Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 41


    దాంతో విశ్వమ్మీద నాకు కించిత్తు కోపమూ వొచ్చింది. కానీ, అతను పశుపతి గారడీలో మునిగిపోయిన కుర్ర దర్శకుడు. సినీమాల్లో పాత్రలనైతే అతనిష్టం వొచ్చినట్టు మార్చుకోగలడుగానీ జీవితంలో పశుపతుల నేం చేయలేడు.
    శకుంతల వెళ్ళిపోయింది. పశుపతి విశ్వం పక్కన జాగ్రత్తగా కూర్చుని సిగరెట్టు ముట్టించేడు. విశ్వంతో కాసేపేదో మాట్లాడేడు. తెర తొలగడంతో మాటలాపేశాడు.
    'మధురానగరి' ప్రారంభమయ్యింది.
    నాట్యాలు చూడటమైతే జరిగింది కానీ వాటిని విమర్శించేంత స్తోమత నాకులేదు. అయినా సరే శకుంతల చేస్తున్నది ఏ వన్ డాన్సంటే నేనొప్పుకోను. సోమయాజులు తలూపుతూ పాడుతున్న దానికీ, శకుంతల అంగికాభివనాయానికి పొత్తే లేదు. ఎవరిష్టమొచ్చినట్టు వారు పాడుతున్నారు. చేస్తున్నారు. శకుంతల నేర్చుకున్న విద్య యింకా ప్ర్రారంభదశలోనే ఉన్నదని చెప్పాలి.
    ఇక నేను లేచి వెళ్ళిపోవడానికి సిద్దపడ్డాను మూర్తి బలవంతం చేసి కూర్చోపెట్టేడు.
    ప్రముఖులంటూ వొచ్చిం తర్వాత వారి యొక్క 'చేవ్రాలు' కోసం అనేకమంది సామాన్యమైన మనుషులు తహతహ లాడటం మామూలే. అప్పుడా నాడు అయిదారు గురు కాలేజీ విధ్యార్ధులు ముందువరసకి వొచ్చారు. ఆటోగ్రాఫ్ పుస్తకాలు పుచ్చుకుని విశ్వానికి ఇలాటి అభిమానులే ముఖ్యమని నా ఉద్దేశం. పశుపతి మొహంలో రంగులు మారుతున్నట్టు పసిగట్టాను. విశ్వం వాళ్ళకి సంతకాలు చేస్తూండగా పశుపతి వెర్రిత్తిన మనిషిలా ఖంగారుగా అటూ ఇటూ చూసేడు. నాట్యం మధ్యలో యిలా అనవసరంగా, వొచ్చిన ప్రతివాడికీ సంతకాలు పెట్టడం అతనికీ నచ్చలేదు. నాట్యకళలో చేయించిన రెండు నెలల 'కృషి' వృధా అవడం సుతరామూ ఇష్టం లేదు. అందుచేత వొచ్చిన మనుషులకి సంతకాలైన పిదప పశుపతి లేచివెళ్ళి గేటుదగ్గిరున్న పోలీసుతో యేదో చెప్పి వొచ్చి కూర్చున్నాడు. మరించే అట్నుంచి ఓ పిట్ట గూడా సంతకాలు నిమిత్తం యిటు రానివ్వలేదా పోలీసు.
    'మధురానగరి' చాలా సేపటికిగాని పూర్తికాలేదు! తర్వాత ఏదో జానపద నృత్యమని మైకులో 'చదివేరు'.
    పశుపతి డ్రింకుల తెప్పించేడు. ముందుగా విశ్వానికో డ్రింకు యిచ్చేడు.
    ఇక్కడ విశ్వం విజ్రుంభించేడు. కుర్రవాళ్ళెంత తెలివిగలవాళ్ళో చేతల్లో నిరూపించేడు. తనకిచ్చిన డ్రింకుని గబిక్కిన, వెనక్కి తిరిగి మూర్తికిచ్చేడు. అతనూ, నేనూ యిద్దరము తెల్లబోయేము. అంత వరకూ విశ్వం మమ్మల్ని గమనించలేదేమోనన్న మా భ్రమ పటా పంచలయ్యింది.
    "తాగరా మనం పదినిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోదాం. పిన్నివాళ్ళు యెదురు చూస్తూంటారు కాబోలు. వీడు మూర్తని మా తమ్ముడండీ."
    పశుపతిగారి చేతిలోని రెండో డ్రింకు తీసుకుని నాకిస్తూ నన్నూ పరిచయం చేశాడు.
    "రావుగారని కథలు రాస్తూంటారు."
