ఏవండీ.... దుఃఖం వచ్చింది. ఫోన్ చేయాలి. మాట్లాడాలి. అయన స్వరం వినాలి. కార్డ్ లెస్ తీసుకుని నెంబరు కలిపాను... అయన వెంటనే లైన్లోకి వచ్చారు.
"హాపీ యానివర్శరీ ....నువ్వు లేచావో లేదో అని ఫోన్ చేయాలనిపించినా చేయలేదు....' అయన స్వరం వినిపించగానే కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
"థాంక్యూ....థాంక్యూ.. ఎలా వున్నారు?' అడిగాను.
"చెప్పనా?"
"చెప్పండి."
"భాధపడనంటే చెప్తా"
"చెప్పండి"
"గడ్డం పెరిగింది...షేవ్ చేసుకోవాలంటే నిర్లిప్తత... ఎవరి కోసం చేసుకోవాలి? ఆకలేస్తోంది... తినడానికి ఏమీ లేదు. నువ్వుంటే బజ్జీలు వేసిచ్చే దానివి కదా... నాకు నువ్వు చేసి పెట్టె పెరుగు గారెలు తినాలని ఉంది. తినలేను. హోటల్లో తిందామన్నా ....అవి నువ్వు చేసినవి కావుగా.... సినిమా చూడాలని వుంది.... నీతో చూడ్డం అలవాటయ్యాక ఒంటరిగా వెళ్ళాలని లేదు. అవునూ మన పుట్టిన రోజులకి కనీసం కేక్ కట్ చేయించి నిన్ను ఇంటర్ నెట్ లో చూపించేవాళ్ళు శుభాక్షాంక్షలు చెప్పేవాళ్ళు గా పిల్లలు. రాత్రి ఎదురు చూశాను చేస్తావని....ఏం? ఎందుకు చేయలేదు?"
దుఃఖం అడ్డుపడింది...సమాధానం చెప్పలేకపోయాను.
"భానూ....వాట్ హపెండ్.?" మృదువుగా అడిగారు.
సన్నగా ఏడుపు వినిపించినట్టుంది. అరరే.... డోంట్ బి సో ఎమోషనల్ ... వాళ్ళకి తెలిస్తే బాధపడతారు . చిన్న విషయం బాధపడకు. అయినా మనకింకా పెళ్ళి రోజులేంటి? పెద్దవాళ్ళం అయాము. పిల్లల సంతోషమే మన సంతోషం. వాళ్ళా ఆనందమే మన ఆనందం. ఊరుకో, అన్నట్టు నీకో విషయం చెప్పాలి....నిన్న నువ్వు చేసినట్టు పొటాటో ఫ్రై చేద్దామని ట్రై చేశాను. ముక్కల్ని బొగ్గులుగా మార్చాను. నెక్ట్స్ టైం రాధ డెలివరీ కి వెళ్ళేటప్పుడు బాబుకి సాంబ్రాణి పొగ వేయడానికి అవి పట్టి కెళ్ళచ్చు." అయన నవ్వు నాకు జలతరంగిణీ ధ్వనిలా అనిపిస్తుంది. కానీ.... ఇప్పుడు సంగీత జ్ఞానం లేని వ్యక్తీ చేతిలో మోగుతున్న సంగీత వాయిద్యం లా అనిపిస్తోంది.
"ఏవండీ నేను....ఇంక ఉండలేను.... వచ్చేస్తాను... అయామ్ మిస్సింగ్ యూ" అన్నాను బేలగా.
"నువ్వలా అటుంటే మన పెళ్ళి అయిన కొత్తలో మీ పుట్టింటికి వెళ్ళి రెండో రోజే పరిగెత్తు కొచ్చిన సంఘటన గుర్తొస్తోంది..."
"ప్లీజ్ ....సీరియస్ గా చెప్తున్నాను... నేనిక్కడ వాళ్ళకి పెద్ద చేసేదేం లేదు... నేను లేకపోతె వాళ్ళు వారానికోసారి వండుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. పెద్దపని కూడా పెట్టుకోరు. బంగారుని సాయంత్రం దాకా స్కూల్లోనే ఏవో యాక్టివిటీస్ లో చేర్పిస్తారు. పిల్లలిద్దరూ ఇళ్ళకు వెళ్ళేటప్పుడు దాన్ని పికప్ చేసుకుంటారు. నేను ఇంక వచ్చేస్తాను....టికెట్ ప్రీపోన్ చేయిస్తాను..."
"ఆవేశపడకు భానూ....ఆలోచించు. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళను తల్చుకుని నా పిల్లలు కష్టపడుతున్నారని ఏడుస్తావు. ఆలోచించు. కూల్ డౌన్..."
"లేదండి.... నాకు ఏమీ తోచడం లేదు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు లేక నేను మాటలే మర్చిపోతానేమో అనిపిస్తోంది."
"సరేలే....రాధాలేచాక మాట్లాడు. తనకి ఏమీ ఇబ్బంది లేదు అంటే వచ్చేయ్. నిన్ను వదిలి నేను మాత్రం సంతోషంగా ఉండగలుగుతున్నానా? పిల్లలు ఇబ్బంది పడతారని ....పాపాయికి అమ్మమ్మ అవసరం ఉందని తప్ప... నాకు మాత్రం తెలియదా నీకక్కడ పిచ్చెక్కుతుందని...."
"అలాగే....తప్పకుండా మాట్లాడతాను. వచ్చేస్తాను. వీలైతే వచ్చేవారమే బయలుదేరతాను. మీరు జాగ్రత్త . ముందు షేవింగ్ కి వెళ్ళండి. ఇవాళ మన పెళ్ళి రోజు కదా బద్దకించకుండా ఏదన్నా స్వీటు తెచ్చుకుని తినండి. మరి....చూడండి కొత్త బట్టలున్నాయా? కొనుకున్నారా... ఒక టీ షర్ట్ అన్నా కొనుక్కుని వేసుకో వచ్చుగా..."
"అలాగే....అవన్నీ మాట్లాడకు. అక్కడ వాళ్ళు వింటే బాగుండదు. చూడూ... కన్నీళ్లు తుడుచుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లోకూడా నీకు అక్కడ ఉండడం ఇబ్బందిగా ఉందన్న విషయం రాధకి తెలియనీకు సరేనా?"
నాకు మళ్ళీ దుఃఖం వచ్చింది. అణచుకుంటూ "అలాగే" అన్నాను కానీ నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.
"కాదులే నీ స్వరం నాకు తెలుస్తుంది. నువ్వేడుస్తున్నావ్ . కళ్ళు తుడుచుకో..."
చిటికెన వేలుతో చెంపల మీదికి జారిన కన్నీళ్లు తుడుచుకుని , ఒక్కసారి కళ్ళు గట్టిగా మూసి తెరిచాను. ఇప్పుడు నా కళ్ళకు సమానంగా కట్ చేసిన పచ్చిక , గాలికి ఊగుతున్న మొక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొంతు సవరించుకుని అన్నాను...."లేదు ...ఏడవడం లేదు...."
"ఒకే....మరి ఉండనా?బై....ఒన్స్ అగైన్ హ్యాపీ యానివర్శరీ...."
"థాంక్యూ...." అంటుంటే కను చివరల మిగిలిన రెండు చుక్కలు నా చేతి మీద పడ్డాయి.
'అమ్మమ్మా....ఇక్కడున్నావేంటి? నీకోసం వెతికా....' అంటూ తలుపు తీసుకుని వచ్చి నా ఒళ్ళో వాలిన బంగారుని అయ్యోయో పడతావు అంటూ గట్టిగా పట్టుకున్నాను. నా చేతిలో కార్డ్ లెస్ జారి కిందపడింది.
'అప్పుడే ఎందుకు లేచావు తల్లీ. ఇంకా మార్నింగ్ అవలేదు..." అన్నాను ముద్దు పెట్టుకుంటూ.
"నువ్వు నా దగ్గర లేవు. అందుకేలేచా.... బజ్జుందాం దా....అంది మత్తుగా వాలిపోతున్న కనురెప్పలు మూసుకుంటూ.
"అలాగే....వస్తాను పద బజ్జుందాం"అంటుండగా.
"ఏంటమ్మా , ఇంత చలిలో ఇక్కడ కూర్చున్నావు" రాధ కూడా లేచి వచ్చింది.
"ఏం లేదు తల్లీ.... మెలకువ వచ్చింది.... లేచాను" అన్నాను రాధ చూడకుండా కళ్ళు తుడుచుకుంటూ.
"నీకోసం వెతుక్కుంటూ వచ్చి డోర్ కొట్టింది ఇది. నా నిద్ర డిస్టర్బ్ అయింది. కాసేపు పడుకోవచ్చు కదా... వీకెండ్ అప్పుడే లేచి ఏం చేస్తావు? పడుకో" అంటూ ఆవలిస్తూ రాధ బెడ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది.
నా ఒళ్ళో పడుకుని మళ్ళీ నిద్రలోకి జోగుతున్న బంగారు మొహం చూశాను. అమాయకంగా, అందంగా ఉన్న ఆ మోహంలో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ, అభిమానం, నన్ను వివశురాలిని చేసింది. నా ప్రాణం నా సర్వస్వం .చెంప మీద సున్నితంగా వేళ్ళతో తాకి వాటిని పెదాలకు అనించుకున్నాను. అందులోంచి వాత్సల్యామృతం నా గుండెల్లోకిజారింది. ఆ పరిష్వంగంలోని మెత్తదనం, వెచ్చదనం నాలో తాత్కాలికంగా మరుగునపడిన మమకారాన్ని వెల్లువలా పైకెత్తి నామీద గుమ్మరిస్తున్న భావన.
"ఇంకాస్త బజ్జుంటా'అంటూ నిద్రలోంచి లేచి నాకోసం వెతుక్కుంటూ వచ్చిన నా చిట్టి తల్లిని వదిలి నేనెక్కడకు వెళ్ళను? సున్నితంగా రెండు చేతుల మీద ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటూ "నిన్నోదిలి ఎక్కడకు వెళ్ళగలను తల్లీ! వెళ్ళలేను అనుకున్నాను.నిజమే! వెళ్ళలేను. అది అనురాగ బంధం.... ఇది మమతానుబంధం.... పేగు బంధం...ఈ బంధానికి నన్ను ఖైదీని చేసే శక్తి ఉంది. కాకపోతే ప్రేమానురాగాలు పంచుకుని నూరేళ్ళ జీవితానికి మేము వేసుకున్న ప్రణాళికల్లో చిన్న మార్పు.... నా పిల్లలు ఎంచుకున్న ఈ ఆధునిక జీవన సమరంలో మేము చవిచూస్తున్న చిన్న ఓటమి.... అనుకుంటూ లోపలికి నడిచాను.
***
