Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 42


    "నాకెవ్వరూ  లేరు సాబ్! ఆయన మధ్యలో అన్యాయం చేసి పోయారు. వీడిని చూచుకుని ,కన్న కష్టం చేసి పెంచాను ఉద్యోంగంలో చేరాడు నా కష్టాలు తెల్లారాయి అనుకున్నాను-" నోట్లో పమిట కుక్కుకుంది.

     "నువ్వు ఏడిస్తే నీ కొడుకు రాడమ్మా. జరిగిన విషయాలు చెప్పాలి." అన్నాడు.

     ఆమె కూర్చున్నది. ఆమె కళ్ళు లోతుకు పోయాయి. మనిషి నీరసంగా ప్రాణం లేనట్టు కనిపించింది. తైలసంస్కారం లేని జుట్టు ఆమె కొన్ని రోజులుగా తనకు తాను విస్మరిచిందని అర్ధం అయింది.

     అతను టీ తెప్పించి ఇచ్చాడు టీ త్రాగాక, కాస్త  ప్రాణం వచ్చి నట్టు అయింది.ఆమె ను కొంచెసేపు  ప్రశ్నించ కూడదని, గది వెనుక వైపుకు వచ్చి సిగరెట్టు వెలిగించుకున్నాడు పోలిసు అధికారి.   


                                     10


     ప్రశాంతంగా , పసి పాపలా నిదుర పోతుంది రాధిక. ప్రక్కనే కూర్చున్నాడుసిద్ధార్ధ. డాక్టరు రాగానే తన చెల్లి, చిన్న నాటి  నేస్తం! ప్రేమమూర్తి ప్రాణం లేనట్టు ఉంది. ఆప్యాయంగా చెల్లెలి ముంగురులు సవరించాడు.

     తన తల్లి తండ్రులు లాంటి వారివల్లే 'రొమియో- జూలియెట్' ' దేవదాసు-పార్వతి' ' లైలా మజ్ను' లకథలు ప్రసిద్ధి కెక్కాయి కాబోలు.

    ఉన్నవాడికే మరో నాల్గు లక్షలు, లాంఛనాలు జరిపేకన్నా, లేని వాడికి స్తే ఏం ? ధనికులలో ఈ అంతఃస్తు పిచ్చి ఎప్పడు పోతుంది.తను పోగొట్టాలి.

     తను ప్రేమించిన పిల్లకూడా ఈ ప్రపంచం నుండి మాయం అయితే!

    "హల్లో!"అతని ఆలోచనా స్రవంతి తెగిపోయింది. బూట్లు టకలాడించుకుంటూ డాక్టరు వచ్చాడు.

    " నమస్కారం డాక్టరుగారూ! పరిస్థితిలో మార్పేం లేదు."

    " అహా! చూద్దాం...." అన్నాడు. వచ్చి స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. తనది కదివృత్తి . రోజూ ఎన్నో ఇలాంటి కేసులు చూస్తుంటాడు. తనకున్న ఆదుర్దా ఎందుకుంటుంది!

    "ఏదో వార్త ఆమె బాగా కలిచి వేసింది.  బలమైన షాక్ తిన్ని మిస్టర్." అన్నాడు.

    " కోలుకునే అవకాశం లేదా!"

    "శ్రీనివాస్ యెవరో ఒక్కసారి అతన్ని పిలిపించండి. అతను చచ్చిపోయాడు అనుకుంటుంది. అతను కనిపిస్తే కొంత మార్పురావచ్చు" అన్నాడు,ఆమె చెయ్యి వదిలేసి.

    " అతను యెక్కడున్నది తెలియదు డాక్టరుగారూ."

    " తెలుసుకోండి. అతని వల్ల ట్రీట్ మెంటు తేలిక అవుతుంది." అన్నాడు లేచి బయటికి వెళ్తూ.

    శ్రానివాస్ రాక వల్లే, రాధిక కోలుకుంటుందంటే, తాము ఆశవదులుకోవాల్సిందే.

     సిద్ధార్ధకు అస్పష్టంగా తెలిసింది. శ్రీనివాస్  లేడని, మళ్ళీ తిరిగి రాడని. అతని కళ్ళు చమర్చాయి. ఏం చేయాలో తోచలేదు.

     అరగంట తరువాత కళ్ళు విప్పింది రాధిక. ఆమె మహా యుద్ధం చేసి, అలసి పోయినట్టు చూచింది.

     "రాధికా!"

    " అన్నయ్యా!" అన్నది."

    అతనికి ఆ పిలుపు అమృతం  పోసినట్టు ఉంది. మూడు, నాల్గురోజులుగా కళ్ళు విప్పిమత్తుగా మళ్ళీ మూసుకున్నదే తప్ప తనను పిలువలేదు.

     " అన్నయ్యా!...ఇక్కడ....ఇక్కడ ఎందుకున్నాం?"

    " నీ ఆరోగ్యం బావుండలేదమ్మా. "అన్నాడు.

    " నాకేమయింది?"

    సిద్ధార్ధ ఎగిరి గంతేయాలని పించింది. తన చెల్లెలు మాట్లాడుతుంది. మామూలుగా మాట్లాడుతుంది, అంతకంటే తనకేం కావాలి!

     అతని సంతోషానికి ఆనకట్టలా అప్పుడే డి.ఎస్.పి. పోలిసులు వచ్చారు. వారిని చూస్తూనే రాధిక ముఖం వెల, వెల బోయింది.

    "శ్రీనివాస్.... శ్రీనివాస్...." అంటూ అస్పష్టంగా గొణుక్కుంది.

     "చూడు రాధికా! నీవు శ్రీనీవాస్ విషయాలు స్పష్టంగా చెబితే అతడిని వెతికి పట్టుకుంటాం...."

    " లేదు డాక్టరుగారూ!".... శ్రీను మీకు దొరకడు... దొరకడు...." ఆమె వెక్కి, వెక్కి ఏడ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS