Previous Page Next Page 
మౌనవిపంచి పేజి 42

 

    నందతో పాటు అందరూ నవ్వేరు.
    
    "ఇదిగో నందా! మీ నాన్న నేనూ రెండేళ్ళు కలసిచదివాంలే! వీడికెప్పుడూ నాకంటే మార్కులు తక్కువ వచ్చేవీ. ఇద్దరం బాగా చదివే వాళ్ళమా! ఇద్దరినీ తెలివిగల వాళ్ళకిందే లెక్కకట్టేవారా! ఒక్కోసారి నేను ఫస్టు! వాడు సెకండ్ వచ్చే వాళ్ళమా! మరి వాడికెప్పుడూ మార్కులు నాకంటే ఎక్కువ రాలేదు! ఎందుకంటావ్? పెదాలు బిగించి ప్రశ్నించాడాయన.
    
    తండ్రి వైపు చూసింది నంద.
    
    నారాయణ నవ్వుతున్నాడు తమాషాగా.
    
    "చెప్పుకోగలవా?" రెట్టించాడు.
    
    "చెప్పమంటారా?"
    
    "అనే కదా ప్రశ్నించింది. చూద్దాం నీ గొప్ప."
    
    "మా నాన్న నారాయణ! మీరు సూర్యనారాయణ రెండక్షరాలు ఎక్కువ కదా! అంచేత మార్కులు మీకు ఎక్కువ వచ్చేవి!"    

 

    స్టన్ అయిపోయాడు ఆయన! అదయినా ఎంతసేపు? క్షణంలో సగం! ఫన్నీ! ఫన్నీ! అంటూ పగలబడి నవ్వేడు.
    
    నారాయణ గర్వంగా చూశాడు కూతురి వైపు.
    
    "యు ఆర్ గ్రేట్!" గొప్పగా అన్నాడు సూర్యనారాయణ. "బాగా ఊహించావు! నువ్వు లాయర్ వైతే బావుండేది. వాళ్ళకి ఈ ట్రిక్స్ బాగా టిప్ చేస్తాయి. కానీ ఇప్పుడిప్పుడే నువ్వు లా చదువుతానని పేచీ పెట్టకు! ఈ రోజుల్లో లా ప్రాక్టీసంటే సగం వయసు వచ్చేదాకా వెయిట్ చెయ్యటమే! అన్నారు.
    
    "ఇంతకీ ఆ సీక్రెట్ ఏమిటీ పెదనాన్నా?"
    
    "ఏముంది సింపుల్! పరీక్షల్లో అవేవయినా కానీ మీ నాన్నని అడిగి డవుట్స్ తీర్చుకునే వాడిని. వాడు రాసిందానికన్నా రెండాకులు అంటే టూ పేజీస్ ఎక్కువ వచ్చేవి. వీడెప్పుడూ అలా చెయ్యలేదు. వెధవకి ధైర్యం వుంటేనా? పైగా నేనప్పుడప్పుడు కాపీయింగ్ చేసేవాడిని! అబ్బో దానికెంత ధైర్యం వుండాలి" అన్నాడు గొప్పగా ఫీలవుతూ.
    
    నవ్వేసింది నంద.
    
    "అయినా ఈ రోజుల్లో చదవటం తర్వాత ఉద్యోగాల వేట! అంతా గాంబ్లింగ్ లా అయిపోయింది. పాసవటంకూడా ఛాన్సే. నువ్వు బ్రహ్మాండంగా రాశావనుకో-వాడు చదివి మార్కులు వేస్తాడనేది షూరిటీ లేదు. ఒక జోక్ చెప్పనా? ఆ మధ్య ఎవరో పాలిటిక్స్ లెక్చరర్ కెమిస్ట్రీ పేపర్లు పది దిద్దాక ఆ ఈక్వేషన్స్ ఆ ప్రాబ్లమ్స్ అవి చూసి తనకీ వేరే సబ్జక్ట్ పేపర్స్ యిచ్చారని కనుక్కున్నాడట" చూశావా! అందరూ చదువుకున్నవారే!
    
    నంద ఏమీ అనలేదు. లోపలికి వెళ్ళిపోయింది. కాళ్ళు కడుక్కుని వచ్చి మళ్ళీ  కూర్చునే సరికి సబ్జక్ట్ మారిపోయింది.
    
    "నా మాట విని పెళ్ళి చేసెయ్!"
    
    "అప్పుడప్పుడే ఏం తొందరన్నయ్యా!"
    
    "ఇదిగో నారాయణా! నువ్వెప్పుడూ స్లోయే! ఇప్పుడు చాన్స్ మిస్సయ్యావా దానికి పెళ్ళయ్యే యోగం మరెన్ని సంవత్సరాలకో!"
    
    "ఏమిటి పెదనాన్నా పెళ్ళంటున్నావ్? ఎవరికి?"
    
    "నీకేనమ్మా! అబ్బాయి ఎమ్మెస్సీ ఎగ్రికల్చర్ ఎ.ఎ.డి.గా పని చేస్తున్నాడు. కట్నం అక్కర్లేదు. పిల్ల సంప్రదాయకురాలై అంతో ఇంతో చదువుకుని ఉంటే చాలన్నాడు.
    
    నంద జవాబు ఇవ్వలేదు. తలవంచుకుంది.
    
    "అప్ కోర్స్! వాడికి భార్యపోయి ఏడాదైంది. రెండేళ్ళ  అబ్బాయి వున్నాడు. అయితేనేం వాడి వయస్సు ఇరవయ్యారే!"
    
    చివాలున తలెత్తింది నంద.
    
    పెత్తండ్రివైపు రోషకషాయిత నేత్రాలతో చూసింది.
    
    ఆయన కొద్దిగా చలించాడు.
    
    "ఈ సంబంధం విషయం ఎత్తకండి పెదనాన్నా!"
    
    "నందా! నీకు అనుభవం లేదు. ఇంతకంటే మంచి సంబంధం తేలేడు మీ నాన్న!
    
    గుండేసి పేల్చినంతగా బాధపడింది.
    
    తండ్రి వైపు చూసింది.
    
    ఆయన ముఖంలో ఆవేదన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూంది.
    
    తల్లి ముఖంలో దుఃఖం పెద్దాడనే గౌరవంతో వాళ్ళకేమీ అనలేకపోతున్నారు.    

 

    కూతురెక్కడ అపార్ధం చేసుకుంటూందోనని మరోభయం!
    
    "పెదనాన్నా! నాకసలు పెళ్ళేకాకపోయినా ఫర్వాలేదు కానీ ఈ సంబంధం విషయం మరి మరి ఎత్తకండి!"
    
    "నంద! నారాయణకి కాస్త కొస వెర్రి ఉండేది అది నీకూ అబ్బినట్టుగా వుంది. నీకు కాలం విలువా, లోకం పోకడ తెలిసినట్లు లేదు.
    
    "ఇంకేం అనకండి పెదనాన్నా! మళ్ళీ ఆ విషయం ఎత్తి మీపై వుండే గౌరవాన్ని పాడు చేసుకోకండి!" అంది కఠినంగా.    
    
    "ఒహో! చాలా జోరుగా వున్నావే!"
    
    ఆయనింకేదో అనబోయాడు.
    
    నంద నిర్లక్ష్యంగా ప్రక్క వీధిలోని తన ఫ్రెండింటికి వెళ్ళిపోయింది. వెనకనుంచి లీలగా ఆయన తండ్రిని వేస్తూన్న చీవాట్లు వినిపిస్తూనే వున్నాయి.
    
                                     26
    
    "గుడీవినింగ్ మేడమ్!"
    
    ఉలికిపాటుతో చూసింది. గోడ గడియారంవైపు. ఎనిమిది అయిదు.
    
    సరిగ్గా ఎనిమిదికి వస్తారు, షార్ట్ హ్యాండ్ ట్యూషన్ వాళ్ళు!
    
    వాళ్ళు పిలిచిన పిలుపు అది!
    
    ఆలోచనలకి స్వస్తి చెప్పి, వాళ్ళ నలుగురికీ షార్ట్ హాండ్ చెప్పసాగింది. తన ఉద్యోగం కోసం నేర్చుకున్న టైపింగ్, షార్ట్హాండ్ ఇలా ఇప్పుడు బ్రతుకు తెరువుకి పని చేస్తున్నాయి. ఎన్నివిధాల కష్టపడితేనో నలుగురికీ నోట్లోకి వేళ్ళు పోతున్నాయి.
    
    దీక్షగా పాఠం చెబుతుంది నంద. వాళ్ళు అంతకంటే శ్రద్దగా వింటున్నారు.
    
    "నమస్కారమమ్మా!"
    
    ఆ పిలుపుకి ఉలికిపాటుతో అటు చూసింది. అతను పచారీకొట్టు జనార్ధన్.    

    అతన్ని చూడగానే గుండె జల్లుమంది నందకి! భగవాన్ అనుకుంది.
    
    "ఒకటవ తేది వెళ్ళిపోయి నాలుగు రోజులైందమ్మా!" చాలా సున్నితం మాట్లాడతాడు అతను.
    
    "అవునండీ! ఈసారి అనుకోని ఇబ్బంది వచ్చింది!"
    
    "ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంసారం జరగాలి కదమ్మా ఈసారి మీరింకా సరుకులకి రానేలేదు. ఆ విషయం కనుక్కునేందుకే వచ్చాను! డబ్బుదేముంది! ఈ రోజు కాకపోతే రేపిస్తారు!"    
    
    పెదవి కొరుక్కుంది నంద! ఇది జాలితో కూడిన శిక్ష! దీన్ని భరించటమే కష్టం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS