"వానపాము కాటేసింది"
కాలింగ్ బెల్ మోగింది.
వంటగదిలో పనిచేసుకుంటున్న కామేశ్వరి.... చేతిలో పని వదిలేసి హాల్లోకి వచ్చి... వీధి తలుపు తీసింది. ఎదురుగా చేతిలో సూట్ కేసుతో మాలతి.... ఆవిడ కళ్ళు ఆశ్చర్యంగా ఆనందంగా మెరిశాయి. "ఏవిటమ్మా ఈ రాక.... ఇంత అకస్మాత్తుగా ...అల్లుడేడి?" కూతురి చేతిలో సూట్ కేస్ అందుకుంటూ ఆప్యాయంగా అడిగింది.
మాలతి చిరునవ్వు నవ్వుతూ అన్నది... "నన్ను లోపలికి రానివ్వవా అయన లేకపోతె"
ఆవిడ గుమ్మానికి అడ్డం జరిగి "రామ్మా" అంటూ లోపలికి దారితీసింది.
"నాన్నగారు అప్పుడే ఆఫీస్ కెళ్ళారా? నీలు కాలేజి కెళ్ళిందా?" మాలతి నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు కలియ చూస్తూ అడిగింది.
"వాళ్ళిద్దరూ వెళ్ళి అరగంట అయింది. డా.... మొహం కడుక్కో కాఫీ ఇస్తాను" వంటగదిలోకి దారి తీసింది.
మాలతి నేరుగా బాత్ రూమ్ వైపు వెళ్ళింది.
కామేశ్వరి చిక్కటి ఫిల్టర్ డికాక్షన్ తో కాఫీ కలిపి వెచ్చ బెట్టింది.
"ఏవిటమ్మా విశేషాలు... నీ ఆరోగ్యం ఎలా ఉంది?' కాఫీ తాగుతూ అడిగింది మాలతి.
"నా ఆరోగ్యానికేం ....నిక్షేపం లా ఉన్నాను. నువ్వేంటి అలా చిక్కిపోయావు? ఆ కళ్ళ కింద నల్లగా అలా ఉందెం.... విశేషం ఏవన్నా ఉందా?"
మాలతి చిన్నగా నవ్వి అంది... "ఏం లేదమ్మా ....మీ అందరి మీదాదిగులు అంతే"
"అందుకేనా.... ఇలా అకస్మాత్తుగా ఊడి పడ్డావు. మీ అత్తగారు, మావగారు ఆడపడుచూ బాగున్నారా?" అల్లుడు నిన్ను బాగాచూసుకుంటున్నాడా?"
"ఆ' తల్లి ప్రశ్నకి ముక్తసరిగా సమాధానం చెప్పి పెరట్లోకి నడిచింది మాలతి.
పచ్చపచ్చగా కళకళలాడుతున్న మొక్కల్ని చూస్తుంటే మాలతి మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది.
ఇవన్నీ తనూ, నీలూ కలిసి నాటిన మొక్కలు. అన్నీ కూడా పచ్చగా ఉండి ఫలాలనిస్తున్నాయి. పూల మొక్కలన్నీ పరిసరాలను పరిమళింపచేస్తున్నాయి.
తనూ... నీలూ ఈ ఇంటి నుంచి... అమ్మా నాన్నలనుంచి దూరమైనా తామిద్దరి గుర్తుగా ఈ మొక్కలు కలకాలం ఉండిపోతాయి అని రకరకాల మొక్కల్ని ఏరికోరి తెచ్చి నాటారు.
"అన్నంలోకి ఏం చేయను మాలా?" కామేశ్వరి స్వరం విని ఆలోచనల నుంచి తెప్పరిల్లి చూసింది మాలతి.
"కంది పచ్చడి చేయమ్మా....చాలాకాలమైంది తిని."
'అలాగే.... నువ్వు కూర్చుని కబుర్లు చెప్తుండు.... నేను అరగంటలో నీకుకంది పచ్చడి , సాంబారు.... మునక్కాడల కూరతో అన్నం వడ్డిస్తాను.
మాలతి తల్లి ప్రశ్నలన్నిటికీ అంటీ అంటనట్టు సమాధానాలు చెప్తూ గడిపేసింది.
అన్నం తిన్నాక బాగా నిద్రోచ్చింది.
అమ్మ చేతి వంట.... చాలాకాలం తరువాత కడుపు నిండా భోం చేయడంతో ఒళ్ళు తెలీని నిద్రతో నాలుగైనా మెలకువ రాలేదు.
నీలిమ హడావుడితో నాలుగున్నర కి లేచింది.
వెలిగిపోతున్న మొహంతో నీలిమ "ఎన్నాళ్ళు అయిందక్కా నిన్ను చూసి" అంటూ అమాంతం కావలించుకుంది.
ఆ తరువాత నీలిమ కబుర్లు ,నవ్వులు వీటి మధ్య రామారావు ఆఫీసు నుంచి వచ్చిందాకా కాలక్షేపం అయింది. ఆ రాత్రి అమ్మా నాన్న చెల్లి వీళ్ళందరితో కూర్చుని కబుర్లు చెప్తూ అన్నం తింటున్న మాలతి కళ్ళు చెమర్చాయి. ఎన్నాళ్ళు అయింది ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం లో గడిపి కోపాలు.... తాపాలూ.... చీదరింపులు.... వెటకారాలు.... పెళ్ళి అయిన దగ్గర్నించి మనిషినన్న విషయమే మర్చిపోయింది.
అత్తగారికి డబ్బు దాహం.... ఆడపడుచుకి ఆశ దాహం, మావగారికి సేవల దాహం... భర్త గారికి స్వార్ధం. ఒక కుటుంబంలో నాలుగు రకాల మనస్తత్వాలతో నొప్పించక తానోప్పక మసలుకోవడం కత్తి మీద సాము.
మాలతి నవ్వుతున్నా అప్పుడప్పుడు ఆమె మొహంలో తాట్లాడుతున్న నీలినీడలు నీలిమ దృష్టి నుంచి తప్పించుకోలేక పోయాయి.
రాత్రి కాగానే అక్కగార్ని తీసుకుని డాబా మీద కెళ్ళింది. చాప పరచుకుని పడుకుని వెన్నెల జల్లుల్ని చూస్తూ అడిగింది నీలిమ. .. ఇప్పుడు చెప్పు.... ఇంత అకస్మాత్తుగా రావడానికి కారణం ఏమిటి?"
మాలతి బలవంతంగా నవ్వి - "మిమ్మల్నందర్నీ చూడాలనిపించి " అన్నది.
నీలిమ మాలతి కళ్ళల్లో కి చూస్తూ "అంతేనా!" అన్నది. మాలతి కళ్ళు వాలిపోయాయి. గుండెల్లో దాచుకున్న మంచుపర్వతం కరిగినట్లింది.
చెల్లెలి గుండెల్లో తలదాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
కొన్ని నిముషాలు గడిచాక నీలిమ అడిగింది.
"మనసు తెలికైందా కాస్త.... ఇప్పుడు చెప్పు...."
మాలతి మెల్లగా అన్నది -- "నీలూ! నాకు కట్నాల పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోయినా అమ్మానాన్నల కోసం శేఖర్ కి నలభై వేలు కట్నం ఇస్తున్నా మౌనంగా ఉండిపోయాను. పెళ్ళిలో అలకపాన్పు మీద స్కూటర్ కావాలంటే , నాన్న తను కొనుక్కున కొత్త స్కూటర్ ఇచ్చేసినా మాట్లాడలేదు నేను... ఎబిసి వలలో చిక్కుకుని ఉద్యోగం ఊడగొట్టుకుని ఈ రెండేళ్ళుగా నా వంటి మీద నగలన్నీటికీ స్థాన చలనం కల్పించినా ఏం మాట్లాడలేదు.
మొగుడికి ఉద్యోగం లేదని.... అత్తయ్యా మావయ్యా.... సుధా నన్ను ఇంట్లో పనిమనిషిలా చూసినా నా ఖర్మ ఇంతే అని సరిపెట్టుకున్నాను. కానీ... కానీ... మాలతి కంఠం దుఃఖంతో రుద్దమైంది.
"కానీ...." నీలిమ కళ్ళు చిట్లించింది.
'అయన వ్యాపారం చేస్తారుట.... పెట్టుబడికి యాభై వేలు కావాలిట. అది తెస్తే కానీ తిరిగి రావద్దని నన్నిక్కడికి పంపించారు నీలూ! రెండేళ్ళుగా నేను మనింటికి కేవలం ఒక్కసారి మాత్రం వచ్చాను కదా! ఎందుకో తెలుసా? నేను ఇక్కడకు వస్తే అక్కడ వాళ్ళకు సేవలు చేసేవాళ్ళు ఉండరని నన్ను పంపేవారు కాదు. అప్పుడు కూడా అలాగే డబ్బు కోసం పంపించారు కానీ నాన్నగార్కి అడగటం ఇష్టం లేక వెళ్ళిపోయాను. అక్కడి కెళ్ళాక నాకు జరిగిన మర్యాదలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ తల్చుకుంటే భయం వేస్తోంది. ఇప్పుడు ఈ విషయం నాన్నగారితో ఎలా ప్రస్తావించాలో తెలీడం లేదు. డబ్బు లేకుండా వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో అని భయం."
"నువ్వసలు వెళ్ళద్దు" ఆవేశంగా అన్నది నీలిమ.
"నీలూ!" ... ఆదుర్దాగా పిలిచింది మాలతి.
"అవునక్కా.... నువ్వు వెళ్ళద్దు.... నాన్నతో నేను మాట్లాడతాను. ఛీ... ఛీ.... మనుషుల మనసులతో వ్యాపారం చేసేవాళ్ళు మనుషులు కారు. ఇంత నీచులా వాళ్ళు... ఇంతకాలం నుంచి బావగారికి నామీద పిచ్చి ప్రేమ ....నన్నువిడిచి ఒక్క రోజూ కూడా ఉండలేరు అని నువ్వు చెప్తోంటే నిజం అనుకున్నాను."
"హు...." విరక్తిగా నవ్వింది మాలతి.
'అలా చెప్పక ఏం చెప్పను? అసలు సంగతి చెప్పి మీ మనసుల్లో అశాంతి రేపనా? నేను సుఖంగా ఉంటే మీరంతా సుఖంగా ఉంటారని కదా!"
"ఆ.... ఉన్నావుగా చాలా సుఖంగా" వెటకారంగా అంది నీలు.
ఆ రాత్రి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు కలత నిద్ర పోయారు.
మర్నాడు అందరూ కాఫీలు తాగి తీరిగ్గా కూర్చుని ఉండగా నీలిమ అన్నది తండ్రితో "నాన్నా! అక్కకేదన్నా ఉద్యోగం చూడాలి."
రామారావు ఆశ్చర్యంగా చూశాడు. "అక్కకి ఉద్యోగమా?"
"అవును నాన్నా...అక్క ఇంక అక్కడికి వెళ్ళదు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది."
"నీకేమన్నా మతిపోయిందా ఏమిటి.... ఏం జరిగింది?" కంగారుగా అడిగింది కామేశ్వరి.
"ప్రస్తుతానికేం జరగలేదమ్మా ... ఇంకా కొన్నాళ్ళు ఆగితే అక్కని వాళ్ళు చంపేస్తారు."
"నీలూ!" కోపంగా అరిచాడు రామారావు.
"నాన్నా...' ఆవేశ పడవద్దు. నేచేప్పేది వినండి." అంటూ నీలిమ రాత్రి మాలతి తనకు చెప్పిన విషయాలన్నీచేప్పింది.
అంతా విన్న రామారావు, కామేశ్వరి నిశ్చేష్టులయ్యారు.
మాలతి నిశ్శబ్దంగా రోదిస్తోంది.
కొంతసేపు గడిచాక.... బలహీనమైన స్వరంతో అన్నాడు రామారావు. "ఇన్ని బాధలు పడుతూ నన్ను డబ్బడగటానికి మొహమాటపడ్డావా మాలతీ! నా ఈ సంపాదన.... ఇదంతా మీకోసం కాదా తల్లీ!"
"కావచ్చు నాన్నా ! అలా అని వాళ్ళడిగిందల్లా ఇచ్చేస్తారా? ఇవాళ్టి ఈ కోరికలన్నీ రేపు బ్లాక్ మెయిల్ గా మారతాయి. పదివేల తోటి.... యాభై వేల తోటి తృప్తి పడి అక్కను బాగా చూసుకుంటారనా! అలాంటి వాళ్ళే అయితే అసలు అడగనే అడగరు."
"అయితే ఏవిటంటావే.... డబ్బు కోసం దాని కాపురం కూల్చి.... దాన్ని మొగుడ్నోదిలి రమ్మంటావా?" కోపంగా అంది కామేశ్వరి.
"కొన్నాళ్ళు అక్క వాళ్ళని కేర్ చేయకుండా ఉంటే వాళ్ళే దారికోస్తారమ్మా"
"చాల్లే...నీ బోడి తెలివితేటలు ప్రదర్శించకు.నిర్లక్ష్యం చేసిన ఆడదాన్ని ఏ మొగుడు మళ్ళీ రాణిస్తాడు? సంసారం అన్నాక లక్షా తొంభై ఉంటాయి.ఆ మాత్రానికి ఇలా వదిలేస్తారా? మాలతీ రేపే డబ్బు తీసుకొని నువ్వు బయల్దేరు. అతను రేపు వ్యాపారంలో లాభాలు గడిస్తే అనుభవించేది నువ్వు కాదూ..."
"అమ్మా... ఆవేదనగా పిలిచింది మాలతి. "నేను వెళ్ళనమ్మా ౧ నీకు తెలీదు వాళ్ళ సంగతి."
"చూడమ్మా.... నీకు ఇలాంటి మనుషులతో అనుభవం లేదు కాబట్టి ఇలా భయపడుతున్నావు. కొన్నాళ్ళు ఇలా సాధించడం మామూలే. పాతబద్దాక మొత్తం అందరి మీదా అధికారం నీకే వస్తుంది. నామాట విని రేపే బయల్దేరు. ఏవండీ! డబ్బు రెడీ చేయండి."
'అలాగే కామేశ్వరీ!"
నీలిమా, మాలతి నిస్సహాయంగా ఒకర్నోకరూ చూసుకున్నారు.
***
మాలతి వెళ్ళిపోయిన కొంతకాలం బాగానే గడిచింది. ఒక్క ఉత్తరం మాత్రం తల్లీ తండ్రికి రాసింది. ఆ తరవాత ఉత్తరాలు రాసే తీరిక దొరకలేదు. ఇంటెడు చాకిరీతో అలసి పోయేది. శేఖర్ ఏం బిజినెస్ ప్రారంభించాడో తెలీదు. రోజూ ఉదయం వెళ్ళడం.... రాత్రి పొద్దు పోయాక రావడం . భార్యాభర్తల మధ్య ఓ అరగంట కూడా సంభాషణ సాగేది కాదు.
