Previous Page Next Page 
ఒప్పందం పేజి 40

 

    ఇప్పుడు కూడా నేను అనుకున్న జీవితం అనుభవిస్తూనే ఉన్నాను. మా ఇద్దరి మధ్యా అదే అన్యోన్యత.... అదే అనురాగం. మా జీవితాల్లో అదే చైతన్యం. అదే రసానుభూతి. ఒక స్త్రీగా, మాతృమూర్తి గా పరిపూర్ణత చేకూరుస్తూ మనవరాలి ఆగమనం.... కానీ, తేడా....చిన్న తేడా.... చిన్నదేం కాదు....పెద్దదే. చాలా పెద్దది. అక్కడ నా జీవితం నిత్య చైతన్య స్రవంతి. ఇక్కడ నా జీవితం ఘనీభవించిన మంచు. ఈ కూతురు, ఈ అల్లుడు , ఈ మనవరాలు అక్కడ ఉంటె ఈ ఆనందాన్ని పాపాయితో పొందే మధురానుభూతుల్ని ఆయనతో కలిసి పొందే అనందం వేరు. అది ఎన్ని వేల డాలర్లు వెచ్చించినా లభించదు.
    ఇప్పుడు చిత్రంగా ఏదో మార్పు నాలోనే. నా ప్రేమలోనే.... నా ప్రేమ ఇదివరకు రెండు భాగాలు... ఇప్పుడు నాలుగు భాగాలైంది.అందులో ఎక్కువ వాటా నా బంగారుకి... అందుకేనేమో ఆరునెలలు దాటగానే ,ఇరుకు సీట్లో 18 గంటల విమాన ప్రయాణం , స్వేచ్చ లేనిఅమేరికా జైలు జీవితం , పలకరింపుకి నోచుకోని మౌన జీవితం, జడత్వం తో నిండిన దినచర్య... ఏవీ నన్ను నిరోధించవు. అయన కళ్ళల్లో లీలామాత్రంగా కనిపించి మాయమయే దిగులు, అయన సాన్నిధ్యంలో నేను పొందే మహత్తరమైన అనుభవం ఏవీ నన్ను ఆపవు. ఆరునెలలు దాటగానే పాపాయి నవ్వు, పాపాయి అల్లరి నన్ను అమెరికా లాక్కెళ్ళి పోతాయి.అలా వచ్చేటప్పుడు మా పెళ్ళి రోజులు, పుట్టినరోజులు, వెన్నెల రాత్రులు శృంగార జీవితం నన్నేదీ ఆపదు . కానీ,రాగానే మళ్ళీ చైతన్యం ఘనీభవిస్తుంది. నిత్యం ఆయనతో మాట్లాడే నా మాటల్లో చిలిపితనం పోయి ఫోన్ లో పాపాయి అల్లరి, పాపాయి కబుర్లు దొర్లుతాయి.
    "ఏంటిది? ఇంతేనా జీవితం..." గుండెల్ని చీల్చుకుంటూ దీర్ఘమైన నిట్టుర్పు వచ్చింది.
    నా కళ్ళు మళ్ళీ వెన్నెల్లో తడుస్తున్న ప్రకృతి వైపు తిరిగాయి. ఆలోచనలు మనసు నిండా కదం తొక్కుతుంటే కళ్ళ ముందు కాస్సేపుశూన్యం కన్పిస్తుందేమో... ఇప్పటిదాకా కను మరుగైన వెన్నెల అందం మళ్ళీ నా గుండె పొరల్ని తాకింది. ధారలుగా, కారుతూ , తన తేజాన్ని తన చల్లదనాన్ని ప్రకృతి మీద వెదజల్లుతూ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడుతోంది. అమాంతం వెళ్ళి ఆ వెన్నెల్లో స్నానం చేయాలనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి దోసిళ్ళ తో ఆ వెన్నెల పట్టుకుని తాగాలని పిస్తోంది.
    వెన్నెలంటే మా ఇద్దరికీ ఎంతో ఇష్టం. ప్రతి పున్నమి నాడూ డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకోడం మా జీవితాల్లో ముప్పై ఏళ్ళ నుంచీ వస్తున్నా రివాజు. మా శృంగార జీవితంలో ఒక మధురమైన అనుభూతి. అలాంటి వెన్నెల రాత్రుల్లో అయన నా చేత ఎన్ని వెన్నల పాటలు పాడించుకుని వింటారో.... వెన్నెల లోని వికాసమే వెలిగించేద నీ కనులా.... ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నల ఈనాడూ, ఆనాడూ ఒకే వెన్నెల... కృష్ణశాస్త్రి గారి పాట... ఆ వెన్నల పాట....జల్లులు జల్లులుగా గుండేల్లోకురిపిస్తూ నేను పాడుతోంటే ఆయన ఎంత తమకంతో వినేవారు. రేల్లుపాక పానుపు పైన జల్లు, జల్లులుగా ఎవరో చల్లినారమ్మా.... నా కక్కడ ఇంకక్షణం కూడా నిలవాలనిపించలేదు. నాకూ, వెన్నలకీ మధ్య పారదర్శకంగా ఉన్న గాజు కిటికీ అభేద్యమైన గోడలా  అనిపించింది.
    సవ్వడి చేయకుండా బైటకి వచ్చాను. అడుగులో అడుగు వేసుకుంటూ కిందికి దిగి వచ్చి స్టాండ్ మీద ఉన్న కార్డ్ లెస్ చేతిలోకి తీసుకుని బ్యాక్ యార్డ్ వైపు నడిచాను. సెక్యూరిటీ నెంబరు నొక్కి డోర్ తీసి బైటకి వెళ్ళి గార్డెన్ చెయిర్ లో కూర్చున్నాను. చల్లగా, హాయిగా ఉంది. వెన్నెల బంతిలా మారి నా ఒళ్ళో పడినట్లు అనిపించింది.
    అయన ఆఫీసు నుంచి వచ్చి ఉంటారు... ఫోన్ చేసి శుభాకాంక్షలన్నా చెప్పాలి కదా! అయన నాకు శుభాకాంక్షలతోటే సుప్రభాతం పాడారు. ఎంత దూరం ఉంటె ఏం? ఆయన ప్రేమ, అయన అనురాగం నన్ను నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అందుకు హ్యాపీ యానివర్శరీ అంటూ చెవిలో అయన ఊదిన శంఖమే నిదర్శనం.
    మా పెళ్ళి రోజు రాధకి గుర్తు లేదు. ఉండి ఉంటె నిన్న రాత్రే హడావుడి చేసేది. అర్ధరాత్రి కేక్ కట్ చేయించి, ఆ సన్నివేశాన్ని తండ్రికి స్కైపు లో చూపిస్తూ తనూ, భర్తా కూతురూ మా ఇద్దరికీ శుభాక్షంక్షలు చెప్తూ.... ఎన్ని శుభాక్షాంక్షలు చెప్పినా, ఎంత పెద్ద కేకు కట్ చేయించినా కంప్యూటర్ లో ఆయనకి చూపించినా మేమిద్దరం కలిసి ఈ వెన్నెల రాత్రిని , వెన్నెల పాటలతో గడిపే ఆ మధురమైన సన్నివేశాన్ని ఆస్వాదించగలమా? రాధ అమెరికా రావడం వల్ల, పాపాయి పుట్టడం వల్ల మేము ఇలా ఏడాదికి ఆరునెలలు వియోగంతో భాధపడుతున్నాం కానీ ఎప్పుడైనా మేము ఇంతకాలం ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉన్నామా?నెవ్వర్.... ఎంత మంది కుంటుంది మా దాంపత్యం లాంటి దాంపత్యం. ఉండదు గాక ఉండదు. నేను ఇలా వస్తున్నందుకు అయన ఎంత బాధపడుతున్నారో ఆలోచించే వ్యవధి కూడా లేకుండా వచ్చేస్తున్నాను. ఆరునెలలు ఎంతలో గడుస్తుంది? అందులోనూ అయన సాన్నిధ్యంలో తిరిగి చూసేలోగా మళ్ళీ షాపింగు లు, సూట్ కేసు లు సర్దుకోడం, బరువులు,చూసుకోటం ఎయిర్ పోర్టు, ఇరుకు సీటు , పికప్ లు, ఫ=డ్రాపింగ్ లు..... ఏంటీ జీవితం?ఇంతేనా ఇంక ....నాకు చాలా బెంగగా అనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనింకా రాకూడదు ఇక్కడికి... ఇప్పటికే ఆయనకి చాలా అన్యాయం చేశాను. ఎంత పిల్లలైతే మాత్రం భర్తని నిర్లక్ష్యం చేసేంత మాతృ ప్రేమ అవసరమా? నో అంతగా అయితే పాపాయిని నాతొ తీసికెళ్ళి పోతాను. కానీ, ఆయన్ని వదిలి మాత్రం ఇంక వచ్చేది లేదు.
    తమాషా ఏంటంటే మా మధ్య ఇటీవల తరచూ ఏర్పడుతున్న ఈ దూరం దేబ్బలాటలతో కానీ, అభిప్రాయ భేదాలతో కానీ ఏర్పడింది కాదు కాబట్టి ఇంత దూరంలోనూ మామధ్య చిలిపి కబుర్లు, తీయని అనుభూతుల నేమరివెతలు.... ఫోన్ ద్వారా , ఇంటర్ నెట్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి. మామనసుల్లో ప్రేమ పుష్పాలు నవనవలాడుతూనే ఉన్నాయి. కానీ, ఇలా ఎంత కాలం?
    అయన రిటైర్డ్ అవడానికి ఇంకా రెండేళ్ళు. ఆ తరువాత ఇద్దరూ రావచ్చు. వచ్చినా అయన ఇంత యాంత్రికత ను భరించలేరు. ఆయనకి జీవితం ఒక చైతన్య వాహికలా ఉండాలి. ఆయనలోని భావుకత, రసికత,చలాకీతనం, ఆయన్నిక్కడ నిర్వీర్యం చేస్తుంది. ఒక్కసారి ఇక్కడకు వచ్చి నా పరిస్థితి చూసి నన్ను మళ్ళీ పంపిస్తారా లేదా అని కూడా నాకు అనుమానమే. ఈ జీవన విధానం ఆయనకి ఎంతమాత్రం నచ్చదు. నన్నేకాదు,పిల్లల్ని కూడా ఉండనివ్వరు. కానీ, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా రారు. వాళ్ళకి ఇక్కడే బాగుంది. కానీ నాకుఇండియానే బాగుంది. ఇదే జనరేషన్ గ్యాప్ లో ఉన్న అభిరుచుల తేడా. అక్కడ ఉన్నస్వేచ్చ నాకిక్కడేది? ఇండియాలో లంచగొండితనం పెరిగిపోనీ, ఇండియాలో పొల్యూషన్ పెరిగి పోనీ, ఇండియాలో మోసాలు, దగా,దొంగతనాలు,సామాజిక అలజడి , ఏమన్నా ఉండనీ, నా ఇండియా ఇండియానే.... అక్కడ ఎన్నో సౌకర్యాలున్నాయి. అక్కడ నావాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు. నా జీవితాన్ని సుఖంగా ప్రశాంతంగా , రసవత్తరంగా గడిపే అవకాశం నాకేంతగానో వుంది. రెక్కలుంటే ఎంత బాగుండేది... ఈ ఒక్కరోజు నాభర్త దగ్గరకు వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభూతిని మూట గట్టుకుని వచ్చేదాన్ని.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS