"ఏమో! ఇంట్లో బల్బు వుందంటే సడన్ గా మాడిపోతున్నాయి. బల్బు లేకపోతే ఎన్నాళ్ళయినా అలాగే వుంటాయి!"
"పూర్ సెంటిమెంట్!" నవ్వుకుంది నంద! నెలనెలా ఒకటో రెండో బల్బులు ఫ్యూజవుతూనే వున్నాయి. అద్దెతో పాటుగా, సి.సి. చార్జెస్ తో పాటుగా ఇంటి బడ్జెట్ లో నెల నెలా బల్బులకి కేటాయించక తప్పటం లేదు. ఎప్పుడు చేసిన వైరింగో! స్విచ్చిల్లోనూ లోపాలున్నాయి! ఒక్కోసారి స్విచ్ వేస్తే బల్బు మాడిపోతూనే వుంది!" అనుకుంది.
చెల్లితో ఇంకేమీ అనకుండా వెళ్ళి తల్లికీ, తండ్రికి భోజనం పెట్టి వచ్చింది. ఇద్దరికీ మందు ఇచ్చింది.
రవికాంత్ మెల్లిగా వంటింట్లోకి వచ్చాడు.
"భోజనం చేస్తావా?"
తలూపేడు.
పీటవేసి వడ్డించింది. మవునంగా చకచకా భోజనం ముగించాడు అతను.
"నందా!" చేతులు కడుక్కుని పిలిచాడు.
"ఏం?" ఆశ్చర్యంగా చూసింది.
"ఆమె ఊరకే అలా అంది నేనేం చూళ్ళేదు, అలా నుంచొని వుంటే కేకలు పెట్టింది!"
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నందకి. నోరు విప్పి సరిగ్గా మాటాల్లేని ఇతన్నా అంతలేసి మాటలంది? ఎలా మనసు వొప్పిందో? పాపం బాధపడ్డాడు. ఎంతగా కృంగిపోయాడో? సంజాయిషీ యిచ్చుకుంటున్నాడు. తనదేం తప్పులేదని చెప్పుకుంటున్నాడు అనుకుంది.
ఆమె మనసు మంచిది కాదు. నువ్వేం బాధపడకు అని ముందు ఇంట్లోకి వెళ్ళిపోయింది నంద.
"మేడమ్!"
తిరిగి స్టూడెంట్స్ వద్దకి వెళ్ళి పాఠం చెప్పబోతూ వుండగా పిలిచాడు కులపతి. అతను ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నాడు.
"రా కులపతి!" పిలిచింది.
"మీరు బిల్లు కట్టలేదు. డి.సి. లిస్టులో వేశారు. కేరియర్ తీసికెళ్ళాలి. మధ్యాహ్నం వచ్చాను. మీరు లేరు తీసికెళితే ఇబ్బంది అవుతుందని ఆఫీసులో ఏదో చెప్పేశాను-"
రక్తం చల్లబడిపోయినట్లయింది నందకి. సి.సి. బిల్లే దాదాపు పది వుంది. ఇరవయిలోగా కట్టెయ్యాలని ఎంతో ప్రయత్నించింది. కుదర్లేదు. ఆఖరికి నెలాఖరులోగా కట్టేసినా ఫర్వాలేదు. ఫెనాల్టీతో వెళ్ళిపోతుంది. కానీ అది సాధ్యపళ్ళేదు. తను పూర్తిగా మరిచిపోయింది. ఇప్పుడు డి.సి. చార్జీలో మరో పది. ఇతను కాబట్టి ఎక్కువ పడదు. లేకపోతే మామూలు. ఇంకో రెండో! మూడో! ఎలా ఈ సంసారం ఈదేది?
అయినా బిల్లు జీతం రాగానే తీసుకుంటే సరిపోదూ! వూహు పదో తారీఖు దాకా తీసుకోరు! ఎందుకో అసలు సి.సి.లు జీతాల్లో విరగ్గోస్తే సగం బాధ్యత పని తప్పిపోతాయి. అలా ఎందుకు చేయకూడదు? లేదా జీతాలు వచ్చే రోజున ఆఫీసుకి బిల్లులతో సహా వచ్చేస్తే సరిపోదూ?
"రేపు కట్టిస్తాన్లే కులపతీ!" అంది కాని ఎలా కట్టగల్గుతుంది. రేపు కట్టేయగల శక్తే వుంటే ఇతని చేతికి ఇప్పుడే ఇవ్వచ్చుగా రేపు- రేపు- మధ్య తరగతి మనుషులకీ ఆలోచనలుగానీ, పనులని వాయిదా వేసుకోటానికి ఎంత మంచిసాకు-
నిజంగా రేపు అనే దానిపై ఆశ లేకపోతే మధ్య తరగతి మనుషులు ఏనాడో చెరువుల్లో, బావుల్లో దూకి చచ్చే వాళ్ళు.
ఈ రోజంతా నిరాశతో గడిపినా, రేపటిపై తీయని వూహలు వెలుగుతాయి. తెల్లగా తెల్లారేసరికి ఏ అల్లావుద్దీన్ అద్భుత దీపం వల్లనో, ఏ పాతాళభైరవి వల్లనో ఇల్లు స్వర్ణమయమై పోతుందని నూటికి తొంభైమంది మధ్యతరగతి మనుషులు ఆశపడతారు.
"మేడం! ఒకటవ తేదీకి పూర్వమే నేను మీ బిల్లు కట్టేను. మళ్ళీ మీకు పదిరూపాయలు డి.సి. చార్జీలు పడతాయని కట్టేశాను. మీరు మీ బిల్లు ఇవ్వండి పెనాల్టీ వచ్చేనెలకి జమ అవుతుంది!
"థాంక్యూ కులపతి" అంది సంతోషంగా ఆమె ముఖంలో ఎంత ఆనందం! పదిరూపాయలు అనవసరంగా ఖర్చు కాకుండా మిగిలిపోయాయనే తృప్తి ఎంత సంతోషాన్ని కలిగించింది.
అందరూ వెళ్ళిపోయారు. శశికాంత్, విమల చదువుకుంటూనే వున్నారు.
ఒకరోజు తనకి జరిగిన అనుభవం గుర్తుకి వచ్చింది.
అందరికీ అనుభవాలంటే తీపి గుర్తులు.
కానీ తనకి మాత్రం అన్నీ చేదు మాత్రలే! ఏం చేయాలి?
ఒక్కో జాతి లక్షణం అది!
తను అంతకు మించి తెచ్చుకోలేదు.
25
ఆరోజు క్లాసులో చాలా కులాసాగా గడిచిపోయింది. నిజంగా అది ఒక్కొక్కరోజు అదృష్టమనే చెప్పవచ్చు. అదే లెక్చరర్!
అదే రూం!
వాళ్ళే స్టూడెంట్స్ దాదాపు అదే సబ్జక్టు!
అయినా ఒక్కోరోజు క్లాస్ టెన్షన్ లో నడుస్తుంది. మరో రోజు జాలీగా వెళ్ళిపోతుంది. ఇంకో రోజు మూడీగా గడుస్తుంది.
కారణమంటూ ప్రత్యేకంగా ఏదీ వుండదు. మరి కులాసాగా గడిచిపోయిందంటే అదృష్టమనుకోవాలా? ఇంకేమనుకోవాలి?
ఇంటికి వచ్చేసరికి పెదనాన్న కబుర్లు చెబుతున్నాడు అందరితోనూ, అంతా తుళ్ళుతూ నవ్వుతూ గడుపుతున్నారు ఇంకా అప్పటికి దరిద్రం కష్టం చాయల్లోకి కూడా రాలేదు.
"రావేరా!" ఆప్యాయంగా పలకరించాడాయన. స్వయానా పె త్తండ్రి కాదు. ఆయన ఏ తరంలోనో దాయాదలు. ఇప్పుడు జ్ఞాతులు! ఆస్తి పంచుకోనవసరంలేని సోదరత్వం అందుకే ఆప్యాయతలు ఎక్కువ ఆయన పేరు సూర్యనారాయణ.
"ఎప్పుడొచ్చావు పెద్దనాన్నా!"
"నీ కంటే గంట ముందు- నీవు ఎలా చదువుతున్నావ్?"
"ఈ మధ్య ఏవైనా పరీక్షలు వచ్చాయా?"
"ఎందుకు?' తెల్లబోతూ అడిగింది.
"ఏం లేదు! కాలేజీ మానేసి రెండు దశాభ్దాలు అయిందిగా! రోజుకో రూలు! గంటకో మార్పు! విద్యాగంధంలేని మంత్రులు విద్యాశాఖకి వస్తున్నారు అది మన కర్మ! ఏ రిటైర్డ్ చాల్సలర్ నో ఆ శాఖకు తీసుకోరు. వీళ్ళు ఎలక్షన్స్ లో లక్షలకి లక్షలు ఖర్చుచేయలేరు కదా!" ఆయన తీరే అంత! తీగలాగితే డొంకంతా కదిలిపోతుంది.
"మంచి మార్కులే వచ్చాయి పెదనాన్నా! అన్నిట్లోనూ అరవైకి పైనే వచ్చాయి!
"వెరి గుడ్! హార్టీ కంగ్రాట్స్! అనేసి గమ్మున వుండిపోయాడు. ఒక నిమిషం ఆగి ఇదిగో నందా! ఇవన్నీ నూటికా రెండొందలకా? ఎందుకంటే ఆస్మత్పుపుత్రః అలాగే చెప్పాడు!! అని గలగల నవ్వేశాడు.
