Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 42


                                                ఎన్నిక
    
    హైద్రాబాద్ నుంచి టెలిగ్రాం వొచ్చింది. స్క్రూటినీ ఆదివారం యేర్పాటయింది గనక వెంటనే బైలుదేరి రమ్మని. తప్పిందిగాడు. శనివారం రాత్రి బస్సులో కూచుని అమ్మిరెడ్డి గురించి ఆలోచించేను!
    కథలూ, నవలలూ రాసుకునే రోజుల్లో ప్రజల్నుంచి నాకింత "గమనింపు" రాలేదనే చెప్పాలి. ఏ శుభముహూర్తాన ఈ నాటకాలు ప్రారంభించేనో గానీ, ప్ర్రారంభించిన కొన్ని మాసాల్లోనే ప్రతివూరా నా నాటకాలు ప్రదర్శింపబడి మన్నన లందుకున్నాయి!
    ఆర్నెల్ల క్రితం "బ్రతకనేర్చిన మనిషి" రాసేను. అమ్మిరెడ్డి ఆ నాటకంలో ముఖ్యమైన పాత్ర అమ్మిరెడ్డి వయస్సు రమారమి పదేళ్ళకి మించరాదు. నాటకం మధ్యలో అమ్మిరెడ్డి తండ్రి చనిపోయాడు. బ్రతికున్న రోజుల్లో చాలా విలాసంగా గడిచిన మనిషి అమ్మిరెడ్డి తండ్రి. అప్పులు చేయడంలో సిద్దహస్తుడు. దానివల్ల అతను పోయిన పిదప, మిగిలిన కొంప కాస్తా అప్పులవాళ్ళ పరమవుతుంది. అమ్మిరెడ్డి వీధిలో నుంచొని గుండెలవిసేలా యేడుస్తాడు. ఇక్కడ అమ్మిరెడ్డి నటన పరాకాష్ట నందుకుంటేనేగానీ నాటకం రాణించదు. గనక అమ్మిరెడ్డి పాత్రిక తగినకుర్రాడు చాకులాటి వాడై వుండాలి. వయసు చిన్నదైనా నటన విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవలసి వుంటుంది.
    "బ్రతక నేర్చిన మనిషి" మొట్టమొదటి మూడు ప్రదర్శనలూ నేను చూడటం జరిగింది. అయితే నేనూహించి రాసిన అమ్మిరెడ్డిని అప్రదర్శనల్లో చూడలేకపోయేను.
    ఈ మధ్య నా కా పాత్రపైన 'భయం' గూడా వేస్తోంది. ఆలోచన లేకుండా అలాంటి పాత్రల్ని నాటకంలో రాసేయడం నాకు సులభమేమోగానీ ప్రదర్శనలకు మాత్రం తలకు మించిన పని! అందుకే అమ్మిరెడ్డి మీద నమ్మకం పోయి భయం వేస్తోంది!
    ఈ నాటకం తీసుకున్న హైద్రాబాద్ ప్రదర్శకులు స్థానికంగా మంచి పేరున్న నటులని  విన్నాను. వాళ్ళ అమ్మిరెడ్డిని చూడాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఎందుచేతనోగాని వాళ్ళ అమ్మిరెడ్డి నాకు నా న్యాయం చేయడనిపిస్తోంది? కేవలం ఈ కారణం వల్లనే వాళ్ళ స్క్రూటీని చూచేందుకు - ముఖ్యంగా ఈ కొత్త అమ్మిరెడ్డిని పరీక్షించేందుకు ఆయత్త పడ్డాను.
    హైద్రాబాద్ లో బస్సు దిగుతూనే వాళ్ళందరూ నాకు స్వాగతం పలికేరు. వాళ్ళు తెచ్చిన టాక్సీలో కూచుంటూ వాళ్ళ ఆర్గనైజర్ని అడిగేను అమ్మిరెడ్డిని చూపించమని అతను సిగరెట్టు ముట్టిస్తూ అన్నాడు. "ఇంకా రాలేదు. స్ర్కూటినీ వేళకొస్తాడు. మెరికలాటి కుర్రాడు లెండి!"
    ఆ సాయంత్రం నాలుగున్నర క్కాబోలు రవీంద్రభారతిలో స్ర్కూటీని యేర్పాటు చేసేరు. మూడు గంటలనుంచే నటులు రంగులు వేసుకోడం ప్రారంభించేరు. అప్పటికొచ్చి కూడా అమ్మిరెడ్డి రాలేదని విన్నాను. మనసు కొంచెం బాధపడ్డది.
    నన్నంటిపెట్టుకు తిరుగుతూన్న స్క్రూటిని అధికారి నా మనసు గమనించక,
    "అదేం అలా ఉన్నారు? యూ ఆర్ నాట్ ఫీలింగ్ వెల్?" అని తెలుగులో పరామర్శించి యింగ్లీషులో అడిగేడు. నవ్వేసి ఊరుకున్నానేగాని నా కోరిక అతనికి చెప్పలేదు. నాలుగ్గంటల క్కాబోలు అమ్మిరెడ్డి పాత్రధారి వొచ్చేడని యెవరో కుర్రాడు చెప్పేడు. వెంటనే గ్రీన్ రూం లోకి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అధికారి ఉపన్యాసానికి మధ్యలో అవాంతరం కలిగించడం, శ్రోతగా నా ధర్మం కాదని తప్పనిసరిగా ఆ ఆడిటోరియంలో బల్లిలా కూర్చుండవలసిన అవసరం యేర్పడింది. అధికారి సంభాషణ మిగింపుకి రాకమునుపే ఓ లావుపాటి వ్యక్తివొచ్చి నా పక్కన కూచుంటూ నన్ను పలకరించేడు. నేనతని వేపు చూచినా మరుక్షణమే అతన్ని ఖరీదైన మనిషిగా గుర్తించేను. ఆయన తనని తను పరిచయం చేసుకున్నాడు. చిట్టిబాబు తండ్రిట.
