన కిరోసిన్ డబ్బా తీసి మూత తీసింది.
అందరూ నిశ్చేష్టు లై చూస్తుండగానే అందులో ఉన్న కిరసనాయలు అందరి మీదా చల్లి తన మీద కూడా చల్లుకుంది.
"చూడండి.... ఒక అగ్గిపుల్లతో నలుగురం సజీవ దహనం అవుతాం. రేపు పేపర్లో అగ్ని ప్రమాదం లో మరణించిన కుటుంబం అని వార్త వస్తుంది. మీకేవన్నా అభ్యంతరమా?"
"ఒసేయ్....!' నలుగురూ వెర్రిగా అరుస్తూ మాలతి జుట్టు పట్టుకున్నారు. "మమ్మల్నే చంపుతావా! చూస్తా....అరేయ్ తాడు తీసుకురారా.... ముందు దీన్ని కట్టేయ్ " అరిచింది సుభద్రమ్మ.
వెనక తలుపులు ధడాల్న తెరచుకున్నాయి.
మాలతి జుట్టు వాళ్ళ చేతుల్నించి అప్రయత్నంగా జారింది.
"కానిస్టేబుల్ వాళ్ళని అరెస్ట్ చేయి" ఎస్.ఐ ఆజ్ఞాపించాడు.
మాలతి ఎస్....ఐ ముందుకు నడిచి చేతులు జోడించింది. "సినిమాల్లోలాగా కధ అయిపోయాక వస్తారనుకొన్నాను థాంక్స్ సార్....ముందే వచ్చారు."
నీలిమ పరుగెత్తు కొచ్చి మాలతిని వాటేసుకుంది.
"ఈరోజే వీళ్ళు నీ కధ ముగింపుకి ముహూర్తం పెట్టుకున్నారని నాలుగు తంతే చెప్పడక్కా మీలాయర్. పోలీసులు లాయర్ని ఏమీ చేయలేరు కదా! అందుకే నేనే రంగంలోకి దిగాను. కాకపోతే పదివేలు అడిగాడు. తన్నులు తిన్నందుకు ఇస్తానన్నాను" నవ్వింది నీలిమ.
"మీరిద్దరూ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ రాసివ్వండమ్మా...." ఎస్.ఐ అన్నాడు, సంకెళ్ళ మధ్య తలలు వంచుకుని నిలబడ్డ నలుగుర్ని తీసుకెళుతూ.
'అలాగే సార్.... తప్పకుండా వస్తాం.... అక్కా.... ముందా కిరసనాయలు బట్టలు మార్చుకో....' నీలిమ అంది.
"ఎస్...ఐ గారూ ! వాళ్ళని కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పొరపాట్న ఎవరన్నా సిగరెట్ పీక మీద పడేస్తే పాపం వాళ్ళు తగలబడతారు" అంది మాలతి.
నలుగురు కళ్ళలో భయం. శేఖర్ కళ్ళల్లోని క్రోధం మాలతి పెదవుల పైన గర్వంతో కూడిన చిరునవ్వు.
"మిస్టర్ శేఖర్! వానపాము కూడా కాటేయగలదని అర్ధమైందా? కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు. విష్ యూ గుడ్ లక్ వెళ్లి రండి. సుధా! నిన్ను మాత్రం ఓ గంటలో బైటకి తీసుకొస్తాను. భయపడకు" హుందాగా నడిచి బాత్రూం లోకి వెళ్ళిపోయింది మాలతి.
సంకెళ్ళ తో కానిస్టేబుల్ వెనకాల వెళ్తున్న ఆ నలుగుర్ని చూసి జాలిగా నవ్వుకుంది నీలిమ . ఆడపిల్లలు కొంచెం అప్రమత్తంగా ఉంటె ఇలాంటి నరహంతకుల్ని ఎదుర్కొనడం చాలా సులువు....అమ్మాయిలూ బహు పరాక్.
***