    పశుపతి చేతిలో వున్న మూడో డ్రింకు తాను పుచ్చుకున్నాడు. పశుపతిలో గొప్ప చలనం కలిగింది. నాలిక్కరుచుకుని తల బాదుకుంటూ అన్నాడు.
    "అయ్యయ్యో! రావుగారు! రావుగారు, నాకు తెలీపోవడమేమిటండీ బాబోయ్! వార్నాకు బాగా తెలుసు. మీరు ఆయన్ను నాకు పరిచయం చేస్తుంటే నాతల కొట్టేసినంత పనయింది. వారేమిటీ. నాకు తెలీకపోవడమేమిటి? బలేవారేనేమీరు. (పునరుక్తి గమనించలేదు) వెనగ్గా కూచున్నారా స్వామీ! ఇలారండి. వొచ్చిక్కడ కూర్చోండి. ముందు" అంటూ తను లేచి నించున్నాడు.
    పశుపతి మీద జాలి కలిగింది. కానీ మేము ముందు వరసలోకి వెళ్ళలేదు. పశుపతే వెనక్కి తిరిగి మాతో మాట్లాడేడు. ఆయన చాలా విషయాలు కొత్తగా చెబుతున్నట్టు చెప్పేడు. వాళ్ళమ్మాయి నటన, వాళ్ళమ్మాయి చదువు, వాళ్ళమ్మాయి పెంకితనం - అల్లరీను అయితే యివన్నీ విశ్వానికి చెప్పాలనే ప్రయత్నంలో మమ్మల్ని అడ్డుగా వాడుకున్న ఆయన చాతుర్యం గణనీయమే!
    జానపద నృత్యం మేం ముగ్గురం లేచి నించున్నాము. మమ్మల్ని బయట వరకూ సాగనంపేరు సెక్రటరీ, ప్రెసిడెంటూ, థియేటరు ఓనరూ, ఉత్తమ నటుడూ వగైరాలు పశుపతి మాత్రం నన్ను కొంచెం అవతలగా తీసికెళ్ళి అడిగేడు.
    "రేపు విశ్వం గారు యిక్కడే వుంటారా?"
    "ఇక్కడేమో తెలీదుగానీ వాళ్ళ పల్లెటూర్లో వుంటారు."
    "వెడదామంటారేమిటి?"
    "చూద్దాం."
    "అమ్మమ్మ మీరా మాటనకూడదు. నేను రేపుదయం ఎనిమిధంటే ఎనిమిది గంటలకి మీ యింటి కొస్తాను."
    "సర్లెండి."
    "అన్నట్టు, అబ్బాయి పేరేమిటన్నారూ సంగమా, కుటుంబమా?"
    "సంగమేశ్వరరావు!"
    "ఆ! సంగమేశ్వరరావునీ మీ యింటికి రమ్మనండి. ఉద్యోగం వేయించేద్దాం. అదిగో మిమ్మల్ని విశ్వనాథం గారు పిలుస్తున్నారు. వొస్తానండి."
    ఉదయం యేడున్నరకే సంగమేశ్వరరావు మా ఇంటి కొచ్చేడు. నా ముందు కూర్చున్నాడు. నేను విషయం చెప్పేను. అతను విని ఆనందంగా అన్నాడు.
    "మీకు తెలీదుగానండి. మీకు చాలా పరువుంది. లేకపోతే ఆ పశుపతిగారు ఓ పట్టాన మీమాట వినేవారనా?"
    సంగమేశ్వరరావు లౌక్యాన్ని నేను మెచ్చుకోలేకపోయేను. ఈ సంగమేశ్వరరావు, వెంకట్రావు ఇద్దరూ కలిసి నా ప్రాణం తినేశారు. నాకప్పుడు కోడి పందేలు గుర్తుకొచ్చేయి. పందెపు కోడిలా నన్ను బరిమీదకి వొదిలేరు. ఎవర్నీ నమ్మకూడదు.
    పశుపతిగారి కారు వారన్న టైముకి ఓ పావుగంట ముందే వొచ్చేసింది. ఆయనంత దూరాన్నుంచే నవ్వుమొహంతో గబగబా వొచ్చేశారు చేతులూపుకుంటో.
    మా యింట్లో చాలా అందమైన కుర్చీలు రెండే వున్నాయి. సంగమేశ్వరరావు కొకటీ, నేనొకటీ వాడుకుంటే పశుపతి గారెక్కడ కూర్చుంటారనే విషయం ఆలోచిస్తూ నించున్నాను. అప్పడు నాకో పాత కుర్చీ గూడా వున్నట్టు జ్ఞాపకం వొచ్చింది. ఆ జ్ఞాపకానికి వెంటనే నొచ్చుకున్నాను.
    
                                                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS