అప్పుడే హడావుడిగా పురుషోత్తమరావుగారొచ్చారు.ఆయన డి.ఎస్.పి. గారెంతో పరిచయం వున్నట్టు పిలిచారు.
"మీరు వచ్చి ఇక్కడ స్టేషన్లో వుండటమా! భలేవారు. మన ఇల్లు ఎందుకున్నది! అన్నాడు.
డి.ఎస్. పి గారు నవ్వారు.
"డ్యూటీ మీద వచ్చాను. ఇక్కడే వుండాలి."
" డ్యూటీలో వుంటే భోజనం వుండదా! పదండి వెళ్దాం అన్నాడు.
"ఈసారి క్షమించండి." అన్నాడు యెప్పుడో మినిష్టరుగారింట్లో పార్టీలో చూచాడు,అంతే ఆ పరిచయానికే చనువుగా వచ్చి పిలుస్తున్నాడు.
" భోజనానికి రాకపోతే ఊరుకోను."
" నేను డయటింగ్ లో వున్నాను."
" పుల్కాలు కావాలా!చెప్పండి చేయిస్తాను."
"వద్దండీ , మీరొక చిన్న సహాయం చెయ్యండి. నిదానంగా కొన్ని వివరాలు చెప్పండి" అన్నాడు.
" ఏ విషయంలో!"
"అదే ఆ శ్రీనివాస్ అనే అబ్బాయి కనిపించటం లేదుట-"
"వాడు నా కొంపకు చిచ్చు పెట్టాడు. అది పబ్లిక్ గా చెప్పే విషయం కాదు." విచారంగా నిట్టూర్చాడు.
డి.ఎస్. పి. గారు అందరి వంక చూచాడు అక్కడున్న మిగతా పోలీసు బృందంతోపాటు బాలరాజు బయటి బయటికి వెళ్ళారు.
"చెప్పండి."
"శ్రీనివాస్ తండ్రి నా దగ్గర పొలం పాలికి తీసుకుని చేసుకునే వాడు. బీదవాడని చాలా సహాయం చేసాను. కాని అంతా వృధా అయింది అతను అప్పు తీర్చకనే చనిపోయాడు."
"అదెప్పటి మాటో. కదా. ప్రస్తుతం శ్రీనివాస్ విషయంచెప్పండి."
" ఆ విషయానికే వస్తున్నాను. ఆడది, పిల్లడితో అప్పేం తీరుస్తుందని వదిలేసాడు. పిల్లడిని చదివించమన్నాను. చదువుకుని బాగుపడితే ఒక బీదవాడిని చదివించానన్న తృప్తి మిగులుతుందనుకున్నాను: కాని.... వాడు చేతబడి చేసి మా అమ్మాయిని పిచ్చిదాన్ని చేసాడు..." అన్నాడు కోపంగా.
" అతను కనిపించలేదు తల్లి కంప్లెయిట్ ఇచ్చింది."
" మంత్రాలు, తంత్రాలు నేర్చుకుంటూ ఎక్కడున్నాడో.... నా కొంప ముంచారు. పెళ్ళి చేసుకుని హాయిగా అత్తగారింటికి వెళ్ళాల్సిన పిల్ల హాస్పత్రిలో ఉంది. నేనే వాడినిపట్టుకొమ్మని కంప్లయిట్ ఇద్దాం అనుకున్నాను." అన్నాడు పురుషోత్తమరావు.
పోలీసు అధికారి నోటమాట రానట్టుండి పోయాడు.డబ్బుగల వారు, పరపతి గలవారు ఏమయినా చేయవచ్చు.
తన ఆగ్రహాన్ని దిగమింగాడు.
" అలాగా!ఒక్క సారి మీ అమ్మాయిని చూడవచ్చా?"
" డాక్టరు మమ్మల్నే వద్దన్నారు. మా ఇంటి దీపం ఒక్కగానొక్క ఆడపిల్ల." అన్నాడు చాలా దిగులుగా.
" అయిసీ. మళ్ళీ అవసరం అయితే కబురు పంపుతాను. మీరు వెళ్లి రండి." అన్నాడు లేచి కరచాలనం చేస్తూ.
పురుషోత్తమరావు అయిష్టంగా కదిలాడు.
డి.ఎస్.పి. గారుటెప్ రికార్డర్ ఆన్ చేసి మరోసారి జరిగిందంతా విన్నాడు.
అతనికి ఏం అంతు పట్టలేదు.
శ్రీనివాస్ ను చంపటానికి బలమైన కారణం కనిపించలేదు.అతను పెద్ద అధికారి కాడు. యెవరికి పోటి లేడు.
"థ్రీనాట్ బన్-"
" ఎస్ సర్!"
"వెళ్ళి పార్వతమ్మను పిలువు."
అతను టీ త్రాగుతూ ఆలోచిస్తుండగానే పార్వతమ్మ వచ్చింది.
'నా బిడ్డ.... నా కొడుకు సాబ్-' అంటూ డి.ఎస్.పి. కాళ్ళ మీద పడింది.
"ఛ.....ఛ...లేమ్మ! ఏమిటిది?"భుజాలు పట్టి లేపాడు ఆమెను.