    ఇక్కడ ఈ నాటకంలో అమ్మిరెడ్డి వేషం వేస్తోన్న కుర్రాడి పేరు చిట్టిబాబు.
    సరిగ్గా నాలుగున్నరకే తెర తొలిగింది. నాటకం మొదలు పెట్టేరు. మొదటి రంగం పూర్తవుతుందనగా ఓ తడవ పరిశీలనాధికారి వేపు చూసేను. అతను గోడమీద బొమ్మలవేపూ, అప్పుడప్పుడు తన చేతి గడియారం వేపూ, చూస్తూన్నాడు. నాటకం పట్ల అతని నిర్లక్ష్యానికి చాలా నొచ్చుకున్నాను.
    పెళ్ళిచూపులకీ, ఈ స్క్రూటనీలకూ చాలా దగ్గిర సంబంధం వున్నదని నాటకాలు రాయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే పూర్తిగా తెలిసొచ్చింది. వొచ్చిన వరుడి మీద కన్నెపిల్ల పెళ్ళి ఆధారపడినట్లే, ఇక్కడ ఈ పరిశీలనాధికారి నిర్ణయం మీద నాటక సమాజం వారి కొన్ని నెలల వ్యయప్రయాసలు ఆధారపడి వుంటాయి. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆరాటం ముందు సమాజం నిర్వాహకుల గుండెదడ ఏ మాత్రం తీసిపోదని చెప్తాను.
    మొదటిసీను పరిశీలనాధికారిని అంతగా ఆకట్టుకోలేక పోయినా, రెండో సీనులో అతను బాగా కదిలిపోయినట్టు గమనించేను. దానికి సాక్ష్యం ఆ సీను పూర్తయింతర్వాత అతని కనుకొలకుల్లో నీళ్ళు చెక్కు చెదరకుండా వుండటమే!
    ఇక నా విషయం వేరే చెప్పనవసరం లేదు. ఆ సమాజం నిర్వాహకుడు చెప్పినట్టు చిట్టిబాబు "మెరిక" లాటి కుర్రాడు. అతను అమ్మిరెడ్డి పాత్రని మనోహరంగా పోషించేడు. ఇక్కడ, ఈ నగరంలో - నేనూహించి రాసిన అమ్మిరెడ్డిని ఖచ్చితంగా చూడగలిగేను. ఆ శీను పూర్తవుతుందనగా అమ్మిరెడ్డికి రాసిన నాలుగు మాటలూ చిట్టిబాబు చాలా బాగా అనగలిగాడు. ఓ దివ్యానుభూతిని పొందినట్లయింది నాకు.
    "అయ్యా! సార్! దేవుడితో పాటు వీరంతా కూడా నా కన్యాయం చేసేస్తున్నారు! నేనిప్పుడు తండ్రిలేని వెధవని, కుర్ర కుంకని. నామీద జాలి చూపించండి సార్! నన్నోదార్చండి!"
    నా పక్కనే కూచున్న చిట్టిబాబు తండ్రి కళ్ళొత్తుకోవడం స్పష్టంగా చూడగలిగేను!
    - తిరిగి మా వూరొచ్చిన నెలరోజుల క్కాబోలు స్క్రూటినీలో 'బ్రతకనేర్చిన మనిషి' ఎన్నికైన శుభవార్త తెలిసింది. ఆ నాటకం ఎన్నికవడానికి ముఖ్యమైన కారణం అమ్మిరెడ్డి పాత్రనీ నాకు తెలుసు.
    మా వూర్లో నా స్నేహితుల్తో నేనక్కడ చూచినా అమ్మిరెడ్డి గురించి ఘనంగా చెప్పేను. చిట్టిబాబు ఉజ్వలమైన భవిష్యత్తుకి వారసుడవుతాడనీ జోస్యం చెప్పేను. ఇది విని చాలామంది నవ్వేసి వూరుకున్నారు. అది గమనించి ఈ ప్రచారాన్ని మరి తగ్గించక తప్పలేదు.
    ఆఫీసుపని ఒత్తిడిలో తల నిండుగా మునిగిపోయిన నాకు 'బ్రతకనేర్చిన మనిషి' ప్రదర్శన తేదీ వారం రోజులు ముందుగానే తెలిసింది. భాగ్యనగరంలో ఆ రవీంద్రభారతిలోనే రసజ్ఞులముందు ప్రత్యేకాహ్వానితులైన సినీనటులు, దర్శకుల సమక్షంలో యేర్పాటు చేసిన పోటీల్లో నాకు నచ్చిన అమ్మిరెడ్డి పరిచయం కాబోతున్నాడని వినగానే నా ఉత్సాహం పరవళ్ళు తొక్కింది, ఆ పోటీల్లో తుది ప్రదర్శన "బ్రతకనేర్చిన మనిషి" అదేరోజు బహుమతి ప్రధానోత్సవం గూడాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS