Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 43


    కానీ, నా ఆఫీసునుంచి నా ఉత్సాహాన్ని మరుక్షణంలో చంపింది, అయినా ఆవేళకి తప్పనిసరిగా వెళ్ళి అమ్మిరెడ్డిని అభినందించాలనే తపన రోజురోజుకీ ఎక్కువవుతూ వొచ్చింది. ఆర్రోజులు పగటి కలల్తోనే గడిపేను. ఏడోరోజు సరిగ్గా నా నాటకం ప్రదర్శన రోజుకి భగవదనుగ్రహం వల్ల ఎలాగైతేనేం శెలవు సంపాదించగలిగేను. ఆఫీసునుంచే బస్టాండుకి వెళ్ళేను.
    బస్సు హైద్రాబాద్ చేరేవేళకి చాలా వేళయింది. టాక్సీ ఎక్కి రవీంద్రభారతి దగ్గిర దిగేను. నేను ఆడిటోరియంలో అడుగుపెడుతూన్న వేళకి రెండో సీను జరుగుతోంది. పోటీల్లో ఈరోజు చివరిది గనక చాలా ముఖ్యమైన రోజు. ప్రేక్షకులు కిటకిట లాడిపోతున్నారు.
    గుండె చేతుల్లో పెట్టుకుని గోడనానుకుని ప్రదర్శన చూస్తున్నాను. మంచి రక్తిగా నడుస్తోంది రంగం. అమ్మిరెడ్డి పట్ల ప్రేక్షకుల సానుభూతిని ప్రత్యక్షంగా విన్నాను. ఆ సీను పూర్తవుతూండగా ఆడిటోరియంలో ఎవరో రసజ్ఞుడు "లవ్ లీ" అని అరిచేడు. ఆ కేక వెంబడి గబగబా చప్పట్లు వినిపించేయి. అనందాశ్రవుల విలువెంతో అప్పుడు నాకు తెలిసొచ్చింది.
    బహుమతి ప్రధానోత్సవం జరుగుతూన్నప్పుడు మరింత నిటారుగా నించున్నాను. ఆ ఏడాది ఉత్తమ నటుడుగా నా అమ్మిరెడ్డి పాత్రధారి చిట్టిబాబే ఎన్నికయ్యాడు. ప్రేక్షకుల హర్షామోదంతో ఉక్కిరిబిక్కిరయ్యేను. ఉత్తమ ప్రదర్శన బహుమతీ నా నాటకానికే లభించింది!
    ఎగిరి గంతువేయాలనిపించింది. గబగబా గ్రీన్ రూమువేపు నడిచాను. ముఖ్యంగా చిట్టిబాబుని అభినందించాలని. కాని -అక్కడ చేరిన మనుషుల్ని చూడగానే వాళ్ళక్కాస్త దూరంగా ఆగిపోయేను. ప్రఖ్యాత సినీదర్శకులొకరు చిట్టిబాబుతో ఏమిటోమిటో మాటాడుతున్నాడు. వాళ్ళిద్దరి చుట్టూ తతిమ్మా నటులందరూ గుమిగూడేరు! వాళ్ళలో ఒక్కరూ నన్ను గమనించే స్థితిలో లేరు. వాళ్ళ ఉత్సాహానికీ, చిట్టిబాబు అదృష్టానికీ, నేను ముచ్చటపడిన మాట వాస్తవం!
    నా భుజం మీద ఎవరిదో చేయి పడ్డది. ఉలిక్కిపడి ఆవేపు చూసేను. అతను సుదర్శనరావు! నా మిత్రుడు. అతనన్నాడు-
    "వొచ్చేయ్? ఇప్పుడు మీ వాళ్ళకి నీతో అవసరమేమీ లేదు! గనక వాళ్ళనిబ్బంది పెట్టకు! నీ మర్యాదా కాపాడుకో వొచ్చేయ్."
    నిజంగూడా అదేను. సుదర్శనంతో పాటు అతనింటికీ వెళ్ళిపోయేను. ఆ రాత్రి నిద్రస్సలు పట్టనే లేదు.
    ఉదయం పదిగంటలక్కాని స్నానం గట్రా ముగించలేదు. సుదర్శనం కాఫీ తాగి వాళ్ళాఫీసుకి వెళ్ళిపోయేడు. నేను చిక్కడపల్లి వేపు నడిచేను.
    మునుపు స్క్రూటీని జరిగినప్పుడు చిట్టిబాబు వాళ్ళింటికి వెళ్ళేను. ఇప్పుడు వాళ్ళ యిల్లు పోల్చుకోడం కష్టమనిపించినా, చివరికి వాళ్ళింటి ముందు నించోగలిగేను. అయితే ఇప్పుడా ఇంటికి తాళం వేసి వుంది.
    రాత్రికి రాత్రి ఆ తండ్రీ కొడుకులిద్దరూ మదరాసు బండెక్కి పోయారేమోనని ఆ తాళం చూడగానే అనిపించింది. కానీ, అక్కడికి దాపులోవున్న కుళాయి దగ్గిర నీళ్ళు పట్టుకుంటూన్న చిట్టిబాబుని చూడగానే నా అనుమానం పటాపంచలయ్యింది. గబగబా అతని వేపు నడిచేను.
    నన్నతను చూచినా క్షణంలో అతని మొహంలో 'వెల్తురు' కనిపించింది. కానీ అది క్షణికం. వెంటనే దీనత్వం గోచరించింది. అతను రెండుచేతులూ వినయంగా జోడించేడు. ముచ్చట వేసింది నాకు.
    అతనన్నాడు.
    "మీకు తెలీదా సార్! మానాన్న పోయేరు!"
    నా నెత్తిమీద పిడుగుపడినట్లయింది. మళ్ళీ అతనే అన్నాడు.
    "అయ్యా! సార్! దేవుడు నాకు అన్యాయం చేసేడు సార్! నేనిప్పుడు తండ్రిలేని వెధవని, కుర్ర కుంకని. నా మీద జాలి చూపించండి. నన్నోదార్చండి సార్."
    నా కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగేయి. నిలువెల్లా కంపించి పోయేను. అతన్తో ఏం చెప్పకుండానే వెనుతిరిగేడు. అతనింకా ఏడుస్తూనే వున్నాడు.
    మావూరు బస్సెక్కిం తర్వాత అనుకున్నాను.
    అమ్మిరెడ్డికి నాటకంలోనే కాదు, జీవితంలోనూ అన్యాయం జరిగిపోయింది. చిట్టిబాబూ! నువ్వీ నాటకం వెయ్యొద్ధింకా! కేవలం నాటకాలు రాసే వాడినేగాని జీవితాలు మార్చు చాతుర్యం నా కెక్కడుంది నాయనా! నేనెవర్నీ ఉద్దరించలేను. నిన్ను ఓదార్చలేను నిజం!
    
                                                                      *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS