Previous Page Next Page 
ఆదివిష్ణు కథలు పేజి 40


    విశ్వంతోపాటు చాలామంది ఖరీదైన మనుషులు లోపలికొచ్చేరు. విశ్వం వేదికమీదికి వెళ్ళగా మిగతా వాళ్ళందరూ మా ముందున్న మొదటి వరుస కుర్చీల్లో కూర్చున్నారు. సరిగ్గా నాముందు పశుపతిగారే కూర్చున్నారు. ఆయన నా మొహం చూచిగూడా పలుకరించలేదు. నేనూ తలదించేను.
    సరిగ్గా ఆయన కుడివేపున మూడుకుర్చీలు ఖాళీగా వున్నాయి.
    సభ ప్రార్ధనతో ప్ర్రారంభమయింది. 'వందేమాతరం' పాడినమ్మాయి పాట పూర్తయి తర్వాత (ఫర్లేదు బాగానే పాడింది) వినయంగా చేతులు జోడించి విశ్వానికి నమస్కరించింది.
    సంఘ కార్యదర్శి విశ్వాన్ని సభికులకు పరిచయం చేశాడు. అదైన తర్వాత విశ్వం కాసేపు మాట్లాడేడు. ఈ సినిమా ప్రపంచంలో తానెన్నికష్టాలెదుర్కొని ఈ స్థితికొచ్చేడో చెప్పేడు. (వొంటికి మల్లెపూవులు తగలడం కూడా గొప్ప కష్టమేనా అనిపించింది నాకప్పుడు) ఆంద్ర ప్రేక్షకులు తన పట్ల చూపుతున్న ఆధారాభిమానాలు శ్లాఘనీయమన్నాడు. కళలకు ఆటపట్టైన మా వూళ్ళో తనకీరకమైన అభినందన సభ ఏర్పాటుచేయడం ముదావహమనీ అన్నాడు. (అప్పుడు సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి) తదనంతరం ఉపన్యాసం ముగించి కూర్చున్నాడు.
    సంఘాధ్యక్షులు విన్నపాలూ ముగిసేయి. అవి జరుగుతూండగా విశ్వం తనకిచ్చిన పూలదండని ముక్కు దగ్గిరగా వుంచుకుని ఏదో ఆలోచిస్తున్నట్టు కన్పించేడు.
    ఉపన్యాసాలు పూర్తయిం తర్వాత విశ్వంతోపాటు వక్తలూ వేదికదిగి కిందికొచ్చేశారు.
    తర్వాత వినోదకార్యక్రమాలు. అవి ప్ర్రారంభించే ముందు నా ముందువరసలో వున్న కుర్చీల్లో జరిగిన కొన్ని తమాషాలు రాస్తాను.
    విశ్వం వేదిక దిగొచ్చి పశుపతిగారి కవతలగా వున్న మూడో కుర్చీలో కూర్చున్నాడు. రెండోదాన్లో సంఘాధ్యక్షులు పశుపతిగారి పక్కనే కార్యదర్శీను. ఇదీ సీను. కానీ, పశుపతిగారికీ వరస వచ్చినట్లు లేదు. సంఘ కార్యదర్శితో ఏదో మెల్లిగా చాలాసేపు మాటాడేరు. ఆమీదట కొన్ని ఒడంబడికలేవో జరిగి వుంటాయి. అందుచేత కార్యదర్శి పశుపతిగారి కుర్చీలోకి వచ్చేడు. దరిమిలా అధ్యక్షుడూ కదిలి ఇవతల (కార్యదర్శిది) కుర్చీలోకి వచ్చేడు. అప్పుడు విశ్వం ఎడం పక్కకుర్చీ ఖాళీ అయ్యింది. దాన్లోకెళ్ళి కూర్చున్నాడు పశుపతి. అతని ఆరాటం నాకు చిరాకనిపించింది.
    పశుపతి విశ్వానికి ఎడంపక్క కుర్చీలో కూర్చున్నాడన్నమాటే గానీ, విశ్వానికవతల కుడిపక్కన కూర్చున్న మరో మనిషిమీద కోపమొచ్చి వుండాలి. ఎంచేతంటే ఆ మనిషి, విశ్వాన్ని జలగలా పట్టుకుని విడిచిపెట్టడం లేదు. తెగ మాటాడేస్తున్నాడు. మొహమాటం కొద్దీ విశ్వం తలూపుతున్నాడు.
    పశుపతి ఓ తడవ అవతల మనిషి వేపు మిర్రున చూచేడు. అది గమనించలేదా మానవుడు. తరువాత కార్యదర్శిని కళ్ళతో ఏదో హెచ్చరించేడు. అప్పుడా కార్యదర్శితన సీట్లో నుంచి లేచి వెళ్ళి వినయంగా విశ్వం ముందు నించుని ఏదో చెప్పాడు. తన పక్కనే బాంబేదో పేలినట్టు ఉలిక్కిపడి ఎడంవేపు చూసేడు విశ్వం.
    అప్పుడు పశుపతి రెండుచేతులూ జోడించి వెకిలిగా నవ్వేశాడు. ఆనక విశ్వ రెండుచేతులూ పుచ్చుకున్నాడు. ఈలోగా కార్యదర్శి విశ్వానికి కుడిపక్కన కూర్చున్న జలగని అక్కడనించి లేవవలసింది అభ్యర్ధించి, అతనికి తాను లేచొచ్చిన కుర్చీ చూపించేడు. జలగ లేచి కార్యదర్శి ఖాళీచేసిన కుర్చీలో కూర్చుంది.
    ఈ జలగ మొన్నామధ్య ఒక చిన్ని పరిషత్తులో ఉత్తమనటుడి బహుమతి పుచ్చుకున్న వైనం నా పక్కసీట్లో మనిషి చెప్పగా విని ఆశ్చర్యపోయేను.
    విశ్వాన్ని జలగా విడిచిపెట్టినా పశుపతి విడిచిపెట్టలేదు. నవ్వేస్తూ కుర్చీని కుదిపేస్తూ ఏదో వల్లించి చెబుతున్నాడు. విశ్వం తన పూలదండని వాసనచూస్తూ వినీ విననట్లు వింటున్నాడు.
    "మరో అయిదు నిమిషాల్లో 'మధురానగరికి' ప్రారంభమవుతుంది. కుమారి శకుంతలా పశుపతి తమ నాట్యకౌశలాన్ని సహృదయులైన ప్రేక్షక మహాశయులకు పరిచయం చేస్తారు" అని ఎవరో కాగితంమ్మీద రాసి చదివినట్టు మైకులో చెప్పారు.
    ఈ హెచ్చరిక విన్న జానాభా కెలావున్నదోగాని నేనదరి చచ్చేను. పశుపతిగారి వ్యూహాన్ని మెచ్చుకోక తప్పింది కాదు.
    నా పక్క కుర్చీలోని మూర్తి బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్న వాడిని చేత్తో కుదిపాను. కదిలి అన్నాడు.
    "శకుంతలంటే సైకిలు వాలా కదూ గురూ!"
    "ఎక్జాక్ట్ లీ, కొంచెం నీ ముందుచూడు. అసలైన నాట్యం యిక్కడే జరుగుతోంది" అన్నాను పశుపతిని చూపిస్తూ.
    అటువేపు చూచి మెల్లిగా నవ్వేశాడు. నాట్యం ప్రారంభమయ్యే ముందు ఓ మనిషి ముందు వరస కుర్చీల దగ్గిర అటూ ఇటూ నాలుగైదుసార్లు తిరగడం గమనించేను. ఇంటర్వెల్లో చెగోడి, బజ్జీ, టీ అమ్ముకునే కుర్రాళ్ళని మరపించేడతను. అతను చాలాసార్లు విశ్వందృష్టి నాకర్షించుకునేందుకు ప్రయత్నం చేసేడుకాని, ఫలించలేదు. చివరికి విసుగెత్తి వెనక కుర్చీల్లోకి చేరుకున్నాడు.
    "అంబికా థియేటరు ఓనరు" అన్నాడు.
    "సినిమాల్లో వేషంకోసం వచ్చాడా?"
    "అయ్యే ఉంటుంది. మొన్నా మధ్య ఒకడొక్కు సినీమాలో రెండు నిమిషాలపాటు వీపు వాయించుకున్నాడు. ఇప్పుడు మరో చాన్స్ కోసం చూస్తున్నాడు. ఈ తడవ గూడా యే వింజామరం లాటిది పుచ్చుకోడమో మొహాన్న కొడతారంతే!"
    అయిదు నిమిషాలు గడిచినా నాట్యం ప్రారంభం కానేలేదు. ఉన్నట్టుండి పశుపతి గ్రీన్ రూం వేపు పరుగెత్తేడు. కాసేపట్లో పశుపతి శకుంతలని వెంటబెట్టుకొచ్చేడు. మొదటి వరస కుర్చీల దగ్గరికి. ఆ అమ్మాయి తండ్రితో వొస్తున్నప్పుడు కెమేరాల్లో ఫ్లాష్ లు గబగబా వెలిగేయి.
    ఆ అమ్మాయి యింటిదగ్గిర కంటే ఇక్కడంత అందంగా లేదు. సైకిలు తొక్కుతున్నప్పుడు చాలా అందంగా వుండేది. ఇప్పుడు అందంగా లేకపోయినా బరువుగావున్నది. ఏవో చాలా అలంకారాలూ చేసేరు. నేను నార్యాలు చాలా చూసేను. ఇన్ని అలంకారాలతో మెరిసిపోతే "చల్లలమ్మబోదు -"అనెవ్వరూ యెప్పుడూ యెక్కడా నాట్యం చేయలేదు మీదు మిక్కిలి ఆ అలంకారాలన్నీ గూడా కలిసి పెద్దసైజు వికృతాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నట్టు నాకనిపించింది. అందుచేత శకుంతల నాస్థితిలో చూచినప్పుడు నేను చాలా సిగ్గుపడిపోయేను.
    తండ్రి కోరినట్టు శకుంతల విశ్వానికి పాదాభివందనం చేసింది. రెండు ఫ్లాష్ లు చిటిక్ చిటిక్ మని మెరిసేయి. అంత వరకూ బాగానే వున్నది. రెండు నెలలు (సరిగ్గా నేను లెక్కవేయలేదు. ఉజ్జాయింపుగా అన్నాను) శిక్షణతో మొదటిసారి కాలికి అందెలు కట్టి వేదిక ఎక్కి నాట్యం చేయడమనే గొప్ప విద్యకి ఒక ప్రఖ్యాత దర్శకుని ఆశీస్సులందుకోడంలో అనౌచిత్యం కనిపించదు. కానీ, పశుపతి ఓ వెండి కప్పు విశ్వం చేతికిచ్చి, ఆ కప్పుని శకుంతల కివ్వమని చెప్పి, వెనువెంటనే ఫ్లాష్ లు మెరిపింపజేసే ప్రయత్నంలో వ్యాపారం దాగి వుంటుంది. ఇదే నాకు నచ్చలేదు. నాట్యం చూడక మునుపే బహుమతీ ప్రధానమని (అదీ శకుంతల వాళ్ళ సొమ్మే) సంప్రదాయాన్ని వ్యాపార రహస్యమనీ నేనంటాను. ఈ కార్యక్రమాన్ని యావత్తూ ఫోటోల్లో నింపడం దారుణమనీ అంటాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS