"మీరు చిన్నబ్బాయిగారిని రేపు పంపండి! ఇస్తూ తీసుకొంటూ వుండండి. కొంటేనే కోమటి స్నేహం అమ్మాయి గారూ!"
"అసలే బాకీ తీర్చలేదు కదా! అందుకని సరుకులకి పంపలేదు. జనార్ధన్ గారూ! నాకు ఒక వారం రోజుల్లో డబ్బు వస్తుంది."
"డబ్బొస్తుంది. మీరిస్తారు. డబ్బుదేం ఉందమ్మా! వస్తూ పోతూ వుండాలి! సరుకులు ఇంట్లో లేకపోతే సంసారానికి ఎలా? డబ్బు లేదని అవసరాలు ఆగవు కదా! వస్తానమ్మా! రేపు చిన్నబ్బాయిని పంపండి! వారానికి డబ్బొస్తే మీరు తెచ్చి ఇవ్వండి! అని వెళ్ళిపోయాడు జనార్ధన్.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంలో గడిచిపోయాయి.
తిరిగి పాఠం అందుకోబోయింది.
"నమస్తే! నమస్తే!" అంటూ వచ్చాడు. సేట్ చమన్ లాల్! అతన్ని చూడగానే ఆమె గుండె వేగం హెచ్చింది.
"కూర్చోండి!" అని నంద అనక పూర్వమే అతను చాపమీద కూర్చున్నాడు. "మీరీ నగ ఇడిపించుకొనేలేదు. చాన్నాళ్ళయి పోయింది! వడ్డీకూడా కట్టలేదు. ఇలా అయితే ఎట్లా?"
ఏం సమాధానం ఇవ్వగలదు.
"మాకీ వడ్డీ వచ్చి ఆరు నెలలయింది! మీది ముఖం మాకీ చూపనే లేదు. ఇట్లా అయితే నగ మాకీ జమ చేసుకుంటాం!"
నివ్వెరపోయింది. ఆ గొలుసు సుమారు రెండు మూడుతులా లుంటుంది. తల్లికి మరి సీరియస్ అయిపోయిన రోజున వెళ్ళి తాకట్టుపెట్టి తెచ్చి ఆమెని బ్రతికించుకుంది. అందరి మధ్య తరగతి మనుషుల్లాగే డబ్బుపోయినా జబ్బు తగ్గి తల్లి బతికినందుకు సంతోషించింది. నెలనెలా వడ్డీ చెల్లించే ఏర్పాటుతో తెచ్చింది.
"మాకీ మీకీ నాన్నగారూ బాగా తెల్సు! అందుకే అప్పు ఇచ్చినాం. ఇట్లా చేస్తే ఎట్లా? నేస్తం నేస్తమే! డబ్బు డబ్బే!"
"త్వరలో తెచ్చి ఇస్తాను!"
"అట్లా చెప్తారు అందరూ! ఇవ్వకపోతే నగ అమ్మేస్తాం! ఆపైన మీ ఇష్టం! చూస్కోండి!" అన్నాడు అతను లేవబోతూ.
"సరే!" అంది నిస్ప్రుహగా. ఆమెకి తెలుసు! తను ఇప్పుడిప్పుడే ఆ నగ విడిపించుకోలేదని అదంతే! అలాగే తృప్తి పరచాలి మాటలతో! అమ్మేస్తే దిగులుతో నిట్టూర్చాలి.
ఏం బ్రతుకులు!
ఈ వయసులోనే ఇన్ని అనుభవాలా!
అది- అది తన పిన్ని ఇచ్చింది. ఒకసారి ఆమె తమ ఇంటికి వచ్చింది. వెంట టేప్ రికార్డర్ తెచ్చింది. ఆమె గొప్పగా పాడుతుంది.
ఒక టేప్ నిండా తన పాటలు రికార్డ్ చేసి తమకందరికీ వినిపించింది. అది విని నంద కూడా పాడాలని కుతూహలపడింది.
"నువ్వు పాడతావా?"
"ఊఁ" బెరుకుగా తలూపింది.
ఆమె నవ్వింది. ఆ సమాధానానికి.
"పాడు!" అంది టేప్ ఆన్ చేస్తూ.
అన్నమయ్య కీర్తన పాడింది నంద! పాట గొప్పగా వుంది! పాడటమూ ఫరవాలేదు.
"పాడమంటే ఏ ఇంగ్లీషు సాంగో, హిందీ గీతో, తెలుగు పాటో పాడతావనుకున్నాను. నాకు సినిమా పాటలంటే అట్టే ఇష్టం లేదు. పంకజ్ మల్లిక్, సైగల్ పాటలు. తెలుగులో రాజేశ్వరరావు, ఘంటసాల పాటలు, నాగయ్యగారి పాటలూ నాకు ఇష్టమే. అవన్నీ ఎవరు పాడతారు? నువ్వే క్లబ్ సాంగ్ పాడతావోనని భయపడ్డాను. నేను శాటిస్ ఫై చేయటానికై టేప్ చేస్తున్నత్తుగా నటించాను. ఇప్పుడు అదే పాట అలాగే పాడు. ఫర్వాలేదు. బాగా పాడావు!"
పినతల్లి మాటలకు నంద గుండెల్లో గంటలు మ్రోగించింది. గొప్పగా ఫీలయింది. గుండెల్నిండా తృప్తిని నింపుకుంది. ఆ తృప్తితో గొప్పగా పాడింది. ఆమె టేప్ చేసి మళ్ళీ వినిపిస్తే ఆ పాట తను పాడిందేనా అన్నంత వింతగా వింది నంద! నిజంగా మార్వెలెస్ గా పాడింది.
ఆమె తృప్తిని దాచుకోలేదు!
మెప్పుగా తన మెడలోని గొలుసుతీసి నంద మెడలో వేసింది.
"నందా! నీ పెళ్ళికి నేను వస్తానో రాలేనో ఇప్పుడే ఇచ్చాననుకో! ఇది భద్రంగా దాచుకో-" అంది.
తల్లీ తండ్రీ ఎంత వారించినా ఆమె వినలేదు. నాకామాత్రం స్వతంత్రం లేదా! అక్క కూతురికి ఓ నగ ఇవ్వకూడదా! అంది.
ఆ నగ ఇది! ఈ రోజుకి ఋణం తీరిపోయింది అనుకుంది నంద నిరాశగా.
చమన్ లాల్ వెళ్ళిపోబోతున్నాడు.
"మేడమ్!" వినయంగా పిలిచాడు శ్రీధర్.
"ఏమిటీ? డిస్టర్బ్ అయింది కదూ. ఒక్కోరోజు అంతేనోయ్! ఉద్యోగస్తులకి సామాన్యంగా ఫస్ట్ వీక్ బెస్ట్ వీక్! కానీ నాకు వరస్ట్ వీక్! ఎందుకంటే వచ్చేది ఆరొందలు! ఇవ్వవలసింది వెయ్యికిలోపు. ఈ బడ్జెట్ బాలెన్సింగ్ నాతో అవటం లేదు! లక్ తన్నేసి ఏ లాటరీయో వస్తే తప్ప ఈ బాధలు తీరవు!" అంది నవ్వుతూ.
"అది కాదండీ!! ఆ సేట్ జీ డబ్బు కట్టేద్దాం ఇప్పుడే!"
"నువ్వా!" ఆశ్చర్యంగా అడిగింది.
"అవునండీ! నాకు ఈ రోజే ఎరియర్స్ వచ్చాయి. అనుకోకుండా మా స్కేలు పెంచారు కదా! ఆ డబ్బు వుంది మీరు తీసుకోండి. మళ్ళీ మీకు వీలయినప్పుడే ఇవ్వండి.
నాకేం తొందర్లేదు. ఆ నగ పోతుందన్న బాధ మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చెబుతున్నాను. దయచేసి అపార్ధం చేసుకోకండి. ఇది త్యాగం కాదు! చారిటీ అంత కంటే కాదు. జస్టు హెల్ప్! మీకు వడ్డీ తగ్గించే వీలు! అంతే!" గబగబా చెప్పేశాడు. అతను ఓ రైటర్ కుమారుడు రచయిత లక్షణాలు వచ్చాయి అనుకుంది.
"ఎక్కడి కక్కడే! ఇది ఇన్ సల్ట్స్ అనుకోకూడదు. ఎడ్ జస్ట్ అయిపోవాలి అంతే!! అనుకుంది నంద. సరే అన్నట్లుగా గంభీరంగా తలూపింది.
చెదిరిన మనస్సుతో పాఠం చెప్పలేకపోయింది. "ప్లీజ్! రేపురండీ!" అంది.
"అలాగే మేడమ్!" అంటూ లేచాడు.
శ్రీధర్ జేబులోంచి డబ్బు తీశాడు. "ఎంత వుంది మేడమ్!" అని అడిగేడు.
"దాదాపు పన్నెండువందలు! పేలవమైన గొంతుతో అంది.
శ్రీధర్ పన్నెండువందలూ తీసి యిచ్చాడు.
అందరూ వెళ్ళిపోయారు.
లేచి వెళ్ళి డబ్బు పెట్టెలో పెట్టి వచ్చింది.
ఇంకా భోజనం వేళ కాలేదు. తొమ్మిది దాకా పాఠాలు చెప్పి అప్పుడు భోజనం చేయటం.
ఊరికే కూర్చుంది నంద.
మా అయ్యగారు ఈ చీటీ ఇవ్వమన్నారండీ అంటూ వీరప్ప ఓ చీటీ అందించాడు.
నిర్లిప్తంగా అందుకుంది. అది మెడికల్ షాపు ఓనరు కేశవయ్య రాసిన ఉత్తరం- చీటీముక్క-
